బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Brand Loyalty

    మా మనవరాలు ప్రతీ రోజూ ట్.వీ. లో వచ్చే యాడ్స్ చూడ్డం, ‘ మమ్మీ కాంప్లాన్ త్రాగితే, పొడుగు అవుతారుట. ఏదో నైసిల్ పౌడర్ రాసుకుంటే ఒళ్ళు పేలదుట, ఏదో ఫలానా డ్రింకు త్రాగితే పళ్ళ రసం లాగే ఉంటుందిట’ అంటూ అందర్నీ ఊదరగొట్టేస్తూంటుంది. వాళ్ళ నాన్న అయితే ‘ అబ్బో మా అమ్మాయికి ఎన్ని తెలిసిపోయాయో’ అని మురిసిపోయి, ఏదో మాల్ కెళ్ళడం,తన కూతురు అడిగినవన్నీ తేవడం. దీంతో ఇల్లంతా ఓ మినీ మాల్ లా తయారైపోతూంది.పైగా అవి వాడినప్పుడల్లా టి.వీ. యాడ్ లో పాడిన పాటొకటి మనకు బోనస్సు!ఇప్పుడే ఇలా ఉంటే, ఇంకో రెండేళ్ళు పోయిన తరువాత, మా మనవడు అగస్థ్య తో ఎలా ఉంటారో ఊహించుకోడానికే నవ్వొస్తుంది!

ఈ యాడ్లవాళ్ళు, చిన్న పిల్లల్ని టార్గెట్ చేసి ఎంత బాగా వాళ్ళ సరుకుల్ని మార్కెట్ చేస్తున్నారో !ఇవన్నీ చూసినప్పుడు, మా చిన్నతనం గుర్తొచ్చింది.ఆ రోజుల్లో ఇన్ని బ్రాండులూ ఉండేవి కావు, ఉన్నాకానీ ఇన్నిన్ని యాడ్లూ ఉండేవికావు.ఏదో పత్రికల్లోనూ, పేపర్లలోనూ వచ్చే ‘లక్స్’ సోప్,గ్రైపు వాటర్,కాల్గేట్ టూత్ పేస్ట్, జే.బీ. మంగారాం బిస్కట్టులూ, గ్లాక్సో వాళ్ళ గ్లూకోజ్ పౌడరూ ఇలాటివే బాగా గుర్తుండిపోయాయి.అయినా మాకు ఫలానాది కావాలీ అని చెప్పే ధైర్యం ఎక్కడేడ్చిందీ? నాన్నగారు ఇంట్లోకి ఏం తెస్తే అదే నోరుమూసుకుని వాడి, పెరిగి పెద్దయ్యాము.వాటినే వాడి వాడి వాటిమీద ఒక రకమైన ఎటాచ్మెంటూ, ఆ బ్రాండ్ మీద ఓ లాయల్టీ వచ్చేశాయి.

ఆ రోజుల్లో ‘ఓవల్టైన్’ అని ఒకటుండేది.బయటినుండి ‘ఇంపోర్ట్’ చేసే వారు.అలాగే పెద్దవాళ్ళు ‘సెవెన్ ఓ క్లాక్’ బ్లేడు తో షేవింగు చేసికునేవారు.ఆ బ్రాండుల్లోనే పెరిగి పెద్దయ్యాము కాబట్టి, ఇంకో బ్రాండ్ కి మారే ప్రసక్తే లేదు.అదేకాకుండా, పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అదే వేదం ! దీనితో ఆగకుండా, మనం కూడా పిల్లల తండ్రులు అయిన తరువాత, ఇంట్లో అవే తెచ్చేవాళ్ళం.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటె, మా మనవరాలు నవ్య టి.వి. లో వచ్చే బ్రాండులు తెమ్మనప్పుడు, మా అబ్బాయి నుండి ఓ లెక్చరు వినవలసి వచ్చింది.తను చెప్పిన దానిలోనూ పాయింటుంది-ఇప్పటి వాళ్ళు ఏ ప్రత్యేకమైన బ్రాండు గురించీ ‘మైండ్ బ్లాక్’ చేసుకోరూ, మార్కెట్ లో ఉన్న ప్రతీ బ్రాండూ వాడి, ఆ తరువాతే దేనికో దానికి సెటిల్ అయిపోతారూఅని. మరి అలాటప్పుడు, మీ అమ్మాయి మైండు కూడా బ్లాక్ అవడంలేదా అని అడిగాను.తనంటాడూ, నేను కూడా మీదగ్గర ఉన్నంతవరకూ మీరు తెచ్చే బ్రాండులే వాడానూ, ఒక్కసారి ఆ ‘శృంఖలాల’ నుండి విముక్తుడినయ్యాక, బయటి ప్రపంచంలో ఉన్నవన్నిటిగురించీ తెలిశాయి అని.బహుశా అదే కరెక్టేమో.మేము పెరిగిన వాతావరణం లో, ఇటువంటి అవకాశాలు తక్కువ. పోన్లే ఏదో పెద్దవాళ్ళు చెప్పారూ, వింటే ఏం పోయిందీ అనే మనస్థత్వం లోంచి బయట పడలేక పోయాము.

ఇంకో సంగతేమంటే, ఎక్కడా బయట రోడ్డు సైడులో ఉన్న దుకాణాల్లోంచి ఏమీ తిన కూడదు.ఎందుకంటే, ఇంట్లోనే చేసేవారు ఏం కావలిసివచ్చినా. బయట వస్తువులు తింటే ఆరోగ్యం పాడైపోతుందీ అని. బయట ఎవరైనా మన స్నేహితులు ( బయట ఊళ్ళనుండి వచ్చి చదువుకునే వారు), ఎప్పుడైనా వాళ్ళకి వచ్చే హొటల్ కేరీయర్ లో వచ్చే భోజనమో, టిఫినో తింటూంటే,
మహ రుచిగా ఉండేది.మనకి ఇంట్లో వాళ్ళు శ్రమ పడి చేసిన లంచ్, అవతలి వాడికి ఇచ్చేసి, వాడి హొటల్ లంచ్ తినడం అదో ఆనందం.వాడు మాత్రం, మనం ఇంటినుండి తెచ్చిన భోజనాన్ని ఆవురావురుమంటూ లాగించేసేవాడు.అంతే కాదు, మా అబ్బాయి పూణే లో ఇంజనీరింగు చదివేటప్పుడు, ప్రతీ శనాదివారాలు ఓ అయిదారుగురు స్నేహితుల్ని భోజనానికి తీసుకొచ్చేవాడు. దీన్ని బట్టి అర్ధం అయిందేమిటయ్యా అంటే,ప్రతీ రోజూ ఒకే టైపు తింటూండేసరికి ఎవడికైనా విసుగొచ్చేస్తుంది. అంతే కానీ బ్రాండ్ లాయల్టీ కాదూ ఇంకోటీ కాదు. జరిగినంతకాలం జరుపుకోవడమే.

ఈ గోలంతా ఎందుకు రాశానంటే, ఈ అరవైయేళ్ళలోనూ ఎప్పుడూ బయటి రోడ్ సైడ్ దుకాణాల్లో ఎప్పుడూ తిన లేదు. ఏదో హొటల్లోకి వెళ్ళే తినేవాడిని. ఆఖరికి మా కాలేజీ ఎదురుగా ఉన్న పాక హొటల్లోకి కూడా ఎప్పుడూ వెళ్ళే ధైర్యం చెయ్యలేదు, ఎందుకంటే ఎవడెక్కడ చూసిపోతాడో, ఇంట్లో చెప్పేస్తాడో అనో భయం ! ఆఖరికి ఈ మధ్యన అంటే రాజమండ్రీ లో, నాకంటె ముందుగా, మాఇంటావిడ పూణె వెళ్ళీపోయి, నేను ఒఖ్ఖడినీ ఉన్నప్పుడు కూడా, కుమారీ టాకీస్ దగ్గరలో ఉన్న ‘జిలేబీ’ కొట్టులో ‘బెల్లం జిలేబీ’ ఉండేది, ఎప్పటినుండో మనసూ తినాలని, అయినా సరే తినలేకపోయాను.అలాటిది మొన్న ఆదివారం నాడు, ఇంట్లో వెరైటీ లంచ్ ( మా ఇంటావిడ ఓ బ్లాగ్గు కూడా వ్రాసింది దాని గురించి) చేసి, నేను ఎప్పటినుండో తినాలనుకుని, బయట తినే ధైర్యం లేక, ఆ కోరిక చంపుకున్న వస్తువులన్నీ చేసి రుచి చూపించారు !!

%d bloggers like this: