బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– జ్ఞాపకాలు …జ్ఞాపకాల గానే ఉంటేనే బాగుంటుంది..


    చాలామంది, పుట్టి, పెరిగిన ఊరు వదిలి, ఉద్యోగరీత్యానో, ఇంకో కారణం చేతనో, వేరే పట్టణానికో, నగరానికో, రాష్ట్రానికో, దేశానికో వెళ్ళి స్థిరపడిన తరువాత, ఓ వయసు వచ్చిన సమయంలో, అదేదో nostalgia పేరు చెప్పి, ఓసారి మనం పుట్టిన ఊరువెళ్ళి చూసొస్తే బాగుండునూ అనే ఓఅర్ధరహితమైన భావన వస్తూంటుంది. అర్ధరహితం అని ఎందుకన్నానంటే, ఎప్పుడో పుట్టిపెరిగిన ఊళ్ళో, ఇన్ని సంవత్సరాల తరువాత చూసేందుకేమీ ఉండదు. ఎక్కడ చూసినా మార్పే. అరే ఇక్కడ “ఫలానా వారిల్లుండేదీ.. పిన్నిగారు ఎప్పుడు వెళ్ళినా పటిక బెల్లం పెట్టేవారూ, వాళ్ళ ఇంటరుగుమీద హాయిగా ఆడుకునే వారమూ..”, ఇక్కడ ఓ పెద్ద కొబ్బరి తోటుండేదీ, మా ఇల్లు ఇక్కడే కదూ ఉండేదీ..ఇంటికి పెద్ద కాంపౌండూ, వెనకాల పెద్ద పెరడూ..10-15 గదులూ, పెరట్లో నుయ్యీ.. అక్కడే కదూ తువ్వాలు కట్టుకుని స్నానం చేసేవాడినీ…( ఆరోజుల్లో ఆడవారికి మాత్రమే స్నానం గదులు ). నూతిగట్టు పక్కనే ఓ పొయ్యీ దానిమీద ఓ “డేగిసా” తో వేణ్ణీళ్ళు కాచుకోడమూ, తెల్లారేసరికి అమ్మ, పెరట్లో తులసికోట దగ్గర ప్రదక్షిణాలు చేయడమూ, అన్నిటిలోనూ ముఖ్యం పెరట్లో ఓ రుబ్బురోలూ, పండగల్లో అమ్మ గారెలకోసం మినపప్పు రుబ్బడం, పచ్చళ్ళు వంటగదిలో ఉన్న బుల్లి రుబ్బురోలులో.ఇంట్లోనే ధాన్యం పోసుకోడానికి ఓ గాదె…. ఇలా సినిమా రీలులాగ యాభై ఏళ్ళ క్రితం పాత గుర్తులన్నీ తిరుగుతాయి. కానీ, యదార్ధానికి ప్రస్తుతం అక్కడ ఉన్నదేమిటీ– ఓ కార్పొరేట్ స్కూలూ, దానికో సెక్యూరిటీ వాడూనూ. ఏదో వాడి కాళ్ళావేళ్ళా పడి, ఓసారి లోపలకి వెళ్ళి చూసొస్తామని వెళ్ళడం. మనకి కనిపించేది ఏమిటీ, ఉత్త ప్రహారీ గోడ. ఆ ప్రహారీ గోడమీదే, సుద్ద ముక్కతో నాలుగు నిలువు గీతలు గీసికుని, వాటినే వికెట్లనుకుని, చక్క బ్యాట్టు, టెన్నిస్ బాలుతో క్రికెట్ ఆడిన రోజులు గుర్తొచ్చి, ఎమోషనల్ అయిపోవడం. అదృష్టమేమిటంటే, ఆరోజుల్లో నాతో క్రికెట్ ఆడిన నా కజిన్ కూడా నాతో ఉండడం. ఇద్దరం కలిసి, ఆ మిగిలిన ప్రహారీ గోడ మీద ఆప్యాయంగా చెయ్యి వేసి ఫొటో తీసికోడం !Trip 097 Trip 098

..Trip 095

అదే వీధిలో, మా అమ్మమ్మ గారి ఇంటికి ఎదురుగా, రామాలయం దగ్గర ఒక ఇల్లుండేది. అక్కడ రేమెళ్ళ శేషమ్మ్మ గారని ఒక పండు ముత్తైదువ, ఒంటి నిండా నగలు పెట్టుకుని, మహలక్ష్మి లా ఉండేవారు. ఎప్పుడైనా అమలాపురం భూపయ్య అగ్రహారం అంటే, ఆవిడే గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడో.. శిథిలమైపోయిన ఆ ఇల్లు చూసేటప్పటికి గుండె నీరైపోయిందిTrip 091

ఆనాటి జ్ఞాపకాల లో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నది ఏమైనా ఉందీ అంటే, రామాలయం. ఆరోజుల్లో ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. శ్రీరామనవమికి పానకాలూ, తాటాకు విసినకర్రలూ గుర్తుచేసికుని ఓ సారి సంతోషించాను.Trip 092

అక్కడనుండి బోడసకుర్రు గోదావరి మీద వేసిన కొత్త వంతెన మీదుగా, పాశర్లపూడి వెళ్ళి, మా స్నేహితుడిని కలవడానికి వెళ్తే, అక్కడ చూసిందేమిటీ, ఓ అరడజను 10 లీటర్ల మినరల్ వాటర్ సీసాలు. కోనసీమ అంటేనే, నీరు అమృతంలా ఉండేది. అలాటిది త్రాగడానికి మంచినీరు లేక, అదీ గోదావరికి 2 కిలోమీటర్ల దూరంలో, మినరల్ వాటర్ వాడాల్సిన దౌర్భాగ్యం !. మళ్ళీ జీవితంలో తిరిగి రాకూడదనుకుని , వస్తే ఇంకా ఎన్నెన్ని భయానక దృశ్యాలు చూడాల్సొస్తుందో అని భయం వేసింది.

కానీ ఇంత బాధలోనూ ఊరట కలిగించిన దృశ్యం అలనాటి గుర్రబ్బండి…Trip 044

అందుకే పుట్టిపెరిగిన ఊరికి వెళ్ళి, ఏదో ఉధ్ధరించేయడంకంటే చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుండెల్లో పదిలంగా దాచుకోవడమే ఉత్తమం..

Advertisements

5 Responses

 1. పాతనీరు వెళ్ళిపోయి కొత్త నీటికి చోటిచ్చినట్టు మార్పు ఎక్కడైనా సహజమే అయినా, శేషమ్మగారి పాత ఇల్లు, మీరు వికెట్లు గీసుకొన్న గోడ చూసి మాకే అయ్యో అనిపించింది. ఇక మీకెంత బాధ అనిపించిందో! మంచి టపా ఫణిబాబు గారూ.

  Like

 2. వర్మ గారూ,

  నిజంగా చాలా బాధేసిందండి.. మీ స్పందనకు ధన్యవాదాలు…

  Like

 3. ఎక్కడో చదివాను ఫణి బాబు గారూ.నోస్టాల్జియా ఒక నెగెటివ్ ఆలోచన అని. ఇలా పాత పాత జ్ఞాపకాలు తెచ్చుకుని చాలా బాధపడి బాధపడి ఒక నిర్ణయానికి వచ్చాను అలా వెళ్ళి ఆ పాత జ్ఞాపకాలను రేకెత్తించే ఏవీ చూడ కూడదని. కాని మనసు ఊరుకుంటుందా! ఊరుకోదు, అదే కష్టం. జ్ఞాపకాలు వయసు వచ్చేకొద్దీ బాధించేవిగానే ఉంటాయి అనిపిస్తున్నది. ఆ జ్ఞాపకాల బాధన పడకుండా ఉండే మార్గం రకరకాల వ్యాపకాలే అని నా ఆలోచన.

  Like

 4. మార్పు ఎంత సహజమైనా బాధాకరమే

  Like

 5. శివరామప్రసాద్ గారూ,,

  ” కాని మనసు ఊరుకుంటుందా! ఊరుకోదు, అదే కష్టం.” thats the bottom line. మీరన్నట్టు ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటేనే బాగుంటుంది.

  డాక్టరు గారూ,

  నిజమే.. బాధాకరమే.. కానీ ఎక్కడో గుచ్చుకుంటుంది..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: