బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి. ఇదివరకటి రోజుల్లో ప్రభుత్వ విద్యావిధానాల్లో, మరీ ఈ రోజుల్లో ఉన్నంత complications ఉండేవి కావు. ఏదో అక్షరాభ్యాసం చేసిన తరువాత, ఏ బోర్డు స్కూల్లోనో, మ్యునిసిపల్ స్కూల్లోనో, ఫస్ట్ ఫారం లో చేరి, SSLC దాటేసి, ఓ కాలేజీ లో చేరి, ఓ డిగ్రీ పుచ్చేసికుని ఏదో ఒక ఉద్యోగం లో చేరేవారు. ఇదంతా నాలాటివాళ్ళు చేసిన పని. కొంతమంది అంటే తెలివైన వాళ్ళన్నమాట అయిదుసంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీ లోనో మెడికల్ లోనో చేరి, ఇంజనీర్లు గానూ, డాక్టర్లగానూ సెటిల్ అయిపోయేవారు.

   ఆ SSLC లూ అవీ మాయం అయిపోయి అవేవో +2 అన్నారు, అంటే ఇదివరకటిలాగ స్కూళ్ళనుండి, కాలేజీలకెళ్ళఖ్ఖర్లేకుండా అప్పటిదాకా చదివిన స్కూల్లోనే ఈ +2 పూర్తి చేసేసి, ఏ professional course లోనో చేరిపోయేవారు. మిగిలిన రాష్ట్రాల మాట ఎలా ఉన్నా, ఇక్కడ మహారాష్ట్రలో మాత్రం merit మీదే ( అంటే 12క్లాసులో వచ్చిన మార్కుల ఆధారంగా) ఇంజనీరింగ్, మెడికల్ లలో సీట్లొచ్చేవి. మా పిల్లల విషయం లో, ఏదో భగవంతుడి దయతో, వాళ్ళూ మంచి మార్కులే తెచ్చికుని, merit మీదే సీట్లు సంపాదించి, మొత్తానికి ఇంజనీర్లనిపించుకున్నారు. శుభం! రిటైరయే సరికి పిల్లల చదువులూ,వాళ్ళ పెళ్ళిళ్ళూ, పురుళ్ళూ పూర్తిచేసికొని, అమ్మయ్య ఇంక ఆ చదువులూ, ఎడ్మిషన్లూ గొడవలూ మన కెందుకులే అని అనుకున్నంత సేపు పట్టలేదు, మళ్ళీ ప్రారంభం!

    పిల్లల వ్యవహారాలు పూర్తయిపోయాయి, ఇంక మనవళ్ళూ, మనవరాళ్ళూ వచ్చారు రంగం లోకి. మా మనవరాలు ఇక్కడే గురుకుల్ అనే స్కూల్లో చదువుతోంది. sibbling quota లో వాళ్ళ తమ్ముడికీ సీటొచ్చేసింది. బాగానే చదువుతూ మనవరాలు 8 క్లాసూ, మనవడు 3 క్లాసులోకీ వచ్చారు. నవ్య ఈ ఏడాదే 1 క్లాసులోకి అదే స్కూల్లో చేరింది. తన తమ్ముడు అగస్థ్య ని పై ఏడాది ఎలాగూ sibbling quota లో సీటొచ్చేస్తుంది కదా అనే భరోసాలో ఉన్నారు ఇన్నాళ్ళూ. సరీగ్గా అప్పుడే వచ్చేసింది గొడవంతా. అదేదో RTE ట ( Right To Education) ప్రకారం, ఇన్నాళ్ళూ ఉన్న రూల్స్ అన్నీ, పక్కన పెట్టి, 25% బయటి వారిక్కూడా ఇస్తారుట. అంటే ఇదివరకటిలాగ సీటు గ్యారెంటీ లేదన్నమాట.ఇంక టెన్షనూ. ఏదో పిల్లా,పిల్లాడూ ఒకేస్కూల్లో ఉంటే ఇళ్ళల్లో తల్లితండ్రులకి కూడా బావుంటుంది అనే కదా, ఒకే స్కూల్లో వేస్తారు, కానీ ఈ కొత్తరూల్స్ ధర్మమా అని , అసలు సీటు వస్తుందో రాదో అని టెన్షను.

   ఇదంతా ఒకవేపైతే,ఇప్పుడు ఇంకో కొత్త గొడవ ప్రారంభం అయింది. మామూలుగా చాలా స్కూళ్ళలో 10 క్లాసుదాకానే ఉంటుంది, ఆ తరువాత ఏ జూనియర్ కాలేజీ లోనో, డిగ్రీ కాలేజీల్లోనో +2 లో చేర్పించడం. ఈ స్కూళ్ళలో కొన్ని State Board, కొన్ని CBSE, కొన్ని ICSE ఏమిటో అంతా గందరగోళం.మామూలుగా ఉండే reputed colleges ల్లో, మెరిట్ మీద ఎడ్మిషన్లు దొరికేవి ఇన్నాళ్ళూ. కానీ మన శ్రీమాన్ ప్రభుత్వం వారికి ఉన్నది ఉన్నట్టుగా ఉంచడం ఎప్పుడు చేశారుట? కొత్తగా ఓ రూల్ పెట్టారు, ఈ CBSE,ICSE వాళ్ళకి కాలేజీల్లో ఎడ్మిషన్ ఉండదూ అని.ఇన్నాళ్ళూ చదివిన స్కూల్లో +2 ఉండదూ, బయటి కాలేజీల్లో ఎడ్మిషన్లు దొరకవూ, మరి వీళ్ళందరూ ఏం చేయాలిట? ఇంకా రెండేళ్ళు టైముందనుకోండి, అప్పటికి వ్యవహారం ఓ కొలిక్కి రావొచ్చు, లేదా తను చదువుతున్న స్కూల్లోనే +2 కూడా రావొచ్చూ, వస్తే గొడవే లేదు. అయినా టెన్షను టెన్షనే కదా!

    ఇవన్నీ చాలదన్నట్టు ఆ సిబల్ గారికి ఉన్నట్టుండి ఏదో మొదలెడతాడు. హాయిగా ఇన్నాళ్ళూ ఓ JEE వ్రాసేస్తే, దేశంలో ఉన్న ఏదో ఒక IIT లో చేరిపోయేవారు. ఇప్పుడేమో కొత్తగా ఏదో propose చేయడంతో మన IIT ల వాళ్ళందరూ ఠాఠ్ మేం ఒప్పుకోమూ, అనేసి వేరు కుంపట్లు పెట్టేస్తారుట! అంటే ఇప్పుడేమిటంటే, ఏదో ఓ పరీక్ష వ్రాసేస్తే వదిలిపోయేదానికి, దేశంలో ఉన్న ప్రతీ IIT వాళ్ళ entrance test వ్రాయాలన్నమాట ! అసలు ప్రభుత్వం విధానాలు మార్చేముందర వాటివల్ల వచ్చే కష్టాల సంగతి ఆలోచించరా? ప్రతీ దాంట్లోనూ Reforms అనేవి ఉండాలి, కాదనం, కానీ అవి student/parent friendly గా ఉండాలి కానీ, ఇలా దినదినగండం లా మార్చేస్తే ఎలాగ?

    చదువుల సంగతి అలా ఉండగా, మధ్యలో అదేదో 4.5% రిజర్వేషనోటి కొత్తగా తెచ్చారు, మన ఆంధ్రప్రదేష్ హైకోర్టు వాళ్ళు దీన్ని కొట్టిపారేశారు. దీనితో మొత్తం మళ్ళీ గందరగోళం ప్రారంభం అయింది.మళ్ళీ అదో గొడవా. పోనీ ఇన్ని తిప్పలూ పడి ఏదో IIT లో చేరాడనుకుందాము. దేశాన్నేమైనా ఉధ్ధరించేస్తారా అంటే అదీ లేదు, ఠింగురంగా అంటూ అదేదోMS చేయడానికి బయటెక్కడికో వెళ్ళిపోవడం, చివరకి అక్కడే ఏదో ఉద్యోగంలో సెటిల్ అయిపోవడం. పోనీ అలాగని మన దేశంలో విద్యారంగం లో reforms ఉండకూడదని కాదు. ఉండాలి. ఆ RTE అనేదే లేకపోతే, బీద విద్యార్ధులకి మంచి స్కూళ్ళల్లో ఎడ్మిషన్ ఎలా వస్తుంది? కానీ తీరా ఎడ్మిషన్ వచ్చిన తరువాత, ఆ పిల్లల తల్లితండ్రులు ఆ స్కూళ్ళలో వసూలు చేసే ఫీజులు భరించగలరా లేదా అని కూడా ఆలోచించాలిగా. పోనీ ఆ ఫీజులుకూడా ప్రభుత్వం వారే భరిస్తారనుకుందాము, కానీ తోటి విద్యార్ధులతో పోటీ పడగలరా? ఇవికూడా దృష్టిలో పెట్టుకోవాలేమో అని నా అభిప్రాయం.

    ప్రతీ వాళ్ళూ ఇంజనీరింగూ, మెడిసినూ చేసి, పైచదువులకి బయటి దేశాలకి వెళ్ళే బదులు, అదేదో retail రంగం లో చేసినట్టు విద్యారంగం లో కూడా FDI కి అంగీకరిస్తారనుకుందాము. కానీ తీరా పెట్టిన తరువాత మళ్ళీ మన రాజకీయనాయకులు రిజర్వేషనూ కమామీషూ అంటూ మొదలెడతారు. దీనివల్లే కాబోసు, అసలు ఎవరూ ఆ విషయమే ఎత్తడం లేదు. ఈ గొడవలన్నీ కాకుండా, హాయిగా ప్రభుత్వమే ఉన్న స్కూళ్ళని బాగుచేసి, అక్కడే చదువుకోనిస్తే అసలు గొడవే ఉండదుగా. ఇదేమీ కొత్త కాదు. ఇప్పుడంటే ప్రతీ చోటా ఈ Corporate Schools/Colleges పుట్టగొడుగుల్లా వచ్చేశాయి కానీ, మొన్నమొన్నటి దాకా అందరూ చదివింది, ఏ మ్యున్సిపల్ స్కూల్లోనో, బోర్డు స్కూల్లోనే కదా! ఏం, వాళ్ళేమీ తెలివైనవారు కాదా? కాన్వెంట్లలోనూ, Corporate Schools/Colleges లోనూ చదివినవారే genius లా ఏమిటీ?..

Advertisements
%d bloggers like this: