బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– నవంబరొచ్చిందంటే చాలు…

   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధర్మమా అని, పెన్షన్ తీసికునే వారందరికీ ఈ నవంబరు నెలొచ్చిందంటే, చాలు, ఎక్కడలేని ఓపికా వచ్చేస్తూంటుంది. ఇంకా బతికే ఉన్నామని “నిరూపించు” కోవద్దూ మరీ. ఏదో ఒక్కసారి ఆ పెన్షనిచ్చే బ్యాంకుకి వెళ్ళి, ఓ సంతకం పెట్టేస్తే, ఏడాది పొడుగునా మన పెన్షనేదో మనకొచ్చేస్తూంటుంది. మరీ “బ్యాంకుకి వెళ్ళి సంతకం పెట్టేస్తే..” అని ఇలా టపాల్లో వ్రాసినంత ఈజీయా మరి? Easier said than done.. ప్రతీసారీ ఏదో ఒక మెలికపెట్టి ఈ “వృధ్ధ జీవులతో” ఆడుకోడం, మన బ్యాంకులకీ, ప్రభుత్వానికీ అదో సరదా… వీళ్ళేకదా తేరగా దొరికేదీ…

    నవంబరు నెలలో ఎప్పుడైనా వెళ్ళి ఈ కార్యక్రమం పూర్తిచేసేస్తే ఫరవాలేదూ, అని ఓ రూలున్నా, ఇదివరకటి అనుభవాల దృష్ట్యా నేను మాత్రం ఒకటో తారీకునే బయలుదేరుతూంటాను. ఎందుకంటే కిందటిసారి 15 న చేస్తే, ఆ నెల పెన్షను పడలేదు! కారణం ఏమిటా అని అడిగితే, ” పదో తారీకులోపులో “బతికున్న” వాళ్ళకే నెలాఖరుకి వస్తుందీ, దరిమిలా “బతికున్న” వాళ్ళకి ఈ నెల బకాయితో పాటు, వచ్చే నెలలో ఇస్తారూ అని గౌరవనీయ బ్యాంకు వారు, చెప్పిన కారణంగా, నవంబరు ఒకటనేటప్పడికి ఓ “అనిర్వచనీయ” గౌరవం, భక్తీఏర్పడిపోయింది.అందువలన నవంబరు ఒకటీ , తెల్లారిందంటే చాలు, బ్యాంకు ఎప్పుడు తెరుస్తారా, మనం “బతికే” ఉనట్టు ఎప్పుడు చెప్పేద్దామా అనే ఓ ఆత్రుత! అవేవో ఫారాలూ అవీ నింపాలిగా- 1. మనం బతికే ఉన్నామూ. 2. రెండో పెళ్ళి చేసికోలేదూ..( ఒకళ్ళని భరించడానికే కుదరడం లేదు ఇంకో పెళ్ళి కూడానా) & 3. ఇంకో ఉద్యోగంలో చేరలేదూ.. (this is the biggest joke..). ఫొనిద్దురూ ఏదో అడిగేరూ, అవునూ, లేదూ, లేదూ అని వ్రాసేసి ఓ సంతకం పెట్టేస్తే పోలేదూ..

    ఎలాగూ ప్రతీ ఏడాదీ నింపేవి ఈ ఫారాలేకదా అనేసికుని, కిందటేడాది వెళ్ళినప్పుడే ఓ spare copy ఓటిఅట్టేపెట్టుకున్నాను, అక్కడకేదో నేనే తెలివైనవాడి ననుకుని, ఆ ఫారం ఏదో ఇంట్లోనే నింపేసి, బ్యాంకు తలుపులు తెరిచీ తెరుచుకోగానే ఝూమ్మని లోపలకి తోసేసుకుని వెళ్ళి, ఇచ్చేయొచ్చూ అనుకున్నాను. మిగిలినవాళ్ళెలాగూ ఫారాలు తీసికోడంలో బిజీగా ఉంటారూ, ఏమిటో ఈమాత్రం తెలివితేటలుండొద్దూ, వయసొచ్చింది ఏం లాభం.. etc..etc.. మనసులోనే అనేసికుని, చెప్పాగా మిగతావారికంటే మనమే తెలివైనవాళ్ళమనే దుర్గుణం ఎప్పటికీ వదలదు మనల్ని !

    ఫారం అంటే నింపేశాను కానీ, మరీ అంత ప్రొద్దుటే వెళ్ళడానికి కుదరలేదు కారణం- ఇవాళ్టికీవేళే చేయాలని ఓ మిస్టరీ షాపింగు assignment ఒకటొచ్చింది. అదేదో పూర్తిచేసికుని, ఎలాగూ బ్యాంకు నాలుగున్నరదాకా పనిచేస్తూంది కదా అనేసికుని,
అదేదో పూర్తిచేసికుని, ఒంటిగంటన్నరకి వెళ్ళాను, అప్పటికి రష్ కూడా తగ్గుతుందీ అని. తీరా వెళ్ళి చూస్తే ఏముందీ, పెన్షన్ కౌంటరు ఖాళీ.. అక్కడుండే పిల్ల ( మూడేళ్లనుండీ ఆ అమ్మాయే!!) సావకాశంగా కూర్చుంది. ఇదేమిటీ, తేదీ ఏమైనా తప్పా, ఎంత చెప్పినా వయసొచ్చేస్తూంది, మతిమరుపు ఎక్కువైపోయిందీ ఈమధ్యా అనుకున్నాను. ఒకటో తారీకున అదీ నవంబరు నెల, కౌంటరు మరీ ఇంత ఖాళీయా..అయినా చూద్దామనుకుని, ఎంతో “అతితెలివితేటలు” ప్రదర్శించి ఇంట్లోనే నింపేసిన, ఆ “నలిగి” పోయిన ఫారాన్ని చూపిస్తే.. “No Sir, please get fresh form and submit” అనేసింది. వీటిక్కూడా expiry daట్లూ అవీ మొదలెట్టారా ఏమిటీ అనుకుని, ఆ కొత్త ఫారమేదో తీసికున్నాను.

    చెప్పానుగా మనకంటే తెలివైనవారు మన ప్రభుత్వం వారు.పాత ఫారంలో చెప్పిన మూడింటికీ, ఈ కొత్త ఫారంలో ఇంకోటి కలిపారు.పోనీ అదేదో ముందే ఏ పేపరులోనో తెలియచేయొచ్చుగా, అబ్బే, అలా చేస్తే వాళ్ళకి ఆ “సంతోషాలు” ఎక్కడ దొరుకుతాయీ, ఈ పెన్షనర్లేమో మళ్ళీ ఓ ఏడాద్దాకా కనిపించరూ, అసలంటూ చేస్తే ఇదే అవకాశం. చెప్పొచ్చేదేమిటంటే, పొద్దుణ్ణించీ క్యూల్లో నిలబడ్డవాళ్ళందరికీ ఈ “కొత్త” ఫారం లో నింపవలసిన వివరాలు లేవు. అధవా ఉన్నా వాటి supporting documents లేవు. ఈ కారణాలన్నిటివలనా, క్యూలో నుంచున్న ఏ ఒకటో వంతు వారు మాత్రమే,(అదీ భార్యలు స్వర్గస్థులైన వారు) పని చేసికోగలిగారుట, అదీ అసలు కారణం ఆ కౌంటరు అంత నిర్మానుష్యంగా ఉండడానికి!!

   ఇంక ఆ కొత్తగా కావలిసిన “వివరం” ఏమిటయ్యా అంటే, మనతరువాత మన పెన్షనుకి అధికారం వచ్చే spouse గారి, జన్మ తారీకూ, పాన్ నెంబరూ, వీటి supporting documents, జతచేసి, ఇవ్వాలిట. అదండి విషయం.కారణం మరేమీ లేదూ, ఆమధ్య పేకమిషను లో ఈ పెన్షనర్లెలాగూ చాలా కాలం బతికేస్తున్నారూ, పోనీ వాళ్ళకీ ఓ సౌలభ్యం ఇద్దామూ అనేసికుని, 80 ఏళ్ళకి ఇంత పెంపూ, 90 ఏళ్ళకి ఇంతా, ఏతావేతా వందేళ్ళూ బతికితే పెన్షను కూడా 100% అని.మన వివరాలైతే వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ ఈ spouse ల విషయంలో, ఏదో వయస్సు ఫలానా సంవత్సరాలూ అన్నామే కానీ, జన్మదినం అవీ ఇవ్వలేదు. మనం బతికున్నన్నాళ్ళూ ఎలాగూ అనుభవించాము, ఆ సౌకర్యమేదో మన తరువాత పెన్షను తీసికునే భార్యక్కూడా రావొద్దూ మరి. అదండి సంగతి..

    ఇంక మనకథలోకొస్తే, మా స్నేహితుడొకరున్నారని చెప్పానుగా SBI లో, ఆయన ధర్మమా అని, ఇంటికొచ్చి, ఆ కాగితాలేవో తీసికుని, మళ్ళీ ఆ ఎండలో పడి వెళ్ళి, మొత్తానికి ఆ కాగితాలన్నీ submit చేసొచ్చాను.ఈ టపా ఎందుకు వ్రాశానూ అంటే, మీ ఇళ్ళల్లో పెన్షను తీసికునేవారందరూ ఊరికే ఎగరేసికుంటూ వెళ్ళిపోడంకాదు, నేను పైన చెప్పిన వివరాలతో వెళ్ళండి. కాదూ.. నువ్వు చెప్పడం మేము వినడమా అనుకున్నారో మీ ఇష్టం..చెప్పడం చెప్పేశాను.. ఆ తరువాత..

%d bloggers like this: