బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–etiquette లు….

    ఇంట్లో ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. మహా అయితే, కట్టుకున్నావిడచేత నాలుగు చివాట్లు తినడం తప్పించి.. కానీ బయటకి వెళ్ళినప్పుడైనా కొన్ని కొన్ని మర్యాదలు లాటివి పాటించాల్సొస్తూంటుంది. మనకోసం కాకపోయినా చూసేవాళ్ళేమైనా అనుకుంటారేమో అన్న “పాపభీతి” లాటిదోటుండాలని నా అభిప్రాయం. కాదూ నాకిష్టమొచ్చినట్టుంటానూ అంటే, అందరిలోనూ “తలతిక్క” వాడూ అని ఓ పేరొచ్చేస్తుంది. వస్తే రానీ అంటారా అది మన ఖర్మ !

నూటికి తొంబైమందిలో కొంతమందికి ఇంట్లో ఎలా ఉన్నా, బయటకొచ్చేసరికి ఓ పేరు రావాలని గొప్ప తపనలాటిదుంటుంది.కొంతమందైతే as a matter of habit అలవాటుపడిపోయి, ఇంట్లోనూ బయటా ఓలాగే ఉంటారు. కానీ మిగిలిన పదిమందీ ఉన్నారే వాళ్ళతోనే వచ్చిన గొడవంతానూ. ఎవడెలాపోతే మనకేమిటీ, మన పనేదో మనకైపోవాలి, పక్కనున్నవాళ్ళు ఏ గంగలో దిగితే మనకెందుకూ అనుకుంటారు.

కొన్నికొన్ని విషయాలు మరీ ఎవరూ బొట్టెట్టి చెప్పఖర్లేదు.బుధ్ధీ, జ్ఞానమూ స్వతహాగా ఉండాలి. నెత్తిమీదికి ఏళ్ళొస్తే సరిపోదుగా! ఈ సందర్భంలో ఇప్పుడు ప్రతీ వారి చేతిలోనూ సహజకవచకుండలాల్లాగ ఉండే cell phones. చాలామంది ఏదో చెవుల్లో పువ్వులాటివి పెట్టేసికుని లాగించేస్తారు. రోడ్డుమీద వెళ్తున్నప్పుడల్లా ఏమిటేమిటో మాట్టాడేస్తూంటారు, మొదట్లో పాపం వాడికి “మానసిక సంతులన్” ఏమైనా తేడా వచ్చిందేమో అనుకునేవాడిని. కానీ క్రమక్రమంగా అలాటి ” పక్షులు” ప్రతీచోటా కనిపిస్తూంటారు. వీళ్ళవల్ల ఊళ్ళోవాళ్ళకేమీ నష్టం లేదు. మహ అయితే వాడికే నష్టం. ఈ చెవుల్లోవాటివల్ల, వెనక్కాలొచ్చే వాహనాల హారన్లు వినిపించక accidents చేసికుంటూ ఉంటారు. వాడి ఆయుద్దాయం అంతేకాబోసనుకోడం వదిలేయడం.

కొంతమందుంటారు, ఎక్కడకివెళ్ళినా తమదగ్గర cell phone ఉందీ అని చూపించుకోవాలని యావ కాబోలు, దాని నోరైనా నొక్కరు. దానిదారిన అది మోగూరుకుంటే ఫరవాలేదు, వింత వింత రింగు టోన్లూనూ. ఊళ్ళోవాళ్ళందరికీ తెలియొద్దూ.. అక్కడికేదో పుట్టడమే సెల్ ఫోనుతో పుట్టాడా అనిపిస్తుంది. మహ అయితే ఓ పది పదిహేనేళ్ళయిందనుకుంటాను ఈ ఫోన్లొచ్చి. ఈ రోజుల్లో వచ్చే emergency లు, ఈ మాయదారి ఫోన్లు రాకపూర్వమూ ఉండేవిగా, అప్పుడేంచేసేవారుట? Technology ధర్మమా అని మనకి ఈ communication చాలా సులభం అయింది. కానీ అలాటి సాధనాలు ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు ఉపయోగించుకోవాలో అనే విషయం మనలో ఉంది. ఆ మర్యాదలు పాటించడానికి కూడా options ఇచ్చారు కదా. వాటినేవో ఉపయోగించుకుంటే ఎవరికీ తగాదా ఉండదుగా. అక్కడే etiquette లు రంగంలోకొస్తాయి.

బహిరంగ ప్రదేశాల్లో అంటే, మీటింగుల్లోనో, ఏ సంగీతకచేరీల్లోనో, సినిమా హాళ్ళలోనో దాని నోరు నొక్కేయడానికి(silent mode), అదేదో వణకడానికి ( vibration mode) లాటివి ఉంటాయిగా. దేంట్లోనో దాంట్లో పడేసుండొచ్చుగా. రైళ్ళలో చూస్తూంటాము, ఎవడికో, ఏ అర్ధరాత్రో దిగాలంటే, ఈ సెల్లు ఫోనుకి, ఓ అలారం లాటిది పెట్టుకుని, మిగిలినవాళ్ళందరి ప్రాణాలూ తీయడం ! అదేదో vibration mode లో పెట్టుకుని చావొచ్చుగా, అబ్బే వాడితోపాటు బోగీలోని మిగిలినవాళ్ళ నిద్రలు కూడా తగలడితే వీడికి కడుపు నిండుతుంది.

అవన్నీ ఓ ఎత్తూ ఇప్పుడు నేను చెప్పేదింకో ఎత్తూ.. ఈవేళ మా నాన్నగారి అబ్దీకం పెట్టుకోడానికి రాఘవేంద్ర మఠానికి వెళ్ళాము. పిలవడమంటే ప్రొద్దుటే తొమ్మిదిన్నరకే వచ్చేయమంటారు కానీ, మొదలెట్టేసరికి పదకొండు, కార్యక్రమం అంతా కలిపి ఓ 45 నిముషాలు. ఈ 45 నిముషాలూ కూడా,ఆ దిక్కుమాలిన సెల్ ఫోనుని నోరునొక్కుంచాలనే ఇంగితజ్ఞానం లేని ఇద్దరు ప్రబుధ్ధులని చూశాను. జన్మనిచ్చి పైలోకాలకి వెళ్ళిపోయిన తల్లితండ్రులని స్మరించుకోడానికి ఉన్న ఆ ఒక్కరోజునకూడా, ప్రశాంతంగా ఉండనీయరు. ఆ serenity of the occasion కోసమైనా మర్యాద పాటించాలనే జ్ఞానం లేదు.ఇంతలో ఏం కొంపలుమునిగిపోతాయిట? అప్పటికీ ఆ క్రతువు జరిపిస్తున్న పూజారి చేతకూడా చెప్పించుకున్నారు, అబ్బే బుధ్ధి రాదే.

అలాగే ఆ మధ్యన ఓ funeral కి వెళ్ళాల్సొచ్చింది, అక్కడా అంతే, ఎక్కళ్ళేని అత్యవసరాలూ అప్పుడే వచ్చేస్తాయి. ఓ వైపున ఆ పార్ధివ శరీరానికి ఏవేవో పూజలూ అవీ జరుపుతూంటారు, మధ్యలో ఎవడిదో సెల్ ఫోను ఆవాజూ. ఒక్కొక్కప్పుడనిపిస్తూంటుంది- ఇలాటప్పుడు ఆ పాడె మీద పడుక్కోబెట్టినవాడుకూడా లేచి రావొచ్చనీ. అత్యవసరాలుంటాయి, ఆయనెవరో పోయారుగానీ, మనం ఇంకా బతికే ఉన్నాముగా, అది రైటే, కానీ ఆ సెల్ ఫోనుని ఏ “vibration mode” లోనో పెట్టుకుని, బయటకెళ్ళి మాట్టాడొచ్చుగా, అబ్బే అన్నిరాచకార్యాలూ అప్పుడే! మహ అయితే ఏమౌతుంది? దాంట్లో చూస్తే ఓ missed call ఉంటుంది. అంత అర్జెంటైతే ఫోనుచేసి మాట్టాడొచ్చు, ఇలాటప్పుడే etiquette లు రంగంలోకొస్తాయి. ఇలాటివన్నీ ఎవరూ నేర్పఖ్ఖర్లేదు. కానీ అలాటివి ఆచరించినప్పుడు మాత్రం చూసేవాళ్ళకీ అనిపిస్తుంది, ఫరవాలేదు, మంచీ మర్యాదా తెలిసినవాడే అని…

ఈమధ్యన పెళ్ళిళ్లల్లో పురోహితుళ్ళుకూడా ఓ రెండో మూడో బేరాలొప్పుకుంటారు, ఒకచోట తాళి కట్టిస్తూంటే ఫోనూ ఇంకో చోటనుంచి, గౌరీ పూజకి టైమైపోతోందో అనో, స్నాతకానికి పీటలమీద కూర్చోమంటారా అంటూ.. ఆ ఫోన్లు చేసినవాళ్ళందరికీ తలో sloట్టూ alloట్ చేసేస్తాడు మన పురోహితుడు గారు. ఇలాటివన్నీ చూసే వాడెవడో అదేదో సినిమాలో బ్రాహ్మణులని నవ్వులపాలు చేశారూ అంటూ ధర్నాలూ, మానవహక్కులవాళ్ళదగ్గర పితూరీలూ అవీనూ.ఎవరి గొడవ వాళ్ళది…

పోనిద్దురూ ఎవడెలాపోతే మనకేమిటీ… మా చిన్నప్పుడు “రత్నం” పెన్నని ఒకటుండేది. దాన్ని వాడడం అంటే ఓ status symbol గా భావించేవారు. చిన్నపిల్లలని ముట్టుకోనిచ్చేవారు కాదు. మా నాన్నగారి దగ్గరా ఉండేది. నా చిన్నప్పుడు, పాకబడిలో చదివేటప్పుడు, వాడెవడో శనగపప్పూ, జీళ్ళూ ఇస్తానంటే, ఆ పెన్నుకాస్తా వాడికిచ్చేశాను, వాడు దాన్నమేశాడు. అదీ నాకూ “రత్నం” పెన్నుకీ ఉన్న అనుబంధం. మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ “రత్నం” పెన్ను ఘనత విన్నాను/ చదివాను

%d bloggers like this: