బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు

మనదేశంలో జనాలకి  కిరికెట్ మీదుండే అభిమానం, ఇంక దేనిమీదా ఉండదు. దానికి సాయం అదేదో T20 World Cup  ట. ఓ రెండు నెలలనుండీ, దాని పూర్వాపరాలు, ఓ వారం రోజులనుండీ, అసలు టూర్నమెంటు ప్రారంభం అవడంతో ప్రతీరోజూ గోల.ఎవరి అభిమానం వారిదీ,  దానికేమీ అభ్యంతరం లేదు. కానీ, మన దేశం ఓ మ్యాచ్ నెగ్గిందంటే, టీవీ వాళ్ళూ , పేపర్లవాళ్ళూ చేసే హడావిడి, ఒక్కొక్కప్పుడు చిరాకు పెడుతుంది. పైగా ఈ మ్యాఛ్ లు రాత్రి 7.30 కి ప్రారంభం అయి, ఓ రాత్రివేళకు పూర్తవుతాయి. ఇంక అప్పుడు చూసుకోవాలి, బాణాసంచాలూ, టపాకాయలూ హోరెత్తించేస్తాయి. ఇంక భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అయితే అడగక్కర్లేదు.  రెండుదేశాల మధ్యా దౌత్య సంబంధాల మాట దేవుడెరుగును కానీ, ఈ మ్యాచ్ ల్లో నెగ్గడమే , దేశగౌరవానికి  ఋజువు గా భావిస్తారు. మనవాళ్ళ ఆట ఎలా ఉన్నా, చచ్చినట్టు వాళ్ళనే సపోర్టు చేయాలి.  కర్మకాలి, అవతలి జట్టుకి చప్పట్లు కొట్టారా, దేశద్రోహం కింద కేసుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్న రోజులు. నిన్నటి ఆటలో మన జట్టు నెగ్గిందిట. అక్కడికేదో వరల్డ్ కప్ నెగ్గినంత హడావిడి చేశారు. బాణసంచాలు ఎక్కువగా కాల్చి హడావిడి చేయడంతో పాపం, కెప్టెన్ గారి  సుపుత్రికి నిద్రాభంగం కలిగిందని, కెప్టెన్ గారి సతీమణి అదేదో ట్వీట్ చేశారట.. అదో పెద్ద న్యూసూ. దేశంలో ఆ పిల్లకే కాదు, లక్షలాది ఇళ్ళల్లో, వృధ్ధులకీ, పిల్లలకీ, కూడా నిద్రాభంగం జరిగింది. కానీ మన మాట వినేవాడెవడూ? నిన్నటికి నిన్ననే పాకిస్తాన్ మహిళల జట్టు, మన జట్టుని ఓడించిందిట. ఒక్కడైనా మాట్టాడేడా?  మాట్టాడితే మళ్ళీ ఏదో అంటారు.

ఆటని ఆటగా చూడడం ఎప్పుడు నేర్చుకుంటారో మనవాళ్ళు. మొన్నెప్పుడో ఓ మ్యాచ్ లో ఓడిపోయారు.. ఒక్కడూ మాట్టాడలేదు. మన ప్రసార మాధ్యమాలూ అవీ కూడా  Focus  చేసేది,భారత్- పాకిస్తాన్ మాచ్ ల మీదే. అది హాకీ అవనీయండి, లేక ఇంకోటేదో అవనీయండి. అభిమానం ఉండొచ్చు, కానీ మితిమీరకూడదేమో…అసలు ఆ ఆర్గనైజర్లని అనాలి.. ఈ రెండు జట్లనీ ఒకే గ్రూప్ లో వేయడమెందుకూ?మన ప్రాణం తీయడానికా? చెరో గ్రూప్ లోనో వేస్తే గొడవే ఉండేది కాదుగా..  ఫైనల్స్ కి ఉంటే ఉంటారు పోతేపోతారు.. ఓ మ్యాచ్ తో గొడవొదిలిపోయేది, మనకీ సుఖశాంతులుండేవి.. అబ్బే.. అలాచేస్తే, వీళ్ళకొచ్చే రెవెన్యూ తగ్గిపోదూ? ప్రతీదానికీ డబ్బుతోనే ముడి.

 ఒక్కో గ్రూప్ లోనూ ఇంకా మ్యాచ్ లు ఆడాలి, నెగ్గాలి, అప్పుడుకదా తేలేది?పోనీలెండి,  మళ్ళీ లీగ్గులూ, సింగినాదాలూ అంటూ రెండేసిసార్లు ఆడరు. ఎక్కడికక్కడే. ఇంకో రెండు మ్యాచ్చీలకి, మన జట్టంటూ నెగ్గితే  బాణాసంచా హడావిడి భరించాలి. ఈసారైనా కెప్టెన్ గారి సుపుత్రిని నిద్రపోనిస్తారేమో చూడాలి.

%d bloggers like this: