బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-సమయానికి కనబడకుండా పోయేవి–2


    ఇవేళ చెప్పేవాటిలో ముఖ్యమైన వస్తువు గొడుగు. ఇంట్లో పనిచేసే వంటావిడో, పనిపిల్లో ఎప్పుడో వర్షం వచ్చినప్పుడు తీసికెళ్ళుంటారు. వాళ్ళు తిరిగి కూదా ఇచ్చే ఉంటారు. ఏది ఏమైనా వర్షా కాలం వచ్చేసరికి, దీనిల్లుబంగారం కానూ, ఛస్తే కనిపించదు.

ఇదివరకటి రోజుల్లో అయితే ఎండా కాలం లో కూడా గొడుగు వేసికుని వెళ్ళేవారు కాబట్టి, ఆ గోడుగు మూవ్ మెంట్స్ మీద ఓ దృష్టిఉంచేవారం. ఇప్పుడేమిటి, ఎవేవో రైన్ కోట్లూ అవికూడా ఓ ప్యాంటూ షర్టూ లాగ, లేకపోతే ఏదో జాకేట్టు లాగ. దానితో పాపం మన బుచ్చి గొడుగుకి పాపులారిటీ తగ్గిపోయింది. అయినా సరే చరిత్ర లో దాని స్థానం ఎప్పుడూ ఉంటుంది.ఇప్పటికీ మా ఫాక్టరీలో రిటైరు అయిన రోజు ఓ గొడుగు ( ఇప్పుడు ఫోల్డింగు టైపు అనుకోండి) ఇస్తూనే ఉన్నారు.కారు ఆపి కొట్టులోకి వళ్ళాలంటే గొడుగు ఉండాలికదా. దాంతో ఏమౌతూందంటే ఇంట్లో ఉన్న గొడుగులన్నీ, ఆ కారులోనే ఉండొచ్చు, అథవా ఒకటీ రెండూ ఇంట్లో ఉన్నా అవి ఎవరో తీసికెళ్ళుంటారు.ఏది ఏమైనా వర్షం వచ్చినప్పుడు నెత్తిమీద గుడ్డేసుకుని వెళ్ళాల్సిందే !!

ఇంకో వస్తువు టార్చ్ లైటు, ఇప్పుడంటే సెల్ ఫోన్లలో లైటూ అవీ ఉంటున్నాయికానీ, మొన్న మొన్నటిదాకా టార్చ్ లైటు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం.ఎవడికో ఇచ్చేఉంటాము,ఆ పెద్దమనిషి, తన పని ఐపోయిన తరువాత తిరిగి ఇద్దామనేది జ్ఞాపకం ఉంచుకోడు.ఇంకోటి గమనించే ఉంటారు, ఆ టార్చ్ లో బ్యాటరీలు మార్చడం ప్రతీ వాళ్ళూ మర్చిపోతూంటారు. దీంతో ఏమౌతుందీ అంటే ఆ బ్యాటరీలు నీరు కారిపోయి, టార్చ్ ఎందుకూ పనికిరాకుండా పోతూంటుంది.

ఇంకోటి నైల్ కట్టర్, హాయిగా ఇదివరకటి రోజుల్లో అయితే గోళ్ళు కొరుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఎవేవో మానిక్యూర్లూ అవీ వచ్చాయి, అయినా వారానికోసారి ఈ నైల్ కట్టర్ కావాల్సివస్తూంటుంది. ఎక్కడో గుమ్ముగా కూర్చునుంటుంది, కనిపించదు. ఇటువంటి క్యాటిగరీలోకే వచ్చేది హాట్ వాటర్ బ్యాగ్గు. ప్రతీరోజూ ఉపయోగించం కాబట్టి దాన్ని ఎక్కడో జాగ్రత్త చేసి పెడతాము. ఏ నడుము నొప్పి వచ్చినప్పుడో, కాలు బెణికినప్పుడో మూవ్ రాసి స్టైలు గా ‘ ఫొమెన్ టేషన్’ పెట్టండీ అంటాదు డాక్టరు. అప్పుడు వెదకడం మొదలెడతాము. ఇదివరకటి రోజులే హాయి, ఓ గిన్నె నిండా నీళ్ళు కాచుకుని, దాంట్లో ఓ గుడ్డ ముంచుకుని, ఆ నీళ్ళు పిండేసి హాయిగా కాపడం పెట్టేవాళ్ళం! ఇప్పుడు అవన్నీ పాత చింతకాయ పచ్చళ్ళే!

ఇంకో వస్తువు
థర్మా మీటరు. ఈ రోజుల్లో డాక్టర్లు కూడా ఏదైనా రోగం వస్తే, ప్రతీ గంటకీ టెంపరేచరు నోట్ చేసికోమంటున్నారు. నా నమ్మకం ఏమిటంటే, అసలు ఈ థర్మా మీటర్లుండడం వల్లే ఈ రోగాలు కూడా ఎక్కువయ్యాయి.బి.పీ, సుగర్, ప్రెగ్నెన్సీ, మొన్న ఎప్పుడో చదివాను క్యాన్సరు టెస్టింగు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చుట. ఇదిగో ఇలాటివన్నీ కొంపలో పెట్టుకోవడం, ప్రతీ రోజూ చూసుకోవడం, దాన్ని గురించి నెట్ లో చదవడం, ఏవేవో ఊహించుకోవడం, ఇంట్లోవాళ్ళ ప్రాణాలు తీయడం, డాక్టర్ల బిజినెస్ పెంచడం తప్ప ఇంకోటి కాదు. ఏమన్నా అంటే ‘ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్’ అని జ్ఞానబోధ చెయ్యడం !!

ఇంకోటుందుందండోయ్ ఫ్యూజ్ వైరు. ఇదివరకటి రోజుల్లో ఎప్పుడైనా ఇంట్లో కరెంటు పోతే ఇంట్లో వాళ్ళే ఫ్యూజు వేసికునే వాళ్ళు. వీడు ఏదో హై వాటెజ్ ఉండే హీటరో, గీజరో వాడడం మొదలెడతాడు. ఠప్పున షార్టైపోతుంది. అర్ధరాత్రీ,అపరాత్రీ ఎలెక్ట్రీ వాడెక్కడ దొరుకుతాడు, అందుకనొ ఓ ఫ్యూజు వైరు ఇంట్లో ఉంచుకునే వాళ్ళు.లైట్లు పోయినప్పుడు,టార్చి లైటూ, ఫ్యూజు వైరూ లేకుండా కరెంటు ఎలాగొస్తుందీ? ఇప్పుడంటే ఇన్వర్టర్లూ సింగినాదం వచ్చేయి కానీ, మన ఊళ్ళల్లో ఇప్పటికీ ఈ ఫ్యూజు వైర్ల అవసరం ఉంటూనే ఉంటుంది.

గుర్తుండే ఉంటుంది, ఇదివరకటి రోజుల్లో ప్రయాణం చేసేటప్పుడు, మనతో తీసికెళ్ళే ప్రతీ బ్యాగ్గూ, సూట్ కేసుకీ తాళాలు వేసే వాళ్ళం. వీటన్నిటినీ కలిపి కట్టడానికి ఓ చైనూ మళ్ళీ దానికో తాళం. ఈ తాళాలు లెకపోతే రైల్వే స్టేషన్ లో క్లోక్ రూం లో మన సామాన్లు ఉండనీయడు.ఇందుకోసం ప్రతీ సారీ ప్రయాణానికి ముందో యజ్ఞం చేయాలి. ఏ ఫాన్సీ కొట్టుకో వెళ్ళడం, మూడో నాలుగో క్లిక్కు తాళాలు కొనడం. విచిత్రం ఏమిటంటే వీటికి ఏమీ సెక్యూరిటీ ఉండదు. ఒకే తాళంతో అన్నీ తెరవ్వొచ్చు. ఆఖరికి ఆ క్లోక్ రూం వాడిదగ్గరుండే తాళం చెవితో సహా. అయినా వాడు చెప్పాడు కాబట్టి మనతో తీసికెళ్ళిన ప్రతీ బ్యాగ్గుకీ ఈ తాళం తగలెయడం. పైగా ప్రయాణం లో ఏ పెట్టైనా తీయాలంటె, తాళాలు మన దగ్గరే ఉంటాయి కనుక ప్రతీసారీ, మనల్నే పిలుస్తారు. అంత బక్క తాళం కప్పా ఛస్తే తెరుచుకోదు. రెండు మూడు సార్లు ప్రయత్నించిన తరువాత తెరుచుకుంటుంది.మొత్తానికి ఈ ప్రయాణాలన్నీ పూర్తయిన తరువాత, ఈ తాళం కప్పలూ,తాళం చెవులూ విడివిడిగా ఓ ప్లాస్టిక్ డబ్బాలో వేసేమనుకుంటాము. ఇంకో ప్రయాణానికి వెళ్ళెముందర, మళ్ళీ ఈ తాళాల డబ్బా గుర్తుకొస్తుంది. ఎక్కడ పెట్టామో మర్చిపోతాము యాజ్ యూజుఅల్.

మొత్తానికి పిల్లాడిఆట సామాన్లలో ఎక్కడో దొరుకుతాయి. ఇంత శ్రమా పడి వెదికి పట్టుకుంటే, ఒక తాళం కప్పకీ చెవి పట్టదు.అంతకుముందు ఒకేతాళం చెవితో వచ్చేసిన తాళం కప్పలన్నీ మొండికేస్తాయి. ఓ వైపున ట్రైను టైము అయిపోతూదనే ఖంగారు, ఏం చెసేది లేక పక్క కొట్లోకి వెళ్ళి మళ్ళీ ఓ సెట్టుకొనుక్కోవడం. చివరకి ఇంటినిండా తాళాలే. ఒక్కటీ ఉపయోగించదు!పోనీ ఈ రోజుల్లో అవేవో నెంబర్ల లాకులొచ్చాయ కదా అనుకుంటే, మనం పెట్టుకున్న నెంబరు కోడ్డు ఎప్పుడూ గుర్తుండి చావదు!

ఈ సారి ఇంకొన్ని……..

8 Responses

  1. I drove 900 miles east and after going there could not find the key to my suitcase. Had to stop at local K-Mart and buy 3 T-shirts and used them with same Jean pant for one week. Then Came back all the way 900 miles again and found that the key was right inside the suitcase.

    Like

  2. @లేదు
    తాళం ఆ పెట్టెలో ఉంటే, మరి ఆ పెట్టెకి తాళం ఎలా వేశారు?

    Like

  3. కామెంట్ రాద్దామని వచ్చి, వెధవది నా పెన్ను , సులోచనాలు మరిచాను :))

    Like

  4. నిజజీవితం లోని చిరాకులను విసుగులేకుండా తీరికగా చెప్తున్నారు..నాకు తెలిసిన ఏ మామయ్యతోనో మాట్లాడుతున్నట్లుగా ఉంది…”నువ్వెక్కడ మాట్లాడుతున్నావ్…మాట్లాడుతుంది నేనేగా” అంటారేమో, నేను కూడా మాట్లాడుతూనే ఉన్నాను నా మనసులో..ఇలా..”కరక్టే కరక్టే..నా గొడుగూ టయానికి కనపడి చావదు…తాళాలు…నేను కూడా మొన్న కొనలా ..ఇంకా నేను జేబు దువ్వెనలు కూడా ఇలానే కొని కూడబెడతూ ఉంతానులెండి”
    ఇప్పుడు నా మాటలు కూడా మీకు చేరి ఉంటాయి.

    Like

  5. లెదూ,

    సాధారణంగా చాలామందికి అయే అనుభవమే !

    Like

  6. పానీపూరీ,

    ఎలాగోలా వేశారు !!

    Like

  7. పిండారి,

    నెట్ లో కామెంటు వేయడానికి పెన్నెందుకండి బాబూ. మరీ నన్ను ర్యాగ్గు చేసేయకండీ !!!

    Like

  8. బొందలపాటీ,

    అందేయి బాబూ.పనేమీ లేదుగా. చదివేవాళ్ళున్నంత కాలం రాస్తూనే ఉంటాను !!

    Like

Leave a comment