బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

టపా వ్రాసి అప్పుడే 3 నెలలయిపోయింది. Facebook  లో ప్రతీరోజూ, పోస్టులు పెట్టి, అక్కడి స్నేహితులనందరినీ హింసిస్తున్నాను, గత రెండేళ్ళగా. నేను పెట్టే సమాచారం, అందరికీ తెలియదని కాదు, మనకి తెలిసిన విషయాలను ” డబ్బా” కొట్టుకుని, అందరినీ “బోరు ” కొట్టడం.  నా గోల భరించలేక, మొహమ్మాటానికి చాలామంది “Like”  కొట్టడం, కొంతమంది వ్యాఖ్యలు పెట్టడం, కొంతమందైతే ఏకంగా Share  చేసేసికోవడం. కొంతమందైతే , మన పేరు తీసేసి, తమ స్వంత పోస్టుల్లా పెట్టేసికోడం… ఏదైతేనేం, కావాల్సినంత కాలక్షేపం. ఏదో విధంగా అందరి నోళ్ళలోనూ పడ్డం. రేపెప్పుడో, ఈ లోకాన్నుండి నిష్క్రమించినప్పుడు, ఓసారి గుర్తుచేసికుంటారుకదా.. ” అమ్మయ్యా ఈయన గొడవ వదిలిందిరా బాబూ..” అనో, లేక ” పాపం చాదస్థంగా ప్రతీరోజూ పోస్టులు పెట్టేవాడు ” అనో, ఓ నాలుగురోజుల పాటు.  నా స్నేహితులే నా స్థిర చరాస్థులు. బ్లాగులోకమైనా, ముఖపుస్తక లోకమైనా. ఇక్కడ బ్లాగులోకంలో అందరూ సుఖపడిపోతున్నారేమో.. మళ్ళీ అలాగెలా కుదురుతుందీ? అందుకనే పునరాగమనం.

 మాఇంట్లో , మా అమ్మాయీ వాళ్ళ పాత టీవీ ఒకటుండేది. అవడం కలరుదే, అయినా ఈ రోజుల్లో ఫ్యాషనయిన  HD  అవీ వచ్చేవికావు. మా మనవళ్ళు వచ్చినప్పుడల్లా, అడగడం.. ” క్యా తాతయ్యా.. కొత్త టివీ తీసికోకూడదా?” అంటూ. ఏదో ” ఆయనే ఉంటే…” అన్నట్టు,అంత ఓపికుంటే ఎప్పుడో మార్చేసేవాడిని.  ఆర్ధిక పరిస్థితా అంతంత మాత్రం.. అంటే సరీపోవడంలేదని కాదు.. సరిపోవడమేమిటీ, మిగులుతోంది కూడానూ..  ఆ మిగిలినదేదో నేనెక్కడ ఖర్చుపెట్టేస్తానో అని, మా ఇంటావిడ, తన నెలవారీ ఫ్రెండ్ల అదేదో చిట్ ఫండు  దాన్ని వీళ్ళిక్కడ బిసీ అంటారులెండి, దాంట్లోకి  divert  చేసేసింది.మొత్తానికి ప్రతీ నెలా, నాకొచ్చే పెన్షనులోంచి, సగం భాగం, ఆవిడ ఎకౌంటులోకి మార్చడం. ఆ డబ్బుల మీద సర్వహక్కులూ ఆవిడవే. ” చేసికున్నవాడికి చేసికున్నంత..” అనుకుని  నోరుమూసుకుని కూర్చోడం తప్ప చేసేదేముంది?అదండీ ఉపోద్ఘాతం.మన ప్రభుత్వాల deficit budget  లా ఎప్పుడూ ” లోటు బడ్జెట్టే “…

ఇంక అసలు కథలోకి వస్తే..నేను ప్రతీరోజూ చేసే  loud thinking  ధర్మమా అని, మొన్న డిసెంబరు, 15, నా పుట్టినరోజు బహుమతిగా , కొని పెట్టేసింది. ఇదేదో తన ” విశాల హృదయం ” అని అపోహ పడకండి. ఎంతైనా ఆడవారు, ప్రతీదీ గుర్తుపెట్టుకోడంలో సిధ్ధహస్తులు.  తను నా జీవితంలోకి తన 18/19 ఏట వచ్చింది. అప్పటినుండీ, తన 60 వ ఏటి దాకా, తన పుట్టినరోజు పేరుచెప్పి, ఇంట్లోకి అవసరమయే వస్తువోటి కొని, తన పుట్టినరోజు బహుమతి అని పేరు పెట్టేవాడిని.   కత్తిపీట, కల్వాలతో మొదలైన ప్రస్థానం…  అలా సాగుతూనే ఉంది. అవన్నీ ఇన్నాళ్ళూ మనసులో పెట్టేసికుని, ” వీడి రోగం కుదర్చాలి..” అనుకుందో ఏమో, మొత్తానికి ఓ టీవీ కొనేసి, ” ఇదిగో మీ గిఫ్ట్ ” అంది.. అదండీ విషయం.

 మాపిల్లలకీ, తనకూ కూడా చేతుల్లో  smart phone  లే. నేనొక్కడినీ మాత్రం, ఇ‍‍క్ష్వాకుల కాలం నాటి, సాదా సీదా ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నా ఇన్నాళ్ళూ… ఏమనుకుందో ఏమో, మొన్న ఫిబ్రవరి, 28, మా పెళ్ళిరోజుకి నాక్కూడా ఓ  Smart Phone  కొనిపెట్టేసింది.. అది చేతికి వచ్చినప్పటినుంచీ, బయటకి వెళ్ళడం మానేశాను. ఏదో తెలుగు పేపరు తెచ్చుకోడానికైనా బయటకు వెళ్ళేవాడిని. కనీసం ఆ గంటా గంటన్నరసేపైనా, ఇంట్లో తన పనులు తను చేసికునేది. ఇప్పుడా అవకాశమే లేకుండాపోయింది..తనకు ప్రతీరోజూ ఉండే గంటన్నర ” మనశ్శాంతీ ” కొండెక్కేసింది.

అందుకే అంటారు ఏదైనా చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాలని. మనం చేసే పని పరిణామాలెలా ఉంటాయని. कुछ खोना पढ्ताहै..  అదండీ సంగతి… 

%d bloggers like this: