బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు–పొత్తూరి విజయలక్ష్మి-హాస్య(గుళికలు) కథలు

    శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు ” హాస్య కథలు’ అనే శీర్షికతో, ఒక పుస్తకం ప్రచురించారు. ఇందులో మొత్తం 24 ‘కథలు’ ఉన్నాయి….

ఆలిండియారేడియో, మహిళామండలీ కుట్టుమిషనూ , నా పెళ్ళి సమస్య తీరింది , మగ పెళ్ళివారమండీ,
కరెంటు సంబరం , ప్రయాణంలో మనిషి సాయం, పదిహేను పైసలికి ఆరుగురు పిల్లలు, నీళ్ళు తెచ్చుకునే చీర,
కారులో షికారు , కూరల పేరంటం , ఉత్తరీయం ఇస్త్రీ , ఇంటినిండా ఇంగిలీషు,
చదువు మధ్యలో ఏదో కాస్త..,. స్కూలు మీద కర్ర పెత్తనం , చండశాసన మహారాజు , యుధ్ధానికి సిధ్ధం,
భాగవత సారం , దొంగ అట్లు , సినిమాకి వెళ్తే రిక్షా ఎక్కం, సభల సంరంభం,
ఇరుగూ పొరుగూ ఆసరా , సర్వం శ్రీ జగన్నాధం , అన్నానా?? ఏమనీ ?? , పండు గాడు.

కథల పేర్లన్నీ వరస క్రమంలో వ్రాయలేదు. ఏం అనుకోకండి.

    వీటికి కథలు అని ఎందుకు పేరుపెట్టారూ అనుకున్నాను కానీ, ఆవిడ ‘ ఒక చిన్న మాట’ లో వ్రాసినట్లుగా ‘ బాల్యం అంటే అందరి జీవితాలకూ అపురూపమైన వరం.నా బాల్యం కూడా ఎంతో మధురంగా గడిచింది.మొదటినుంచీ హాస్య రచనలు చేయడం నాకు ఇష్టం.అందుకే నా చిన్ననాటి అనుభవాలు కొన్నిటిని మీఅందరితోనూ పంచుకుంటున్నాను’ అని ముందరే ఒక ‘డిస్ క్లైమరు’ పెట్టేశారు!!

    పై ‘కథల’లో ఉన్నవి, ప్రతీ ఉమ్మడికుటుంబంలోనూ, మన చిన్నతనంలో అనుభవంలోకి వచ్చినవే. మనలో ఎంతమంది, ఆ మధురానుభవాలని నెమరు వేసికుని వాటికి ఓ అక్షర రూపం ఇస్తారు? ఇక్కడే శ్రీమతి విజయలక్ష్మి గారు ఓ పేద్ద పాయింటు స్కోరు చేసేశారు. ప్రతీది చదివిన తరువాత, పాఠకుడు ‘ నిజమే, మా అమ్మమ్మా తాతయ్యా కూడా ఇలాగే ఉండేవాళ్ళు’
అని అనుకోకుండా ఉండలేరు. ఆవిడ వ్రాసిన ప్రతీ ‘కథ’లోనూ మన బాల్యం గుర్తుకొచ్చేస్తుంది.

   ఇందులోని మొదటి మూడు ‘కథల’ లోనూ అంటె ఆలిండియా రేడియో,కరెంటు సంబరం, కారులో షికారు లలో అమ్మమ్మగారి అమాయకత్వం, ఇతరులకంటె మన దగ్గర ఉన్న వాటిలోని,ఆధిక్యం దానివలన మనం ఎంతగొప్పవాళ్ళమో తెలియచేయడంలో ఉండే ఆనందం చదవాలే కానీ ,చెప్పడం కష్టం.
‘చదువు మధ్యలో ఏదో కాస్త..,భాగవత సారం ‘ లో అమ్మమ్మ గారి అథారిటీ ( స్కూలు మాస్టర్ల మీద) చూపించారు.‘ఇరుగూ పొరుగూ’ లో ఏదో సాయంగా ఉంటారు కదా అని, ఇంట్లో ఓ వాటా మంచివాళ్ళనుకుని అద్దెకు ఇచ్చి, ఆవిడ వాళ్ళతో పడే పాట్లు, ‘మహిళామండలీ కుట్టు మిషన్‘ లో ఓ మచ్చు తునక–” మల్లు గుడ్డ ఎంత పీకినా ఏం ప్రయోజనం,కవచం తో కర్ణుడిలా, ఆయనలా బనీనుతో ఉండిపోవాల్సి వచ్చేది” అన్న ముగింపు వాక్యం చదువుతోంటే ఆనాటి దృశ్యం మన కళ్ళకు కనిపిస్తుంది.’ కూరల పేరంటం’ లో కొత్తగా చెన్నపట్నం నుండి తెచ్చిన ఇంగ్లీషు కూరలూ,’ స్కూలు మీద కర్ర పెత్తనం ‘లో అమ్మమ్మ గారిని అడ్డుకోలేని తాతయ్య గారి నిస్సహాయతా, అలాగే ‘దొంగ అట్లు’ లో తాతయ్య గారు బయట చేసే అట్లు తిని, దానికి అమ్మమ్మ గారిచే చివాట్లు కూడా తిని, చివరికి జిహ్వ చంపుకోలేక, ‘అమ్మడూ,నాకు ఒంట్లో బాగుండడం లేదే, పోనీ ఆ అట్లు ఏమైనా తింటే తగ్గుతాయేమో’ అని అడగడం.

    ఇంక ‘ నాపెళ్ళిసమస్య తీరింది‘ లో రచయిత్రి అనుభవించిన ఆనందం, సంతృప్తీ,’ ఉత్తరీయం ఇస్త్రీ’ లో తాతయ్య గారిని వీళ్ళు పెట్టే తిప్పలూ,’ చండ శాసన మహారాజు’లో తాతయ్యగారు
పోస్ట్ మాన్ తో ‘అవున్లే నువ్వు పరాయివాడివీ,నువ్వు చదవకూడదు,మేమంతా ఒక్కటే, నేను చదవచ్చు,నా చేతికివ్వడం నీ ఉద్యోగ ధర్మానికి విరుధ్ధం,అయితే అట్లా దూరంగా పట్టుకో చదువుతా’ అనడంలో, తాతయ్య గారి పెద్దరికం,‘సినిమా కి వెళ్తే రిక్షా ఎక్కం’ లో ఆనాటి పూర్వ సువాసినుల చాదస్థం,’ అన్నానా ఏమనీ‘ లో ఇద్దరు చెమిటి వాళ్ళ మధ్య జరిగే సంభాషణా,’ నీళ్ళు తెచ్చుకునే చీర‘ లో కొత్తకోడలి అమాయకత్వం,అన్నిటిలోకీ మచ్చు తునక ‘పదిహేను పైసలకి ఆరుగురు పిల్లలు’ అది చదివిన తరువాత నవ్వి నవ్వి కడుపు నొప్పొస్తే,
నేను బాధ్యుడిని కాను. మందులకోసం శ్రీమతి విజయలక్ష్మి గారినే ఖర్చులు పెట్టుకోమందాము!

    మొత్తం 96 పేజీలు , వెల 40/- రూపాయలు. అంటే ఒక్కొక్క కథా 1.67 రూపాయలయ్యిందన్న మాట. కిట్టుబాటయ్యిందంటారా? అన్ని కథలూ ఒక్కసారే చదివేయకండి, అటొచ్చీ, ఇటొచ్చీ వంటింట్లోకి వెళ్ళి ఓ బెల్లం ముక్క నోట్లో వేసికున్నట్లుగా ఆస్వాదించండి. ఎప్పుడు మీకు మూడ్ బాగోలేదంటే, ఆ పుస్తకం తీసి ఏదో ఓ కథ చదివేయండి. అంతే ఆ బ్యాడ్ మూడ్ అంతా ‘ హూష్ కాకీ’ అయిపోతుంది.

%d bloggers like this: