బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కాలక్షేపం

    అసలు కార్యక్రమం ప్రకారమైతే, ఏప్రిల్ 15 కి రాజమండ్రి వెళ్ళి ఏదాది పుట్టిన రోజు కి ‘పురిటి మంచం’ ( నన్ను అనుమానించకండి బాబూ, నా బ్లాగ్గు ది) చూద్దామని టికెట్లు బుక్ చేశాము.కానీ కారణాంతరాలవలన క్యాన్సిల్ చేసికున్నాము.మళ్ళీ ఎప్పుడో వీలు చూసుకుని వెళ్ళాలి.ఎంత చెప్పినా నాలో, ఈ బ్లాగ్గులు వ్రాయడానికి స్పూర్తి ‘గోదావరి గాలి’ అని ఒప్పుకోవాలి. ఏమిటో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది.

    ఎంతమంది కొత్తస్నేహితుల్ని సంపాదించానో? ఎప్పుడు వారందరినీ కలుసుకునే అదృష్టం కలుగుతుందో? ఇప్పుడు తెలుగు వ్రాయడం ఎంత అలవాటు అయిపోయిందంటే, ఎప్పుడైనా ఇంగ్లీషులో మెయిల్స్ పంపాలన్నప్పుడు, చాలా కష్టం అయిపోతూంది.మా వాళ్ళందరూ నన్ను కోప్పడుతున్నారు! ఇంగ్లీషు అలవాటు తప్పిపోతుందీ, అప్పుడప్పుడు ఇంగ్లీషు బ్లాగ్గులు కూడా వ్రాస్తూండండి అని.అందుకోసమని ఈ మధ్యన నా ‘మిస్టరీ షాపింగు’ కొంచెం, ఎక్కువ చేశాను.

   గత వారం లో ‘షాపర్స్ స్టాప్’రెండు-ఒకటి నాదీ, ఇంకోటి మాఇంటావిడదీ చేసి దాని రిపోర్ట్ పంపాను.నేను వ్రాసిన రిపోర్ట్ బాగానే ఉందీ అని 8/10 మార్కులు ఇచ్చారు!ఫర్వాలేదు, ఇంగ్లీషు మరీ అంత అన్యాయంగా లేదూ అనిపించింది! రేపు డాక్టర్.బత్రాస్ క్లినిక్కు కి వెళ్ళాలి( మిస్టరీ షాపింగేనండోయ్). సాయంత్రం ఫోన్ చేసి మెయిల్ పంపారు. కన్సల్టేషనుకే 1500/- కట్టాలిట, మనకి వచ్చేస్తుందనుకోండి, ఏమిటో హోమియోపతీ క్లినిక్కుల్లో కూడా ఇంత ఫీజా, బాబోయ్!
కాలక్షేపం బాగానే అవుతోంది!

    ఈవేళ నాతో వరంగాం ఫాక్టరీ లో పనిచేసిన ఓ అబ్బాయి ( ఆ రోజుల్లో ఆర్డర్లీ గా ఉండేవాడు), ఇప్పుడు స్టాఫ్ లోకి ప్రొమోట్ అయ్యాడు, వచ్చాడు నన్ను కలవడానికి. ఆ ఊరు వదిలి 12 సంవత్సరాలయ్యింది, అయినా గుర్తు పెట్టుకుని వచ్చాడు. తను అన్నాడూ ” మీ దగ్గర పనిచేయడం వల్ల , పధ్ధతులన్నీ తెలిశాయీ, అందువలన ఎవరినైనా కూడా హాండిల్ చేయ కలుగుతున్నానూ’అని. చాలా సంతోషం వేసింది. అబ్బో ఫర్వాలేదూ, నేను ఇచ్చిన ట్రైనింగు కొంతమందికైనా పనిచేసిందీ అనుకున్నాను.

    నిన్న వ్రాసిన నా బ్లాగ్గు పుట్టిన రోజు సందర్భంగా కొన్ని విషయాలు వ్రాయలేక పోయాను, బ్లాగ్గు మరీ పెద్దది అవుతుందీ అని.ఏడాది పొడుగునా వ్యాఖ్యలు వ్రాసిన వారిలో, ఎక్కడో ఒకరిద్దరు తప్ప అందరి దగ్గరనుండీ ప్రోత్సాహకరమైన వ్యాఖ్యలే వచ్చాయి. కొన్ని కొన్ని పోస్టుల్లో లింకులు ఇచ్చినప్పుడు, ఓ రెండు రోజులు పోయిన తరువాత, ఆ లింకులు మాయం అయిపోయాయి.ఇప్పుడు చూస్తే తెలిసింది. కారణం ఏమిటో తెలియదు.ఏదైనా తెలుగు న్యూస్ పేపరు లో నాకు నచ్చిన విశేషం గురించి వ్రాస్తూ, ఆ లింకు ఇచ్చేను. కానీ ఇప్పుడు చూస్తే ఒక్కలింకూ చదవడానికి కనిపించడం లేదు. మీలో ఎవరైనా ఈ సమస్యకి సొల్యూషన్ చెప్తే సంతోషిస్తాను.

    చెప్పానుగా , నాకు పనేం లెదు, ప్రతీ రోజూ తెలుగు పేపర్లన్నీ వివిధ జిల్లాల వార్తలతో సహా చదువుతూంటాను, అందులో ఏదైనా ప్రత్యేకమైన విషయం ఉంటే, మీఅందరితోనూ పంచుకోవాలని అంతే ! ఈ కిటుకేదో చెప్పేసేరంటే, ఈ ఏడాది కూడా మిమ్మల్నందిరినీ బోరు కొట్టేయొచ్చు!!!

%d bloggers like this: