బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మొహమ్మాటాలూ, చొరవా…

    ఈ టపాకి పెట్టిన శీర్షిక ఒకదానికొకటి విరుధ్ధంగా ఉంది కదూ !! ఎందుకంటే మొహమ్మాటం ఉన్నవారికి చొరవనేది ఎన్ని జన్మలెత్తినా ఉండదు. ఇంక ప్రతీదానిలోనూ చొరవ తీసికునేవారికి ఈ మొహమ్మాటమనేది ఏ కోశానా ఉండదు…కొంతమందిని చూస్తూంటాము, పాపం ప్రతీదానిలోనూ మొహమ్మాటమే, అడిగితే బావుండదేమో, ఏమైనా అనుకుంటారేమో, మరీ వెకిలిగా ఉన్నామనుకుంటారేమో…అంటూ ఎప్పుడూ back foot మీదే.ప్రపంచం తన దారిన తను పరిగెత్తేస్తూంటుంది, ఎక్కడ గొంగళీ అక్కడే అన్నట్టుగా, ఈ పెద్దమనిషి అలా చూస్తూంటాడు. అదృష్టం బావుండి ఇతని life partner కొద్దిగా, మొహమ్మాటం లేనిదైతే ఫరవాలేదు, అలా కాకుండా తనూ అదే కోవకి చెందినదైతే దొందుకుదొందే అన్నట్టు,everybody takes them for a ride.. అందుకేనేమో భగవంతుడు కూడా అలాటి అగత్యం లేకుండగా, ఇద్దరు విభిన్న మనస్థత్వవాల వారిని కలుపుతూంటాడు..బహుశా అదే కారణం అయుంటుంది ఇంకా ఈ భూమిమీద జనాలు బతుకుతున్నారు !!

ఈ “మొహమ్మాటాల” శాల్తీలకి ఈ గుణం పుట్టుకనుండీ వస్తుంది. చిన్నప్పటినుండీ పెరిగిన వాతావరణమో కారణం అయుండొచ్చు.ఆవ్యక్తి ఆడా, మగా అని తేడా ఉండదు. ఇంటినిండా గంపెడు పిల్లలుండే కుటుంబంలోంచి వచ్చారనుకోండి,ఎప్పుడైనా ఏదైనా కావలిసొచ్చినా తల్లితండ్రులని అడగడానికి మొహమ్మాటం, ఊరికే అడిగి పాపం వాళ్ళని బాధపెట్టడం ఎందుకులే అనో, పోనిద్దూ తన చెల్లెలికో, తమ్ముడికో ఉంటుందిలే అనుకుని అడక్కపోవడమో, కారణం ఏదైతేనేం, ఈ “మొహమ్మాటం” అనేది నరనరానా ఓ virus లాగ పాకిపోతుంది.పైగా ఓ “అంటువ్యాధి” లాగ మిగిలినవారికి కూడా పాకుతుంది.దానితో ఏమౌతుందంటే, దాంపత్యజీవితం ప్రారంభించిన తరువాత పుట్టిన ఒకరిద్దరు పిల్లలలో ఒకళ్ళు మాత్రం guarantee గా వంశపారంపర్యంగా వచ్చిన మొహమ్మాటానికి flag bearers గా కొనసాగుతారు. మరి ఇవి పొమ్మంటే ఎక్కడకిపోతాయి?

పైగా ప్రతీదానికీ ఇలాటి “మొహమ్మాటాల” బక్రాలు ఉండకపోతే, ఆ రెండో category వాళ్ళ మనుగడ సాగేదెట్లా? ముందుగా ఈ back footed వాళ్ళని చూద్దాము.దేశంలో ఎక్కడ చూసినా ఏదో ఒక సందర్భంలో క్యూల్లో నుంచోవలసివచ్చే పరిస్థితి చూస్తూంటాము. ప్రతీదానికీ క్యూలే. బ్యాంకుల్లో, రైలు రిజర్వేషన్లు, స్కూళ్ళలో పిల్లల ఎప్లికేషన్లు తెచ్చికోడం, ఏదో రేషన్ షాపుల్లో ఈమధ్యన “ఆంఆద్మీ” లకి కిరసనాయిలూ, పంచదారా, బియ్యం ఇవ్వడం మానేశారుకాబట్టి ఫరవాలేదు కానీ, లేకపోతే అక్కడా, మరీ ఇళ్ళబయటకి వెళ్ళి ఓ బకెట్టో, బిందో పట్టుకుని వీధి కుళాయిలదగ్గర నుంచోవలసిన పరిస్థితి లేదు కాబట్టికానీ, లేకపోతే అక్కడా, అన్నిటిలోకీ అర్జెంటుగా అవసరం వచ్చి ఏ sulabh దగ్గరైనా నుంచోవలసివచ్చినా ఇదిగో పాపం మొహమ్మాటం పక్షులు బలైపోతూంటారు.

ఎక్కడికైనా వెళ్ళాలని ఏ బస్సుకోసమో, లోకల్ ట్రైనుకోసమో చూస్తూంటారనుకోండి, ఆ బస్సో ట్రైనో వచ్చీరాగానే ఎక్కుతాడా, అబ్బే ఛస్తే అలా చేయడు.పాపం అవతలివాడికి అర్జెంటేమో అనేసికుని, మిగిలినవాళ్ళు ఎక్కేదాకా చూస్తూండడం, ఇంతలో ఆ బస్సో ట్రైనో వెళ్ళిపోవడం. మరి ఇక్కడ మన “ మర్యాదరామన్న” ఉన్నట్టు ఆ బస్సుకీ, ట్రైనుకీ తెలియదుగా! ఎవరింటికైనా వెళ్ళారనుకోండి, వాళ్ళింట్లో ఇచ్చే చాయ్ లోనో, కాఫీలోనో పంచదార తక్కువైనా, అడగడానికి మొహమ్మాటం, అడిగితే ఏమైనా అనుకుంటారేమో.చివరకి అర్జెంటుగా అవసరం వచ్చినా, wash room ఎక్కడుందో అడగడానికి కూడా మొహమ్మాటమే, బావుండదేమో.. అనుకోడం.బస్సుల్లో ఏదో సీటు ఖాళీగా ఉన్నా సరే ఆ రాడ్డు పట్టుకుని వేళ్ళాడడంలోనే అత్యంత ఆనందం అనుభవిస్తాడు.చివరకి ఏ mall లోకో వెళ్ళినప్పుడు cash counter దగ్గర ఏ ప్రబుధ్ధుడో అడగ్గానే వాణ్ణి ముందరకి తోయడం. బ్రహ్మశ్రీ చాగంటి వారు చెప్పినట్టుగా తనలో తను “రమిస్తూ” ఉంటాడు.

చిన్నప్పుడు అమ్మచేత “ పాపం అమాయకుడండీ నోట్లో నాలుకే లేదూ.. రేపు ఎలా బతుకుతాడో..” అనీ, పెళ్ళయిన తరువాత, “ మావారు నోట్లో వేలెట్టినా కొరకేలేరండీ...” అని భార్యచేత చెప్పించికోడంలోనే సంతోషమేమో. అయినా ఎవరి ఆనందం వాళ్ళదీ. ఇలాటివారిని చూసినప్పుడు జాలిలాటిది వేస్తూంటుంది. ఏమో ఇదివరకటి రోజుల్లో ఇలాటి సద్గుణాలకి ఓ recognition ఉండేదేమో కానీ, ఈరోజుల్లో ఇలాటి గుణాలని exploit చేసేవారే ఎక్కువ.

ఇంక ఈ రెండో టైపు వాళ్ళు- అంటే ప్రతీదాంట్లోనూ చొరవ చూపించేవాళ్ళు, వీళ్ళకి ఎక్కడికెళ్ళినా ఢోకా లేదు.ఎక్కడికెళ్ళనీయండి తన పని అయిపోవాలి, అవతలివాడు ఏ గంగలోనైనా దూకనీయండి.ప్రతీ విషయంలోనూ చొరవే, ఒక్కొక్కప్పుడు అవతలివారికి embarrassing గా కనిపించినా సరే. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లో టివీ రిమోట్ ని చేతిలో తీసేసికోడమూ, వీడిక్కావలసినదేదో పెట్టేసికోడం.ఆ ఇంట్లో పిల్లల్ని ఓ పధ్ధతిలో పెంచుతూంటాడు ఆ ఇంటాయనో, ఇంటావిడో, అడక్కుండా చానెళ్ళు మార్చే అలవాటుండదు, అలాటిది ఈ పెద్దమనిషెవడో వచ్చి చేతిలోది లాగేసికోవడంతో ఆ పిల్లలకి కూడా ఆశ్చర్యం వేస్తుంది. పైగా ఆ పెద్దమనిషి వెళ్ళినతరువాత, తండ్రినో, తల్లినో నిలేస్తారుకూడానూ, ” మమ్మల్ని కోప్పడతారూ.. మరి ఆయన అలా చేసినప్పుడు ఊరుకున్నారే..” అంటూ. Ofcourse,ఇవన్నీ టీవీలు కొత్తగా వచ్చిన రోజుల్లోవి, ఇలాటివి ఈరోజుల్లో మరీ ఎక్కువ కనబడవులెండి, ఎవరి గదిలో వారికి విడిగా టీవీ లున్న రోజులాయె.ఊరికే ఉదాహరణకి చెప్పాను.

ఏదైనా అర్జెంటవసరం వచ్చిందనుకోండి, మొహమ్మాటం లేకుండా, మీఇంట్లో wash basin ఎక్కడుందండీ అని లౌక్యంగా అడిగేయడం, ఎలాగూ దానిపక్కనే ఆ రెండోది కూడా ఉంటుందీ, మన పని చేసెసికుని రావొచ్చూ.ఇంక బయటకి ఎక్కడకి వెళ్ళినా క్షణాల్లో పనిపూర్తిచేసికొచ్చే ఘనత ఎలాగూ ఉంది.జేబులో, పెన్నూ కాగితమూ లేకపోయినా సరే, ఆ అడిగినవాడిదగ్గరే ఆ రెండూ పుచ్చుకుని, వీలునిబట్టి వాడిచేతే ఆ ఎప్లికేషనేదో వ్రాయించేసి ఓ సంతకం ఏదో పేద్ద oblige చేస్తున్నట్టుగా పోజుపెట్టేయకలడు.

ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ముందుగా వాళ్ళతో ఓ చుట్టరికం కలిపేయడం.ఇది ఆడవారిలోనూ, మగవారిలోనూ ఓ “చొరవ ప్రాణు” లలో చూస్తూంటాము. పెద్దాళ్ళైతే పిన్నిగారూ, అవతలివారింట్లో ఆడావిడని మరీ అక్కయ్యగారూ అనలేక( అక్కడికేదో ఈవిడ వయస్సులో తక్కువైనట్టు) వదినగారూ అనేస్తే ఓ గొడవుండదు.పని కానిచ్చేసికోడం.

ఇలాటివాళ్ళకి చిన్నప్పటినుంచీ ఈ అలవాటు ఉంటుంది, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, ఆ ఇంటివారి పిల్లాడి ఆటబొమ్మలు హడఫ్ చేయడంతోటే వీడి చొరవా ( వీడి తల్లితండ్రుల ఉద్దేశ్యంలో!), భవిష్యత్తులో వీడు ఎంత వృధ్ధి లోకి వస్తాడో, చొరవతో జీవితంలో ఎంతలా దూసుకుపోతాడో అన్నీ సినిమారీళ్ళలాగ కనిపిస్తాయి !

చొరవ అనేది ఉండాలి, కాదనము. కానీ దానివలన ఆ మొహమ్మాట పక్షికి నష్టం రానంతవరకూ…

%d bloggers like this: