బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–outsourcing….

    ఏమిటో ఈ రోజుల్లో ఎక్కడ విన్నా ఇదే మాట.outsourcing అని. అక్కడికేదో కొత్తగా వచ్చిన concept లాగ. యుగయుగాలనుండీ జరుగుతున్నదే. అయినా ఇదేదో కొత్తగా కనిపెట్టినట్టు చెప్పేస్తారు. ఒంట్లో ఓపిక లేక, పనిమనిషిని పెట్టుకోడం లేదూ, అదీ ఈ కోవలోకే వస్తుంది కదా. ఏదో ఉద్యోగంలో ఉన్నప్పుడు, తప్పించుకున్నాము కానీ, రిటైరయిన తరువాత, ఊరికే కూర్చుంటే, ఇంటావిడ కి తోచదు.

   వంట గిన్నెలు నాలుగూ కడిగేసికుని సింకు పక్కన పెట్టేస్తుంది. వాటిని వాటివాటి స్థానాల్లో సద్దడం మన పనన్న మాట! ఏదో మొదట్లో, ” ఊరికే కూర్చోపోతే ఆ నాలుగ్గిన్నెలూ సద్దేయకూడదండీ...” అని ప్రారంభించింది, కాలక్రమేణా, “సద్దకెక్కడ పొతాళ్ళెద్దూ…” లోకి వచ్చేస్తుంది.అలాగే, ఆరేసిన బట్టలు, మడతపెట్టడం దగ్గరనుంచీ, ఇస్త్రీకి తీసికెళ్ళడం దాకా అన్నీ ఈ outsourcing లోకే వస్తాయి. వీటితో ఎక్కడయ్యిందీ, ఏదో జిహ్వచాపల్యం కొద్దీ, ఏ మెంతికూరో, గోంగూరో తెస్తామనుకోండి, ఏదో మొదట్లో అయితే తను చేసేది కానీ, రోజులు గడిచే కొద్దీ, ఈ ఆకుకూరలు బాగుచేయడం ఇంటావిడoutsourceచేసేసింది! ఇదివరకైతే నేను మార్కెట్ కెళ్ళి సంచీ ఖాళీ చేస్తున్నప్పుడు, ముందుగా చూసేది, ఈవేళేమైనా ఆక్కూరలు తెచ్చారా అని. కానీ, వాటిని బాగుచేసి, నా ” గొంతేరమ్మ కోరికలు” తీర్చాలంటే కొద్దిగా శ్రమతో కూడిన పనేగా మరి. ఆ శ్రమంతా తను బాగుచేసిన ఆకుకూరల్లో తెలిసేది. ఏదో ఆకులు విడివిడిగా ఉంటే పరవాలేదు కానీ, మరీ “కాడల” తో ఉంటే ఎలాగండి బాబూ? నవలడానికి పళ్ళా లేవు, మరీ తినేటప్పుడు, ఆ కాడేదో గొంతుక్కడ్డం పడితే కష్టం కదూ? పైగా ఏమీ అనకూడదూ, ఆ ఆకులేవో సరీగ్గా బాగుచేయకూడదోయ్ అంటే చాలు, “నాకు తెలిసిందింతే, తినాలంటే తినండి, కాకపోతే, ఎవరిచేతైనా బాగు చేయించుకోండి…”. మళ్ళీ ఈ కూరలు బాగుచేసికోవడానికి ఇంకోళ్ళా? అంటే not in so many words, “ఓపికుంటే, బాగుచెయ్యి, లేకపోతే నోరుమూసుకుని మింగూ...” అనే కదా మరి. దానితో ఈమధ్యన ఏం జరుగుతోందంటే, మార్కెట్ నుండి ఏ ఆక్కూరైనా తేవడం, డైనింగ్ టేబుల్ మీద ఓ రెండు న్యూస్ పేపర్లేసికుని, ఆ కూరేదో బాగుచేయడం. మధ్యమధ్యలో ఎక్కడదాకా చేశానో చూస్తూంటుంది, చివరకొచ్చేసరికి మాత్రం ఓ సానుభూతి వాక్యం- ” అయ్యో ఆక్కూర తెచ్చారని చెప్పొచ్చుగా, బాగుచేసేదాన్నీ” అంటూ. మేముండే ఇల్లు ఏమైనా ప్యాలెస్సా ఏమిటీ, అంత కనిపించకపోవడానికి? ఏమిటో ఇలా ఉంటుంది.

   అలాగే, టీ పొడుం, కాఫీ పౌడరూ, పంచదారా డబ్బాల్లో పెడతాముకదా, పోనీ అవి ఖాళీ అయినప్పుడు చెప్తే ఏంపోతుందీ? అబ్బే, తనే చూసుకుంటాడులే. మామూలుగా ప్రతీ రోజూ ప్రొద్దుటే కాఫీ, మధ్యాన్నం పూట చాయీ తనే పెడుతూంటుంది. మధ్యాన్నం కొద్దిగా రెస్టు తీసికుంటోంది కదా, పోనీ ఈవేళ ఆ చాయేదో పెడదామని చూస్తే, చాయ్ డబ్బా, పంచదార డబ్బా ఖాళీ. అందుకన్నమాట, మెళుకువొచ్చినా, లేచి చాయ్ పెట్టకపోవడం! ఛస్తానా, టైముకి ఆ చాయ్ నీళ్ళు పడకపోతే రోజెళ్ళదూ.మాట్టాడకుండా, చాయ్ ప్యాకెట్టు తెరిచి, చాయ్ పొడి డబ్బాలో పోసి, అలాగే పంచదార పెద్ద డబ్బాలోంచి, చిన్నదాంట్లోకి పోసి, చాయ్ పెట్టడం, అప్పుడు తీరిగ్గా కళ్ళు తెరుస్తుంది.. “ అర్రే నేను పెడుదునుగా చాయి, ఇంకా అయిదవలేదని ఆగాను..”. అసలు విషయం ఏమిటంటే, ఆ చిన్న డబ్బాలు refill చేయాలి, బధ్ధకం. ఇదిగో ఇలాటి వాటిని outsource చేసేయడం లోకే వస్తుంది! వామ్మోయ్ ఎన్ని తెలివితేట్లండీ.అలాగే తను ఎప్పుడో ప్రొద్దుటే లేచి కాఫీ పెట్టలేదూ అంటే, డబ్బాలు ఖాళీ అన్నమాట!అదేదో చెప్పేయకూడదూ, మళ్ళీ లౌక్యాలూ! మన నోటితో మనం చెప్పకూడదు. తనూ తాగాలి కదా, తయారుచెయ్యకేం చేస్తారూ? పైగా, ఓ గ్లాసుడు కాఫీ తీసికుని వచ్చి, విషయం ఇదన్నమాట అన్నామనుకోండి, ప్రపంచంలో ఎక్కడా చూడని అమాయక మొహం ఓటి పెట్టేసి, ఏమిటీ అంటున్నారూ అనడం! నేనేం అంటున్నానో తనకీ తెలుసును.

    ఇలాటి వాటిని subtle outsourcing అంటారు. ఊళ్ళోవాళ్ళకి తెలియదు, ప్రతీవాళ్ళూ ఆహా ఓహో అనుకునేవారే, అబ్బ ఎంత అన్యోన్యదాంపత్యమో అనుకునేవారే! ఇలాటివి నూటికి తొంభైమంది ఇళ్ళల్లో జరుగుతూనే ఉంటాయి. ఎన్నిచెప్పండి ఇలాటి outsourcing ల్లో ఉన్న హాయి ఎందులో ఉంటుంది చెప్పండి….

    ” మన తెలుగు” గురించి శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు ఏమి వ్రాశారో, అదీ 1935 లో ఇక్కడ చదవండి.ఇందులో రెండో వ్యాసం. ఏమిటో మనవాళ్ళకి భాషాబిమానం ఈమధ్యనే తగ్గిందేమో అని బాధపడిపోతూంటాము. కానీ ఈ “రోగం” ఎప్పటినుంచో ఉందని తెలుస్తోంది…

Advertisements
%d bloggers like this: