బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఊళ్ళో వాళ్ళమీద బ్రతికే ఘనులు

    కొంతమంది ‘ప్రాణు’ లుంటారు. తమజేబులో డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రక్కవాడి మీదే బ్రతికేసి, పబ్బం గడుపుకునే వాళ్ళు. మన రోజువారీ జీవితంలో చాలా మందిని చూస్తూంటాము.
వీళ్ళు సిగ్గూ శరమూ లాటివి ఇంట్లో పెట్టుకుని వచ్చేస్తూంటారు. ప్రతీ రోజూ ఎవడో ఒక బక్రా తగులుతూంటేనే ఉంటారు.

ఉదాహరణకి ఆఫీసులో జీతాలు పుచ్చుకునే రోజు అదేదో ‘పే రోల్స్’ లో సంతకం పెట్టాల్సివచ్చినప్పుడు, ఓ రెవెన్యూ స్టాంపు అవసరం వస్తుందనుకోండి. అంటే, నేను చెప్పేది ప్రభుత్వ కార్యాలయాల గురించి, ప్రైవేటు సంస్థల్లో ఏం చేస్తారో తెలియదు.వీళ్ళు రెవెన్యూ స్టాంపు అంటించి సంతకం పెడితేనే కానీ నెల జీతం ఇవ్వరు. మారోజుల్లో అయితే,ఉద్యోగం లో చేరిన కొత్తలో 60 ల్లో అన్నమాట,సంతకం పెట్టి ఓ లైన్లో నుంచుని జీతం తీసికోవలసి వచ్చేది. క్రమ క్రమంగా, ఓ ప్యాకెట్లో పెట్టి ఇచ్చేవారు. ఆ తరువాత ఓ బ్యాంకు ఎకౌంటు ఓపెన్ చేయించి అందులో జమ చేస్తున్నారు. ఏది ఏమైనా, రెవెన్యూ స్టాంపు ప్రకరణం తప్పదు.

చెప్పొచ్చేదేమిటంటే, ఈ ‘ఊళ్ళో ప్రజలమీద బ్రతికేవాళ్ళుంటారన్నానే, వీళ్ళు స్వంతంగా డబ్బు ఖర్చు పెట్టి ఒక్కసారి కూడా రెవెన్యూ స్టాంపు తెచ్చుకోడు. ‘అర్రే స్టాంపు లేదండి, నా దగ్గరా’ అని ఓ మాట చెప్పేసి, అవతలివాడి నెత్తిమీద చెయ్యి పెట్టేస్తారు.ఆ రోజుల్లో అయితే రెవెన్యూ స్టాంపు 10 పైసలుండేది, పోన్లే ఓ స్టాంపు కేమయ్యిందీ, 10 పైసలే కదా అని, ప్రక్కవాడు కూడా ,తన పర్సులో ఉన్న ఎక్స్ ట్రా స్టాంపు వీడికి ఇచ్చేస్తాడు.మనం వాడిచ్చే పదిపైసలూ తీసికోనూలేమూ, అలాగని అడగా లేమూ. మనకి మాత్రం ఊరికే చెట్లకి కాస్తున్నాయా, మనం ఓ సిస్టమేటిక్ గా బ్రతికేవాళ్ళం కాబట్టి, ప్రతీ నెలా జీతం టైములో అవసరం వస్తుంది కాబట్టి, సంవత్సరానికి సరిపడే స్టాంపులు స్టాకు పెట్టుకుంటాము. ఏవో అరియర్సూ వాటికీ అవసరం వస్తాయని
ఓ మూడో నాలుగో ఎక్కువ ఉంచుకుంటాము.అది వీడికి సమర్పించుకుంటాము. క్రమ క్రమంగా రెవెన్యూ స్టాంపు ఖరీదు 1 రూపాయ దాకా పెరిగింది. పోనీ వాడు ఇవ్వడం మర్చిపోయాడేమో అని గుర్తుచేద్దామా అంటే మొహమ్మాటం. పోనీ అడిగినా,వాడేం చెప్తాడు, ‘అదేంటండి, వెధవ రూపాయకే అన్నిసార్లు అడుగుతారూ, ఇవ్వకుండా మీ అస్థేం హడప్ చేసేస్తున్నామా’ అంటాడు.
అంతే కాదు, కనిపించిన ప్రతీ వాడిదగ్గరా యాగీ చేసేస్తాడు.’ఫలానా ఆయన ఒఠ్ఠి పిసినిగొట్టు, పైస పైసా కి చూసుకుంటాడు’అని.అంతే కానీ వాడి కక్కూర్తి గురించి చెప్పడు !

ఓ నెలా రెండు నెలలూ చూసి, జీతాలకి వెళ్ళేటప్పుడు, ఒకే ఒక్క రెవెన్యూ స్టాంపు జేబులో పెట్టుకోవడమే దీనికి మందు.కొసమెరుపేమిటంటే, మన ఫ్రెండు, మన ఎదురుగానే ఇంకో బక్రా నెత్తిమీద చెయ్యిపెట్టి తన పబ్బం గడుపుకోవడం. వీళ్ళని పుటం వేసినా బాగుపడరు.అంతే!

అలాగే సిగరెట్లు కాల్చేవాళ్ళు, స్వంత డబ్బులు ఖర్చుపెట్టుకుని సిగరెట్లు కాల్చరు. పైగా అదో గొప్పగా చెప్పుకుంటూంటారు.’నాకు సిగరెట్టు అలవాటు లేదండి,ఎప్పుడైనా ఎవరైనా ఆఫర్ చేస్తే తాగుతూంటానూ’అని. రోజులో ఓ పది పదిహేను ఊదేస్తూంటాడు. పైగా ఓ బ్రాండ్ లాయల్టీ ఏమీ ఉండదు. ఎవడేం బ్రాండు ఇస్తే అది కాల్చడం.వాడి లాయల్టీ అల్లా ‘ఫూకట్ ‘ గా వస్తే కాల్చడం!కొసమెరుపేమంటే దేశంలో ఉన్న ప్రతీ బ్రాండు మీదా తన అభిప్రాయం చెప్పడం--ఫలానాది చాలా స్ట్రాంగండి, ఫలానాది కాలిస్తే కిక్కు రాదండీ అంటూ.

అలాగే ఆఫీసుకెళ్ళడానికి ఏ బస్సో ఎక్కొచ్చుకదా, అబ్బే దేర్భ్యంలా ఆఫీసుకెళ్ళే దోవలో స్థంభం లా నుంచుని తెలిసినవాడెవడైనా కనిపిస్తాడా అని చూడ్డం, ఎవడో మొహమ్మాటానికి, రమ్మనడం,అంతే కాదు ప్రతీ రోజూ అదే టైముకి అక్కడ నుంచోడం, ఆఫీసుకి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా లాగించేస్తున్నాడుగా. పైగా సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ప్రొద్దుటాయనకోసం ఆగడం. ఆయనేమో ఓ రోజు చూసి ఇంక ఆగలేక, నాకు బజారులో పని ఉందండి అని తప్పించుకోవడానికి ప్రయత్నించినా, మన నక్షత్రకుడు, వదులుతాడా, అబ్బే, ఫర్వా లెదండి, నాకూ బజారులో పని ఉందండి అంటాడు. వీళ్ళ స్పెషాలిటీ ఏమిటంటే దేశం లో ఉన్న ప్రతీ టూ, ఫోర్ వీలర్సుగురించీ ఉచితమైన అభిప్రాయాలు చెప్పడం !

పైగా వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే, వాడు ఓనరూ, అసలు గాడీ యజమాని డ్రైవరూ అన్నట్లుగా.ఏదో మొహమ్మాటానికి, ఈ గాడీ యజమాని ఎవరైనా పిలియన్ సీటు మీద ఎక్కుతామూ అంటే, పోన్లే మొదటిసారి అడిగేడూ, వద్దంటే బాధ పడతాడేమో అని, సర్లెండి ఎక్కండి, నేనేమైనా మొయ్యాలా అంటాడు. ఆ ‘ఒక్కసారే’ మన ఫ్రెండు, జీవితాంతం మనమేదో వాడికి ఋణ పడ్డట్లుగా ప్రతీరోజూ, టైముకి రెడీ అయిపోతాడు. ఏ ఖర్మకాలో వాడు లీవు పెట్టేడనుకోండి,ఆ రోజు కూడా వదలడు. ‘మన ఆఫీసుకేళ్ళే దోవలోనే ఉందండి మా వాడి స్కూలూ, కొంచెం దారిలో దిగపెట్టేయండి’అని చెప్పి,పిల్లాడితో ‘ జాగ్రత్తగా కూర్చోరా మన అంకులే ఫర్వాలేదు’ అంటాడు.అంటే వీడికే కాకుండా వీడి సంతానానికి కూడా మనం ‘అన్ పైడ్ డ్రైవర్లు’ అన్నమాట!ఇంట్లో ఆయన భార్యకి చిర్రెత్తుకొచ్చేస్తూంటుంది, ఏమిటీ ఈ వెధవ సంత, ఆవెళ్ళేటప్పుడేమైనా ప్రమాదం జరిగితే అదో గోలా.’ఎందుకండీ మీకు ఈ సమాజ సేవా? చెప్పొచ్చుగా ఎవరినీ ఎక్కించుకోవడం నాకిష్టం లేదూ అని, లేనిపోని లంపటం తెచ్చుకున్నారు, పోనీ మీకంత మొహమ్మాటమైతే మా ఆవిడకిష్టం ఉండదూ అని నా పేరు చెప్పండి.ఆ నిష్టూరమేదో నేనే భరిస్తానూ ‘అంటుంది.

రేపు ఇంకా…..

%d bloggers like this: