బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– operation deletion….


    ఏమిటో మొన్నెప్పుడో సావకాశంగా కూర్చుని చూస్తూంటే, నా సెల్లు నిండా ఎవరెవరివో నెంబర్లున్నాయి. ఓ దుర్గుణం ఉందిగా, ఎవరైనా కనిపిస్తే ఏదో రోజూ ఫోను చేసేవాళ్ళలాగ, వారి ఫోన్ నెంబరు అడగడం.పోనీ ఆమాత్రం పరిచయం ఉన్నందుకు అవతలివారో, లేదా ఆ నెంబరు నోట్ చేసికున్న పాపానికి మనమైనా ఫోను చేస్తామా అంటే అదీ లేదూ.ఎందుకొచ్చిన గొడవలు చెప్పండి హాయిగా ఎవరి దారిన వారిని ఉండనీయక?

    పైగా సెల్లులో ఇలా నెంబర్లన్నీ నోట్ చేసికుంటే ఇంకో గొడవుంది.రేపెప్పుడో మనం పోయినప్పుడు, పిల్లలకి ఎవరెవరెవరికి తెలియపరచాలో తెలియక ఇరుకులో పడతారు.అలాగని అందులో ఉండే నెంబర్లన్నిటికీ తెలియపరచలేరుగా. మనకి దగ్గరవాళ్ళెవరో వాళ్ళకీ తెలియదు.అయినా మనం చేసే ఘనకార్యాలన్నీ పిల్లలతో ఎక్కడ చెబుతాము కనుక? అసలు మన చుట్టాలెవరో కూడా తెలియని ఈరోజుల్లో మనస్నేహితులెవరో తెలిసే అవకాశం ఎక్కడ? దీనికి పిల్లల్ననీ లాభంలేదనుకోండి, మనం చేసే నిర్వాకం ఏమిటి? ఇదివరకటి రోజుల్లో మన బంధువులెవరో తెలిసే సందర్భాలుండేవి, రాకపోకల కారణంగా, ఇప్పుడు అలాటివన్నీ అటకెక్కేశాయి.

    ఆమధ్యన మా ఫ్రెండొకాయన భార్య స్వర్గస్థురాలైతే చూడ్డానికి వెళ్ళాము. ఆయనతో మాట్టాడుతూంటే, మధ్యమధ్యలో వారి కూతురు రావడం అడగడం–” అప్పా.. ఈ నెంబరుకి తెలియచేయాలా..” అంటూ, ఈయనకేమో ఆ నెంబరెవరిదో తెలియదాయె. ఇలాటి పరిస్థితులు వస్తూంటాయి. మా ఇంటావిడ సెల్లులో వాళ్ళ ఫ్రెండ్సందరి నెంబర్లూ ఉంటాయి, అలాగే తను expect చేసేదేమిటీ, నా సెల్లులో కూడా నా ఫ్రెండ్సందరి నెంబర్లూ ఉంటాయని, కానీ నాదాంట్లో ఊళ్ళోవాళ్ళ నెంబర్లన్నీ ఉంటాయి. పోనీ ఆ నెంబర్లవాళ్ళైనా అప్పుడప్పుడు ఫోన్లు చేస్తే పరవాలేదు. ఎప్పుడో పున్నానికో, అమావాస్యకో ఓ ఫోను చేయడం, కొంతమందైతే అదీ మానేశారులెండి అది వేరే విషయం.

    ఇంకొంతమందుంటారు, వాళ్ళకి ఏదో అవసరం ఉన్నప్పుడు ఎవరి ద్వారానో తెలిసికున్నానని మనకి ఫోను చెయ్యడం. సంగతేమిటా అంటే వాళ్ళకి ఇంట్లో ఏదో పూజ ఉందిట, తెలుగులో పూజ చేయించే పురోహితుడెవరైనా ఉన్నారా అని, 50 ఏళ్ళబట్టీ ఇక్కడే ఉండడంతో, నాకేదో తెలిసుంటుందని. ఏదో ఫలానా నెంబరుకి ప్రయత్నించండీ అంటాను. ఏదో కాలక్షేపం కబుర్లేవో చెప్పేసి పెట్టేస్తారు.ఏదో ఫోను చేశారుకదా అని ఆ నెంబరు save చేసికోడం. పోనీ మనం ఇచ్చిన సమాచారం ఏమైనా ఉపయోగించిందో లేదో తిరిగి తెలియచేయడానికి వారికీ తీరికుండదు. పోనిద్దూ పనైపోయిందిగా అనే “చల్తాహై” attitude.అలాగే ఇంకొకాయన ఇంకోరెవరిదో పేరు చెప్పి, “ఫలానా వారింట్లో మనం కలిశామూ” అంటూ, వాళ్ళింట్లో ఏదో కార్యక్రమానికి తెలుగు వంటలు చేసేవాళ్ళు కావాలీ, మీకెవరైనా తెలుసా.. అంటూ అడగడం.

    ఎక్కడైతే పరిచయం అయిందో చెప్పే సందర్భంలో ఆ ” ఇంకో ఆయన” పేరుచెప్పడంలో ఉద్దేశ్యం అర్ధం అవదు. దీనితో జరిగేదేమిటీ, “ఓహో మన ఫ్రెండుగారి పరిచయస్థులు ఇలాటివారన్నమాట..” అని ఓ (దుర) అభిప్రాయం ఏర్పడిపోతుంది.మనం ఏదో సమాచారం చెప్పామూ, అలాగని జీవితాంతం ఋణగ్రస్థులవాలని కాదు నేను చెప్పేది, ఏదో విషయం తెలిసిందిగా, పోనీ అది ఉపయోగించిందో లేదో చెప్తే, మనకీ తెలుస్తుంది, రేపెవరైనా ఇంకోరు అడిగితే చెప్పొచ్చూ అని. లేదా తనకి ఇంకొంత సమచారం తెలిస్తే, ఇంకోరికి ఉపయోగపడుతుంది. కాదూ ఎవడెలాపోతే మనకేమిటీ, మనపనైపోయిందిగా అనుకుంటే అసలు గొడవేలేదు.

    అసలు ఎవరైనా ఇలాటి సమాచారాలు అడిగినప్పుడు ” నాకేమీ తెలియదండీ..” అనేస్తే ఇన్నిన్ని పీక్కోడాలే ఉండవుకదూ !!అన్నిటిలోకీ ఇదే హాయంటాను.ఏమిటో అన్నీ మనకే తెలిసినట్టు అడగ్గానే ఎగేసికుంటూ, మనకి తెలిసినవీ, తెలియనివీ, తెలుసుకోబోయేవీ ప్రతీదీ చెప్పేయడం, మళ్ళీ వాళ్ళేదో తిరిగి ఫోనుచేయలేదో అని మొత్తుకోడం, ఎందుకొచ్చిన గొడవలూ. అప్పటికీ మా ఇంటావిడ చివాట్లేస్తూనేఉంటుంది ఎందుకొచ్చిన తాపత్రయాలండి బాబూ, “మీరేమో ఏదో చెప్తారు, వాళ్ళేమో తిరిగి ఫోను చెయ్యరూ, ప్రతీవాళ్ళకీ మీకున్నంత తీరికెక్కడిదీ, చెప్పాలనుకుంటే చెప్పేయండి, అంతేకానీ వాళ్ళు తిరిగి ఫోనుచేయలేదని ఊరికే బ్లడ్ ప్రెషరు పెంచేసికోకండి..” అంటూ “గీతా జ్ఞానం” బోధిస్తుంది.సరే అనేసికుని ఇంక మళ్ళీ జీవితంలో ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకూడదూ అని ఓ “ఒట్టోటి” పెట్టేసికోడం.అదెంతసేపూ, మళ్ళీ ఎవరో ఫోను చేస్తారూ, ఆ “ఒట్టేదో” గట్టున పెట్టేయడం, మళ్ళీ మొదలూ..పుట్టుకతో వచ్చిన బుధ్ధులు ఎక్కడకి పోతాయీ, అవీ మనతోపాటే...

    అసలు ఈ సోదంతా ఎందుకు వ్రాశానూ అంటే, సాయంత్రం ఏదో నెట్ లో కెలుకుతూంటే ఓ ఫోనొచ్చి కట్టయిపోయింది. పోనీ నెంబరుందికదా అని, నేనే తిరిగి ఫోను చేశాను.తీరా ఆయన ఫోను తీసి, ” మీరెవరండీ..” అన్నారు. ముందుగా ఫోను చేసింది ఆయనా, నన్నడుగుతున్నారు అనుకున్నాను.కొద్దిగా ముందుకువెళ్ళి, మీరెక్కణ్ణించీ అన్నారు, సరే ప్రస్తుతం ఫొనుచేసింది నేనే కదా అనుకుని పూణె నుండీ అన్నాను.పూనా.. అక్కడెవరూ నాకు తెలిసినవారు లేరే అంటూ,మీకు ఫలానావారు చుట్టాలేనా అన్నారు.అప్పుడు ఇద్దరికీ click అయింది, ఇదివరకు మేమెప్పుడు కలుసుకున్నామో, అవీఇవీ కబుర్లు చెప్పేసికున్నాము. ఆయనకీ నాలాగే ఎవరెవరివో నెంబర్లు నోట్ చేసేసికోడమూ, సావకాశంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్లు చేయడమూనూ, అదే ప్రకరణంలో నాకూ ఫోను చేసినట్టున్నారు. తీరా నా ఫోన్లో caller tune హిందీ పాట ” ఖోయా ఖోయా చాంద్..” వినిపించుంటుంది, ఇదెక్కడ గొడవరాబాబూ అనుకుని పెట్టేసుంటారు. ఏదో పాతపాటలమీద అభిమానంకొద్దీ ఆ పాట పెట్టుకున్నాను.అప్పుడు తెలిసింది ఆయనకీ నాలాగే నెంబర్లు నోట్ చేసికునే దురలవాటు ఉందని.

    ఈ గొడవలన్నీ పడలేక ఆ మధ్యన కూర్చుని అవసరంలేనివీ, ఎప్పుడో అవసరానికి ఫోన్లు చేసేవారివీ నెంబర్లు delete చేసేశాను. హాయిగా ఉంది….

6 Responses

 1. నా నెంబరు తీసేశారా? 🙂

  Like

 2. రెండు చిన్న జేబులో పట్టే నోటు పుస్తకాలలో,
  ఒకదానిలో క్లుప్తంగా ఆ రోజులో జరిగిన ఘటనలు
  రెండోదానిలో ఆల్ఫబెటికల్గా పేర్లు చిరునామాలు నెంబర్లు
  వ్రాసుకోవడం , ఒక పేజిలో ఎమర్జెన్సి కోసం కేటాయించడం
  చాల ఉపయోగ పడుతుంది. ఇది ఆపరేషన్ కంట్రోల్ / ఆల్ట్ అనుకోండి.

  Like

 3. మొహమాటానికో లేక అవసరార్థానికో తీసుకున్న నెంబర్లను సెల్‌ఫోన్లోకి ఎక్కించినపుడు వారి పేరు ముందు ఒక ‘Z’ ను తగిలిస్తుంటాను. Z category అన్నమాట. ఈ Z category పేర్లన్నీ కిందకి వెళ్ళిపోతాయి. ఈ టెక్నిక్ మీకేమన్నా పనికొస్తుందంటారా?

  Like

 4. శర్మగారూ,

  మీనెంబరు తీసేటంతటి ధైర్యం ఎక్కడండి బాబూ.. ఇంట్లో తిండి దొరకాలా వద్దా….

  డాక్టరుగారూ,
  ఆ చిన్న చిన్న పుస్తకాల్లో వ్రాయడం కొద్దిగా కష్టంగా ఉంది. పైగా సెల్ లో చేసికుంటే, delete చేసే సదుపాయం ఒకటుందిగా….

  తెలుగుభావాలూ,

  మీరు చెప్పింది బావుంది.. ఓసారి ప్రయత్నిస్తాను…

  Like

 5. ఎప్పట్లానే సరదాగాను ఆలోచనాత్మకం గాను సాగింది మీ టపా. వాళ్ళు తిరిగి ఫోన్ చెయ్యలేదని మీరు బాధ పడటానికి కారణం మీకు అందరితో సరదాగా సందడి గా గడపాలని ఉండటం కావచ్చును. ఎటొచ్చి అవతలి వాళ్ళు భవసాగరం లో ఈదుతూ ఉంటారు కదా. అయినా మీ కోపం చల్లారాలంటే ఒక ఉపాయం, మీకు పని వచ్చినప్పుడు వాళ్ళకే ఫోన్ చేసి అడగండి. చెల్లుకు చెల్లు 🙂

  Like

 6. మౌళీ,

  “ఎప్పట్లానే సరదాగాను ఆలోచనాత్మకం గాను సాగింది..” Thanks… మీరు చెప్పినది కరెక్టే.. సలహా బాగానే ఉంది కానీ, ఏదో ఒకరిద్దరితో తప్పించి, ఇంకోరితో పని రావడం అరుదే… మరి ఎలా ? పోనీ వారి క్షేమ సమాచారాలు తెలిసికుందామా అని ఫోనుచేసినా,
  ” this number is no longer in use..” అని మెసేజ్ వస్తూంటుంది. దానర్ధం వారి నెంబరు మారినా, తెలియచేయవలసిన అగత్యం వారికి కలగలేదన్నమాట ! అందుకే delete చేసేయడం హాయి అనుకున్నాను…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: