బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు

ఈ సమాజంలో జీవిస్తున్నాము కాబట్టి. ఈ సమాజ పౌరుడిగా, కొన్ని బాధ్యతలు (వాటినే  Social Obligations  అంటారనుకుంటా) ఉంటూనే ఉంటాయి.. అప్పుడప్పుడు స్నేహితులకి ఫోను చేసి క్షేమసమాచారాలు విచారించడం, ఎవరికైనా ఒంట్లో బాగోలేదని విన్నప్పుడు ఓసారి వెళ్ళి పలకరించడం, అనుకోకుండా ఏ బంధువులో, తెలిసినవారో మనింటికి వచ్చినప్పుడు అతిథి మర్యాదలు చేయడం, లాటివన్నమాట…

 ఈమధ్యన మాకు తెలిసినవారొకరు, వాళ్ళ అబ్బాయి గృహప్రవేశానికి , సత్యనారాయణ పూజ, భోజనానికీ పిలిచారు..  మనవైపు నుంచి పురోహితుడిని తెచ్చుకున్నారు..  వ్రతం టైముకి చేరాము. చేతిలో అక్షింతలు  ఇచ్చి కథ మొదలెట్టారు ఆయన.. ఇన్ని సంవత్సరాలనుండీ వింటున్న, వర్తకుడు, వాళ్ళమ్మాయి కళావతి దాకా ఎప్పుడూ వింటూన్నదే. కానీ ఆ తరువాత ఇంకో కథ- శ్రీరాముడు, రావణాసురుడిమీదకు యుధ్ధం చేసే ముందు కూడా, ఆ వ్రతం చేశారుట. అదేదో మొదటిసారిగా వినడం చేత, ఆయన్నే అడిగేస్తే సరీ అనుకుని. ” గురువుగారూ ఈ మధ్య సిలబస్  లో ఏమైనా మార్పులు చేశారా ఏమిటీ, ఈ కథ ఎప్పుడూ విన్నట్టు లేదే..” అంటే, ఆయన చెప్పారు.. మొత్తం 18 కథలు ఉన్నాయిట, వినేవారిని బట్టీ, సమయాన్ని బట్టీ చెప్తూ ఉంటారుట.. శుభం.

 తెలుగునాట హోలీ రంగులేసికోవడం, పౌర్ణమినాడే చేసుకున్నారు. కానీ, ఇక్కడేమిటీ, దేశంలోని చాలా ప్రాంతాల్లో, పౌర్ణమి రోజు సాయంత్రం హోలీమంటా, పూజా చేసికుని, మర్నాడంతా రంగులు జల్లుకుంటారు. ఆ సందర్భంలో, ఉదయపు పూట కొట్లన్నీ మూసేసి, మధ్యాన్నం తెరిచారు.. ఇంట్లో ఓ పండైనా లేదూ అనుకుని సాయంత్రం కొనడానికి బయలుదేరి దగ్గరలో ఉండే కొట్టుకి వెళ్ళాను.. ఈలోపులో మా ఇంటావిడ తన స్నానం, పూజా పూర్తిచేసికోవచ్చూ అనుకుని.  మాఅబ్బాయీ పిల్లలూ ముంబై వెళ్ళడంతో, ఇంక ఆరోజుకి వాళ్ళు రారని సావకాశంగా చేసికోవచ్చనుకుంది. మా సందు చివర కొట్టుకి వెళ్ళాను. ఇంతలో ఓ ఫోనూ.. మీ ఇంటికి దారేదండీ అంటూ. ఆయనకి గుర్తులు చెప్తూ ,నేనిక్కడే రోడ్డుమీదే ఉన్నానండీ అని చెప్పి, వారు కారులో రాగానే, నేనుకూడా అందులోనే కూర్చున్నాను. మొట్టమొదట చేసిన పనేమిటంటే, ఇంట్లోకి వెళ్ళేలోపుగానే మా ఇంటావిడకి ఫోను చేశాను… ఇలా అతిథులు మీ చుట్టాలొస్తున్నారూ అని. అదేమిటండీ చెప్పనేలేదూ.. ఎప్పుడూ.. అంది. లిఫ్టులోకి వచ్చేశాము.. నాతోనే ఉన్నారూ అన్నాను.  అలా చెప్పేటప్పటికి  ” పోకిరి ” సినిమాలో, ప్రకాశ్ రాజ్ కి  ఆశిష్ విద్యార్ది  ఫోనుచేయగానే అడుగుతాడు… అసలెవరు తీసికొచ్చారురా … అని. ” నేనే తీసికొచ్చానూ.. అంటాడు. సరీగ్గా అవే గుర్తుకొచ్చాయి.అలాగని వీళ్ళేమీ నాకు తుపాకీ గురిపెట్టలేదనుకోండి. అప్పుడప్పుడు ఇలాక్కూడా జరుగుతూంటాయి.. ఓ రెండు గంటలు కూర్చుని వెళ్ళారు.  అందుకేనేమో అంటారు.. నగరాల్లో ఎవరింటికైనా వెళ్ళాలంటే, ముందు ఓ ఫోను చేసి రావడం ఆనవాయితీ అని. కానీ, పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారూ.. ఎలాగా దగ్గరలోనే ఉన్నారుకదా అని సడెన్ గా గుర్తొస్తాం. ఇలాటివన్నీ  occupational hazards  అంటారనుకుంటా. ఇలా ఫోన్లు చేసి వెళ్ళడం వలన ఇంకో సదుపాయం కూడా ఉంది. అతిథులు వచ్చేసరికి, ఇంట్లో అన్నీ ఎక్కడివక్కడ సద్దేయొచ్చు, వాళ్ళు కూడా తీరుబడిగా అలంకరణలు, గట్రా చేసికోవచ్చు. బయట పడక్కర్లేదు.. మాకలాటి గొడవలు లేవనుకోండి, ఇరవైనాలుగ్గంటలూ, మా ఇంటావిడ ఏదో ఒకటి సద్దుతూనే ఉంటుంది. చెప్పకుండా వచ్చినా, చెప్పి వచ్చినా పెద్ద తేడా ఏమీ లేదు. అప్పుడప్పుడు నాకే చురకలేస్తూంటుంది– అప్పుడెప్పుడో తెచ్చిన చీరలూ, బ్లౌజుపీసులూ అవీ అయిపోయాయి, మళ్ళీ తెచ్చి పెట్టండి అంటూ.. జీహుజూర్ అంటూ తలూపడం. మళ్ళీ ఇంకోరెవరో వచ్చి వెళ్ళేదాకా, గుర్తుకురాకపోవడం…

 

 

 

%d bloggers like this: