బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్…

    మన దేశంలో ఎక్కడ ఏది జరిగినా, అంతంత హడావిడి చేసేస్తారే, అలాటిది మన బ్లాగుల్లో అంతమంది మనవాళ్ళు, అమెరికాలో ఉన్నారే, వాళ్ళ గురించి, కనీసం ఆ దేశంలోనే ఉంటున్న మనవారు కొద్దిగా తెలియచేసుంటే బాగుండేదని నా అభిప్రాయం. అలాగని మన చానెళ్ళలో చూడ్డం లేదా అని కాదు. చూడ్డం వేరూ, జరిగిన విపత్తు గురించి, first hand account వినడం వేరూ. అంతమందికి అంత కష్టం వచ్చిందే, అయినా సరే, మనవాళ్ళలాగ ప్రతీ రాజకీయనాయకుడూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నట్టు వినలేదూ, చూడలేదూ. అప్పటికీ ప్రతీ రోజూ CNN చూస్తూనే ఉన్నాను.ఇలాటి స్వభావం చూస్తూంటే, వారే more mature గా కనిపిస్తున్నారు. మనవాళ్ళు చూడండి, దురదృష్టవశాత్తూ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీ ఎర్రంనాయుడి గారి మరణానికి ప్రభుత్వమే కారణం అంటున్నారు.అంటే నేను ఏదో ప్రభుత్వాన్నే సమర్ధిస్తున్నానని కాదు. ప్రతీ దానికీ, ఎవరో ఒకరిని దుమ్మెత్తిపోయడం తప్ప మన నాయకులకి ఇంకో పనే లేదా అని అనిపిస్తూంటుంది.అసలు విషయాన్ని పక్కకుపెట్టి, ఏమిటేమిటో ఊహించేసికోడంలో చూపే నేర్పు, పాలనలోనూ, ప్రజలకి చేసిన promiseలు నెరవేర్చుకోడంలోనూ ఉంటే ఎంత బాగుండేదోకదూ!

    అలాగే మన టివీ చానెళ్ళ వ్యవహారాల్లోనూ, అంత నష్టం జరిగిందే, ఎంతోమంది ప్రాణాలు పోయాయే, ఆ విదారక దృశ్యాలను ఒక్కటంటే ఒక్కటీ చూపించకపోడంలో ఉన్నవిదేశీ చానెళ్ళ విజ్ఞత కి హ్యాట్స్ ఆఫ్ ! మనవాళ్ళు చూడండి, ఎక్కడైనా ఏ దుర్ఘటనైనా జరగడం తరవాయి, క్లోజప్పు చేసి మరీ చూపిస్తూంటారు. పైగా ఎవరైనా చూడలేకపోతారేమో అని, రోజంతా చర్చలూ, పక్కనే పొద్దుణ్ణించీ చూసిన visualసూనూ.గాయపడిన వాడిని హాస్పిటల్కి తీసికెళ్ళడం మానేసి, అతనితో ఇంటర్వ్యూలూ, బైట్టులూనూ. మన వాళ్ళకి అసలు ఎప్పుడు బుధ్ధొస్తుందీ?

    రెండు మూడు రోజుల్లో అత్యంతముఖ్యమైన ప్రెసిడెంటు ఎన్నిక ఉంది.అక్కడవాళ్ళూ ఒకళ్ళమీద ఒకళ్ళు దుమ్మెత్తిపోసుకుంటారు, అయినా ప్రస్థుత విపత్కర పరిస్థితి దృష్ట్యా, ఆ ఎన్నిక ప్రచారాలూ అవీ పక్కకు పెట్టేశారు. ఇక్కడ చూడండి, గుజరాత్ లోనూ, ఇంకోచోటా త్వరలో ఎన్నికలంటున్నారు, ఆ ప్రచారాలు చూడండి– ఈవేళ దిగ్విజయసింగు, మోడీని నీ భార్యనెక్కడ దాచేశావూ..” అంటూ ఓ చురక.దానిక్కారణం ఆ మోడీమహాశయుడేమో, ఆ తరూరు భార్యని ఏదో అన్నాడుట. దరిద్రులు, వాళ్ళవాళ్ళ భార్యలు ఏ గంగలో దిగితే అసలు మనకెందుకూ? వీటికి సాయం ఆ ట్విట్టరూ, ఫేస్ బుక్కులూ ఒకటీ? ప్రతీ తలమాసినవాడూ ఏదో ఒకటనడం, ఎవడిగురించన్నాడో వాడేమో, ఈ రాసినవాడిమీద పరువునష్టం దావా వేయడం. ఆ చిదంబరం గారి కొడుకుని చూళ్ళేదూ?

    ఇంక సుబ్రహ్మణ్యస్వామి “పట్టువదలని విక్రమార్కుడి” లాటివాడు. రాజాని దింపేశాడు. ఇప్పుడు రాణివాసంమీద పడ్డారు, ఏదో ఋజువులూ అవీ ఉన్నాయనే కదా, ఓ పెద్ద పత్రికా సమావేశం పెట్టి చెప్పుకుంటూ పోయాడూ. ఠాఠ్ అదంతా బోగస్సూ, కోర్టులో పరువునష్టం దావా వేస్తామూ అనేశారు. మన దేశంలో ఓ సౌలభ్యం ఉంది, ఎప్పుడైనా ఎవడైనా ఏదైనా అంటే, కోర్టులో ఓ దావా వేసేస్తే సరి, ఎవడికీ సమాధానం చెప్పుకోనఖ్ఖర్లేదు. మరీ బలవంత పెడితే sub judice అంటూ తప్పించుకోవచ్చు! మనం బతికుండగా, ఆ కేసూ విచారణకి రాదు, అందరూ సుఖంగా ఉంటారు.ఇవన్నీ, మీలాటి, మాలాటి “ఆం ఆద్మీలకి” మాత్రం కాదు. Its the exclusive privilege of our politicians and celebrities only. ఆయనెవడో మంత్రిగారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుని హాయిగా కూతురి పెళ్ళి చేసేస్తున్నాడుట. మనందరికీ కూడా అలాటి ఓ అవకాశం ఇస్తే ఎంత బావుండేదో?

    ఒకదాని తరువాత ఒక్కో రాజగోపురం కూలిపోతోంది. కొత్తగా పాలకొల్లులో క్షీరారామ దేవాలయపురాజగోపురం కూలిపోయింది. ఆ మధ్య శ్రీశైలంలోనిదీ, అంతకు పూర్వం కాళహస్తీ, అంతకుముందు బాపట్ల భావన్నారయణ గుడిదీనూ.కొత్తగా మంత్రిపదవికూడా దొరికిందీ, మన మెగాస్టారు గారు, ఏవేవో ప్రకటనలు చెసేయడం కంటే, స్వంత ఊరు పాలకొల్లు ( ఆయనని ఎన్నుకోలేదనుకోండీ, అది వేరే విషయం)లో గోపురం సంగతి చూడకూడదూ? ఇలాటివి ఆయన శాఖలోకి రావా ఏమిటీ? 200 ఏళ్ళ పురాతన కట్టడం, మరీ tourist attraction లోకి రాదంటారా? ఏమోరాదేమో.సినిమావాళ్ళకి షూటింగులకోసం ఏవేవో చేసేస్తానూ, అస్సలు భారతదేశాన్నే ఓ బ్రాండ్ ఎంబాశడర్ చేసేస్తారుట ! అదీ మన ప్రధానమంత్రిగారు ఈయనతో చెప్పారుట! వినేవాడుండాలి కానీ ఎన్నైనా కబుర్లు చెప్పొచ్చు! ఉన్నవాటిని చూసే దిక్కులేదుకానీ కబుర్లకేమీ లోటులేదు.

    ఇదండీ విషయం.. అయినా బతికేస్తున్నాము. ఏదో మొదలెట్టి దేంట్లోకో వెళ్ళిపోయాను. చెప్పొచ్చేదేమిటంటే, అమెరికాలో ఉంటూన్న మన పాఠకులు అక్కడ జరిగిన ఘోర తుఫాను గురించీ, అక్కడుండే ప్రజానీకం, దానినుండి ఎలా బయటపడకలిగిందీ బ్లాగుల ద్వారా తెలియచేస్తే, మీ యోగక్షేమాలు మాక్కూడా తెలుస్తాయిగా. Give a thought !

%d bloggers like this: