బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–క్లీనింగ్ అభియాన్

    క్రిందటి ఆదివారం నాడు మా అబ్బాయికీ, కోడలుకీ ఇల్లు క్లీన్ చేద్దామని ఓ బ్రిలియంట్ ఐడియా వచ్చింది.అంతకు ముందర మేము రాజమండ్రీ వెళ్ళేటప్పుడు, చెప్పాను వాళ్ళతో, మేము లేకుండా చూసి, ఇంట్లో ఉన్న వన్నీ అవతల పారేయకండి మెము వచ్చేదాకా అని. మొత్తానికి ఒప్పుకుని, ఆదివారం నాడు క్లీనింగు ,మొదలెట్టారు.

    నేను మా పిల్లల చిన్నప్పటి స్కూలు రికార్డులతో సహా జాగ్రత్త చేసి ఉంచాను.అవన్నీ చూసుకుని ఎంత సంతోషించాడో!ఇంక మిగిలినవన్నీ సార్ట్ చెయ్యడం మొదలెట్టారు.మా అమ్మాయి పుస్తకాలూ, రికార్డులూ విడిగా పెట్టి, తనకి చూపించాక డిస్పోజ్ చేద్దామని విడిగా ఉంచాము.

    మా అబ్బాయీ, కోడలూ మా నవ్య వ్రాయడం మొదలెట్టినప్పటినుండీ ఉన్న కాగితాలు తీసి జాగ్రత్త చేయడం మొదలెట్టారు. అప్పుడు అడిగాను,’ మీకు మీ పిల్లల జ్ఞాపకాలు ఎంత ముఖ్యమో, నాకు కూడా నా పిల్లల రికార్డులూ అంతే ముఖ్యం బాబూ అని.ఆఖరికి మా అబ్బాయి పుట్టినప్పటి, హాస్పిటల్ రికార్డుతోసహా, అప్పటి బిల్లులు కూడా జాగ్రత్త చేశాను.1980 లో మా అబ్బాయి పుట్టినప్పుడు, అయిన బిల్లు 528/- రూపాయలు.అదే జహంగీరు హాస్పిటల్లో, మా మనవడు పుట్టినప్పుడు అయిన బిల్లు అక్షరాలా 60,000/- రూపాయలు!! గుండె గుభేల్ మంది!

    ఈ క్లీనింగ్ అభియాన్ లో నేను మా ఇంటినుండి తెచ్చుకున్న ‘కొడక్ 620’ బాక్స్ కెమేరా ఒకటి దొరికింది. అది 1920 లోనో ఎప్పుడో తయారుచేసిందిట.దానితో, నేను చాలానే బ్లాక్ ఎండ్ వైట్ ఫొటోలు తీశాను. ఆ ఫొటోలు అన్నీ చూడడంలో ఉన్న ఆనందం చెప్పలేనిది. ఈ నలభై ఏళ్ళలోనూ నేను జాగ్రత్త చేసినవి చాలా భాగం ఇప్పటికే తీశేశాము.ఇప్పుడు ఇంక తరవాతి తరానివి.

    ఇదివరకు తెలుగు వార పత్రికల్లో వచ్చే బాపు కార్టూన్లూ, సీరియల్సూ అన్నీ తీసి ఉంచాను.అందులో కార్టూన్లు మాత్రం ఉంచి మిగిలినవన్నీ తీసేశాము.ఇప్పుడు ప్రతీ పత్రికా ఎలాగూ నెట్ లోవస్తూంది కదా,అందుకనన్నమాట. ఊరికే ఇల్లంతా ఈ కాగితాలతో నింపడం కన్నా, కంప్యూటర్ లో స్టోర్ చేసికోవడమే హాయి కదా.

    ఏమిటో అనుకుంటాము కానీ, ఈ జ్ఞాపకాలు మనం ఉన్నన్నాళ్ళూ చూసుకొని ఆ పాతవన్నీ గుర్తుచేసికోడానికే, మనం వెళ్ళిపోయినతరువాత వీళ్ళేమైనా ఉంచుతారా ఏమిటీ? పాతనీరు వెళ్ళిపోయి కొత్తనీరు వచ్చేస్తుంది.అన్నీ తెలుసున్నవైనా, ఏమిటో ఈ తాపత్రయం ! మేమనే కాదు, ప్రతీ ఇంట్లోనూ జరిగేదే ఇది. ఎప్పుడో అవసరం వస్తుందని, ప్రతీ ఉత్తరం, కాగితం జాగ్రత్త చేయడం.ఎప్పుడో ముహూర్తం చూసుకుని అవన్నీ చింపేసి అవతల పారేయడం ! మొన్న మొన్నటి దాకా, నా నలభైరెండేళ్ళ, పే స్లిప్పులూ, జి.పీ.ఎఫ్ కాగితాలూ కూడా ఉంచాను!

   ఇవాళుంటాం, రేపటి సంగతి తెలియదు అయినా సరే, పిల్లలకి సంబంధించినవన్నీ, వాళ్ళకి మొదటవేసిన బట్టలతో సహా జాగ్రత్త చేయడం, వాళ్ళు చిన్నప్పుడు వేసిన బొమ్మలతో సహా ఉంచడం.

    ఇప్పుడంటే ఈ స్కానింగులూ అవీ వచ్చేయి కాబట్టి, పాత రికార్డులన్నీ స్కాన్ చేసేసి, హాయిగా కంప్యూటర్ లో పెట్టేస్తున్నాము, కానీ మాకు అలాటి సౌకర్యాలుండేవి కాదుగా. అందుకనే అంత రద్దీ పేరుకుపోయింది. మొత్తానికి ఈ నలభై ఏళ్ళ పైచిలుకి ప్రస్థానం లోనూ, నాకై ముఖ్యమైనవి అన్నవి ఓ సూట్ కేసుడు అయ్యాయి.వాటిని మాత్రం నేను బ్రతికుండగా బయట పడేయొద్దని, మొత్తానికి ఒప్పించాను !! ఏమిటో ఆ పాత కాగితాలు చూసినప్పుడు అదో ఆనందం, అది అనుభవించాలే కానీ చెప్పలేము.

%d bloggers like this: