బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ‘కోతికొమ్మచ్చి’-Live


    చెన్నై వెళ్ళడానికి ముందురోజు నుండీ, పూణె నుంచే బాపూ గారి ఇంటి నెంబరు ప్రయత్నించగా, మొత్తానికి వారి అబ్బాయి దొరికారు. శ్రీ బాపూ రమణగార్లు హైదరాబాదు వెళ్ళారనిన్నూ, శుక్రవారానికి చెన్నై తిరిగి రావొచ్చనీ చెప్పారు.
శుక్రవారం నాడు ప్రయత్నిస్తే, ఇంట్లో లేరనీ, మత్నాడు (శనివారం) ప్రొద్దుటే ప్రయత్నించమనీ చెప్పారు. మరీ ప్రొద్దుటే ఎందుకులే అనుకుని, 9.00 గంటలు దాటిన తరువాత శ్రీ రమణ గారికి ఫోను చేసి, ‘గురువుగారూ, నేను ఫలానా,
నాకు జీవితంలో ఉన్న కోరికల్లో శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చాలా సార్లు తీరింది, ఇంక మిగిలినదల్లా, నరనారాయణులైన మిమ్మల్నీ, శ్రీ బాపుగారినీ దర్శించుకుని మీ పాద స్పర్శ చేసికోవడం. మీరు అనుమతిస్తే సరి, లేకపోతే, మీరు సరే అనేదాకా, మీ ఇంటిచుట్టూనే తిరుగుతానూ’ అని చెప్పేశాను.అంటే దానికి ఆయనన్నారూ, ‘ నేను ఖాళీగానే ఉన్నాను, కానీ శ్రీ బాపూ ఏదో కాల్ షీటు సందర్భంలో బయటకు వెళ్ళారూ, 12 గంటలకి రావొచ్చూ, అడుగుతానూ, మీరు 12.30 కి ఫోను చెయ్యండీ’ అన్నారు. సరే అని ఠంచనుగా 12.30 కి మళ్ళీ ఫోను చేశాను ( ‘స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్, జె.వి.సొమయాజులు గారిని బోరు కొట్టిన సీను గుర్తుచేసికోండి!).’గురువుగారూ ఏమయ్యిందీ’ అంటూ. ‘ వీడెవడో వదిలేటట్టుగా లేడూ’ అనుకున్నారేమో, ‘సరేనండీ, నన్ను కలుసుకోవాలంటే, సాయంత్రం 4.30 కి మా ఇంటికి రావచ్చు.బాపు రాత్రి ఎప్పటికి వస్తారో చెప్పలేనూ’అని వాళ్ళింటికి డైరెక్షన్ చెప్పారు-మాముట్టి ( మళయాళం) హీరో ఇంటికి ఎదురుగా ఉన్న ఇల్లే మాది’ అని.

    మా పిల్లలడిగారు,’ఎంతసేపట్లో తిరిగి వస్తారూ’అని. మాకేం తెలుసూ,వెళ్ళిన పదినిమిషాల్లో హలో హలో అని పంపిచేయొచ్చు, ఆయన మాకు తెలుసు కానీ,మేము ఆయనకి తెలియదుగా, చూద్దాం అదృష్టం ఎలా ఉందో’ ఇంక చూసేదేముందీ, నేనూ, మా ఇంటావిడా ఓ ఆటో చేసికుని, ఆయన చెప్పిన చోటకి చేరిపోయాము.పేద్ద కాంపౌండు లో ఉంది వారి ఇల్లు. బయటే కొంతసేపు అటూ ఇటూ చూసి ( ఏ కుక్కైనా ఉందేమో అని ఓ పక్క భయం),శ్రీ రమణగారికి ఫోను చేస్తే వారి భార్య తీశారు. మొహమ్మాట పడకుండా అడిగేశాను- ‘అమ్మగారూ, మీ ఇంటికిందే ఉన్నామూ, ఏదైనా కుక్కా అవీ ఉన్నాయా ‘అని.’అలాటివేవీ లేవూ, తిన్నగా పైకి వచ్చేయండీ’ అన్నారు. ఇంక అడ్డేముందీ, మొహమ్మాట పడకుండా,మెట్లెక్కి వారింట్లోకి వెళ్ళాము.

    శ్రీ వెంకటరమణగారిని మొట్టమొదటిసారిగా,ప్రత్యక్షంగా చూసేటప్పడికి, నా సంతోషం ఏమని చెప్పనూ…..మాటల్లో వర్ణించలేను. ముందుగా కలా నిజమా అని తేల్చుకుని, వారికి పాదాభినందనం చేశాను. మా ఇంటావిడ కూడా అలాగే చేసి, కలో నిజమో తేల్చుకోడానికి నన్ను గిల్లింది!

    అసలు ఆయనతొ ఏం మాట్లాడాలో, ఎల మొదలెట్టాలో తెలిస్తేనా? నేనేమైనా పత్రికా విలేఖరినా ఏమిటీ, ఏవో కొన్ని ప్రశ్నలు ముందుగానే ఎంచుకుని వాటికి ఆయన సమాధానం తెలుసుకోడానికి!అంతా అయోమయం అయిపోయింది.ఆయనకూ తెలుస్తూనేఉంది, వచ్చినవాడు చాలా excite అయిపోయి, ఏమీ మాట్లాడలేకపోతున్నాడూ అని! ధైర్యం చేసేసి,’ ‘సార్ మీకు
ముత్యాలముగ్గు సినిమాలో డయలాగ్గులు అలాగే వ్రాయాలని ఎందుకనిపించిందీ,ఎక్కడ విన్నారు అసలు?’అన్నాను.ప్రక్కనే కూర్చున్న మా ఇంటావిడ వైపు చూస్తే అనిపించింది,ఇంతకంటే మంచి ప్రశ్న దొరకలేదా అన్నట్లు చూసినట్లు! అందుకనే అనుకుంటూంటాను అప్పుడప్పుడు-ఎవరినైనా కలిసినప్పుడు, మనం ఒక్కళ్ళూ ఉండాలీ,ఏమైనా అవతలివాళ్ళు తిడితే, ఎవరికీ తెలియకుండా ఉంటుందీ అని, అంత అదృష్టం కూడానా! కానీ నేనడిగిన ప్రశ్నకి, శ్రీ రమణగారు, ఏమీ నవ్వకుండా, ఓపిగ్గా, ‘కోతికొమ్మచ్చి’ లో వ్రాసినట్లుగా జవాబిచ్చేటప్పటికి, అమ్మయ్యా ఫరవాలేదూ, నేనూ ఏదో మాట్లాడగలనూ అనిపించింది.ఆ తరువాత situation సులభం అయింది.

    ‘ గురువుగారూ, మీరు ఏమీ అనుకోపోతే నేను కొన్ని ఫొటోలు తీసికుంటానూ అనగానే ‘ మీ ఇష్టం, కావలిసినన్ని తీసికోండి’ అన్నారు.మొత్తం ఓ నలభై ఫొటోలు తీసికున్నాను.బయట వెరెండాలో ఆయన కూర్చుని, వ్రాసుకునే కాగితాలతో సహా.అక్కడో జోకు వేశారు- నా చేతివ్రాత, నా భార్యకీ, బాపూగారికీ తప్ప ఎవరికీ అర్ధం అవదూ, వాళ్ళే ఫెయిర్ చేసికుంటూంటారూ, ఒక్కొక్కప్పుడు, నాక్కూడా అర్ధం అవదూ’– అని!

   వారింటికి సాయంత్రం 4.45 కి వెళ్ళాము, ఎప్పుడు బయటకి వచ్చామో చెప్తే ఆశ్చర్యపోతారు సరీగ్గా 7.40 కి. అంటే అయిదు నిమిషాలు తక్కువగా మూడు గంటలు! అసలు అలాటి వారికి మాతో అంత విలువైన సమయం గడపడానికి ఏం అవసరం? ఆ టైములో ఆయన రెండు మూడు కాల్ షీట్స్ వ్రాసుకోవచ్చు.అయినా సరే ఏం విసుక్కోకుండా, నేను అడిగిన ప్రతీ తలా తోకాలేని ప్రశ్నలకూ విసుక్కోకుండా సమాధానం చెప్పారంటే, నమ్మలేకపోయాము.

అప్పుడే ఎక్కడ అయిందీ ఇంకా చాలా ఉంది !

Advertisements

11 Responses

 1. 😮 😮 భలే భలే లక్కీ అండీ మీరు ..మిక్కూడాCongrats అండీ…మరి బాపు గారూ????
  నాకు చిన్నప్పటి నుంచి సెలబ్రిటి ని కలవటం అంటే నే చాలా సరదా.!అందునా బాపు-రమణ గార్లంటే..ఇంక చెప్పెదేముంది…
  ఒక చిన్న రిక్వెస్టండీ.. వీలుంటే ఆ ఫొటోస్ నాకు పంపివ్వారూ…ప్లీజ్…..

  Like

 2. ఆ ఇద్దర్నీ కలవాలన్న మీ ప్రగాఢ కోరిక తీరినందుకు
  భగవానునికి నమోవాకాలు. నిజం చెప్పొద్దూ, నేను
  2005 లో కలసినప్పుడు అసలు నా నోట చాలా సేపు
  మాట రాలేదు. తరువాత పలుసారు కలసినప్పుడు
  కబుర్లే కబుర్లు. మంచి ఫొటోలు చూపించారు !

  Like

 3. ఇది దారుణం! సరిగ్గా నేను వందో పోస్ట్ గా ఎప్పుడెప్పుడు వేద్దామా అని అతి కష్టం మీద తొంభై తొమ్మిది పోస్టులు పూర్తి చేసి ఇంక రెడీ అనుకుంటున్న తరుణంలో ఇదే అనుభవాన్ని మీరు పోస్ట్ చెయ్యడం నేను తీవ్రం గా ఖండిస్తున్నా 🙂

  నా వందో పోస్టులో నేను రాసేది కూడా బాపు రమణ లను నేను కలుసుకున్న అపురూప క్షణాల గురించే. కాకపోతే మేము అసలు వెళ్ళింది రమణ గారిని కలుసుకుందామని అయినా కాస్సేపు మాట్లాడాక బాపు గారు మమ్మల్ని ఆయన స్టూడియో కి తీసుకెళ్ళారు (కింద ఫ్లోరే). ఉదయం పదిగంటలకు వెళ్ళిన మేము (నేను, నా శ్రీమతి) మధ్యాన్నం రెండున్నరకి ఆ ఇల్లు వదల్లేక వదల్లేక అదీ ట్రైన్ టైం అయిపోతోంది కాబటి బయటకి వచ్చాం. ఈ అనుభవాలనే పోస్ట్ గా పెట్టబోతున్నా.

  Like

 4. హంసా,

  నేను తీసినవి మొత్తం 60 ఫొటోలదాకా ఉన్నాయి. మరీ మీకు పంపించేయమనడగడం బావుందా !!!

  Like

 5. గురువుగారూ,

  ధన్యవాదాలు.

  Like

 6. సరస్వతుల శ్రీనివాస ఉమా శంకర గారూ,

  మీరుకూడా వెళ్ళొచ్చారని నాకేం తెలుసూ !!!

  Like

 7. భమిడిపాటి గారు, నేను వీలుంటే పంపమని అన్నానండి-అంతే కాదండి నా ఉద్దేశ్యం రమణ గారి కి(ఇంటి ఫొటోస్ లాంటివి)సంబంధించినవి.వేరే ఏ ఉద్దేశ్యాలు కూడా లేవండి.very sorry if i troubled you,and Thanks for your reply.

  Like

 8. హంసవాహినీ,

  ఊరికే సరదాగా వ్రాశాను!! మరీ అంత సారీలూ అవీ వద్దు!!

  Like

 9. చెన్నై ఎన్నిసార్లు వెళ్ళినా కలవలేదు అన్న బాధ తొలిచేస్తోంది మీ ఈ టపా చదువుతుంటే.

  Like

 10. అనుపమా,

  ఏదీ మన చేతుల్లో లేదు. నేను అన్నేళ్ళనుండీ, శ్రీ ముళ్ళపూడి వారి భక్తుడనైనా, గత సంవత్సరమే ఆయన్ని చూడగలిగాను.

  Like

 11. ఇది మీరు నాకు రహమానుద్దీన్ కి మీ ఇంటికి కలవడానికి వచ్చినపుడు చెప్పారు. మీ దంపతులిరువురితో మాట్లాడుతుంటే .. ఇట్టె కాలం గడిచిపోతుంది. దీన్ని వెటకారం మాత్రం అనుకోకండే… నిజ్జంగా … నిజం…. పచ్చి నిజం :-).

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: