బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


టపా వ్రాసి అప్పుడే 3 నెలలయిపోయింది. Facebook  లో ప్రతీరోజూ, పోస్టులు పెట్టి, అక్కడి స్నేహితులనందరినీ హింసిస్తున్నాను, గత రెండేళ్ళగా. నేను పెట్టే సమాచారం, అందరికీ తెలియదని కాదు, మనకి తెలిసిన విషయాలను ” డబ్బా” కొట్టుకుని, అందరినీ “బోరు ” కొట్టడం.  నా గోల భరించలేక, మొహమ్మాటానికి చాలామంది “Like”  కొట్టడం, కొంతమంది వ్యాఖ్యలు పెట్టడం, కొంతమందైతే ఏకంగా Share  చేసేసికోవడం. కొంతమందైతే , మన పేరు తీసేసి, తమ స్వంత పోస్టుల్లా పెట్టేసికోడం… ఏదైతేనేం, కావాల్సినంత కాలక్షేపం. ఏదో విధంగా అందరి నోళ్ళలోనూ పడ్డం. రేపెప్పుడో, ఈ లోకాన్నుండి నిష్క్రమించినప్పుడు, ఓసారి గుర్తుచేసికుంటారుకదా.. ” అమ్మయ్యా ఈయన గొడవ వదిలిందిరా బాబూ..” అనో, లేక ” పాపం చాదస్థంగా ప్రతీరోజూ పోస్టులు పెట్టేవాడు ” అనో, ఓ నాలుగురోజుల పాటు.  నా స్నేహితులే నా స్థిర చరాస్థులు. బ్లాగులోకమైనా, ముఖపుస్తక లోకమైనా. ఇక్కడ బ్లాగులోకంలో అందరూ సుఖపడిపోతున్నారేమో.. మళ్ళీ అలాగెలా కుదురుతుందీ? అందుకనే పునరాగమనం.

 మాఇంట్లో , మా అమ్మాయీ వాళ్ళ పాత టీవీ ఒకటుండేది. అవడం కలరుదే, అయినా ఈ రోజుల్లో ఫ్యాషనయిన  HD  అవీ వచ్చేవికావు. మా మనవళ్ళు వచ్చినప్పుడల్లా, అడగడం.. ” క్యా తాతయ్యా.. కొత్త టివీ తీసికోకూడదా?” అంటూ. ఏదో ” ఆయనే ఉంటే…” అన్నట్టు,అంత ఓపికుంటే ఎప్పుడో మార్చేసేవాడిని.  ఆర్ధిక పరిస్థితా అంతంత మాత్రం.. అంటే సరీపోవడంలేదని కాదు.. సరిపోవడమేమిటీ, మిగులుతోంది కూడానూ..  ఆ మిగిలినదేదో నేనెక్కడ ఖర్చుపెట్టేస్తానో అని, మా ఇంటావిడ, తన నెలవారీ ఫ్రెండ్ల అదేదో చిట్ ఫండు  దాన్ని వీళ్ళిక్కడ బిసీ అంటారులెండి, దాంట్లోకి  divert  చేసేసింది.మొత్తానికి ప్రతీ నెలా, నాకొచ్చే పెన్షనులోంచి, సగం భాగం, ఆవిడ ఎకౌంటులోకి మార్చడం. ఆ డబ్బుల మీద సర్వహక్కులూ ఆవిడవే. ” చేసికున్నవాడికి చేసికున్నంత..” అనుకుని  నోరుమూసుకుని కూర్చోడం తప్ప చేసేదేముంది?అదండీ ఉపోద్ఘాతం.మన ప్రభుత్వాల deficit budget  లా ఎప్పుడూ ” లోటు బడ్జెట్టే “…

ఇంక అసలు కథలోకి వస్తే..నేను ప్రతీరోజూ చేసే  loud thinking  ధర్మమా అని, మొన్న డిసెంబరు, 15, నా పుట్టినరోజు బహుమతిగా , కొని పెట్టేసింది. ఇదేదో తన ” విశాల హృదయం ” అని అపోహ పడకండి. ఎంతైనా ఆడవారు, ప్రతీదీ గుర్తుపెట్టుకోడంలో సిధ్ధహస్తులు.  తను నా జీవితంలోకి తన 18/19 ఏట వచ్చింది. అప్పటినుండీ, తన 60 వ ఏటి దాకా, తన పుట్టినరోజు పేరుచెప్పి, ఇంట్లోకి అవసరమయే వస్తువోటి కొని, తన పుట్టినరోజు బహుమతి అని పేరు పెట్టేవాడిని.   కత్తిపీట, కల్వాలతో మొదలైన ప్రస్థానం…  అలా సాగుతూనే ఉంది. అవన్నీ ఇన్నాళ్ళూ మనసులో పెట్టేసికుని, ” వీడి రోగం కుదర్చాలి..” అనుకుందో ఏమో, మొత్తానికి ఓ టీవీ కొనేసి, ” ఇదిగో మీ గిఫ్ట్ ” అంది.. అదండీ విషయం.

 మాపిల్లలకీ, తనకూ కూడా చేతుల్లో  smart phone  లే. నేనొక్కడినీ మాత్రం, ఇ‍‍క్ష్వాకుల కాలం నాటి, సాదా సీదా ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నా ఇన్నాళ్ళూ… ఏమనుకుందో ఏమో, మొన్న ఫిబ్రవరి, 28, మా పెళ్ళిరోజుకి నాక్కూడా ఓ  Smart Phone  కొనిపెట్టేసింది.. అది చేతికి వచ్చినప్పటినుంచీ, బయటకి వెళ్ళడం మానేశాను. ఏదో తెలుగు పేపరు తెచ్చుకోడానికైనా బయటకు వెళ్ళేవాడిని. కనీసం ఆ గంటా గంటన్నరసేపైనా, ఇంట్లో తన పనులు తను చేసికునేది. ఇప్పుడా అవకాశమే లేకుండాపోయింది..తనకు ప్రతీరోజూ ఉండే గంటన్నర ” మనశ్శాంతీ ” కొండెక్కేసింది.

అందుకే అంటారు ఏదైనా చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాలని. మనం చేసే పని పరిణామాలెలా ఉంటాయని. कुछ खोना पढ्ताहै..  అదండీ సంగతి… 

10 Responses

  1. అక్టోబర్ 24 తరువాత మార్చ్ 09 న హరేఫల జాలగడికి (బ్లాగుకు)
    తిరిగి వచ్చినందుకు స్వాగతం, అభినందనలు.మీ మ్యూసింగ్స్ గోతెలుగు.కాం లో
    వారం వారం చదువుతూ ఉన్నా బాతాఖానీ కబుర్లలో ఉన్న మజా లేదు.
    అవీ ఇవీ చదువుతూ ఉన్నాను కానీ అక్కడ నా ప్రతిక్రియ మీకు చేర వేసే సదుపాయం లేదు.

    Like

  2. మూడు నెలలు కాదండీ బాబూ, అక్షరాలా 132 రోజులు.అంటే దాదాపు 4 1/2 నెలలు.

    Like

  3. డాక్టరు గారూ,

    మీ అభిమానానికి ధన్యవాదాలు. నిజం చెప్పాలంటే, ఎన్నో ఎన్నెన్నో విషయాలున్నాయి రాయడానికి… ఇటుపైన చూడండి.. ” మమ్మల్నింక బోరు కొట్టకండి బాబూ..” అనేంతవరకూ రాస్తాను..

    Like

  4. వెల్కం బెక బెక !

    మీ లాంటి వాళ్ళు మళ్ళీ బ్లాగు ముఖం చూడడం మా అదృష్టం 🙂

    చీర్స్
    జిలేబి

    Like

  5. ఫణిబాబు గారు నటునిటు
    ఘనముగ జాలముఖచిత్ర గాడిన పడ్డా
    వనమగు బ్లాగున మళ్ళీ
    కనవచ్చిరిగద జిలేబి కామింటివ్వన్

    Like

  6. జిలేబీ గారూ,

    ఇలాటి చెణుకులు మిస్ అయానండి ఇన్నిరోజులూ.. అందుకే మళ్ళీ తిరిగి స్వంత గూటికి చేరుకున్నాను… ఇదివరకటిలాగే ప్రోత్సహిస్తూ ఉంటారని ఆశిస్తూ…

    Like

  7. The Return of the Native (Thomas Hardy గారి నవల).
    Welcome back ఫణి బాబు గారూ. మిమ్మల్ని మిస్ అయ్యాం.

    Like

  8. నరసింహరావు గారూ,

    మీ వ్యాఖ్య చదివిన తరువాత, ఫరవాలేదూ ఎప్పటిలాగే , నా బ్లాగుకూడా చదివేవారు ఉన్నారూ అనిపించింది. ధన్యవాదాలు.. .. మీరందరూ వద్దనేదాకా రాస్తూనే ఉండాలని ధ్యేయం…

    Like

  9. We too like your blog’s.Our Vaishnodevi trip is postponing since three years due to the back pain of our home maker. How lucky we are! Just like a live telecast to read this blog.

    Like

    • రాధారావు గారూ,

      మీరు ఎంత ప్రయత్నించినా,, అమ్మ పిలుపు వస్తేనే కానీ, ఆవిడ దర్శనం అవదని వింటూంతాం. పెళ్ళి అయిన 44 సంవత్సరాలకి మాకు పిలుపొచ్చింది. మీకూ వస్తుందిలెండి త్వరలో.. నిరాశ పడొద్దు… మీ స్పందనకు ధన్యవాదాలు.

      Like