బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– “Being taken for a ride…”

 సాధారణంగా జనాలని వెర్రి వెధవలు చేసినప్పుడు బహుశా “being taken for a ride..” అంటారనుకుంటా.. మన రాజకీయ నాయకులనే చూడండి.. ఎన్నికల సమయంలో ఎన్నో ఎన్నెన్నో ” తాయిలాలు” చూపించి, వారి ని ఎలాగోలాగ ఎన్నికయ్యేటట్టు చూసుకుంటారు. గ్రామస్థాయి పంచాయితీ ఎన్నికలనుండి, జాతీయ ఎన్నికలదాకా ఇదే తంతు. అయినా సరే,  గొఱ్ఱె కసాయివాడినే నమ్ముతుందన్నట్టు, వాళ్ళ వెనక్కాలే పడతాము. ఏ రంగం తీసికున్నా ఇదే రంధి. సాధారణ ప్రజలకి ఈ విద్య రాదూ, వాళ్ళకి వచ్చూ.అంతే తేడా..

ఆర్ధిక సంస్కరణల ధర్మమా అని, ఎక్కడపడితే అక్కడ Malls  వచ్చేశాయి. కొత్త ఎప్పుడూ వింతే కదా, అప్పటిదాకా ఒక్కో వస్తువుకీ, కాళ్ళరిగేలా తిరిగేబదులు, ఒకే  ఛత్రంకింద, అన్నిటినీ కొనుక్కోవచ్చని అందరమూ చంకలెగరేసికున్నాము. విశ్వాసపాత్రంగా అన్నేళ్ళూ మనకి సేవలందిస్తూ, ” అరువు” కూడా ఇస్తూన్న, చివరకి సరుకులన్నీ కొన్న తరువాత, ఓ బెల్లం ముక్క కూడా ఉచితంగా ఇస్తూ, ” ఎలాగున్నారండి అబ్బాయి గారూ..” అంటూ, ఎంతో అభిమానంగా పలకరించే, కిరాణా కొట్టువాడు కాస్తా, ” కాకరకాయ ” అయిపోయాడు.  కానీ, ఎప్పటికోఅప్పటికి మనుషుల్లోనూ  realisation  అనేది వస్తుందే కదా.  బయటి కొట్లలో కనీసం బేరమేనా ఆడొచ్చు. ఈ Malls  లో ఆ అవకాశమేలేదు.అదేదో లేబులూ, దానిమీదో నెంబరూ, దాన్ని అదేదో మెషీను పెట్టి అలా అలా తిప్పితే, దాని ధరెంతో మన బిల్లులోకి వస్తుంది. ఆ పన్నూ, ఈ పన్నూ కలిపి తడిపిమోపెడవుతుంది.  పైగా అవసరమైన సరుకులన్నీ, అల వైకుంఠపురము లోలాగ ఎక్కడో పెడతారు.  మనకి అసలు అవసరమైనవి దొరికేదాకా,  పెద్ద మాల్స్ లో కనీసం, ఓ వందా రెండువందల గజాలైనా ఓ ట్రాలీ నడుపుకుంటూ పోవాలి. దారిపొడుగునా, ఆకర్షణీయంగా కనిపించి, ఎందుకూ అవసరంలేనివన్నీ పెడతారు. పైగా అందులో  Buy one get one free   అని బోర్డులోటీ. మొత్తం కుటుంబంతో కలిసి, ఈ మాల్స్ కి వెళ్ళామా, అంతే సంగతులు. ఆ ట్రాలీలో అతి చిన్న పిల్లనో, పిల్లాడినో కూర్చోపెట్టి, దాన్ని నెట్టుకుంటూ , వెళ్ళేలోపల, ఆ పిల్లో,పిల్లాడో  ” నాకు అదికావాలి డాడీ..” అంటునో, “అరే  ఇదేదో బాగానే ఉందండోయ్.. ” అంటూ , భార్యో, అడగడం, తీరా మనం కొనాల్సిన వస్తువు, కొనేలోపలే, మన ట్రాలీ, నానా  అనవసరమైన చెత్తతోనూ నిండిపోవడం చూస్తూనే ఉంటాము.   ఈ ఖరీదుల్లో , అక్కడుండే స్టాఫ్ జీతాలూ, వాళ్ళ లైట్లూ, ఏసీ ల బిల్లిలూ , అన్నీ కలిపి మన నెత్తిమీద రుద్దుతారు. అయినా సరే ఏదో చిన్నప్పుడు తీర్థాలకి వెళ్ళినట్టు, నెలకోసారో, రెండుసార్లో వెళ్ళాలే. పైగా ఇంకో విషయం.. మీ  గ్రోసరీస్ ఎక్కడ తీసికుంటారూ అని ఏ పక్కింటివాళ్ళో అడిగితే,   We go to Reliance/ Dmart/ Big Bazaar   అని ఇంగ్లీషులోనే చెప్పడం ఓ  Status Symbo లాయె.. అదే రోడ్డు పక్కనుండే కూరల కొట్టులోనో, బళ్ళమీద తెచ్చేవాళ్ళనో, నిమ్మకాయలు ఎంతోయ్ అంటే, వాడు  పదిరూపాయలకి మూడూ, అంటాడు.. వాడికీ తెలుసు మనం నాలుగిమ్మంటామని. ఏదో మెహరుబానీ చేస్తున్నట్టు, వాడూ ఇచ్చేస్తాడు. ప్రతీదానికీ బేరం చెయొవచ్చు. వాడివ్వకపోతే ఇంకో కొట్టు. కొట్లు లేవా ఏమిటీ? కానీ అవే నిమ్మకాయలు, ఏ మాల్ లోనైనా తీసికోండి, ముక్కుపిండి, మూడింటికీ కనీసం ఓ పన్నెండు రూపాయలు వసూలుచేస్తాడు.. మాల్స్ కీ, మన వాడికగా తీసికునే కిరాణా షాప్పుకీ తేడా  ఎక్కడా అంటే, అక్కడ మాల్స్ లో ఆడపిల్లలు యూనిఫారం లోనూ, Good Morning Sir, Thank you sir అనడం , ఇక్కడేమో కొట్టువాడు , కాటాముందర కూర్చునో, లేదా ఏ బనీనులోనో నుంచునో, కొట్టంతా సరుకుల సువాసనలతో ఘుమఘుమలాడుతూండడమో.  ఒక్కోసారి గిరాకీలెక్కువగా ఉంటే ఆగాల్సొస్తుందేమో. ఈ కొట్టువాడు మాత్రం బిల్లులూ గట్రా ఇవ్వడు. మహా అయితే, ఇంట్లో చూపించడానికి  ఓ తెల్ల కాయితం మీద నాలుగంకెలు వేసిస్తాడు. 

ఇలాటిదే ఇంకో రంగం ఉంది. రవాణా వ్యవస్థ. ఆటోలవాళ్ళు మీటర్లు వేయకుండా, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారనీ, మనలాటి సాధుపుంగవులని దోచేస్తున్నారనీ, అప్పుడెప్పుడో ఓ రెండు మూడు  Taxi Service లు వచ్చాయి. ఇదివరకటిరోజుల్లో అసలు టాక్సీలనేవి, ఒక ఊరునుంచి ఇంకో ఊరికి వెళ్ళాల్సొచ్చినప్పుడూ, మహానగరాల్లో మాత్రమే ఉపయోగిస్తారనే అపోహ ఉండేది. కానీ, ఈ కొత్తగా వచ్చిన  Ola, Uber, TFS  వాళ్ళు, మన గుమ్మంలోకే వచ్చి, ఏసీ కార్లలో తీసికెళ్ళినా, ఆటోలకి పెట్టే ఖర్చుకన్నా సగానికి సగమే అవడంతో , చాలామంది ఈ టాక్సీలే పిలిచేవారు. పైగా  ఆటోలోనో, బస్సులోనో వెళ్ళడం కంటే, పెద్ద స్టైలుగా, కారులో దిగడం, చూసేవాళ్ళకీ బావుంటుందికదా.. అది టాక్సీయా, స్వంతకారా, తెల్ల నెంబరు ప్లేటా, పసుప్పచ్చ నెంబరు బోర్డా ఎవడు చూడొచ్చాడు? ఏదో మొత్తానికి ఊళ్ళో తిరగడాలక్కూడా టాక్సీల్లోకి వచ్చేశారు జనాలు. పైగా ఇంకోళ్ళకి కూడా సలహాలివ్వడం… “హాయిగా టాక్సీ పిలిచేయండీ, ఈ దిక్కుమాలిన ఆటొలవాళ్ళు దోచేస్తున్నారూ..” అని.  జనాల హుషారు చూసి, ఈ పైచెప్ప బడిన టాక్సీలవాళ్ళూ, తెలివి మీరిపోయారు. రుచి మరిగారు.. ఒక్కో టైముకి ఒక్కో రేటు. ఇదివరకు నాలుక్కిలోమీటర్లకి 49 రూపాయలుండేదల్లా, రెండుకిలోమీటర్లకి మార్చేశారు. పైగా వీటికి సాయం ఒకడేమో ప్రయాణ వ్యవధి నిమిషానికి రూపాయన్నరైతే, ఇంకోడేమో రూపాయి ముప్పావలా.. పైగా ఏ ట్రాఫిక్కు జామేనా అయితే, అంతే సంగతులు.మనం గమ్యం చేరేటప్పటికి  బిల్లు తడిపి మోపెడవుతోంది. పైగా ఏమైనా అంటే  Terms and conditions apply..

  ఈగోలంతా ఎందుకు రాశానంటే, ఈవేళ పొద్దుట, మా స్నేహితుల ఇంటికి వెళ్ళడానికి టాక్సీ వాడు అక్షరాలా తొంభైతొమ్మిది రూపాయలూ, 5 కిలోమీటర్ల ముచ్చటకి, అదే దూరం, ఆటోవాడు మీటరుమీద అరవై రెండురూపాయలూ తీసికున్నాడు.. అరవైరెండు బదులు, అరవై అయిదిచ్చినా   పుణ్యం కూడానూ.

ఒకానొకప్పుడు ఆటోలవాళ్ళది ” దోపిడీ ” అనుకుంటే, ఈరోజుల్లో టాక్సీ సర్వీసువాళ్ళు చేసేది  ” నిలువుదోపిడీ…”

%d bloggers like this: