బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- Old is always gold

    మా చిన్నప్పుడు చాకలి బట్టలు తీసికెళ్ళడానికి రెండు స్కీములుండేవి. ఒకటి బట్టల్లెఖ్ఖనా, రెండోది రేవుల్లెఖ్ఖనా. బట్టల్లెఖ్ఖ అయితే వంద కింతా అని ఇచ్చేవారు. కాని అతనికి రేవుల్లెఖ్ఖ నచ్చేది. నెలలోనూ నాలుగైదు సార్లు తెచ్చేవాడు. ఇప్పుడు అలాటివేవీ లేవు.నోరుమూసుకుని, బట్టకింతా అని ఇచ్చేయడమే. బట్టలు ఇస్త్రీకి మాత్రమే.మనవైపు చూశాను, ప్రతీ సొసైటీ లోనూ వాచ్ మన్ కి పార్ట్ టైము జాబ్ ఈ బట్టల ఇస్త్రీయే.ఊళ్ళోవాళ్ళందరివీ తెచ్చి బిజినెస్ చేయకూడదు.మళ్ళీ ఈ రూల్స్ ఎందుకో. కొన్ని చోట్ల వీధిలో బండి మీద పెట్టి బొగ్గుల పెట్టితో ఇస్త్రీ చేస్తూంటారు.

ఇదివరకటి రోజుల్లో చాకలి మన బట్టలు తీసికెళ్ళడం వరకూ బాగానే ఉండేది.కానీ వాడి పెళ్ళాం, ఈ బట్టలు తిరిగి ఇచ్చేంతవరకూ, మన వాళ్ళ చీరలూ అవీ లావిష్ గా కట్టేసేది.మొగాళ్ళ బట్టలు ఇంకోళ్ళకి అద్దెలకి కూడా తిప్పేవారు!ఏ ప్రయాణమైనా ఉందని చెప్పినా సరే, టైముకి బట్టలు ఎప్పుడూ ఇచ్చేవాడు కాడు.తెల్లరితే ప్రయాణం అనగా, పిల్లల్ని ఆ చాకలి ఇంటికి పంపడం, వాడు ఇస్త్రీ చేసేదాకా, మనం ఇంతికి రాకూడదు. మొత్తానికి ఏ అర్ధ రాత్రికో ఇచ్చేవాడు!

ఇంక బట్టలు కుట్టే టైలర్లు. ప్రతీ ఇంటికీ ఓ ఆస్థాన టైలరుండేవాడు.ఇంటికే వచ్చి కొల్తలు తీసికునేవాడు. దేంట్లోనైనా గుడ్డమిగిలిపోతే ఏం చెయ్యమంటారూ అని అడిగితే, పిల్లాడికి ఇజారు కుట్టేయమనేవారు.ఇంకో సంగతి, అప్పటికి ఇంకా కట్ డ్రాయర్లూ అవీ రాలేదు, గలేబు గుడ్డ( చార్లది) తో పైజమాలూ, బొందులాగులూ.ఇంట్లో మొగాళ్ళందరికీ ఓ తాను కొనేసి, వాటితో యూనిఫారంగా అందరికీ కుట్టించేయడం ! ఈ టైలరూ అంతే టైముకి ఛస్తే బట్టలివ్వడు. ఏ అరుగు మీదో ఉండేది కొట్టు.

అలాగే ఆస్థాన కంసాళ్ళు, ఆస్థాన వడ్రంగులూ, ఆస్థాన మంగళ్ళూ వీళ్ళళ్ళో ఒక్కళ్ళూ టైముకి వచ్చిన పాపాన్న పోరు.వీళ్ళందరూ కాకుండా ఆస్థాన పురోహితుడొకరు. ఈయనేమీ తక్కువ తినలెదు. ఏ సత్యన్నారాయణ వ్రతమో, లెక ఏ తద్దినమో పెట్టాలన్నా, వీళ్ళు పెట్టే తిప్పలు చెప్పాలంటే కోకొల్లలు. ఒక విషయమేమంటే, ఎన్ని తిప్పలు పెట్టినా టైముకి పని కానిచ్చేసేవారు.
కానీ వీళ్ళు వచ్చేంతవరకూ టెన్షనే!

చాకలికి వేయవలసిన బట్టలన్నీ, ఓ చెక్క పెట్టిలో పెట్టేవాళ్ళం. జనరల్ గా ఆ పెట్టిమీద ఓ రేడియో ఉండేది. ఆ బట్టల పెట్టికి గాలి వెళ్ళడానికి చిల్లులూ, మళ్ళీ వాసనా అదీ రాకుండా.ఇప్పుడో బట్టలు పెట్టి మాట దేముడెరుగు, మనం కూర్చోడానికి సోఫా పెట్టుకోడానికి కూడా స్థలం ఉండడంలేదు.

ఆరొజుల్లో ఇంకో ప్రకరణం ఏమిటంటే, ఏ పెళ్ళి ముందరో ఇంటికి సున్నాలు వేయడం. బయట కావిడ వాడిదగ్గర సున్నపు గుల్ల కొని ఉంచడం. ఓ రోజు ముందర ఈ సున్నం గుల్లని, ఓ టబ్ లో వేణ్ణీళ్ళలో నాన పెట్టడం. ప్రతీ ఇంట్లోనూ ఈ టబ్ లు నూతి దగ్గరలో ప్రత్యేకంగా కట్టించేవారు. నూటికి 90 ఇళ్ళకి బయట చందనం రంగే వేసేవారు.ఇప్పుడంటే డిస్ టెంపర్లూ అవీ వచ్చి, ఆ సున్నం గుల్ల అసలు కనిపించడమే మానేసింది. అన్నీ రెడీ ఫర్ యూజ్ మెటీరియల్సే కదా.

ఆ రోజుల్లో మంచి నూనె కావాలంటే తెలుకులాళ్ళ వీధికి వెళ్ళి గానుగ నూనె తేవడమే. లేకపోతే వారానికి ఓ సారి, ఆ నూనె అమ్మే అతను, ఇంకో మనిషి చేత ఓ కావిడి మోయించేవాడు. వాడుక ఉన్న ప్రతీ ఇంటికీ వెళ్ళడం. ఆవులూ, గేదెలూ తినే తెలగ పిండొకటి, మనం తినే తెలగ పిండొకటీ రెండు రకాలు. ఆ తెలగ పిండితో కూరచేస్తే ఉంటుందండీ రుచి అబ్భ చెప్పలెము. ఇప్పటికీ గుర్తే!

వీళ్ళందరూ కాకుండా సాయంకాలం వచ్చే పోస్ట్ మాన్. ఇప్పుడంటే ఈ ఫోన్లూ, ఈ మెయిల్సూ వచ్చి ఆ ఆనందాన్నంతా మంట కలిపేశాయి కానీ, అసలు చేత్తో వ్రాసిన ఆ ఉత్తరాలలోని ప్రేమా, ఆప్యాయతా వీటిలో రమ్మంటే ఎలా వస్తుందీ?
పనీ పాటా లేకపోతే ఇదిగో ఆనాటి మధుర జ్ఞాపకాలు నెమరువేసికోవడమే. ఓల్డ్ ఈజ్ ఆల్వేజ్ గోల్డ్ .

%d bloggers like this: