బాతాఖాని–లక్ష్మిఫణి కబుర్లు-సమయానికి కనబడకుండా పోయేవి

    మనకి అత్యంత ముఖ్యమైనవీ, కావలిసిన సమయంలో కనిపించకుండా పోయే వస్తువుల లిస్ట్ ఒకటి దృష్టిలోకి వచ్చింది.అందులో మొట్టమొదటిది రేషన్ కార్డు, రెండోది ప్యాన్ కార్డ్, మూడోది సెల్ ఫోన్, నాలుగోది కళ్ళజోడు.

ఇందులో రేషన్ కార్డుందండే దానివలన మనకేమీ బియ్యం,పంచదారా, కిరసనాయిలూ దొరక్కపోయినా,ప్రతీ దానికీ అవసరం ఉంటుంది. నందన్ నిలేకేనీ గారి ఆధ్వర్యంలో ఎప్పటికి తయారవుతాయో తెలియని యునీక్ ఐ.డి. కార్డులు తయారయ్యి మనకు దొరికేదాకా, వీటిని ఎక్కడపెట్టామో మర్చిపోకూడదు.ఈ బుచ్చి రేషన్ కార్డు మన అస్థిత్వానికి ఉన్న ఒకేఒక ఫ్రూఫ్. దాన్ని బట్టే మన మిగిలిన ప్యాన్ కార్డు,పాస్ పోర్టూ వస్తాయి.వీటిలో మళ్ళీ రకాలూ ఆంధ్ర దేశంలో తెలుపూ,పసుపూ ఇంకోటేవో. ఇక్కడ మహరాష్ట్రలో ఆ గొడవలేమీ లేవులెండి. ఎక్కడో బట్టల క్రింద జాగ్రత్తగానే పెడతాము, ఓ ప్లాస్టిక్ కవరులోనో,లేక ఇంకో పోచ్ లోనో.అయినా సరే అది కనబడదు అవసరం వచ్చినప్పుడు. ఫొటోకాపీలు దొరుకుతాయి, కానీ వాటితోపాటు ఒరిజినల్ కూడా అడుగుతూంటారు.ఛస్తే కనిపించదు. ఇల్లంతా వెదికేసి, అందరిమీదా విసుక్కుని, నోటికొచ్చినట్లుగా అందరినీ తిట్టేసి మొత్తం కొంపంతా రణరంగం చేసేస్తాము. ‘వెధవ కొంప ఎక్కడ పెడతారో తెలియదు, సమయానికి కనిపించి చావదు,అన్ని ఇంపార్టెంటు డాక్యుమెంట్లూ గుర్తొచ్చే చోట పెట్టండీ ఎన్నిసార్లు చెప్పినా ఒకడికీ లెఖ్ఖలేదు. అరే పోనీ పాపం పెద్దాడు చెప్పాడూ పోన్లే విందాం అని అనుకుంటారా, అబ్బే ఆయన చెప్పాడూ మనం విండం ఎందుకూ’ అనేకానీ…. మొత్తానికి ఎక్కడో ఒకచోట దొరుకుతుంది, ఏ బట్టల క్రిందో. క్రిందటిసారి పిల్లాడు పాస్ పోర్ట్ రిన్యూ చేయించినప్పుడు తీశాడండీ,అలా విసుక్కుంటే పిల్లలేమనుకుంటారూ అని ఇంటావిడ ఓ లెక్చరిస్తుంది. కథ సుఖాంతం.

ఇంక రెండోది ప్యాన్ కార్డు.ఎన్నిసార్లు దానిని జాగ్రత్త చేసినా( క్రెడిట్ కార్డులు పెట్టుకునే దాంట్లో), ఇదిమాత్రం మాయం అయిపోతూంటుంది.పైగా ఈమధ్యన మనం ఏ రకమైన ఆర్ధిక వ్యవహారాలు జరపవలసి వచ్చినా అంటే ఎం.ఎఫ్, ఫిక్సెడ్ డిపాజిట్,డి మ్యాట్, లేక ఎలాటి దస్తావేజులమీద సంతకం పెట్టెటప్పుడైనా ఇది లేకపోతే, బండి ముందుకెళ్ళదు. పైగా ఇదికనుక పోతే ఇంకోటి ఇవ్వడానికి చాలా టైము పడుతుంది. డూప్లికేట్ అంత త్వరగా ఇవ్వరూ, పోనీ కొత్తదేమైనా ఇస్తారా అంటే అదీ లేదు.అందువలన ఈ ప్యాన్ కార్డుని జాగ్రత్తగా ఉంచుకోవాలి.

ఇంటినిండా సెల్ ఫోన్లే. అయినా సరే మనది ఎక్కడుందో మర్చిపోతాము. పైగా దాన్ని సైలెంటు మోడ్ లో పెట్టడంతో, ఇంకో ఫోన్ నుండి రింగిస్తే వినిపిస్తుందా అంటే అదీ లేదు.ఛస్తే కనిపించదు, వినిపించదు. పైగా అదిలేకుండా మనకి కాళ్ళూ చేతులూ తిసేసినట్లుగా అనిపిస్తుంది. వీటిలో ఆఫీసుదోటీ, అందరికీ ఇచ్చే నెంబరుదోటీ, ఫాన్సీది ఓటీ. ఎన్నున్నా లాభం ఏమిటీ, వాటిని సైలెంటు మోడ్ లో పెట్టేసేక!చివరకి, ఏ సొఫాలోనో, బెడ్డుమీదో, ఏ కుషను క్రిందో దొరుకుతుంది.కానీ, దాన్ని వెదకడానికి పడిన కష్టం పడ్డామో!

అందరూ అనుకుంటారు, కళ్ళజోడు ఎప్పుడూ తగిలించుకునే ఉంటారుకదా, ఎక్కడ పెట్టామో ఎలా మర్చిపోతామూ అని. నాలాటివాడి సంగతి వేరు, ఎప్పుడూ కళ్ళకే ఉంచుకోవాలి. కానీ అందరి సంగతీ అలా కాదుకదా,కొంతమందికి రీడింగు గ్లాసూ, ఇంకోళ్ళకి ఓన్లీ బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకోడానికీ, ఇంకోళ్ళకి ఇంకోదానికీ. ఈ కళ్ళజోళ్ళు మరీ రెండేసీ, మూడేసీ ఉంచం కదా.రాత్రి పడుక్కునేటప్పుడో, ఏ స్నానానికి వేళ్ళేటప్పుడో ఎక్కడో పెట్టి వెళ్తాం. ప్రొద్దుటే లేవగానే అది లేకుండా టైము చూళ్ళేం.ఆ కళ్ళజోడు లేకుండా, ఏదో లాగించేస్తామనుకోండి, కానీ ప్రతీ వస్తువూ మసక మసగ్గా కనిపిస్తుంది.ఈ మధ్యన ఓ యాడ్ వచ్చింది చూశారా, ఇంటావిడ తన గ్లాసెస్ గురించి వెదుక్కుంటూంటుంది, ఇంట్లో వాళ్ళంతా ఆవిడని ఆట పట్టిస్తూంటారు, ఆఖరికి ఆ కళ్ళజోడు ఆవిడ నెత్తిమీదే ఉంటుంది. అలా ఉంటుంది ‘చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెదికినట్లు’. మామూలుగా చూస్తూంటాము, అదేదో తాడు కట్టేసి మెళ్ళో వేసేసుకుంటూంటారు.అది హాయి!

ఈరోజుల్లో ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగాలు చేయవలసిన రోజుల్లో, మనకి ప్రతీ చోటా రేషన్ కార్డులు ఇవ్వరు కదా, మరి ఈయన గోలేమిటీ అనుకోకండి.ఆ రేషన్ కార్డనేది మన అస్థిత్వ చిహ్నిక బాబులూ.ఊళ్ళో ఉన్న మీ వాళ్ళని అడిగితే తెలుస్తుంది. లేకపోతే, మీరుద్యోగం చేసే ఊళ్ళోనే ఓ కొంపకొనుక్కున్నారనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఈ రేషను కార్డు మజాకా ఏమిటో!

మళ్ళీ రేపు ఇంకో లిస్టుతో కలుద్దాం !!!

%d bloggers like this: