బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– దేనికైనా “బడా దిల్” అనేదుండాలి….


   ప్రతీదీ commercial దృష్టి తోనే చూసే ఈ రోజుల్లో అక్కడక్కడ, “బడా దిల్” ఉన్నవాళ్ళని చూసినప్పుడు చాలా సంతోషమనిపిస్తుంది. వారి ఉద్దేశ్యమల్లా అవతలివారికి ఉపకారం చేయడమే. ఆ ఉపకారం మనకి ఉపయోగించేదయుండొచ్చు, మనసుకి ఆహ్లాదం కలిగించేదయుండవచ్చు. ఏదైనా సరే ఆ positive streak అనేదుంటుందే దాన్నే నేను “బడా దిల్” అంటాను. తెలుగులో విశాలహృదయం అనొచ్చేమో, కానీ మన రాష్ట్రభాష హిందీలోనే వ్యక్తపరచాను. మాతృభాష లో చెప్పనందుకు క్షమించండి. నా ఉద్దేశ్యం అర్ధం అయితే చాలు…

    మొన్నెప్పుడో మా ఇంటావిడ మధ్యాన్నం పాలు తోడు పెట్టింది, కానీ నేను చూసినప్పుడు తోడుకోలేదు. సరే దగ్గరలో ఉన్న మిఠాయి దుకాణంలో ఏ అమూల్ దో, నెస్లేదో దొరికితే తీసికుందామని అక్కడకి వెళ్ళి అడిగితే, సీల్ వేసిన బ్రాండెడ్ పెరుగు దొరకదూ, లూజుగా ఉండేదే తనదగ్గర ఉందీ అని చెప్పాడు. కాదూ, మాకు బ్రాండెడ్ దే కావాలీ అంటే, మాములుగా అయితే, అంటే నూటికి తొంభై దుకాణాలవాళ్ళు, తమ బేరం పొగొట్టుకోడం ఇష్టం లేక, అంత అవసరం అయితే మనదగ్గరే తీసికుంటాడులే అనుకుని, మనం దగ్గరలో ఇంకెక్కడైనా దొరుకుతుందా అని అడిగితే, “నాకు తెలియదు ఫో..” అంటూంటారు. నేను నిజంగా అదే expect చేశాను. కానీ, దానికి విరుధ్ధంగా, ఆ కొట్టతను, ఇదే వరసలో నాలుగోది, బేకరీ, అందులో చూడమన్నాడు.
అలాగే వెళ్ళి చూస్తే అక్కడ మాక్కావలిసినది దొరికింది. తిరిగి వచ్చేటప్పుడు, ఆ ముందరి కొట్టతనికి థాంక్స్ చెబుదామని చూస్తే, అక్కడ ఎవరో ఆడావిడ కూర్చున్నారు, వచ్చేశాను.మర్నాడు బస్ స్టాప్ కి వెళ్తూంటే అతను కనిపిస్తే వెళ్ళి థాంక్స్ చెప్పాను.

    మీరనుకోవచ్చు, ఇందులో పెద్ద విశేషమేముందీ, ఆ రెండు కొట్లూ అతనివే అయుండొచ్చూ అని, అదే సందేహం అతనితో అడిగితే నవ్వి అన్నాడూ ” క్యా సాబ్ ఎహీ తో ప్రోబ్లెం హై ..బోలాతో గల్తీ, నయ్ బోలాతోభీ గల్తీ..” అర్ధం అయిందనుకుంటాను- ” చెప్తే ఓ సమస్యా, చెప్పకపోతే ఇంకో సమస్యా..” అని !నిజమే కదూ ఎవరైనా out of the way సహాయం చేస్తే ముందుగా అతన్ని సందేహిస్తాము. మానవనైజం. కట్నం వద్దని ఎవరైనా పెళ్ళికొడుకన్నాడంటే వాడిలో ఏదో లోపం ఉందీ అనుకునే రోజులాయె ఇవి! అతనితో అన్నాను- “ఊరికే సరదాగా అన్నానూ, ఇలా తనకొట్లో సరుకు కొననివాడికి, వీళ్ళకు కావలిసిన కొట్టు వివరాలు చెప్పే “బడా దిల్” అందరికీ ఉండదూ, నాకు తెలిసినవారిలో మీరే మొదటివారూ.. ” అని. అతనన్నాడూ, ” ఇలా థాంక్స్ చెప్పే మొదటివారూ మీరే..” అని !

    అలాగే ఈవేళ మా మనవడు వచ్చినప్పుడు తినే ” రాజ్ గీరా లడ్డూలు” అయిపోయాయంటే, కూరలు తీసుకోడానికి బజారుకెళ్ళినప్పుడు, నాలుగైదు కొట్లలో లేకపోవడంతో చివరగా ఓ కొట్టుకి వెళ్ళి, అక్కడా లేకపోతే అక్కడా ఇదే అనుభవము- ఏ కొట్లో దొరుకుతాయో చెప్పి పుణ్యం కట్టుకున్నాడు. సీన్ రిపీట్...

    తెలుగు పేపర్లు కొనుక్కుని కొంపకి చేరాను. నెట్ లో అన్ని తెలుగు పేపర్లూ (ఇక్కడ దొరకనివి) చదివే అలవాటోటుందని ఇదివరలోనే విన్నవించుకున్నాను. ఆ సందర్భంలో “సాక్షి” తూ.గో.జి ఎడిషన్ చదువుతూంటే ఓ వార్త ఆకర్షించింది. రాజమండ్రీ లో ఓ పుస్తకాల కొట్టుందిట. అక్కడ ఎక్కువగా ఆధ్యాత్మిక పుస్తకాలే దొరుకుతాయి, గొల్లపూడి వీరాస్వామి లాటిదన్నమాట. మేము రాజమండ్రీలో ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం లేదనుకోండి. Mohan Publications అని ఆ కొట్టు పేరు. వివిధ రకాల ఆధ్యాత్మిక పుస్తకాలూ ప్రచురించి, అమ్మడం వీరి వ్యాపకం. SO ఈ సందర్భంలో వీరి కొట్టు పేరు ఎందుకు చెప్పాల్సొచ్చిందీ అని అడగొచ్చు, అదిగో అక్కడికే వస్తున్నాను.వీరు క్రయవిక్రయాలే కాకుండా, వారి సైట్ www.mohanpublications.com లో ఎన్నెన్నో ఉపయోగించే తెలుగు పుస్తకాలు pdf చేసి పెట్టారు. నిజంగా అంత అవసరముందంటారా? వారిదగ్గర దొరికే పుస్తకాల జాబితా, వాటి ఖరీదులూ ఎలాగూ పెట్టారు. కావలిసినవాళ్ళు తెప్పించుకుంటారు, లేదా మానేస్తారు. కానీ ఇంత గొప్పమనసుతో తెలుగువారికి ఉపయోగపడేలా నెట్ లో పెట్టారే అందుకే వారిని “బడా దిల్” క్యాటిగరీలో చేర్చాను. ఓసారి చూడండి ఆ లింకు, అందులో దొరికే కొన్ని ఆసక్తికరమైన పుస్తకాలూ…

    అన్నిటిలోకీ “బడా….. దిల్....” మన బ్రహ్మశ్రీ చాగంటివారి సైటు ఉండనే ఉంది. ఆ సైటుకి పోలికగా ఇంకోటుందనుకోను. ఈ సైటే లేకపోతే ఎలాఉండేదో ఊహించడానికే కుదరడం లేదు. వారి ప్రవచనాలు ప్రత్యక్షంగా వినే అదృష్టం లేని మాలాటివారికి ఇదో వరం. మాగంటి వారిదైతే సరేసరి. చెప్పఖ్ఖర్లేదు ఏక్ దం సూపర్.. ఇదివరకెప్పుడో తెలుగు థీసిస్ అని ఓ సైటుండేది. ఏమొచ్చిందో ఏమో ఎత్తేశారు. దానిలో కొన్ని అద్భుతమైన పుస్తకాలుండేవి.

    ప్రతీవారికీ ఉండమంటే ఉంటుందా మరి ఇలాటి “బడా దిల్లూ..”? వార్తాపత్రికల సంగతి వదిలేయండి, అన్నిభాషల పేపర్లూ చదివేసికోవచ్చు. కానీ Weekly ల విషయం వచ్చేటప్పటికి మనవాళ్ళు ఒక్క ” నవ్య” తప్పించి, మిగిలిన అందరూ కంజ్యూసే!! పోనీ ఓ వారం తరువాతైనా వాటిని నెట్ లో పెట్టొచ్చుగా అబ్బే, కావలిస్తే కొనుక్కోండి,లేదా మీఖర్మ.. అనే attitude.మళ్ళీ ఇంగ్లీషులో అలా కాదు, ప్రతీదీ నెట్ లో చదువుకోవచ్చు. తెలుగు లో విషయసూచిక ఇచ్చేసి వదిలేస్తారు.. ఎప్పుడు వీళ్ళకీ ఆ “బడా దిల్ ” వస్తుందో కానీ….

9 Responses

 1. మీది కూడా బడాదిల్ మాస్టారూ. రెండు మంచి విషయాలు చెప్పడమే కాదు, రెండు మంచి లింకులిచ్చినందుకు

  Like

 2. వెన్నెలరాజ్యం గారూ,

  అలా వ్రాయడంలో మీ “బడా దిల్’ తెలుస్తోంది…Thanks..

  Like

 3. Thanks a lot. Found lots of useful Books

  Like

 4. ప్రకాష్,

  నాటపా ధర్మమా అని, ఉపయోగకరమైన పుస్తకాలు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. చదివినవారిలో ఏ కొంతమందికైనా ఉపయోగపడితే సంతోషమే కదా! కానీ అలాగని తెలియపరచడంలో “బడా దిల్ ” ఉంది !! God bless you..

  Like

 5. dhanyavaadamulu

  Like

 6. మోహన్ గారూ,

  ఇందులో ధన్యవాదాలు చెప్పడానికేముందీ? అసలు చెప్పాలంటే, మీకు మేమందరమూ ధన్యవాదాలు చెప్పుకోవాలి, అన్ని మంచి పుస్తకాలు, తెలుగు పాఠకులకి ఉచితంగా అందుబాటులో ఉంచడానికి. ఈరోజుల్లో ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా, తెలుగువారిలో పుస్తక పఠనానికి, మీరు చేస్తూన్న ఈ సత్కార్యం ఎంతో శ్లాఘనీయం. …

  Like

 7. బాబాయి గారూ

  చాలా మంచి లంకెల్ని ఇచ్చారు. ఎన్నో రోజులుగా వెతుకుతున్న కొన్ని పుస్తకాలు దొరికాయి – మీ పుణ్యమా అని!

  మోహన్ పబ్లికేషన్స్ వారికి కూడా మీ బ్లాగు ముఖంగా ధన్యవాదాలని తెలుపుతున్నాను.

  Like

 8. శిరీషా,

  కొందరికైనా నేను ఇచ్చిన లింకులు ఉపయోగించినందుకు నాకైతే చాలా సంతోషమనిపించింది. ఆ లింకులను పెట్టడం వరకే నా పని. ఉపయోగించుకోడం మీ మీద ఆధారపడుతుంది. మీరు వ్యక్తపరచిన thanks వారికి ఈవేళే తెలియచేశాను.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: