బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు– attention seekers…

    పైన పెట్టానే శీర్షిక అలాటి వారు ఓ unique breed కి చెందినవారు. వాళ్ళో వ్రతంలా చేస్తూంటారు. ప్రపంచం ఏమైనా సరే మనకంటూ ఓ అస్థిత్వం ఉందని నిరూపించుకోవాలి. ఎవడో ఒకడు మనమీద దృష్టి పెడతాడుగా అది చాలు !Mission accomplished.. మళ్ళీ ఇంకోటేదో వెదుక్కుంటూ పోవడం…

   చిన్నప్పుడు ఇదివరకటి రోజుల్లో, గుర్తుండేదనుకుంటాను ఇంటినిండా పిల్లలూ, అందరినీ చూడ్డంకూడా కష్టమే కదా, ఏ ఎడపిల్లాడికో అనిపిస్తుంది, తనకి రావలిసినంత attention రావడంలేదో అని, సావకాశంగా ఏదీ కారణం లేకుండా ఏడుపు, పేచీ మొదలెడతాడు. ఏదో పాపం మొదట్లో వాడి కోరిక నెరవేరేది, కానీ ఈ “పేచీ” లాటిది మరీ అలవాటైపోతే, ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇంటికొచ్చిన వారెవరైనా, “అదేమిటండీ అలా గుక్కపెట్టి ఏడుస్తూంటే మరీ ఏమీ పట్టనట్టుంటారూ..” అని అడిగినా, ” ఫరవాలేదండీ, వాడికది అలవాటే, ఏడ్చి ఏడ్చి ..వాడే ఊరుకుంటాడూ మీరసలు వాడివైపు చూడకండి..” అనేసేవారు, ఈ పేచీ పెడుతున్న వాడి “యజ్ఞం” కాస్తా ఫ్లాప్పైపోయేది.. ఇంకో ప్రక్రియ మొదలెట్టేవాడు, లేకపోతే వీణ్ణి పట్టించుకునేదెవరు?

    కానీ ఈ రోజుల్లో అలా కాదు, ఇంటికి ఒకళ్ళో ఇద్దరో పిల్లలు, వాళ్ళేమో ఈ తల్లితండ్రుల ” ఆంఖో కా తారాలు“. మరీ పిల్లల మధ్య ఎడం లేకపోతే వచ్చే సమస్య ధర్మమా అని, పెద్ద పిల్లాడో, పిల్లకో ఎప్పుడోఒకప్పుడు అనిపిస్తుంది, అరే ఇదేమిటీ ఇలాగే సాగితే గొడవే, అనేసికుని ఏదో మరీ అల్లరి పాలవకుండా ఉండే, జ్వరమో, కడుపు నొప్పో. ఒక్కొక్కప్పుడు My head is reeling mummaa.. అనేసి, పైగా ఈరోజుల్లో ప్రతీదీ ఇంగ్లీషులో చెప్పడం ఓ ఫాషనాయే, ఏదో ఒకటిలెండి, మొత్తానికి ఆ రెండొ పిల్లనో, పిల్లాడినో చూస్తున్న ఆ తల్లితండ్రుల attention మొత్తానికి divert చేస్తుంది. ఏమైతేనే, సాధించిందా లేదా? ఇంక ఈ తల్లితండ్రులు, నెట్ లో ఓసారి వెదికేసి ఎప్పుడెప్పుడు ఎందుకెందుకు బుర్ర అదేనండి head తిరుగుతుందో, తెలిసేసికుని, వెంటనే వాళ్ళు నెలలో కనీసం నాలుగైదుసార్లువెళ్ళే డాక్టరుగారి కి ఫోను చేసేసి, ఓ appointment ఫిక్స్ చేసేసికుంటారు. అదృష్టం ఎమిటంటే ఇలాటివన్నీ వీకెండ్స్ కే పరిమితం. లేకపోతే మళ్ళీ అఫిసులూ, శలవలూ గొడవ! ఆ డాక్టరుగారికీ తెలుసు ఇదేమీ పేద్ద సీరియస్సు కాదూ అని, ఇలాటివాటికి ఫోన్లలో వైద్యం చేయరు, మళ్ళీ వందరూపాయలు వట్టం కాదూ? ఓసారి బట్టలూడతీసి, అదేదో టేబుల్ మీద పొడుక్కోబెట్టి, తల్లీ తండ్రీ పక్కనే ఆ రెండో పిల్లనో/పిల్లాడినో చంకలో పెట్టుకుని, ఈ పరీక్ష చేయబడుతున్న మొదటి పిల్ల/పిల్లాడి వైపు ఆందోళితాభరితమైన దృష్టితో చూస్తూంటారు. ఈ డాక్టరుగారు ఏవేవో పరీక్షలు చేసేసి, సింకులో ఓసారి చేతులు కడిగేసికుని, తాపీగా కుర్చీలో సెటిల్ అయి చల్లగా చెప్తాడు..There is nothing serious.. just cramps.. ఇంగ్లీషులో చెప్తే అదో స్టైలూ.. ఏవేవో మందులు నాలుగైదు(ఏక్ దం harmless) రాసేసి, తనకి రావలిసిన వందరూపాయలూ టేబుల్ సొరుగులో పెట్టుకుంటాడు. ఇంక రోజంతా ఆ పెద్ద పిల్లకి attenషనే attention.. ఎప్పుడో వీలు చూసికుని మళ్ళీ చేస్తుంది… life goes on.. వాళ్ళు మానా మానరూ, వీళ్ళు పరుగులెత్తకా ఉండరూ…

    ఇంకో టైపు వాళ్ళుంటారు, మరీ పిల్లలు కాదూ, రాజకీయనాయకులు చూడండి, ఎప్పుడో ” జంబూ ద్వీపే భరతఖండే.. ” రోజుల్లో ఈయన మంచి ఫారం లో ఉండేవాడు, అన్ని రోజులూ ఒకేలా ఉండవుగా, ఇంకో ప్రబుధ్ధుడు వచ్చి, ఈయన్ని loop line లోకి తోసేశాడు.మామూలుగా పట్టణంలో జరిగే ఏ సభకీ ఈయన్ని పిలవడం లేదు, పోనీ ఎవడో గుర్తెట్టుకుని పిలిచినా, ఆ మీటింగులో ఎవరూ పలకరించిన పాపాన్న లేరు. సడెన్ గా ఈయనకనిపిస్తుంది, ఇదేదో చూడాలీ ..అని, పెద్ద నగరాల్లో అయితే ఏ టీవీ చర్చా కార్యక్రమంలోనో నాలుగు డబ్బులు స్వంతవే ఖర్చుపెట్టుకుని ఓ ” చర్చా” కార్యక్రమంలో పాల్గోవచ్చు. కానీ, పంచాయితీ లెవెల్ గ్రామాల్లోనూ, టౌన్లలోనూ ఎలాగా మరి? ఏ పత్రికా విలేఖరినో పిలిచి ఓ స్టేట్మెంటిచ్చేయడం, విషయం ఏమీ పెద్దదవఖ్ఖర్లేదు.. ” మాతృభాషకి అన్యాయం జరిగిపోతోందీ… లంచగొండి తనం ప్రతీ రంగంలోనూ విచ్చలవిడి అయిపోయిందీ.. సింగినాదం, జీలకర్రా..” అంటూ. ఈయనెవరో రాజకీయసన్యాసం నుంచి బయటకొచ్చి చెప్పాలంటారా, మనకి తెలియదూ? ఈ ప్రేలాపనంతా మన్నాడు పేపర్లలో “పతాక శీర్షిక” లో వచ్చేస్తుంది.మన కరెస్పాండెంటు మరీ ఆ టౌన్ నుంచి వార్తలేమీ పంపడంలేదూ అనే గొడవా ఉండదూ, ఈ అజ్ఞాత( ఎవరి దృష్టిలోనూ పడని) రా.నా. గారికీ కావలిసినంత attenషనూ !!

    ఇంకోరకం వాళ్ళుంటారు, ఇళ్ళల్లో బాగా వయస్సుమళ్ళిన అత్తగారో, మావగారో మరీ పిల్లలు తమకేమీ attenషను ఇవ్వడంలేదనుకుంటారనుకోండి, ” ఏవిటోనే వేడి చేసినట్టున్నట్టుంది… అంటూ ఖళ్ళుఖళ్ళు మని ఓసారి దగ్గితే చాలు కావలిసినంత attenషను.అలాగే మనం బయటకి వెళ్ళినప్పుడు ఎవ్వరూ పలకరించడంలేదేమో అనే ఓ “అభద్రతా భావం” లాటిదొచ్చిందనుకోండి, ఊరికే ఉదాహరణకి..అందరికీ కనిపించేలా మొహం మీదో, చేతిమీదో, నిక్కర్లెసికునేవాళ్ళు ఏ మోకాలిమీదో, క్యాప్రీలు వేసికునేవాళ్ళు ఏ చీలమండమీదో, ఓ బ్యాండేజీయో, చివరాఖరికి ఓ బ్యాండైడ్డో అయినా సరే వేసేసికుని బయటకెళ్ళడం. ప్రతీవాడూ పరామర్శించేవాడే.. ” అయ్యో ఏమయిందండీ.. ” అంటూ..

    అప్పుడెప్పుడో ఆవిడెవత్తో మనవాళ్ళు అదేదో క్రికెట్ మ్యాచ్ నెగ్గితే బట్టలూడ తీసికుంటానందిట, అక్కడకి ఏదో అలాటివాళ్ళని చూడనట్టు ! పాపం మనవాళ్ళుకూడా నెగ్గేశారు… కానీ ఆవిడేమయిందో మాత్రం తెలియలేదు! అలాగే మన సినిమావాళ్ళూనూ, తిన్నతిండరక్క ఏదో చేస్తారు, ఇంక రాష్ట్రమంతా ధర్నాలూ,ఉపోషాలూ గట్రనూ, వీళ్ళందరూ మరి attention seekerసే ..

    అసలు ఈ సోదంతా ఎందుకుమొదలెట్టానంటే, ఈవేళ ప్రొద్దుటే రోడ్డుమీద వెళ్తున్నప్పుడు ఒకాయన ఎదురయ్యారు. ఆయన్ని రోజూ రెండు కుక్కలేసికుని తిప్పడం చూస్తూంటాను. వాటి దగ్గరకా నెను వెళ్ళనూ, మీదపడితే ! ఆయన చేతికి అదేదో sling అంటారే దానితో, ” అయ్యో పాపం ” అనుకుని, పరిచయం లేకపోయినా పలకరించి, ” మిమ్మల్ని ప్రతీ రోజూ ఆ కుక్కలతో చూస్తూంటానూ, కానీ నాకు కుక్కలంటే భయం వలన పలకరించలేదూ..etc.etc..” చెప్పాను.దానికాయన “అవి ఏమీ చెయ్యవూ.. చాలా obedient..” అంటూ ఏవేవో చెప్పారు. నిజమే ఆయనకి obedienటే కాదనం, కానీ వాటికి మనతో పరిచయం లేదుగా.. అనేసి, ఏమిటీ కథా అంటే చెప్పుకొచ్చారు ఆ accident ఎలా అయిందో వివరాలు.మేము మాట్టాడుతూంటే ఇంకోకాయనొచ్చి మళ్ళీ ఇదేప్రశ్న, మళ్ళీ మొదట్నుంచీ చెప్పుకొచ్చాడు. ఇంతట్లో ఇంకో పెద్దమనిషీ, మళ్ళీ ప్రారంభం..హాయిగా ఓ బోర్డెసికుంటే గొడవుండేది కాదు. కానీ ఇదంతా పాపం attention కోసంకాదు నిఝంగా జరిగింది.

    ఒక్కొక్కప్పుడు అవసరంలేని attention వస్తూంటుంది. నాకు జ్ఞానం వచ్చినప్పటినుంచీ మోకాల్నొప్పుంది. ఏదో లాగించేస్తున్నాను. దీనిధర్మమా అని సైకిలు కూడా నేర్చుకోలేదు. బస్సులూ, నడకానూ. దీనివలన ఎవరికీ హాని లేదు.అవేవో షూస్ వేసికోమంటే అవికూడా వేసికునే నా పాట్లేవో నేను పడుతున్నాను. చెప్పానుగా ప్రాణహానేమీలేదు. మొన్న నా అదృష్టం బాగోక పిల్లలొచ్చినప్పుడు, వాళ్ళకి బై చెబ్దామని మామూలు చెప్పులేసికుని వచ్చాను. అలాటప్పుడు కొద్దిగా అడుగు ఎత్తి వేయాల్సొస్తుంది, అదిగో అదే నాప్రాణం మీదకి తెచ్చింది. “మావయ్యగారూ ఓసారి orthopaedician ని కన్సల్ట్ చేద్దామూ అని మర్నాటి సాయంత్రానికల్లా, నన్ను లాక్కెళ్ళారు. అవేవో ఎక్స్ రేలూ అవీ తీసెసి, you must go for implant అనేశాడాయన.నాకు వద్దుమొర్రో అన్నా వినరే,ఆ డాక్టరు ” ఎన్నాళ్ళనుంచీ ఈ నొప్పీ..” అంటే పాతికేళ్ళన్నాను. పాతవేమైనా ఎక్స్ రేలున్నాయా అంటే లేవుపొమ్మన్నాను.అయినా వదలడే, ఫలానాదైతే రెండు లక్షలూ, ఫలానా ఇంపోర్టెడ్ ది అయితే మూడు లక్షలూ అంటూ ఏవేవో చెప్పేశారు. పిల్లల టెన్షను వాళ్ళదీ, రేపెప్పుడో మంచంపట్టవలసొస్తే వాళ్ళకే కదా పాట్లు. ఏదో ఓసారి వైద్యం చేయిస్తే బావుంటుందీ అని వాళ్ళ తాపత్రయం.అప్పుడే అయేదికాదనుకోండి, మా డాక్టరుగారు కూడా చెప్పాలి, అప్పుటిదాకా నా దారిన నేనుకాలక్షేపం చేస్తాను. ఇదిగో ఇలాటివి అవసరం లేని attentionలంటే…

%d bloggers like this: