బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు..

తెలుగు భాషనీ, తెలుగు జాతినీ విచక్షణ అనేది లేకుండా ఇరవైనాలుగ్గంటలూ చిత్రహింసలు పెడుతూన్న మన తెలుగు చానెళ్ళ కార్యక్రమాలు భరించడం రోజురోజుకీ కష్టమైపోతోంది. అలాగని మిగిలిన భాష వారు, తామేమీ తక్కువకానట్టు, ఒక్కో సీరియల్ నీ జీడిపాకం లా సాగతీస్తూనే ఉంటారు. కర్మేమిటంటే, వాటినే మన తెలుగువారు, వారికి తోచిన రీతిలో డబ్బింగు చేసి, పేరుని అనువదించి, మన మీదకి వదలడం. అంటే ఒకచోట తప్పించుకున్నా, ఇంకో భాషలో హింసింపబడ్డం అన్న మాట. అలా అయితే అసలు టీవీ చూడ్డం మానేయొచ్చుగా అనొచ్చు. వేలకి వేలు పోసి టీవీలు కొనుక్కున్నందుకు, పైగా ఇదోటా? ఇదివరకే హాయిగా ఉండేది.. ఒకేఒక్క చానెల్, వాళ్ళేం చూపిస్తే అదే చూడ్డం. ఆరోజుల్లో వచ్చే సీరియల్స్ కి కనీసం ఓ  Date of Expiry  అయినా ఉండేది. కానీ ఈరోజుల్లో అన్ని సీరియళ్ళూ ” చిరంజీవు ” లే.. పోనీ ఏదైనా వార్తల కార్యక్రమం చూద్దామా అంటే, పొద్దుట లేచినప్పటినుండి, ఇరవైనాలుగ్గంటలూ , ఒక్కో చానెల్ వాడూ ఎదో ఒకటి, ఎవరినో ఒకరిని పట్టుకోవడం.. అక్కడెక్కడో ఓ ఇల్లాలు తన కాపరం నిలబెట్టమని నిరాహార దీ‍క్ష ట. ఇంకోసారి, ఎవరో ఓ అమ్మాయి  భర్తమీద పోలీసు కంప్లైంటు, దానిమీదో ప్రోగ్రాం, ఆ పిల్ల పెళ్ళి చేసికున్నప్పుడూ అదే గోల. నాకోటి అర్ధం అవదూ–టీవీ వాళ్ళకి వీళ్ళు దొరుకుతారా. లేక ఈ so called  బాధితులే, డబ్బులిచ్చి వీళ్ళని పిలుస్తారా? ఇవి కాకుండా, కౌన్సెలింగులూ, కుటుంబ సమస్యల ” జట్కా బళ్ళూ” ఉండనే ఉన్నాయి. హాస్యం పేరుతో వస్తూన్న కార్యక్రమాల గురించి  less said the better..

పోనీ ఏదో ఒకటి చూద్దామా అనుకుని, చివరకి క్విజ్ కార్యక్రమాల వైపు చూస్తే.. ఆయనెవరో , తను  ప్రతీవారినీ ” కోటీశ్వరుదు ” చేసేస్తామంటాడు. ఆ చానెల్ కి sms  ద్వారా వచ్చేకోటానుకోట్ల రూపాయల్లో , కొంచం విదిలిస్తారు.పైగా ఆ సదుపాయం, ఒక్క తెలుగురాష్ట్రాలలో ఉండే ప్రేక్షకులకేట.. అమ్మయ్య ఓ గొడవొదిలిందని సంతోషించాను.  

స్కూలు పిల్లలకోసం ఓ చానెల్ వారు నిర్వహించే కార్యక్రమం, కొంతలోకొంత పరవాలేదు. అందులో , పిల్లల ” అమ్మ” లనుకూడా ఓ  helpline  గా చేశారు.అదీ బాగానే ఉంది. నాకోటి అర్ధం అవలేదు– కొంతమంది ” మీరేం చేస్తూంటారమ్మా..” అని అడగ్గానే, ఒకరు   Housewife  అంటారు, ఇంకోరేమో  Homemaker  అంటారు. హాయిగా గృహిణి అంటే పోయేదానికి. ఇంక పిల్లలంటారా, 7 – 9  క్లాసులవాళ్ళే. క్రికెట్ గురించీ, సినిమాల గురించీ టక్కున  జవాబు చెప్పే, శ్రధ్ధ   GK  గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో మరి? అలాగని అందరూ కాదు కానీ, ఎక్కువ శాతం అలాటివారే. ఇంక , మన helpline  అమ్మలంటారా, కొంతమంది ” తెలియదు ” అని sincere  గా ఒప్పేసికుంటారు. కానీ కొంతమంది సమాధానాలైతే తమాషాగా ఉంటాయి. ఆ మధ్యన , మహాభారతం లో  కీచకుడిని వధించింది ఎవరూ, అని నాలుగు  options  కూడా ఇచ్చినా పిల్ల అమ్మనడిగింది. ఆ మహాతల్లేమో ” అర్జునుడు” అంది. ప్రతీదీ తెలియాలని కాదు, ఇదివరకటిరోజుల్లో, చదువుతో ప్రమేయం లేకుండా, మన అమ్మలూ, అమ్మమ్మలూ, నానమ్మలూ ఏదడిగినా  ఠక్కున చెప్పేవారు.  ఈరోజుల్లో పోనీ ఖాళీ టైములో ఏదైనా పుస్తకం చదవాలనే అలవాటే లేదాయె. ఇంక పిల్లలకేం చెప్తారు.. ప్రతీప్రశ్నకీ సరైన జవాబు చెప్పడం కష్టమే, పైగా అక్కడికక్కడ చెప్పడం ఇంకా కష్టం, ఒప్పుకుంటాం.. కానీ ఆ మధ్యన ఓ ప్రశ్న– ” బాబులకి బాబు ఎవరూ అంటే చంద్రబాబని జవాబు. క్విజ్ మాస్టరు అడిగినది  ” తాత ” గురించి. అలాటిదే ఇంకో ప్రశ్న జవాబు ఇంకోటేదో అయితే ” సింగపూర్ ” అని జవాబు. దీన్నిబట్టి తెలుస్తోందేమిటంటే, ఆంధ్రదేశంలో  ఏరోజు పేపరు చూసినా ఈ రెండే కదా కనిపించేదీ? మరీ ఇంత   Brainwaషింగా.ఇంకో విషయం మర్చేపోయాను–  వచ్చిన పిల్లల్ని, “పెద్దయాక నువ్వేం చేస్తావు” అని అడగ్గానే, ఒకరు ఇంజనీరంటారు, ఇంకోరు ఇంకోటేదో అంటారు. ఎంత పెరిగిపోయాయో పిల్లల కోరికలు? మా రోజుల్లో ఏ కొద్దిమందో తప్ప, పెద్దయిన తరువాత, ఏ సినిమాహాల్లో టిక్కెట్లిచ్చేవాడిగానో ( ప్రతీరోజూ సినిమా చూడొచ్చు) మహా అయితే బస్సు కండక్టరుగానో అయితే చాలనిపించేది. ఏమిటో రోజులు మారిపోయాయి…  ఫైనల్స్ లో నీకొచ్చే లక్షరూపాయలూ ఏం చేస్తావని అడగ్గానే, నా పై చదువులకి ఉపయోగిస్తానంటుంది ఓ పిల్లో పిల్లాడో. జూనియర్ కేజీ కే లక్షల్లో ఖర్చవుతున్న ఈరోజుల్లో, వాళ్ళిచ్చే లక్షా ఏ మూలకంటారూ?

 

 అన్నీ చెప్పి మన అసలు సిసలు  Comedy  ఛానెల్ గురించి చెప్పకపోతే ఎలా? మన శాసనసభ/ పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారాలు. ఎంత కాలక్షేపమో. రోజంతా చూడమన్నా చూడొచ్చు. మన పాలకులు చేస్తూన్న దేశసేవ, కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు. దురదృష్టమేమంటే, ఆ కార్యక్రమాలు సంవత్సరం పొడుగునా రావాయె. 

%d bloggers like this: