బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    దీపావళి పండగ బాగానే చేసికుండిఉంటారని ఆశిస్తున్నాను. మాకు కూడా బాగానే జరిగింది.నేను రోజూ బస్సుల్లోనే వెళ్తూంటానుగా, మా మనవడు అగస్థ్యకి ఓ ముచ్చటా, తనుకూడా నాతోరావాలని. మొన్నెప్పుడో ఆ ముచ్చటా తీర్చేశాను. మధ్యలో ఒకటి రెండుసార్లు ఎత్తుకోవలసొచ్చిందనుకోండి, అయినా లాగించేశాను. ఇప్పుడు ఓపికెక్కడిదీ.. అయినా మనవలకి తాతయ్యలని “ఇబ్బంది” పెట్టడం ఓ సరదా ! అందుకేచెబుతూంటాను, తాతయ్యలు డెభైయ్యో పడిలో పడేముందరే ఇలాటి ఆనందాలన్నీ అనుభవించేయాలని! ఆ తరువాత చేసేదేమీ ఉండదు !!

   తమ్ముడుకి అలాటి ఛాన్సొస్తే, అక్కగారూరుకుంటుందా మరి? మరీ ఇద్దరినీ కలిపి తీసికెళ్ళే ఓర్పూ సహనమూ కూడా ఉండాలిగా. దానికోసం ముహూర్తం ఇదిగో నిన్న దీపావళినాడు పెట్టాను. నవ్యని తీసికుని,బస్సెక్కించి, మేముడే ఫ్లాట్టుకి తీసికొచ్చాను.ఎలాగూ సాయంత్రం ఇక్కడ మా ఇంటావిడ లక్ష్మీపూజ అయినతరువాత వెళ్దామనే కార్యక్రమం ఉండనే ఉంది. Unexpected గా మనవరాలొచ్చేసరికి, ఇంటావిడ కూడా బోల్డంత సంతోష పడిపోయింది.

    కూతురుని ఇక్కడ వదిలేసి వాళ్ళ అమ్మా నాన్నా ఎలా ఉండగలరూ, వాళ్ళూ, మనవణ్ణి తీసికుని వచ్చేశారు. ఎలాగూ వచ్చారూ, భోజనం చేసేసి వెళ్ళండర్రా, అని ఇంటావిడచెప్పగా, వాళ్ళూ సరే అని చేసేశారు. అలాగ అనుకోకుండా, పిల్లలతో కలిసి గడిపే మధుర క్షణాలు అనుభవించేశాము.

    ఇలాటి moments ఈరోజుల్లో అస్తమానూ రమ్మంటే వస్తాయా మరి? ఎవరికి వారే బిజీ.. బిజీ… అలాటప్పుడే చిన్ననాటి జ్ఞాపకాలు తన్నుకుంటూ వచ్చేస్తాయి.ఆరోజుల్లో అలా చేశామూ.. ఇలాచేశామూ అంటూ. జరిగిపోయిన రోజులు తిరిగి రమ్మంటే వస్తాయా, ఏదో ఆ జ్ఞాపకాల్లోకి ఓసారి వెళ్ళిపోవడం. సాయంత్రం లక్ష్మీ పూజకోసం పువ్వులూ అవీ తెమ్మని ఇంటావిడ ఆర్డరు. ఎలాగూ బజారుకెళ్ళానుకదా అని కనిపించాయని తోరణం కట్టుకోడానికి మావిడాకులు కనిపిస్తే, ఎంత బాబూ అని అడిగితే రెండు రొబ్బలూ పది రూపాయలన్నాడు. అసలు మావిడాకులు కొనుక్కోవాల్సిన పరిస్థితి రావడమే ఓ దౌర్భాగ్యం, దానికి సాయం రెండంటే రెండు రొబ్బలకి పదిరూపాయలనడం ఇంకా అన్యాయం ! అలాగే అక్కడ కలువపూవులు కనిపించాయి కదా, పోనీ అమ్మవారికి ఈ పువ్వులంటే ఎంతో ప్రీతిట అని శ్రీచాగంటి వారి ప్రవచనాల్లో విన్నామూ అనుకుని, ఖరీదెంతా అని అడిగితే పువ్వు ఒకటికీ ఇరవైరూపాయలన్నాడు. పోనీ అదైనా fresh గా ఉందా అంటే వాటికి నావయస్సుంది ! నోరుమూసుకుని కూర్చుని, ఏవో మిగిలిన పువ్వులు తీసికుని వచ్చేశాను.

    పువ్వులంటే గుర్తొచ్చింది, మేముండే సొసైటీలో ఓ నాలుగు పువ్వులమొక్కలున్నాయిలెండి,అవేవో చంద్రకాంతాలుట ( ఇంటావిడ చెప్పగా తెలిసికున్నది) తెలుపూ, పసుపూ రంగుల్లో ఉంటాయి ఆ చెట్టుకి.ఆమధ్యన మా సొసైటీలోనే ఉండే ఓ చెట్టు చూపించి, ఇవి బిళ్వపత్రాలూ, వీటితో పూజచేస్తే బాగుంటుందీ అని మా ఇంటావిడ చెప్పినప్పటినుంచీ, ప్రతీరోజూ ప్రొద్దుటే కిందకెళ్ళడం, అదృష్టం బాగుండి దొరికితే ఆ పువ్వులూ, కొన్ని బిళ్వపత్రాలూ తెచ్చి ఇవ్వడం. అదృష్టం అని ఎందుకన్నానంటే, మా సొసైటీలోనే ఓ పెద్దావిడొకరున్నారు, నాకంటె ముందుగా వచ్చిందా, ఒక్కపువ్వూ వదలదు, ఏం లేదూ ఆ చెట్టు ఆవిడవేసిందిట! చెట్టంటే వేసింది కానీ మిగిలిన కార్యక్రమాలు– నీళ్ళుపోయడమూ, రాలిన చెత్త బాగుచెయ్యడమూ సొసైటీ వాచ్ మన్నే కదా చేస్తున్నదీ? వాడికిచ్చే డబ్బుల్లో మనవీ ఉన్నాయిగా, ఇలాటి సున్నితమైన ప్రశ్నలు వేయకూడదూ, ఎప్పుడైనా నేను ముందర పువ్వులుకోస్తే మాత్రం, నాకు కావలిసిన ఓ నాలుగు పువ్వులు కోసికుని, మిగతావి వదిలేస్తూంటాను. మరి ఆ ‘పెద్దావిడ‘ కి అంత ‘ ఆబ’ ఎందుకో అర్ధం అవదు!

    ఈ ‘ఆబ’ అంటే గుర్తొచింది, బఫేలకి వెళ్ళినప్పుడు చూస్తూంటాము, తినే ఓపికున్నా లేకపోయినా, ఉన్నవన్నీ ప్లేటులో వేసేసికోడం, ఫ్రీగా వస్తున్నాయి కదా అని, తింటాడా పోనీ, అదీలేదు, చివరకి తినగలిగినన్ని తినడం, మిగిలినవన్నీ అదేదో పెడతారు, దాంట్లో పడేయడం, ఎవరు తిన్నట్టూ? అలాగే సొసైటీలో నీళ్ళు ఏ ఓవర్ హెడ్ ట్యాంకులో క్లీన్ చేయడానికి, రావంటారో అనుకోండి, ఇంక చూడండి, నీళ్ళొచ్చినంతసేపూ, ఇంట్లో ఎక్కడో ఉన్న బిందెతో పాటు, బుల్లిబుల్లిగ్లాసులదాకా అన్నిటిలోనూ నింపేసికోడమే. తీరా ఆ మర్నాడు ఎలాగూ వస్తాయి, మరి ఇంటినిండా నింపిన బకెట్లలోవీ, బిందెల్లోవీ నీళ్ళెఖ్ఖడ పోయడం– గట్టరులోకి. అంతంతేసి నీళ్ళు నింపడం ఎందుకూ, వాటిని అలా పారపోయడం ఎందుకూ? జనాలు ఇలా ఉన్నంతకాలం మనం బాగుపడమంటే ఎలా బాగుపడతాము? ఇలాటివన్నీ చాదస్థం మాటల్లాగ ఉంటాయి.

    ఇదివరకటి జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకుంటే మరి ఇలాటివే గుర్తొస్తాయి.ఇదివరకటి రోజుల్లో మరి ఇలాటివుండేవా? ఏమైనా అంటే జనాభా ఎక్కువయ్యిందీ అంటూ ఓ కుంటిసాకోటి చెబుతారు. జనాభా ఎంత ఎక్కువైనా, ఉండవలసిన బుధ్ధీ, జ్ఞానం అనేవుంటే ఇంత పాడైపోదు పరిస్థితి.

    చాదస్థం అంటే గుర్తుకొచ్చింది- మనం ఉండే ఎపార్టుమెంటుల్లో తలుపులకి అవేవో ఆటోమెటిక్ తాళ్ళాలుట. ఎప్పుడైనా బయటకు వెళ్ళాల్సినా, ఇంట్లో తలుపులేసి పడుక్కోవాలనున్నా, ఆ తలుపుని ఓలాగు లాగేస్తే లాకైపోతుంది. ఇదివరకటి రోజుల్లోలాగ, సింహద్వారాలకి ఓ గడియా అవీ ఎక్కడుంటాయి ఈ రోజుల్లో? అయినా అవన్నీ చూసుకునే ఓపికెక్కడుంది? “హాయ్.. బై.. అంటూ, ఆఫీసులో రాత్రి పన్నెండింటిదాకా పనిచేసి , ఏ అర్ధరాత్రో, అపరాత్రో ఇంటికి వచ్చి, ఇంకా పక్కమీదే నిద్రోతున్న భార్యనో, భర్తనో మళ్ళీ disturb చేయడం దేనికిలే అనుకునేవారికి ఈ సదుపాయం హాయి! ఇలాటి ” హాయి” లున్నప్పుడు, వాటితో తీసికోవలసిన జాగ్రత్తలూ ఉంటాయిగా మరి, ఇదిగో అలాటివే గుర్తుండవు. పోనీ అలాగని చెబ్దామా అంటే “ఎప్పుడూ ఒకటే సొద, అక్కడకి మాకేదో తెలియదన్నట్టు ఎప్పుడూ ఇదే గొడవా..”, లాటి మాటలూ వింటూంటారు, ఇళ్ళల్లో ఉండే “చాదస్థపు” పెద్దవాళ్ళు. అయినా వాళ్ళు చెప్పేవి మానరూ, నా బ్లాగుల్లాగే...

    చెప్పొచ్చేదేమిటంటే, నిన్న సాయంత్రం మా ఇంటావిడ పూజచేసికుంటుంటే, నేను ఏదో కంప్యూటరులో కెలుకుతున్నాను, ఇంతట్లో ఎవరో బెల్లుకొట్టారు, ఏమిటా అని చూస్తే ఎదురింట్లో ఉంటున్న అమ్మాయి. ” అంకుల్, మీదగ్గర గాద్రెజ్ తాళం ఏదైనా ఉందా” అంటూ. విషయమేమంటే, ఈవిడ బయట ఏదో ముగ్గులేస్తోందిట, అవతలివైపు తీసున్న తలుపులోంచి గాలి బాగా వీచి, ఈ తలుపు కాస్తా మూసుకుపోయింది. మూసుకోకేంచేస్తుందీ? అప్పటికీ ఇదివరకు ఇలా రెండు మూడు సార్లు జరిగినప్పుడు ( ఎవరికో కాదు వీళ్ళకే), మా ఇంటావిడ చెప్తూనే ఉంది, తాళ్ళాల గుత్తైనా కొంగుకి ముడేసికో, లేదా బయట గడియేసే బోల్టైనా బయటకి పెట్టుకో అని. ఏదో ఆ రెండు మూడు సందర్భాల్లోనూ, డూప్లికేటు తాళ్ళం ఉన్న , మరిదిగారు, ఆఫీసునుంచి వచ్చేవరకూ మా ఇంట్లోనే కూర్చుని ఎలాగో గట్టెక్కేశారు. ఈసారి ఆ మరిది కాస్తా దీపావళికి ఊరెళ్ళాడు, మనం వీధిన పడ్డాము !!! పోనీ నీభర్తకి ఫోనుచేసి తాళాలు తీసేవాడిని పిలూ అంటే, ఫోను కూడా ఇంట్లోనే ఉందీ, మా తల్లే అనుకుని, నా ఫోను తోనే సమాచారం అందచేసింది. ఇలాటివైనప్పుడు ప్రతీవాడూ పరామర్శ చేసేవాడే. ఇంతలో పైనుండి ఒకడు వచ్చి, అసలెలా జరిగిందీ అంటూ. నీకు తాళం తీయడం వస్తే తియ్యి, అంతేకానీ, ఎప్పుడు జరిగిందీ, ఎందుకు జరిగిందీ లాటి ప్రశ్నలతో ఉపయోగమేమైనా ఉందా అని అడిగేసరికి, ఎవరింటికైతే వచ్చాడో ఆ ఇంటి యజమాని తనకు తెలిసిన వాడికెవరికో ఫొను చేసి మొత్తానికి ఆ గాద్రెజ్ తాళం తీయించాడు. కథ సుఖాంతం…

    మన ఆంధ్ర దేశ ప్రజ్ఞా పాటవాల కి ఓ దృష్టాంతం...PGI

%d bloggers like this: