బాతాఖాని- లక్ష్మి ఫణి కబుర్లు– స్టేటస్ అప్ డేట్…

రోజులన్నీ హాయిగా వెళ్తే మాట్టాడుకోడానికీ, టపాలు రాసుకోడానికీ ఇంకేముంటుందీ? ఆ పైవాడు అన్నీ చూస్తూనే ఉంటాడు.. వీడికి ఏదో ఓ కాలక్షేపం ఉంటేనే కానీ, టైము గడవదూ అని ఆయనకీ తెలుసును. ఈరోజుల్లో ఎక్కడ చూసినా , చేతిఓ ఓ మొబైల్ లేకుండా ఎవరూ కనిపించరు. నేను ఉద్యోగంలో ఉన్న రోజుల్లో కాబోసు అంటే ఓ పదిహేనేళ్ళయింది. దేశంలో అప్పుడప్పుడే కొత్తగా మొబైల్ ఫోన్లు వచ్చాయి.. అప్పుడు మా అబ్బాయి, ఇంకా ఇంజనీరింగులో ఉన్నాడు. తనకి కొత్తగా ఓ బైక్కు కొనిపెట్టమంటే, వాయిదాల్లో ఓ బజాజ్ కాలిబర్ కొన్నాను.  తనకీ నాకూ ఓ ఒడంబడిక– ప్రతీరోజూ నన్ను ఫాక్టరీకి ఆ బైక్కుమీద దిగబెట్టేట్టు..  తను ఆ బైక్కుమీద జాగ్రత్తగా వెళ్ళాడో లేదో తెలిసికోడానికి, ఆరోజుల్లో కొత్తగా వచ్చిన  BPL  మొబైల్ ఒకటి కొనిచ్చాను. వాడు కాలేజీకి చేరగానే, వాళ్ళమ్మకి ల్యాండ్ లైన్ మీద ఓ ఫోను చేయాలి. ఏ కారణంచేతైనా ఆలశ్యంగా వస్తూంటే చెప్పాలి.  ఇదీ బాగానే ఉందనుకుని,  తను వారం లో కనీసం మూడురోజులు, ఆలశ్యంగా వస్తున్నట్టూ, తనతో ఇంకో ముగ్గురు స్నేహితులుకూడా వస్తూన్నట్టూ, వాళ్ళుకూడా మాతోనే భోజనం చేస్తారనీ, లాటి ఫోన్లొచ్చేవి. ఇలా మా ఇల్లు ఏ రోజూ కనీసం అయిదారుగురు  లేకుండా ఉండేది కాదు. అబ్బాయి ఎంబిఏ చదవడానికి గుర్గాం వెళ్ళేటప్పుడు, మాతో మాట్టాడ్డానికి వీలుగా ఉంటుందని ఆ ఫోను కాస్తా తనకిచ్చేశాము.   ఆ  Handset  మరీ రైల్వేవారి  Walkie Talkie  లా ఉందని, దాన్ని కాస్తా మార్చేశాడు. అరోజుల్లో ఫోన్లు అలాగే ఉండేవి నేనేం చేయనూ? ఇప్పుడంటే  Slim, cute  గా వస్తున్నాయి. అదీ మాఇంట్లో మొట్టమొదటి మొబైల్  కహానీ.. సాయంత్రాలు గుడికి వెళ్ళేవాళ్లం. ఓ రోజున గుళ్ళోంచి బయటకొస్తూంటే, ఎవరో ” హలో ” అన్నట్టనిపించింది. నన్నేమో అనుకుని,నేనూ హలో అన్నాను. తీరాచూస్తే, తను మొబైల్ లో ఎవరినో హలో అన్నాడు. మా  ఇంటావిడకి తల కొట్టేసినట్టయింది. ఇలా కాదని మర్నాడు బజారుకి తీసికెళ్ళి, ఓ Reliance  ఫోను కొనిపెట్టేసింది. నాకూ చూపించుకోడానికి బాగానే ఉండేది. ఆరోజుల్లో ఈ  Smartphonలూ అవీ ఉండేవి కాదుగా.. ఏదో సంసారపక్షంగా ఓ ఫోనూ. దానిమీద మీటలు నొక్కుకోడమూ.. మళ్ళీ sms  లు పంపడానికి తిప్పలు పడేవాడిని.. ఎలాగో తంటాలు పడి మొత్తానికి అలవాటు పడ్డాను. అదీ ఓ 15 సంవత్సరాలు, మధ్యలో రెండు మూడు సెట్లు మార్చినా, అన్నీ  Basic Hand setసే.    ఈలోపులో మార్కెట్ లోకి   Touch Screen  సెట్లు వచ్చినా, మా అబ్బాయి ఉద్యోగంలో చేరాక, నన్ను ఓ కొత్తది తీసికోమన్నా,  ఆ అలవాటైన సెట్లే తీసికునేవాడిని. ఆ  Touch Screen  సెట్లలో ఎలా జరపాలో తెలిసేది కాదు. ఎవరిదైనా ఫోనొచ్చినా, నేను జరిపి.. జరిపి తెరిచేలోపులో ఆ ఫోను కాస్తా కట్ అయ్యేది. అయినా హాయిగా వేళ్ళతో నొక్కుకోక, ఈ జరపడాలూ అవీ ఏమిటో… అంతా గందరగోళం.

 కాలక్రమేణా, ఎక్కడ చూసినా  Tablets, Smart phone  లే. అయినా Sincere  గా నేనూ, నా నొక్కబడే ఫోనూ మిగిలాము. మా పిల్లలూ, మా ఇంటావిడలతో సహా అందరిచేతుల్లోనూ అవే. ఎంత చెట్టుకంతగాలీ అనేసికుని కాలక్షేపం అయిపోతోంది. నా ఫోన్ ఏదో  Minimum  వాటికి తప్ప ఎందుకూ ఉపయోగించదు. టాక్సీ బుకింగు నుండి ప్రతీదీ , మా ఇంటావిడ ఫోనులోంచే. ఇదేమీ బాగాలేదనుకుందో ఏమో కానీ, ఈమధ్యన జరిగిన  Updating Abhiyaan  లో, కొత్త టీవీతో పాటు నాక్కూడా, ఓ  Smart Phone  కొనిపెట్టింది.Cannon 2 017

అందులో ఆ ఫొటో ఏమిటంటారా… మనవైపు టాక్సీలకీ , ఆటోలకీ వెనక్కాల రాస్తూంటారు..  “State Bank వారి  సౌజన్యంతో”  – అని   అలా అన్నమాట. ఏంతైనా తనే కదా కొనిపెట్టి, నన్ను  Update  చేసి Facelift  ఇచ్చిందీ…

ఇప్పుడు ఎందుకివన్నీ అని ఏదో మొహమ్మాటానికి అన్నాననుకోండి. అన్నిసార్లంటే మళ్ళీ తిరిగెక్కడతీసేసికుంటుందేమో అని భయం. గుర్తుందా  చిన్నప్పుడు కొత్తగా ఏ బూట్లైనా,కొంటే, ఎప్పుడుపడితే అప్పుడే అవేసికుని బయటకెళ్ళడం. కొత్తగా ఏ రేడియో ఐనా కొంటే, పొద్దుణ్ణించి రాత్రి ప్రసారాలాగేదాకా దానెదురుగుండానే కూర్చోడం.  ఈరోజుల్లోలాగ 24×7  కాదు ఆరోజుల్లో.  రాత్రి పదిన్నరకల్లా ఆపేసేవారు. అమ్మో, నాన్నగారో చివాట్లు పెట్టేదాకా అదే రంధి.. మరి ఇన్నాళ్ళకి, నాకూ అంటూ ఓ కొత్త Toy  దొరికిందికదా, నేనేం తక్కువ తిన్నానూ? ప్రస్థుతం ఆ రంధిలోనే ఉన్నాను..

నేను ఇన్ని సంవత్సరాలనుండీ ఎంతో అభిమానం తో సేకరించిన పాత  Handsets  అన్నీ బావురుమంటూ , అల్మారాలోకి వెళ్ళిపోయాయి…Cropped HS

%d bloggers like this: