బాతాఖాని-లక్ష్మిఫణికబుర్లు-ఊళ్ళోవాళ్ళమీద పడి బ్రతికే ఘనులు–2

    ఇంకొంతమందిని మనం ఉండే సొసయిటీలలో చూస్తూంటాము.మనం ఏదో చదువుకుందామని పేపర్లూ మేగజీన్లూ కొనుక్కుని తెచ్చుకుంటాము.ఎవడో ఓ ఊ.వా.బ్ర.ఘ ఉంటాడు, వీళ్ళకేం కొదవలేదు మన నైబర్ హుడ్ లో.’అర్రే మీరు తెలుగు పేపర్ తెప్పిస్తారా’ అని ఓసారి పలకరించేసి, మన ఇంట్లోనే చదువుతాడు.అక్కడిదాకా ఫర్వాలేదు.ఏదో మొదటిసారి వచ్చాడు కదా అని,
ఇంటావిడతో ” ఏమోయ్ ఓ కాఫీ తీసికుని రా ‘అంటాము. ఓహో ఇదీబాగానే ఉందీ ,కాఫీకూడా దొరుకుతోందీ అని, ఇంక చూసుకోండి, ప్రతీ రోజూ అదే వేళకి ఠంచనుగా హాజరు! పోనీ, అంత పేపరు తెప్పించుకోలేనంత బీదవాడు కాడు,హాయిగా 5 అంకెల్లో పెన్షనొస్తోంది.అయినా సరే ఫ్రీగా వస్తోందంటే ఎవడు వదులుతాడు? పైగా ఏ రోజైనా పేపరు వాడు రావడం ఆలశ్యం అయితే, అదేదో తనే దానికి డబ్బిస్తున్నట్లు విసుగోటీ! ” ఈ పేపర్ బాయ్స్ అంతా ఇంతేనండి,వాళ్ళిష్టం వచ్చినప్పుడొస్తారు, వేళా పాళా లేదు” అని. మరి ఈయనచేస్తున్నదేమిటో?

నేను ఇంకొంతమందిని చూశాను, వాళ్ళింట్లో చిన్నపిల్లలుంటారు.ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు, తమ పిల్లల్ని, ఈ ఊ.వో.బ్ర.ఘ లతో, మనింటికి పంపేస్తారు.ఇంక చూసుకోండి, పైసా ఖర్చు లేకుండా, ఆ పిల్లలకి ఎంటర్టైన్మెంటు. దీపావళి కి చూస్తూనేఉంటాము. కొంతమంది ఘనాపాటీలుంటారు, వాళ్ళ ఇంట్లో బాణాసంచా దాచేసికుని, ప్రక్కవాడు ఏదో పిల్లలతో కాల్పిస్తూంటే, ప్రక్కనే నుంచుంటాడు, వీడి పిల్లలతో.పోన్లే వాళ్ళూ కాల్చుకుంటారూ అని టపాసులో, చిచ్చుబుడ్లో మరోటో వాళ్ళకీ ఇస్తాము.వీళ్ళు, ఓ గంట సేపు మనదగ్గరున్నవన్నీ కాల్చేసి, అప్పుడు గొప్పగా వాళ్ళు తెచ్చుకున్నవి కాల్చుకోడం మొదలెడతారు!అలాగని మనం వాళ్ళదగ్గరకు వెడతామా?పైగా వీటికి సాయం, మనం తెచ్చిన బాణాసంచా మీద వ్యాఖ్యలొకటీ, మీరే కొట్టులో తెచ్చారూ,సరీగ్గా కాలలేదూ, కొంచెం క్వాలిటీ చూసుకుని తెచ్చుకోవాలండీ అని!

మన చిన్నప్పుడు చూసేఉంటాము, ఓ కప్పు కాఫీ పొడి ఇవ్వండి, ఓ కుంచెడు బియ్యం ఇవ్వండి, లేకపోతే ఇంకోటీ, వీటికి అంతం లేదు. పోనీ అలాగని తిరిగి ఇస్తారా అంటే అదీ లేదు.రోజుకొకళ్ళింటికి వెళ్ళినా నెల వెళ్ళిపోతుంది! మళ్ళీ మాటలు మాత్రం కోటలు దాటిపోతూంటాయి!మా చిన్నప్పుడు బాగా బీద స్థితి లో ఉన్న విద్యార్ధులు, ఇళ్ళల్లో వారాలు చెప్పుకుని చదువుకునే వారు.అలాటి వారికి సహాయం చేస్తే పుణ్యం ఉంటుంది. అంతే కానీ ఇలా ఊళ్ళోవాళ్ళమీద బ్రతికే ఘనుల్ని చుస్తే వళ్ళు మండుతుంది.తిన్న తిండి అరక్క చేసే పనులు ఇవి.

నిన్న నేను వ్రాసిన బ్లాగ్గుమీద ఓ కామెంటు వ్రాసిన ‘ఐదు’ చెప్పినట్లు, బస్సుల్లో చిల్లరలేదనే వంకమీద, అవతలివాడిచేత ఖర్చుపెట్టించడం! వీళ్ళది ‘ మోస్ట్ డిగ్నిఫైడ్ బెగ్గింగ్’. అలాగే సినిమాలకీ, హొటళ్ళకీ వెళ్ళినప్పుడు ఏదో పనిఉన్నట్లు మొహం అటెటో తిప్పేసుకోడం! చేతిలో డబ్బులు లేకపోవడం కాదు, ఉన్నాడుగా వాడే ఇచ్చుకుంటాడూ అనే ఓ భరోసా! ఇలాటివాళ్ళు జీవితంలో ప్రతీ వాళ్ళకీ ఎదురౌతూంటారు. నాకొచ్చే డౌట్ ఏమిటంటే, ఈ దురదృష్టం మనకేనా, ఈ ఊ.వా.బ్ర.ఘ లకి ఇలాటి అదృష్టాలు ఎందుకు రావూ అని.

ఇంక మన ఇంట్లో చాలా పుస్తకాలున్నాయనుకోండి, ఐపోయింది మన పని.పాపం మా గురువుగారు శ్రీ అప్పారావు గారు తను సంవత్సరాలనుండీ జాగ్రత్త చేసిన సరుకులూ/ పుస్తకాలమీద ఓ బ్లాగ్గు వ్రాస్తూ, మన ఇంటికి వచ్చిన చిన్నపిల్లల ప్రవర్తన గురించి వ్రాస్తూ,పాఠకుల అభిప్రాయాన్ని అడిగారు. అందులో కొంతమంది ఈయన సెంటిమెంటుని అర్ధం చేసికోకుండా ఆయనకి జ్ఞాన బోధ చేశారు. ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవీ, కొంతమందికి వారు సంవత్సరాలనుండీ జాగ్రత్త చేసిన వస్తువులు/ పుస్తకాలంటే ప్రాణం ఇస్తారు. ఎవరైనా వాటిని తగలేస్తే బాధ పడతారు. దానికి ‘ అంత ప్రాణం లేని వస్తువలమీద ప్రేమ చూపించేబదులు, అదే ప్రేమ చిన్న పిల్లలమీద చూపించొచ్చుకదా ‘అని వ్రాశారు.అసలు ఈయన ఊరికే కూర్చోక అందరినీ అభిప్రాయం అడగడం ఎందుకూ?

ఇంక రైలు ప్రయాణాల్లో చూస్తూంటాము.ఏ కాఫీ వాడో వచ్చినప్పుడు తన జేబులోంచి పైసా తీయడు.ప్రయాణం అంతా ఇంకోడి ఖర్చుమీదే లాగించేస్తాడు.మళ్ళీ తను తెచ్చుకున్న పులిహారో, చపాతీ, లేక పెరుగూ అన్నం పొరపాటున కూడా ఇంకోడికి ఆఫర్ చెయ్యడు. అది అంతే ! అలాగని అందరూ అలా ఉంటారని కాదు, ఒకసారి వీళ్ళూ, ఇంకోసారి వాళ్ళూ ఖర్చుపెడితేనే బాగుంటుంది.ఈ పెద్దమనుష్యులతో ఇంకో గొడవుందండోయ్-వీడి దగ్గర ఓ సూట్ కేసుంటుందనుకోండి, దాన్ని కూడా మన సామాన్లు మోసే కూలీ చేతిలో పెట్టేస్తాడు!ఇచ్చే కూలీ మనం పెట్టుకుంటాము కదా!

ఇవన్నీ చదివిన ఈ తరం వాళ్ళనుకుంటారు ఇదేమిటీ ఈయన ప్రతీ పైసకీ చూసుకుంటాడూ అని. ఇక్కడ పైసలకి చూసుకోవడం కాదు,అవతలి వాళ్ళు తమేదో తెలివైన వాళ్ళనే దురభిప్రాయంతో
అవతలివాళ్ళని ఎక్స్ ప్లాయిట్ చేస్తూంటారే ఆ మెంటాలిటీ
గురించి వ్రాస్తున్నాను. ఇప్పటివాళ్ళకి హొటళ్ళకెళ్ళినప్పుడు మూడంకెల్లో టిప్పులు ఇచ్చే వాతావరణం లో, ఇలాటివన్నీ సిల్లీ గా కనిపించొచ్చు. కానీ ఇదే అంటే ఊళ్ళో వాళ్ళమీద బ్రతికే ఘనులు అలా అనుకోరు. ఊళ్ళో వాళ్ళు బాగా ఉంటే మన పనీ బాగానే ఉంటుంది అనుకుంటారు. ఏం చెప్పండి, వీళ్ళు మాత్రం తమ స్వభావాలు మార్చుకోరు.అదృష్టం బాగుంటే మనమే ఒంటిమీదకు తెలివి తెచ్చుకుని అలాటి వాళ్ళకు దూరంగా ఉండాలి. కనీసం మనం సుఖ పడతాము.

అంతగా సమాజ సేవ చేయాలంటే కావలిసినన్ని మార్గాలున్నాయి.నిజంగా అవసరం ఉన్నవాళ్ళకి సహాయం చేస్తే పుణ్యం పురుషార్ధమూనూ. అంతే కానీ, ఇలాటి పనికిమాలిన వాళ్ళని దగ్గరకు తీసికోవడం బుధ్ధి హీనత.

%d bloggers like this: