బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఏమీ చెయ్యలేక తెచ్చుకునే జ్ఞాపకాలు!

    మా బిల్డింగు క్రింద ‘రిలయెన్స్ ఫ్రెష్ ‘ వాళ్ళ దుకాణం ఉంది. అక్కడ ఏవో మొక్కలూ అవీ వేయడానికి వీలుగా ఓ కుండీ లాటిది (పెద్ద సైజులో), దాంట్లో మట్టీ అది వేసి ఉంఛారు. షాపులో పాడైపోయిన టొమాటోలూ అవీ అక్కడ వేయడంతో, అవి మొక్కలుగా తయారయి, వాటికి టొమాటోలు కాయడం మొదలెట్టాయి. ఆ షాప్ వాడికి, అవి చూపించి, ‘మీ రిలయెన్స్ వాళ్ళు, ఈ టొమాటోలు కోసి వాటినే మాకు ఎప్పుడో అమ్మేస్తారూ, మేము వెర్రివెధవల్లాగ వాటిని కిలో మీరు చెప్పిన రేటుకి కొనుక్కుంటామూ’ అని జోకింగ్ గా అన్నాను.వాడికీ ఈ ఐడియా బాగానే ఉందనిపించింది!

నాకు ఆ టొమాటో మొక్కలు చూసినప్పుడు, మా ఇంటావిడ పెళ్ళి అయి వచ్చిన కొత్తలో, నన్ను పెట్టే తిప్పలు గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో మేము ఫాక్టరీ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం.అప్పుడే తణుకు నుండి వచ్చింది కదూ, చెట్లూ, చేమలూ, ఆకులూ, అలమలూ అంటే ఆపేక్షా! మనం కూడా ఓ గార్డెన్ తయారుచేసికుందామండీ అంది. పోనీ పాపం, ఇంకా ఇంటి బెంగ తీరలేదేమో అని, సరే అన్నాను.ఆ రోజుల్లో నేను షిఫ్టుల్లో డ్యూటీ కి వెళ్ళేవాడిని. ఒక్కొక్కప్పుడు, పగలంతా కొంపలో ఉండి రాత్రిళ్ళు డ్యూటీ కి వెళ్ళేవాడిని.

ఈ ‘హరిత విప్లవం’ ప్రకరణలో, ప్రొద్దుటే, నేను ఫాక్టరీనుండి వచ్చేయగానే, కడుపులోకి ఎదో ఇచ్చేసి, ఓ పాలిథీన్ బ్యాగ్గు పట్టుకుని బయల్దేరతీసేది. మనవైపు మ్యునిసిపాలిటీ వాళ్ళ బండి లాగ, ప్రతీ చెత్త కుప్ప దగ్గరా ఆగడం, ‘అదిగో అక్కడ టొమాటో మొక్క ఉంది, దాన్ని పీకి తీసుకు రండీ ‘ అంటూ, ఓ పది కుప్పల దగ్గర ఆగి, ఓ పదో పదిహేనో టొమాటో మొక్కలు కలెక్ట్ చేయించడం ! ఇంక ఈ చెత్తకుప్పలన్నీ అయిపోయిన తరువాత,’భేల్’ దుకాణాల పక్కన పట్టుకునేది.

ఆ భేల్ దుకాణం వాళ్ళు తరగ్గా మిగిలిన టొమాటో ముక్కలూ అవీ ప్రక్కనే వేస్తారుకదా, అవికూడా మొక్కలయ్యేవి. ఈ పాలిథీన్ బ్యాగ్గులో మొక్కలు పీకి జాగ్రత్త చెయ్యడం, వాటిని ఇంటికి తీసికెళ్ళి, ఓ కుండీ లో వేయడం. అవి పెరిగి పెద్దై టొమాటోలు కాసేదాకా ప్రతీ రోజూ వాటి ప్రోగ్రెస్స్ వాచ్ చేయడం.ఒక విషయం ఒప్పుకోవాలిలెండి, వాటి రుచి మాత్రం బ్రహ్మాండంగా ఉండేది.ఓ రోజు పప్పులోకీ, ఇంకో రోజు పచ్చడీ.

అలాటప్పుడు, మా చిన్నతనంలో ఇంట్లో అక్కడా ఇక్కడా పెరిగే, కాకరకాయ పాదులూ, ఆనపకాయ తీగా, గుర్తొచ్చేవి. ఎప్పుడు కావాలంటే అప్పుడు లేతగా ఉన్న ఓ కాయ కోసేయడం, ఆ రోజుకి పులుసులోకో దేంట్లోకో వేసి అమ్మ పెట్టే భోజనం గుర్తొచ్చేది. ఇప్పుడంటే అవన్నీ మధుర జ్ఞాపకాల్లాగ చెప్పుకుంటున్నాము కానీ, ఆ రోజుల్లో అస్తమానూ విసుక్కునే వాళ్ళం! ఏమిటీ అందరూ సంత కెళ్ళి శుభ్రమైన కూరలు తెస్తూంటే, ఇదేమిటీ మనకి రోజూ ఇంట్లో కాసే ఆనపకాయ పులుసూ,వంకాయ కూరా, బీరకాయ పచ్చడీ, దొండకాయ వేపుడూనా అని అమ్మ మీద విసుక్కునే వాళ్ళం.ఆఖరికి ఇంట్లో పాక మీదకి ప్రాకిన బూడిద గుమ్మిడికాయతోటే వడియాలు పెట్టేవారు! ధనియాలు చెప్పుతో నూరి, ఓ మడి తయారుచేసి, దాంట్లో ఈ ధనియాలు చల్లగా వచ్చిన కొత్తిమిర తోటే చారు పెట్టేవారు!అరటి ఆకు కి కూడా బయటకు వెళ్ళే అవసరం ఉండేది కాదు. సడెన్ గా ఇంటికి ఎవరైనా వచ్చినా సరే, పెరట్లోకెళ్ళి, ఓ కూరో, నారో కోసుకుని, ఓ విస్తరాకు కోసి నిమిషాల్లో భోజనం పెట్టేసేవారు!

ఇవే కాకుండా గోంగూరా, తోటకూరా, బచ్చలి కూరా ఇంట్లో తప్పకుండా ఉండవలసిందే.ఉత్తి ముద్ద పప్పు ఎప్పుడూ ఉండేది కాదు. దాంట్లోకి ఏదో ఒక ఆకుకూర తగిలిస్తే అదో రుచీ.ఇప్పుడు ఇక్కడా పూణే లోనూ బచ్చలి కూర అప్పుడప్పుడు దొరుకుతూందనుకోండి, ఏదో జిహ్వ ఆపుకోలేక కొనుక్కుని దాంతో పాటు కంద ముక్కకూడా తెచ్చి మాఇంటావిడకి ఇవ్వడమే కానీ,అందులో రుచా పచా. ఆ బచ్చలి కూర చూస్తే దానికి నా వయస్సుంటుంది, ముదురు కాడలతోనూ, వాటికి పువ్వులోటీ.ఏం చేస్తాం జిహ్వచాపల్యం! ఏదో లాగించేస్తున్నాం!

ఏదో అప్పుడప్పుడు ఇలా ఆపాతజ్ఞాపకాల్లోకి వెళ్ళి సంతోషించడమే కానీ, ఈ రోజుల్లో ‘పేరు గొప్పా ఊరు దిబ్బా’ అన్నట్లు, తళతళా మెరవడమే కానీ, ఈ రోజుల్లో వచ్చే కూరల్లో ఏమీ లేదు.పాపం మా ఇంటావిడ ఏకూర చేసినా, పచ్చడి చేసినా, ఆఖరికి పులుసు చేసినా, ‘అదేమిటోయ్ ఇదివరకటిలాగ చెయ్యడం లేదూ, అంత రుచిగా కూడా లేవూ’ అంటే గయ్య్ మంటుంది. నేను గత 35 ఏళ్ళనుండీ ఒక్కలాగే చేస్తున్నానూ, మీరు తెచ్చేకూరలే అలా తగలడ్డాయి అంటుంది.నిజమే కదూ ! ప్రతీదీ హైబ్రిడ్డు, ప్రతీదాంట్లోనూ ఫెర్టిలైజర్లూ, పెస్టిసైడ్లూ ఇవన్నీ పీకలదాకా మింగి మనకేమో ఒబేసిటీలూ, వాటిని తగ్గించుకోడానికి మళ్ళీ జిమ్ములూ వగైరా వగైరా…

%d bloggers like this: