బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– దేనికైనా పెట్టిపుట్టాలంటారు అందుకేనేమో….


    ఓ అంటే ఢం కూడా రాని నాలాటివాడికి, అంతంతమంది ప్రఖ్యాత సాహితీపరుల తో ఓ ఆరుగంటలు గడపకలిగానంటే మరి ఏం చెప్పమంటారూ? వారందరి గురించీ, ఏవో పత్రికల్లో చదవడమే కానీ, ప్రత్యక్షంగా చూస్తానని ఎప్పుడైనా అనుకున్నానా ఏమిటీ? అందుకే ఈ టపాకి శీర్షిక అలా పెట్టాను.

   ఆమధ్యన మమ్మల్ని సిమ్లా, హరిద్వార్ దర్శనాలు చేయించిన శ్రీ దాసరి అమరేంద్ర గారు తమ అరవయ్యో జన్మదినం భాగ్యనగరంలో సాహితీమిత్రుల సమక్షంలో జరుపుకుంటున్నారనీ, వీలుంటే తప్పకుండా వచ్చి, ఆ కార్యక్రమంలో పాలుపంచుకుంటే తనకూ సంతోషంగా ఉంటుందనీ, చెప్పడమేమిటి, మేము సరే అనేశాము.అయినా ఊరుకోలేక, ఎవరెవరు వస్తున్నారండీ అని కూడా అడిగేశాను. ( అసలు నాకెందుకూ, ఆయన ఎవరెవరిని పిలుస్తారో, ఆయనిష్టం, మీకెందుకండీ, మన్ని పిలిచారూ, వెళ్దాం.. అని మా ఇంటావిడచేత చివాట్లు కూడా తిన్నాను).అయినా నోటి దురద తీరదుగా…

    ఆయనా ఏదో పెద్దవాణ్ణి కదా అని నేను అడిగినదానికి సమాధానంగా ఓ నాలుగైదు పేర్లు చెప్పారు.అందులో ఒకరు శ్రీ కె.శివారెడ్డిగారు, నవ్య సంపాదకులు శ్రీ జగన్నాధ శర్మగారూ, శ్రీ వివినమూర్తిగారూ, శ్రీఖదీర్ బాబు గారూ…శ్రీమతి కుప్పిలిపద్మగారూ, శ్రీ శ్రీపతిగారూ. వీరందరి పేర్లూ ఎక్కడో అక్కడ చదివినవే, శివారెడ్డిగారైతే సాహిత్యేకాడెమీ బహుమతి వచ్చినవారూ, శర్మగారు నవ్య ద్వారా వారంవారం సుపరిచితులే. శ్రీ వివినమూర్తిగారి కథలైతే ఎన్నో చదివాను. వోరినాయనోయ్ ఇంత పెద్దపెద్ద వారితో, మమ్మల్నీ ఆహ్వానించారంటే, శ్రీ అమరేంద్ర గారికి మామీద ఎంత అభిమానముందో తెలుస్తుంది.

    ఉద్యోగంలో ఉండే రోజుల్లో కొంతమందిని చూశాను- వారింట్లో ఎదైనా శుభకార్యం జరిగితే ఇచ్చే రిసెప్షన్లు మామూలు ఉద్యోగులకి ఒకసారీ, పెద్దపెద్దవారికి ప్రత్యేకంగానూ ఇచ్చేవారు.అలాటి so called elite gathering లలో మామూలువారికి ప్రవేశం ఉండేది కాదు. దానికి విరుధ్ధంగా ఇప్పుడు మాలాటి అర్భకులని కూడా without a second thought, ఆహ్వానించారంటే, శ్రీఅమరేంద్రగారి సంస్కారం ఎంత గొప్పదో తెలుస్తోంది.దానికి సాయం, ఆయనమీద నా అభిప్రాయం ఏమిటో కూడా వేదిక మీద చెప్పమన్నారు ! అదంతా తరువాత చెప్తానులెండి.

    శతాబ్దిలో బయలుదేరి, రెండున్నరకల్లా సికిందరాబాద్ లో ఓ హొటల్ లో దిగి, అదేదో “ఫ్రెష్” అయిపోయి, బేగంపేట Air Force Station కి నాలుగింటిలోపల చేరిపోయాము.ఆ హొటల్ ఏదో ముందర చూడ్డానికి బాగానే ఉంది, రాత్రికి తెలిసింది, ఎంత దౌర్భాగ్యపు హొటలో అది! నెట్ లో ఏవో రివ్యూలు చూసి బుక్ చేశాను, స్టేషనుకి మనిషినికూడా పంపాడు. తెల్లారకట్ల కరెంటు పోయేసరికి, లైటూ, ఫాన్నూ, ఏసీ ఆగిపోయాయి సరే, ఓ కిటికీ కూడా లేదు. నా దారిన నేను పడుక్కున్నాను, మా ఇంటావిడైతే నానా బాధా పడింది. దిక్కుమాలిన రివ్యూలు చదివి హొటళ్ళు బుక్ చేసికోకూడదని జ్ఞానోదయం మాత్రం కలిగింది.అయినా అన్నీ బాగానే ఉంటే మొహం మొత్తేయదూ? ఇలాటి అనుభవాలు కూడా కలిగితేనే కానీ ట్రిప్పు పూర్తయినట్టుండదు !

   అందరూ వచ్చినతరువాత కార్యక్రమం మొదలెట్టారు. ముఖ్యాంశం శ్రీ అమరేంద్రగారు వ్రాసిన రెండు పుస్తకాలు ఆత్మీయమ్DA, సాహితీయాత్ర DA2 ల ఆవిష్కరణ. ఒకరి తరువాత ఒకరు, శ్రీ అమరేంద్రగారితో వారికి ఉన్న అనుబంధాల గురించి మాట్టాడారు. వారంతా ఏదో ఒక రూపంలో ఆయనతో గత నలభై ఏళ్ళగా పరిచయం ఉన్నవారే, ఉద్యోగరీత్యా అనండి, సాహిత్య ప్రయాణం అనండి,లేదా దగ్గరబంధువులనండి, వారివారి మధుర జ్ఞాపకాలు అందరితోనూ పంచుకున్నారు. అమ్మయ్య నా పేరు చెప్పలేదూ బతికిపోయానూ అనుకున్నంత సేపు పట్టలేదు, ఇంతలో వారి అబ్బాయి రాహుల్ , “మానాన్న గారి latest friend..” అని నా పేరు చెప్పేశాడు.ఏదో కూర్చుని కబుర్లు చెప్పమంటే చెప్పగలను కానీ, ఇలా అంతమంది ప్రముఖుల సమక్షంలో మైక్కులో చెప్పమంటే ఎలాగండి బాబూ, ఎప్పుడూ మైక్కులూ అవీ చేతిలో పెట్టుకుని మాట్టాడడం రాదాయె, అదృష్టం ఏమిటంటే, మైక్కు చేతిలో పెట్టుకోవలసిన అవసరం కలగలేదు.ఆ మైక్కులేవో fix చేసేఉన్నాయి. ఓ గొడవొదిలింది, లేకపోతే కాళ్ళూ చేతులూ వణికి, ఆ మైక్కేదో కిందపడేసేవాడిని. ఆ విడియో తీస్తున్నవారి ఫ్లాష్ లైట్లూ ..ఏమిటో అంతా గందరగోళం అయిపోయింది. ఏమైనా కాగితమ్మీద వ్రాసుకున్నానా ఏమిటీ, చదివేస్తే ఓ పనైపోఏది. అబ్బే ఎక్కడో విన్న ఎక్స్టెంపో ట. అప్పటికప్పుడే చెప్పేయాలిట.

    కిందపడిపోకుండా, ఆ మైక్కులు పట్టేసికుని, ఎదురుగుండా ఒక్కడు కనిపిస్తే పాపం, అంతా అంధకారమయం, ఏం పేలానో తెలియదు.మొత్తానికి మొహమ్మాటానికి చప్పట్లైతే కొట్టారు.. ఏది ఏమైనా మనస్పూర్తిగా ఆయనమీద నా అభిప్రాయమైతే చెప్పగలిగాననే భావిస్తున్నాను.. నా నాలుగుమాటలూ పూర్తికాగానే snacks కోసం బ్రేక్కిచ్చేశారు. ఆ బ్రేక్ తరువాత కేక్ కటింగూ, ఆ తరువాత రాహుల్-సురభిల ఉంగరాల exchange.ఈ మధ్యలో మరి వాళ్ళందరినీ కలియకలిగామని documentary proof ఉండొద్దూ మరీ, Autograph.

    అలాగే కొన్ని ఫొటోలూ అవీకూడా తీశాను.hyd 001hyd 028kb 002hyd 016

    తరువాత భోజనం. పదిన్నరయింది.అదేదో హొటల్ లో దిగాముగా, అక్కడికి వెళ్ళొద్దూ, మళ్ళీ మా అమరేంద్రగారే దిక్కు ! వారి స్నేహితురొకరితో చెప్పి, మమ్మల్ని సికిందరాబాద్ లో దింపేయమన్నారు.ఎక్కడా శ్రమ పడఖ్ఖర్లేకుండా,కాలు కిందెట్టఖ్ఖర్లేకుండా, మమ్మల్నిక్షేమంగా చేర్చే బాధ్యతకూడా తీసికున్నారు. That is what Mr.Amarendra is..స్నేహానికి ప్రాణంపెట్టడమంటే ఇదే మరి. వారికి మాతో పరిచయం ఏణ్నర్ధం క్రితం, అయినా మాలో ఏం చూశారో కానీ, ప్రాణమిత్రులయిపోయారు.ఆయనలో మాకు నచ్చింది ఆయన నిరాడంబరత్వం, స్నేహానికి ప్రాణం పెట్టే తత్వం, అవతలివారిని తన మాటలతో ఎక్కడా నొప్పించకుండా, తననుకున్నదేదో నిర్మొహమ్మాటంగా వ్యక్తపరచడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. అలాటివారు, మమ్మల్నికూడా తమ స్నేహితుల జాబితాలో చేర్చుకోడం మా అదృష్టం...

7 Responses

  1. చదువుతూంటే చాలా ఆనందం కలిగిందండీ. అరుదైన మంచి సంగతులు,ఫోటోలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    Like

  2. karyakramaniki raavalani undi raleka poyi na nalanti variki mee raata running commentary.Missed a good occasion.But savoured the moments through your post
    Murty

    Like

  3. ఏమోనండీ భమిడి పాటి వారు,

    మీరు టపా పెట్టెరండీ ! అది చదవడానికి మేము పుట్టే మండీ ! ఇదీ పుట్టి పెట్టి నవారి మాటే కదండీ మరి !

    జిలేబి.

    Like

  4. అదృష్టవంతులు.
    మీరు భమిడిపాటి వారు కదండి. అదే పెట్టి పుట్టడమన్నమాట.

    Like

  5. తృష్ణ గారూ,

    నా టపా మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు…

    మూర్తిగారూ,

    నిజంగానే ఓ మంచి కార్యక్రమం మీరు మిస్ అయారు. మేమైతే శ్రీ అమరేంద్రగారి అథిధి సత్కారాలు పూర్తిగా ఆస్వాదించగలిగాము. Next time better luck…

    జిలేబీ,

    అదే మీ వ్యాఖ్యల్లో ఉండే మజా అంతా !! నేను పెట్టిన శీర్షికనే అందంగా మలిచేశారు…Thats what ZILEBI is all about…

    బోనగిరి గారూ,

    బహుశా మేము చేసికున్న అదృష్టం అంతా అందులోనే ఉందేమో… ధన్యవాదాలు.

    Like

  6. thanks phani babu gaaroo..edeni kaaryakramam baagaa jarigindante anduku mukhya kaaranam vachhina vaallu vedajallina positive energy..meerantaa ekkedekkadinincho vachhaaru ..naa kala nijam chesaaru..many thanks

    Like

  7. అమరేంద్ర గారూ,

    మీ అలవాటు ప్రకారం వచ్చినవాళ్ళకే credit ఇవ్వడం మీ గొప్పతనం….

    Like

Leave a comment