బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– moments of happiness…

    మనిషన్న తరువాత జీవితంలో ప్రతీ రోజూ పైన పెట్టిన శీర్షిక లాటి క్షణాలుండవు. అలాగని రోజూ ఏడుస్తూనే ఉంటే కుదరదుగా దొరికినదాంట్లోనే ఆ “క్షణాలు” వెదుక్కోవాలి. అప్పుడే సంతోషంగా ఉండగలము.ఏమిటో చెప్తారూ, మీకేమీ పని లేదూ అన్నా అనొచ్చు, కానీ నేను జీవితంలో నేను అనుభవించే అలాటి moments of happiness, గురించి ఓకసారి మీతో పంచుకుందామనే ఈ టపా.అవి చాలా silly గా కనిపించొచ్చు. కానీ ఆలోచిస్తే అవును కదూ..అనిపించినా అనిపించొచ్చు. అది మన దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది.

ఏదో లాటరీల్లోనో, వారానికి రెండురోజులు వచ్చే KBC లోనో కోట్లు సంపాదిస్తేనే గొప్పకాదు. సంతోషం ఉంటుంది కానీ ప్రతీవారికీ రాదుకదా, ఆ వచ్చినవాణ్ణి చూసి మనకీ వస్తే ఎంత బావుండునూ అనిపిస్తుంది. తీరా వస్తే, దానితోపాటు వచ్చే “కష్టాలు” చాలానే ఉంటాయి.మనకొచ్చిన డబ్బుగురించి ప్రపంచంలో ప్రతీవాడికీ తెలుస్తుంది.ఆ నెలరోజులూ వచ్చేpublicity చాలా బావుంటుంది. అక్కడితో ఆగదుకదా, ఎక్కడో ఎవడో మన లొకాలిటీలోనే ఉండే ఏ రౌడీ వెధవకో ఓ ఆలోచన వచ్చేస్తుంది- ఈ ప్రైజు వచ్చినవాడెవడో మన దగ్గరలోనే ఉన్నాడూ, వీడి దగ్గరనుండి కొంత లాగిస్తే బావుంటుందని, ఏదో ఒకరూపంలో extortion లోకి దిగుతాడు.పోనీ అవేమైనా ఎదుర్కునే ఓపికుందా అంటే అదీ ఉండదు.ఎందుకొచ్చిన ప్రైజురా భగవంతుడా అనుకుంటూ జుట్టుపీక్కోడం మిగులుతుంది.అలాగని ప్రైజు రాకూడదనడంలేదు, ఫుకట్ గా వచ్చే డబ్బు చేదా ఏమిటీ? ఊరికే ఉదాహరణకి చెప్పాను. మనకెలాగూ రాదూ గొడవే లేదూ…

మరి అలాగైతే ఇంక మనం ఈ so called moments of happiness ని అనుభవించడం ఎలాగా మరీ? అదిగో అక్కడకే వస్తున్నాను. ప్రొద్దుటే నిద్ర లేవగానే అనిపిస్తుంది, ఈవేళ ఎలా ఉంటుందో అని.ప్రొద్దుటే లేచి బాల్కనీలో కూర్చున్నప్పుడు ఇంటావిడ కాఫీ చేసి ఇస్తే అందులో సంతోషం చూడొచ్చు.. అంటే ప్రతీ రోజూ ఇవ్వదా అని కాదు, అలాగని మనం ప్రతీరోజూ దానిలోని సంతోషాన్ని గుర్తించడం లేదుగా, ఏదో routine గా ఇస్తోంది కానీ, ఇందులో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవలిసినదేముందీ అనుకోకూడదు. ప్రతీరోజూ మనం స్నానం చేసి ఆ తడితువ్వాలేదో మనమే పిడుచుకుని ఆరేసికుంటాము. కానీ సడెన్ గా ఇంటావిడ, ఆ తువ్వాలేదో బకెట్టులోనే వదిలేయండీ అందనుకోండి…నిన్ననే మా ఇంటావిడ ఓ టపాకూడా వ్రాసేసింది.

బ్రేక్ ఫాస్టు కి ప్రతీ రోజూ తినే చపాతీలో, ఇడ్లీలో కి బదులు ఇంకోటేదో చేసిందనుకోండి అది సంతోషదాయకం కదా మరి? నాలాటివాడికి ప్రతీరోజూ బయటకి వెళ్ళకుండా ఉండలేడు. బస్సు పట్టుకుందామని వెళ్తూంటే, మనం వెళ్ళేలోపలే ఆ బస్సు మనల్ని దాటిపోతూంటే అయ్యో అనుకుంటూంటే, ఆ బస్సు డ్రైవరు బస్సుని కొద్దిగా ఆపి మనల్ని ఎక్కించుకుంటే,ఎంత బావుంటుందో.. ఆ డ్రైవరుకి ఆ అవసరం లేదు అయినా ఆ క్షణంలో ఏమనుకున్నాడో ఏమో బస్సు ఆపి మనల్నెక్కించుకున్నాడు. కాకపోతే ఇంకో బస్సొచ్చేదాకా ఎండలో ఆగాలి.మరి అలాటిది moment of happiness లోకి రాదు మరీ?

నిన్నఓ బ్లాగులో ఒకాయన వ్రాశిన వ్యాసం చదివాను. ఆయనకూడా పూనా లోనే ఉద్యోగంలో చేరారుట అరవైల్లో, ఆయన ఎడ్రసు తెలియచేయమని ఓ వ్యాఖ్య పెట్టాను. ఆ బ్లాగు ఓనరు గారు వెంటనే స్పందించి, ఆ వ్యాసం వ్రాసినాయన వివరాలు పంపారు,వెంటనే అయనకి ఫోను చేసి, పరిచయం చేసికుని మా “పాతరోజులు” గుర్తుచేసికుని, ఆరోజుల్లో మా ఫ్రెండ్సందరినీ పేరుపేరునా గుర్తుతెచ్చుకున్నాము. ఎక్కడెక్కడ ఎవరెవరుంటున్నారో తెలియని ఈ రోజుల్లో ఏదో యాభై ఏళ్ళ క్రితం మన స్నేహితుల్ని గుర్తుకు తెచ్చుకున్నామంటే అంతకంటే సంతోషమేముంటుందీ? వివరాలు తెలపవలసిన అవసరం కానీ అగత్యంకానీ ఆ బ్లాగు ఓనర్ గారికి లేదు, అయినా ఆ క్షణం లో అనిపించిందేమో, పంపారు. అదీ moment of happiness అంటే !

రోడ్డుమీదనుంచి వెళ్తూంటే ఎవరో ఆపి ఫలానా చోటుకి దారెటూ అని అడిగితే, మనం వారికి ఆ సమాచారం ఇవ్వకలిగితే ఎంత బావుంటుందో కదూ. రోడ్డుమీద ఎంతోమంది వెళ్తూంటారు, అయినా అతని దృష్టి కి మనమే కనిపించాము, అతనికి తెలియనిదానిని గురించి చెప్పకలిగాము.ఏదో పేద్ద ఘనకార్యం చేసేశామని కాదు.. just…

అలాగే కొంపకు చేరుతూంటే రోడ్డు పక్కన ఓ బండిలో నవనవలాడుతూన్న ఏ మెంతికూరో కనిపించిందనుకోండి, మామూలుగా కట్ట పదిరూపాయలకి దొరికేది, ఆ బండివాడు అయిదు రూపాయలంటే సంతోషం కాదూ. ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో అర్ధణాకి వచ్చేది ఇప్పుడు అయిదు రుపాయలా బాబోయ్ అనుకోకుండా, పదిరూపాయలది సగానికి సగం అయిదురూపాయలకే రావడం ఓ moment of happines అంటాను. మొదట్లోనే చెప్పానుగా మనం చూసే దృష్టికోణం లో ఉంటుంది.భోజనంలో నిమ్మకాయపెట్టి అరటికాయ కూర చూసేటప్పటికి సంతోషం

ఇలా ప్రతీరోజూ మనం చూసేవాటిల్లోకూడా మనం ఆనందాన్ని అనుభవించగలిగితే హాయిగా ఉండొచ్చు. అసలు మనం ఇంటికి రాగానే మనమొహం చూస్తేనే అర్ధం అయిపోతుంది ఇంటావిడకి.. ఏమిటీ మంచి ఉషారుగా ఉన్నారూ అంటుంది. అలా కాకుండా ప్రతీదానికీ మొహం ముటముటలాడిస్తూంటే మనకీ సుఖం ఉండదూ, చుట్టుపక్కలవాళ్ళకీ సుఖం ఉండదూ.

ఏదో ఏ ఆదివారంనాడో మనణ్ణీ మనవరాలునీ చూడడానికి వెళ్ళలేకపోయినప్పుడు సడెన్ గా ఆరోజు మధ్యాన్న్నం “తాతయ్యా.. నానమ్మా.. ” అంటూ అరిచే అరుపుల్లో ఎంత సంతోషముంటుందీ? అలాగని ప్రతీరోజూ కలవలేకపోతున్నామే అని బాధపడేకంటే, దొరికిన మధురక్షణాల్ని ఆస్వాదించడంలోనే సంతోషమెక్కువుంటుంది. వాళ్ళు ఊరికే ఏమీ కూర్చోరు, ఇల్లంతా నానా హడావిడీ చేస్తారు అలాగని వాళ్ళు రాకూడదూ అనుకుంటామా? వాళ్ళు రావాలీ, నానమ్మ ముద్దుముద్దుగా విసుక్కోవాలీ, ఓ రెండు మూడు గంటలుండి వెళ్ళినతరువాత మళ్ళీ ఈసురోమంటూ అన్నీ సద్దుకోవాలీ, కానీ వాళ్ళని చూసి recharge అయిన మన బ్యాటరీలు ఎంత సంతోషంగా ఉంటాయీ? అదన్నమాట నేను చెప్పేది, చిన్న చిన్న విషయాల్లో మనం ఆ moments of happiness వెదికి టుపుక్కున పట్టేసికోవాలి !

అంతదాకా ఎందుకూ ఆ మధ్యన నేను వ్రాసిన ఒకటిరెండు టపాలమీద, నాకూ ఓ reader కీ కొద్దిగా అభిప్రాయ బేధం వచ్చింది.యాదృఛ్ఛికంగా నా టపాలమీద మళ్ళీ వ్యాఖ్యలు పెట్టలేదు, కోపం వచ్చిందేమో అనుకున్నాను. కానీ గత రెండుమూడు రోజుల్లోనూ మళ్ళీ పునర్దర్శనం అయ్యేసరికి సంతోషమనిపించింది…పైగా ఎప్పుడో నేను వ్రాసిన ఓ టపామీద కూడా,ఓ పరిశీలనాత్మక వ్యాఖ్య పెట్టారు. Thats what I call a ‘moment of happiness

మీగొడవేదో మీరుపడండీ, మాకు ఇలాటివాటిల్లో ఆ “క్షణాలు” ఆస్వాదించే ఓపికా, సహనం లేదంటారా మీ ఇష్టం…

%d bloggers like this: