బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఏమిటో ఏవేవో పేర్లు పెట్టేశారు revenge అన్నారు, ఇంకో సింగినాదం అన్నారు. ఏదో గప్ చుఫ్ గా ఆడేసి ఆ తరవాతేదో పేరెట్టొచ్చుకదా, మళ్ళీ pitch లు మాకు కావలిసినట్టుగానే తయారు చేసుకుంటామన్నారు. ప్రతీవాడూ నోరు పారేసికున్నాడు. చివరకేమయిందీ తుస్సుమంది…ఏమిటో నాకు zeal ఎక్కువా, నాకు తోచినప్పుడే రిటైరవుతానంటాడు ఒకాయన, అదృష్టం బావుండి, ఆ పుజారా ఎవరో, ఇంకా కొత్తగా నాజూగ్గా ఉండబట్టి సరిపోయింది లేకపోతే….వచ్చే టెస్టుదాకా ఇంక వీటిమీదే చర్చలు.. అప్పుడు కూడా ఏదో “పొడిచేస్తారని” కాదు, గేమ్ముని గేమ్ములా కాక, ” మాతాతలు నేతులుతాగారూ..” అంటూ ఏదో సామెత చెప్పినట్టుగా ఎందుకండీ? 28 సంవత్సరాలపాటు అజేయంగా ఉన్న మన హాకీ జట్టూ ఇలాగే తయారయింది. చివరకి మన జట్టుకి విదేశీ కోచ్చిలు తెచ్చుకోవలిసిన దుర్గతి పట్టింది ! స్పిన్ను స్పిన్ను అన్నారు, చివరకి భారతీయ సంతతికే చెందిన పనేసార్ మనవాళ్ళనందరినీ చంకనెట్టుకు పోయాడు ! ఏదో ఈ టెస్టు ఓడిపోయారని కాదు, ఎప్పుడూ ఇదే గొడవా? ఆ పుజారాయో ఎవరో అతన్నైనా సరీగ్గా ఆడనిస్తారని అనుకోను, ద్రవిడ్ తరువాత ఇతనే అని అప్పుడే మొదలెట్టేశారు.మిగిలిన వారిగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. ఇదివరకటి రోజుల్లో ఎం.ఎల్.జయసింహ అని మనవాడే ఒకాయనుండేవాడు, ఎప్పుడైనా టీం లోంచి తీసేస్తారేమో అని భయం వేసినప్పుడల్లా ఓ సెంచరీ కొట్టేసేవాడు మళ్ళీ ఓ పది టెస్టులు సరీగ్గా స్కోరుచేయకపోయినా గొడవుండేది కాదు! అలాగే పేపర్లవాళ్ళూ, మీడియావాళ్ళూ గోలెట్టడం ప్రారంభిస్తారో ఓ పాతికో, పరకో కొట్టేస్తే చాలు జీవితసాఫల్య ఎవార్డుకి అర్హుడైపొతాడు ! Thats cricket for us !! రేపెప్పుడో నెగ్గినా నెగ్గొచ్చు.. అదిగో చెప్పలేదూ.. అంటారు !!

    ప్రపంచతెలుగుమహాసభలుట వచ్చేనెలలో జరుపుతారుట. మనరాజకీయపార్టీలు ఒకళ్ళమీద ఒకళ్ళు దుమ్మెత్తిపోసుకుంటున్నారప్పుడే. నిన్న ఓ మరాఠీ చానెల్ లో మూడుగంటలపాటు ఓ కార్యక్రమం చూశాము. విషయం ఏమిటా అంటే మహరాష్ట్ర రాజ్య పురస్కార్ అని 49 వ వార్షికోత్సవం సినిమాలకి బహుమతి ప్రదానం అవీనూ. నమ్మండి నమ్మకపొండి, మూడు గంటల్లోనూ ఒక్కటంటే ఒకే ఇంగ్లీషు మాట విన్నాను. అదికూడా సినిమాల్లోని rerecording విభాగంలో బహుమతి ఇచ్చినప్పుడు. అప్పుడుకూడా ప్రయత్నించి మొత్తానికి మరాఠీలో చెప్పాడు. వాళ్ళెవరో మాతృభాష కి పట్టం కట్టేస్తున్నారో అని చెప్పడానికి కాదు చెప్పేది, ప్రయత్నిస్తే మనవాళ్ళూ చేయగలరు. అలా చేయగల ఉద్దండులూ ఉన్నారు మనవాళ్ళలోనూ, కానీ జరుగుతున్నదేమిటయ్యా అంటే, నిన్న అదేదో దిక్కుమాలిన కార్యక్రమం “మా” టీవీలో చూశాము ఖర్మకాలి, అదేదో “డుబాయి” లో జరిగిందిట. చూస్తూంటే వెగటేసింది.

   దీనికి విరుధ్ధంగా మేము చూసిన మరాఠీ కార్యక్రమంలో మరాఠీ జానపద నృత్యం లావణీ లో నటీమణులు తొమ్మిదిగజాల చీరలో కూడా ఎంత అద్భుతంగా నృత్యం చేశారో? మనవాళ్ళేమో ఒంటిమీద బట్టుంటే తప్పేమో అన్నట్టుంటారు. ఇంక పాటల విషయంలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిదేమో. ఓ అర్ధం పర్ధముండదు. ఊరికే కుయ్యో మొర్రో ఒకటే వినిపిస్తుంది.ఇంక కథ అంటారా, అసలంటూ ఉంటేకదా? ఈమాత్రందానికి గోవాలో జరిగే పిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించే భారతీయ చిత్రాల్లో ఏ ఒక తెలుగు సినిమాకూడా లేదని ఏడవడం ఎందుకో తెలియదు.అన్నిటిలోకీ ముఖ్యమైన విషయం– కార్యక్రమం జరిగిన మూడుగంటలూ ముఖ్యమంత్రి చవాన్ ఉండడం. మన మంత్రులకి ఎక్కళ్ళేని పనులూనూ, ఏదో తూతూమంత్రంగా రావడం, మాట్టాడమంటే ఏవేవో ప్రసంగాలు చేయడం. ఈ కార్యక్రమంలో రెండంటే రెండే నిమిషాలు మాట్టాడారు.

   మనవాళ్ళకంటే మిగిలినవాళ్ళంటేనే ఇష్టం అనిమాత్రం అనొద్దు. రోగమేమిటీ, మనవాళ్ళూ అప్పుడప్పుడు మంచి కార్యక్రమాలు చేస్త్తూంటారు. కానీ చాలా తక్కువగా !

    ఇంక సంగీత కార్యక్రమాల పేరుతో వస్తూన్న కొన్ని”మా” టీవీ లో అదేదో “సూపర్ సింగర్సు”ట, అసలెందుకు చేస్తున్నారో అర్ధం అయి చావదు.జీ టీవీలో సరిగమప అని ఓ హిందీ కార్యక్రమం చూడండి. తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళూ పాడే విధానం, పాడే పాటలు, అన్ని జానెర్సు లోనూ.అన్నిటిలోకీ ముఖ్యం ఆ కార్యక్రమానికి వచ్చే ముఖ్య అతిథులు, ఒక్కోవారం ఒక్కో పిల్లో, పిల్లాడో నిష్క్రమిస్తూంటే బాధేస్తుంది. అయ్యో ఇంతబాగా పాడేడూ పాపం అనిపిస్తుంది.అలా ఉండాలి కానీ, చూసినమొహాలే చూడ్డం, ఆయనెవరో నేర్పించిన ఆ వందపాటలే వినడం ఇంకా ఈ హింస ఎన్నాళ్ళు భరించాలో?

    మొత్తానికి కేజ్రీవాల్ గారు పార్టీ పేరు చెప్పేశారు. ఎంతవరకూ “ఆంఆద్మీ” కి ఉపయోగిస్తుందో చూడాలి. మన పార్లమెంటు as usual.. గా వాయిదాలమీద వాయిదాలు 2014 దాకా ఇలాగే లాగించేస్తారు. ఎవరికొంపా మునగదు. మహా అయితే మనకొంపలే కొట్టుకుపోతాయి. ఎలాగూ మనం dispensable category లోకే వస్తాము…

%d bloggers like this: