బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Occupational hazards.

    మామూలుగా మనం ఉద్యోగం చేస్తున్నప్పుడో, లేక వృత్తిరీత్యా నో వచ్చే కొన్ని రకాలైన ఇబ్బందుల్ని ‘ఆక్యుపేషనల్ హజార్డ్స్’ అనొచ్చుననుకుంటాను.కానీ నిజజీవితంలో కూడా ఇలాటి ఇబ్బందుల్ని ఎదుర్కోవస్తూంటుంది.

   ఉదాహరణకి, నాకు చాలామందితో పరిచయం ఉంది.ఆ పరిచయానికి, అవతలివాడి ఆర్ధిక స్థితితో ఎటువంటి సంబంధమూ లేదు.ప్రతీ రోజూ మనకి ఎదురయ్యే వ్యక్తులతో మన పరిచయం పెరిగి, చూసేవాడికి అనిపిస్తూంటుంది, ‘ఓహో వీళ్ళిద్దరికీ చాలా స్నేహం ఉందేమో’ అని.ఆ పరిచయం ఉన్న మనిషిని చూసినప్పుడు, మన బాడీ లాంగ్వేజ్ కూడా మారుతుంది.నేను ప్రతీ రోజూ చూసే, సొసైటీల వాచ్ మన్ లూ, ఆఖరికి ఇక్కడ దగ్గరలో ఉన్న దేముడి గుడుల వాచ్ మన్ లూ కూడా నాకు పరిచయస్తులే. నేను ఏదో పెద్ద పెద్దవాళ్ళగురించి చెప్పడంలేదు.
నాకు తెలుసును ఇలాటి పరిచయాల వలన నాకు ఒరిగేది ఏమీ లేదని, కానీ ఏం చెయ్యను, ఫ్రెండ్ షిప్ చేసికోవడం నాకున్న పేద్ద బలహీనత.మా వాళ్ళు చివాట్లు వేస్తూనే ఉంటారు, ఇంతమందితో స్నేహం ఎందుకూ అని.’దీనివల్ల మీకేమీ నష్టం లేదుకదా, నా దారిన నన్ను వదిలేయండి’అంటాను.

    ఆ విషయం వదిలేయండి, ఈ పరిచయాల వల్ల వచ్చే కొన్ని నష్టాలుకూడా ఉంటూంటాయి.ఈ వాచ్ మన్లుంటారే వాళ్ళు ,తమ అవసరాలకి మనల్ని ఉపయోగించుకుంటూంటారు. ఓ రోజున ఒకడికి కొంత డబ్బు అవసరం పడింది.ఏదో డాక్టరు దగ్గరకు వెళ్ళాలీ ఓ యాభై రూపాయలుంటే ఇమ్మన్నాడు, తన జీతంరాగానే ఇచ్చేస్తానూ అనికూడా చెప్పాడు.పోన్లే ప్రతీ రోజూ చూస్తూనేఉన్నాను కదా అని చిల్లరలేక వందరూపాయలనోటుంటే అది ఇచ్చాను. గుడికి వెళ్ళినప్పుడల్లా రోజూ దండం పెట్టి పలకరించేవాడు.తరువాతి నెల లో ఇచ్చేస్తాడుకదా అని, వాడివైపు చూస్తే, ‘ సాబ్ పగార్ నహీ మిలా, జైసా మిలేగీ ఆప్ కా పైసా వాపస్ కర్ దేగా’ అన్నాడు.పోన్లే పాపం అనుకున్నాను.ప్రతీ రోజూ ఇదే పాట,ఇంక విసుపొచ్చి, అస్తమానూ చెప్పకూ, నీకు వీలున్నప్పుడే ఇయ్యీ అన్నాను.అంతే అప్పటినుంచీ,ఆ పాటైతే మానేశాడు, డబ్బు సంగతి ఎత్తడే ! ఇదిగో ఇలాటివాటినే ‘ఆక్యుపేషనల్ హాజర్ద్’ అంటారు. వందరూపాయలతో వదుల్చుకున్నాను, లేకపోతే ఇంకా ఎంతకు పెట్టేవాడో? వాడు డబ్బు ఇవ్వా ఇవ్వడూ, నేను అడగను.ఇటుపైన ఇంక నన్ను డబ్బులు అడగడనే ఆశ !!

    మా మనవరాలుకి ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్, మేము ఇంట్లోనే ఉన్నాముకదా అని, క్రెచ్ కి పంపడంలేదు. ఎంతసేపని ఇంట్లో మా మొహాలు చూస్తూ ఉంటుందని, పక్క వాళ్ళ పిల్లతో ఆడుకోడానికి పంపుతూంటారు.తను ఇంకోళ్ళ ఇంటికి వెళ్తుంది కాబట్టి, ఆ మిగిలిన పిల్లల్ని మన ఇంటికి వస్తే ఏం అనకూడదు. అంతవరకూ ఫర్వాలేదు. కానీ వచ్చిన గొడవ ఏమిటంటే, మా మనవరాలు తను ఇంట్లో తినే స్వీట్లూ, చాకొలెట్లూ మొదట్లో పిల్లలందరికీ కూడా ఇచ్చేది. అప్పటికీ తనని అడిగేము, ‘నువ్వు వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఏమైనా పెడతారా’అని.’అబ్బే ఏం పెట్టరూ ఊరికే ఆడుకోడం వచ్చేయడం’ అంది.కానీ ఆ వచ్చే పిల్లల్లో కొంతమంది అతితెలివైన వాళ్ళుంటారు, వయస్సేమీ అంత ఎక్కువ కాదు, ఆరేళ్ళో, ఏడేళ్ళో అంతే. వీలైనప్పుడల్లా, మా ఇంటికి వచ్చేస్తారు ఆడుకోడానికి, వచ్చిన ఓ పావుగంటలో, మా మనవరాల్ని పంపి, ‘ చాక్లెట్టులు తీసికు రా తినడానికీ’ అని పంపుతారు. ఇదేమో మమ్మీ చాకొలెట్ల డబ్బా ఇయ్యి, అందరం తింటామూ అంటుంది. ఇవ్వకపోతే ‘ఫ్రిజ్ లో ఉన్నాయికదా తీసియ్యీ అంటుంది.ఇక్కడ పరిస్థితి మింగాలేమూ, కక్కాలేమూ.ఏదో అప్పుడప్పుడంటే ఫర్వాలేదు కానీ, ప్రతీరోజూ ఇలా అంటే కష్టం కదా. నేను చెప్పాను మా పిల్లలతో’ మన పిల్లకి కాలక్షేపంకోసం, ఇంకోళ్ళ ఇంటికి పంపడమైనా మానేయాలి, కాదూ కూడదూ అంటే, ఇలాటివి భరించాల్సిందే’ అని.ఇదో రకమైన ‘ఆక్యుపేషనల్ హజార్డ్’ కదా!

    పోనీ చాకొలెట్లు అడుగుతోంది కదా అని, అల్పిన్ లేబే వి ఇస్తే ‘ ఛా ఇవి కాదూ, క్యాడ్బరీస్ ఉంటేనే బాగుంటుందీ’అంటుంది. అలాగని, ఇంట్లో ఉన్నవన్నీ, ఊళ్ళోవాళ్ళకోసం కాదమ్మా అనీ చెప్పలేరూ, ఎందుకంటే వీళ్ళు నేర్పినదే– మన దగ్గర ఉన్నది అందరితోనూ షేర్ చేసికోవాలీ అని ! ఇలాటివి చిన్న పిల్లలకి తెలియచేయడం చాలా సున్నితమైన వ్యవహారం.ఎటువంటివి అందరితోనూ షేర్ చేసికోవాలో, ఎటువంటివి చేసికోనఖ్ఖర్లేదో తెలిసికునే లౌక్యం నేర్పాలేము. వాళ్ళంతట వాళ్ళు తెలిసికునేవరకూ ఇలాటివి భరించాలి.

%d bloggers like this: