బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మానవ స్వభావాలు–2

    ఇంక రెండో రకం వాళ్ళుంటారు. వీళ్ళకి ప్రపంచంలో సాధ్యం కానిదేమైనా ఉంటుందా అనిపిస్తుంది! ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపిస్తారు. చిన్న పసిపాప దగ్గరనుండి, వయస్సొచ్చిన వారిదాకా ఎవరూకూడా, ఇలాటివారితో మాట్లాడడానికి సంకోచించరు. కారణం వారి ఫేసియల్ ఎక్స్ ప్రెషన్,మాట్లాడే విధానం,ఇతరులని ఆకట్టుకునే పధ్ధతి.

మనం ఏసంగతి గురించి మాట్లాడనీయండి హా అంతేనా అంటారు. అది వారి అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. వారిదగ్గరకి వెళ్ళీవెళ్ళడంతోనే, మన సమస్యకి పరిష్కారం కూడా అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లుగా అనిపిస్తుంది. సమస్యలంటె ఏదో ఇండో పాకిస్తాన్ సంగతులూ, లేక ఆంధ్రా-తెలంగాణా సమస్యలూ కాదు. మనకి రోజువారి జీవితంలో ఎదురయ్యేవి.మనం ఏదైనా ఓ కొత్త ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళామే అనుకోండి, అక్కడ మనకి అన్నీ కొత్తే. ఏ ఒక్కటీ తెలియదు.ఉండడానికి ఓ కొంప కావాలి, సామాన్లు మార్చడానికి ప్యాకర్స్ కావాలి,వగైరా వగైరా..

ఆఫీసులో అందరికీ ఇలాటివాటిలో సహాయం చేయాలనిపించదుగా, ఏమో ఏం చేస్తే మిగిలినవాళ్ళేమనుకుంటారో అని ఓ భయం. అదిగో అప్పుడే ‘మస్కా’ కొట్టడం ప్రారంభింఛేడూరా అంటారేమో.ఎందుకొచ్చిన గొడవరా బాబూ అని ఒక్కడూ ముందుకు రారు.
ఇలాటివన్నీ ఈ తరం లో ఉద్యోగాలు చేసే ఐ.టి. వాళ్ళకి విచిత్రంగా కనిపించొచ్చు. ఇదేమిటీ ఈయన ఇల్లు చూడ్డం అవీ ఎవడో చెప్తే కానీ తెలియదూ అంటాడేమిటీ, కంపెనీ లో ఎచ్.ఆర్ వాళ్ళుంటారుగా అనుకోవచ్చు.బాబూ మీకు మీ ఆఫీసు వాడు ఇళ్ళెక్కడున్నాయీ, ఏజెంట్లెక్కడున్నారో చూపిస్తారు కానీ, వాటి మిగతా వివరాల గురించి ఎవరూ చెప్పరు.ఆ ఏజెంటు కూడా, కమ్మర్షియల్ గానే అంటే వాడి కమీషన్ గురించే ఆలోచిస్తాడు కానీ, మీ కంఫర్ట్ లెవెలూ అవీ వాడికి అఖ్ఖర్లేదు. ఇదిగో ఇలాటప్పుడే నేను చెప్పేనే ‘ సదా మీ సేవలోనే ‘ అనే ఒక
‘ మాన్ ఫ్రై డే ‘
అవసరం వస్తుంది.వీళ్ళకి మీ అవసరాలు చెప్పేయండి.ప్రతీ మాటకూ ముందు ‘ నో ప్రోబ్లెం బాస్ ‘ అంటూనే ఉంటారు. ఇలాటివారిని మనం గుర్తించడంలోనే మన సత్తా చూపించాలి. మన పధ్ధతి నిన్న చెప్పినట్లుగా ప్రతీదీ నెగెటివ్ గానే ఆలోచించే వాళ్ళం అయితే ఈ పరోపకారి పాపన్న లు మన దృష్టిలోకి రారు. ఎందుకంటే మనకి కనిపించేవి, మన దృష్టికోణాన్ని బట్టే.

నోరువిడిచి సిగ్గు పడకుండా అడగండి, ఇలాటి వాళ్ళు మీదగ్గరనుండి ప్రతిఫలాపేక్ష లేకుండా మీకు అన్ని విషయాల్లోనూ సహాయం చేస్తారు. పిల్లల స్కూళ్ళ విషయం, పిల్లల డాక్టరూ, గైనికాలిజిస్టూ అన్నిటికంటే ముఖ్యం. ఈ మూడింటి సంగతీ తేల్చేసుకుంటే, మిగిలినవన్నీ వాటంతట అవే సాల్వ్ అయిపోతాయి! ఈ మధ్యన ఐ.టీ ఉద్యోగాల ధర్మమా అని పిల్లలు బయటి రాష్ట్రాలలో ఉద్యోగాలకి వెళ్ళవలసి వస్తూంది. ఎంత చెప్పినా మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా, ఈ పూజలూ పునస్కారాలు మానడం లేదు. వాళ్ళకోసం కాకపోయినా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకోసం.అదేకాదు, పిల్లలు లేనంతసేపూ ఏవేవో వాగుతారు. దేముడూ లేదూ, కాకరకాయా లేదూ అంటూ. ఓ పిల్లో పిల్లాడో పుట్టుకొచ్చేసరికి ఈ ఖబుర్లన్నీ హాంఫట్ ! పిల్లాడి బారసాల చేయించడానికి మన తెలుగు పురోహితుడెవరైనా దొరుకుతారా అంటూ. వీళ్ళసంగతెల్లాఉన్నా కానీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని సంతోష పెట్టడానికైనా చెయ్యాలి!

ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళున్నారనుకోండి, వాళ్ళకి మీతాతయ్య గారిదో, మామ్మ/అమ్మమ్మ గారిదో ఏ అబ్దీకమో పెట్టాలనుకోండి. అవిచేయించే పురోహితుడెక్కడూంటాడో మీకు తెలియక పోవచ్చు.ఈ రోజుల్లో నగరాల్లో ‘జస్ట్ డయల్’ అని ఒకటి వచ్చింది. వాళ్ళకి ఏవిషయంలో సమాచారం కావలిసినా క్షణాల్లో చెప్తారు. కానీ ఈ సదుపాయం ఒక్క నగరాల్లోనూ, కొంచెం పెద్ద పట్టణాల్లోనూ మాత్రమే ఉంటుంది. ఈ తద్దినాల పురోహితులు వాళ్ళపేర్లు ‘జస్ట్ డయల్’ తో రిజిస్టర్ చేసికుంటేనే కదా వాళ్ళు మనకి చెప్పేదీ. ఇదిగో ఇలాటప్పుడే మనకి సహాయపడతారు, మన ఫ్రెండు.

అంతే కాదు, వీళ్ళు ఎంత నిస్వార్ధ పరులంటే, మనం కానీ, మన ఇంట్లో వాళ్ళుకానీ ఏ హాస్పిటల్ లోనైనా చేరవలసివస్తే, వాళ్ళు పూర్తి బాధ్యత తీసికుని, మన బంధువులకంటె ఎక్కువగా సహాయం చేస్తారు.అక్కడున్నన్ని రోజులూ వాళ్ళవాళ్ళకెవరికో కష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. అదేమీ తెచ్చిపెట్టుకున్నది కాదు.జన్మతా వాళ్ళు ఇంకోళ్ళకి సహాయం చేయడంలోనే ఆనందం పొందుతారు.

కానీ వచ్చిన గొడవల్లా ఏమిటంటే ఇలాటివాళ్ళు చాలా ‘ రేర్ బ్రీడ్’. అందరికీ రమ్మంటే రాదు. ఈ రోజుల్లో మనం ఎవడికైనా సహాయం చేస్తే, ఇందులో మనకెంత లాభమూ అని లెఖ్ఖ వేసికుంటున్న వాతావరణం లో ఇలాటి వాళ్ళకు నిజంగా ‘హాట్స్ ఆఫ్ ‘

%d bloggers like this: