బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    మన తెలుగుదేశంలో అయితే, తెలుగు పత్రికలు కావలిసినన్ని దొరుకుతాయి. ఏది కావాలంటే అది కొనుక్కోడం, హాయిగా చదువుకోడమూనూ. కాదూ కూడదూ ,ఏ గ్రంధాలయానికో వెళ్ళి అక్కడ చదువుకోడం. నేనైతే ఏదో లైబ్రరీకి వెళ్ళి చదువుతాననుకోండి, కానీ మా ఇంటవిడో? ఏదో లైబ్రరీలకెళ్ళడం, చదవడం అన్నీ ఉత్తిత్తి కబుర్లనుకోండి, అదేమిటో, మొదటినుండీ కొని చదవాలనే తపనే ఎక్కువ. ఉద్యోగంలో చేరిన మొదట్లో సగం జీతం, ఈ పత్రికలకీ, గ్రామఫోను రికార్డులకే అయిపోయేది.

    కానీ, నాకో ‘దుర్గుణం’ ఉంది, కొనడమైతే కొంటాను కానీ, ఇంటి బయటకి ఎవరినీ మాత్రం తీసికెళ్ళనీయను.దీనివలన చాలామందికి కోపాలొచ్చాయనుకోండి, వాళ్ళిష్టం అది. కొనడానికి ఓపికా, స్థోమతా ఉన్నవాళ్ళుకూడా కొనకుండా, ఫుకట్ గా చదివేస్తామంటే, ఇంక ఆ పత్రికల యాజమాన్యాలు బతికేదెట్లా? లేదంటారా, హాయిగా ఏ లైబ్రరీలోనో చేరడం, అక్కడే కూర్చుని చదువుకోడం.

    గత 50 ఏళ్ళనుండీ, పుణె, వరంగాం లలో ఉండడం చేత, రైల్వే స్టేషనుకి వెళ్ళడం, తెలుగు పత్రికలు కొనుక్కోడమూ ఓ వ్యసనమైపోయింది. ‘రచన’ అని ఒక పత్రికోటుంది తెలుసు కదూ. మరీ ‘భారతి’ అంత standard కాకపోయినా, మిగిలిన పత్రికలతో పొల్చి చూస్తే, బాగానే ఉంటుంది. మొదటి సంచికనుండీ కొంటున్నాను.ఇదివరకటి రోజుల్లో హాయిగా రైల్వే స్టేషన్లలో దొరికేది, ఏమొచ్చిందో ఏమో వాళ్ళ ద్వారా అమ్మడం ఆపేశారు. పైగా ” సంవత్సర చందా” యే మార్గం అనడంతో అదీ చేశాను. మొదట్లో నెల మొదటి వారానికల్లా వచ్చేసేది.ఇదీ బాగానే ఉందీ అనుకున్నంతసేపు పట్టలేదు, ఓ అయిదారు నెలలనుండి, దానికిష్టమున్నప్పుడు వస్తూంటుంది.ఓ వరసా వావీ లేదు.

    ఇలా కాదని శ్రీ శాయిగారికి ఫోనుచేశానా, పాపం ఆయన శ్రధ్ధ తీసికుని, ఫోను చేసిన వారంలోపు పంపిస్తూంటారు. ఆడుతూ పాడుతూ, నాకే సంచికైతే రాలేదని ఫోను చేశానో ఆ సంచిక కాస్తా ఓ నెలకో, రెండు నెలలకో వస్తూంటుంది.పోనీ, ఆ డూప్లికేట్ సంచిక తిరిగి పంపిచ్చేద్దామా అనుకుంటే, మళ్ళీ ఇదో ఖర్చా అని అశ్రధ్ధ చేస్తూంటాను.రెండేసి కాపీలు తీసికోడం భావ్యం కాదూ అనుకుని, ఇంక ఫోనులు చేయడం కూడా మానేశాను.పోనీ అలాగని ఎప్పుడైనా మెయిలు చేశానా, దానికి సమాధానం ఉండదు.ఉండబట్టలెక ఎప్పుడో ఫోనుచేసినా, ” మావాళ్ళు సరీగ్గానే పోస్టు చేస్తున్నారూ, తేడా ఏమైనా ఉంటే మీవాళ్ళదగ్గరే ఉందేమోనండీ” అంటారు.అలాగని పోనీ ఆ పత్రిక ( రెండు నెలల తరువాత నాకు వస్తూన్నది) wrapper చూస్తే, దానిమీద ఒక్క పోస్టల్ స్టాంపూ ఉండదు, చిత్రం ఏమిటంటే పుణె పోస్టాఫీసువాల్ల స్టాంపు కూడా కనిపించదు. మరి “గాలిలో” ఎగిరొస్తోందంటారా?

    అసలు ఈ పోస్టలు వాళ్ళకి నామీద ఏదో పూర్వజన్మపు కక్ష లాటిదుందేమో అనిపిస్తూంటుంది.మూడు నెలలక్రితం, మా చుట్టాలబ్బాయి పెళ్ళి అయింది, ఫోను చేసి చెప్పాడు, పెళ్ళిపత్రిక scan చేసి పంపాడు. అయినా అతని అన్నగారు మళ్ళీ ఫోనుచేసి, అలాకాదూ, మీ ఎడ్రసివ్వండి, ఆహ్వానం పంపాలీ అనేసి, ఆ ఎడ్రసు తీసికున్నాడు.పాపం ఆ అబ్బాయి పంపిన కార్డు చివరకి మూడు నెల్ల తరువాత చేరింది. అదేమిటో అని తెరిచిచూస్తే, ఆ పెళ్ళి శుభలేఖ ! ఆ పెళ్ళైనవాళ్ళకి ఏ బాబో, పాపో పుట్టినతరువాత రాలేదు నయం !!

    ఈ పోస్టాఫీసువాళ్ళ దగ్గర డబ్బులు వేయాలన్నా భయమే, తీరా డబ్బులు తీసికుందామనుకుంటే, ఏదో సంతకంలో తేడాఉందంటారు. అప్పుడెప్పుడో రాజమండ్రీకి transfer చేయించిన ఓ TDR రావడానికి మూడు నెలలు పట్టింది. అదీ ఎప్పుడూ, రాజమండ్రీ నుంచి, పుణె లోని PMG గారికి ఫోన్లుచేయగా, చేయగా .. ఏమిటో ఇదివరకటి రోజుల్లో ఈ పోస్టల్ వాళ్ళంటే చాలా అభిమానం ఉండేది. రానురానూ వాళ్ళంటే ఓ దురభిప్రాయం వచ్చేసింది.

    ఒకానొకప్పుడు పోస్టాఫీసన్నా, ఎండనకా వాననకా అందరికీ యోగక్షేమాలు తెలిపే పోస్ట్ మానన్నా అందరికీ ఓ ఆత్మబంధువుల్లాటివాళ్ళు. ఆరోజుల్లో మనం వినే రేడియోలకి licence అనోటుండేది. ప్రతీ ఏడాదీ ఆ licence కట్టకపోతే ఓ నోటీసోటి పంపేవారు! ఓ ఫోను చేయాలన్నా, ఓ టెలిగ్రాం పంపాలన్నా ఆ పోస్టాఫీసులే దిక్కు.ఎప్పుడైనా పాతజ్ఞాపకాలు తాజా చేసికోడానికి పోస్టాఫీసులకి వెళ్ళినప్పుడు, చూస్తూంటాను ఇంకా వాటినే నమ్ముకున్న ” విశ్వాసపాత్రులు” ఇంకా ఉన్నట్టు.మొదటి వారంలో రష్ గాకూడా ఉంటూంటుంది.

    ఈ పోస్టాఫీసుల్లో ఇప్పుడు సింహభాగం ప్రభుత్వ కార్యాలయాలకే మితం అయినట్టు కనిపిస్తోంది.అదేదో certificate of posting అని ఒకటుండేది, Small savings అయితే సరేసరి, వాటిని సేకరించే ఏజంట్లకు అదేదో కమిషనుకూడా దొరుకుతుంది.ఇవే కాకుండా PPF, Postal Insurance లాటివి ఉండనే ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని కొన్ని రైళ్ళలో చూస్తూంటాము RMS ( Railway Mail Service) అని.

    ఈనాటి తరంలో అసలు పోస్టాఫీసులు ఎక్కడుంటాయో కూడా తెలియనివారున్నారంటే ఆశ్చర్యం లేదు. కారణం, వాళ్ళు చేసేపనులు ఇప్పుడు courier వాళ్ళు చేసేస్తున్నారు. పాపం అప్పటికీ speed post అని ఒకటి చేస్తున్నారు, వాళ్ళకు పోటీగా.ఇంక మిగిలినవాటికి ఎన్నెన్నో ప్రెవేటు కంపెనీలవాళ్ళు పోటీకి వచ్చేశారు. ఎంత పోస్టాఫీసులంటే చిన్నచూపున్నా, ప్రతీవారూ passport సంపాదించాలంటే, అదిమాత్రం speed post లోనే వస్తుంది. అలాటప్పుడు గుర్తొస్తూటుంది పోస్టాఫీసుల్లాటివికూడా ఉన్నాయని. ఇదివరకటి రోజుల్లో ఈ పోస్టుమాన్లు దసరాకో, దీపావళికో “మామూళ్ళు” అడిగేవారు. మొత్తం అందరూ కలిసి వచ్చేయడమూ, పాతికో, వందో తీసుకోడమూనూ.ఈమధ్యన “బేరాలు” తగ్గడంవల్లో ఏమో, ఆ paassportలు ఇస్తున్నప్పుడే ఆ మామూళ్ళు తీసేసికుంటున్నారు!

    ఏదిఏమైతేనేమిటి, నాకు ఆ ‘రచన’ పత్రికేదో టైముకిస్తే ఎంత బాగుంటుందో? ఈపోస్టలువాళ్ళని చూసి భయపడి, ఇక్కడ దొరకని తెలుగుపత్రికలకు చందా కట్టాలంటే భయమేస్తోంది కూడానూ !!!!

%d bloggers like this: