బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– -अच्छा लगता है….

    ఈ టపా శీర్షిక చూసి కంగారు పడకండి. ఎప్పుడైనా, ఎక్కడైనా , మనసుకి సంతోషం కలిగించేది ఏదైనా జరిగితే, feel good అనుకోవచ్చు, లేదా రాష్ట్రీయభాషలో చెప్పాలంటే –अच्छा लगता है… అనుకోవచ్చు. అలాటిది ఏదో లాటరీలో ప్రైజే కానఖ్ఖర్లేదు. అనుకోకుండా, మనం అడక్కుండా సహాయం పొందినప్పుడు, ” అరే ..వీరేమిటి, మనకి సహాయం చేస్తున్నారూ.. మనం ఎప్పుడూ వీరిని కలవలేదు కూడానూ, పరిచయం కూడా లేదాయే, అసలు మనకి సహాయం చేయాలని, వీరికెందుకు అనిపించిందో.. అని మధన పడిపోతాము. కానీ, మనసులో మాత్రం –अच्छा लगता है…..

   అలాటి సందర్భాలు, మాకు ఈమధ్యన చేసిన ప్రయాణాల్లో ఓ నాలుగైదైనా కలిగుంటాయి. ఉన్నది మేమిద్దరమే అయినా, ప్రయాణం అంటే, కనీసం రెండు సూట్ కేసులూ , ఇంకో బ్యాగ్గూ, వీటికి తోడు భుజానికి తగిలించుకునే ఓ బ్యాగ్గూ.. వెరసి నాలుగు శాల్తీలు. ఎంత ” చక్రాలు” ఉన్న సూట్ కేసులైనా, టాక్సీలోంచి, స్టేషను లోపలదాకా , ఎలాగోలాగ లాక్కొచ్చినా, ఎక్కడో అక్కడ వాటిని ఎత్తి మోయాల్సొస్తుంది..మనమా అర్భకులం, సూట్ కేసులా పీకలదాకా కుక్కబడ్డాయి, దానికి సాయం సూట్ కేసు బరువోటీ… అంతంత బరువులు ఎత్తిమోసే ఓపిక మాటెలా ఉన్నా, ఏ నడుమో, భుజమో బెణికిందంటే గోవిందో..గోవింద.. నాంపల్లి లో దిగి, సికిందరాబాద్ స్టేషన్ కి , లోకల్ కాకుండా, ఇంకో ట్రైనేదో ఎక్కాము. మేమిద్దరమూ ప్లాట్ఫారం మీద దిగగానే, ఓ అబ్బాయి, మా సామాన్లు కిందకు దింపడంతో మొట్టమొదటి feel good ప్రస్థానం ప్రారంభం. మేము వెళ్ళాల్సిన ట్రైను 10 వ నెంబరు ప్లాట్ఫారం మీదకొస్తుందిట. ఇంతలో క్యాంటీనులో కాఫీ తాగుతూ, ఎవరో ఇద్దరు పెద్దమనుషులతో పరిచయం చేసికున్నాను. నా అలవాటు ప్రకారం కబుర్లు చెప్పడమన్నమాట ! మాటల్లో తెలిసిందేమిటంటే వారిలో ఒకరి నాన్నగారిది కోనసీమా, అమ్మగారిది తణుకూ..భలేగా ఉందీ, మాకాంబినేషను కూడా ఇదేనండీ అంటూ కబుర్లు చెప్పాను.. మా సామాన్లు పట్టుకుని, 10 వ నెంబరుకి ఎలా వెళ్ళడమా అని ఆలోచిస్తూంటే ( ఎస్కలేటర్ ఉందనుకోండి, కానీ ఇదివరకు ఒకసారి జరిగిన సంఘటన మూలంగా, నేను ఎక్కను.), పాపం వారిద్దరూ సహాయం చేశారు..

   ఇంక తిరుపతి యాత్రలో నాలుగురోజులూ, మేమిద్దరమూ, ఓ కారూ. ప్రతీ చోటా డ్రైవరు కారు ఎక్కడో పార్కు చేయడమూ, మా ఫోన్లు కారులోనే పెట్టడంతో, ఎవరో ఒకరి సహాయం తీసికుని అతన్ని ఫోనులో పిలవడమూ. కనీసం నలుగురు అపరిచితులు సహాయం చేశారు. నాలుగో రోజు రాత్రి 11 గంటలకి రాజమండ్రీ చేరాము. మళ్ళీ ఇక్కడా అదే –ట్రైను రెండో ప్లాట్ఫారం మీదా, మేమూ, మా లగేజీతో మొదటి ప్లాట్ఫారానికి వెళ్ళడానికి, పాపం అతనెవరో మా అవస్థ చూడలేక, ఎస్కలేటరు ద్వారా మా సామాన్లు పంపారు.

    నేనూ, మా కజినూ రాజమండ్రీలో, మేము అక్కడ ఉండే రోజుల్లో ప్రతీరోజూ దర్శనం చేసికునే దేవాలయాలకి వెళ్ళాము. వెళ్ళిన ప్రతీ గుడిలోనూ ఉండే పూజారులు నన్ను దూరంనుండే గుర్తించి, పలకరించి, గోత్రనామాలతో పూజ చేయడం. అదీ నాలుగు సంవత్సరాల తరువాత…ఎంత సంతోషమనిపించిందో… వీటన్నిటికీ కొసమెరుపేమిటయ్యా అంటే, 25 న మా ట్రైను అర్ధరాత్రి 2 గంటలకి. అంతరాత్రివేళ ఆటోలు దొరకవని, పన్నెండున్నరకే స్టేషనుకి వచ్చేశాము. ట్రైను ఒకటిలోకే వస్తుందని నిర్ధారించుకున్న తరువాత, అక్కడే వెయిటింగు రూమ్ములో కూర్చున్నాము. ఆఖరి క్షణంలో రెండో ప్లాట్ఫారం అన్నారు. మళ్ళీ మొదలూ- ఉరకలూ పరుగులూ. ఒక్క కూలీ ఉండడు అంతరాత్రివేళ.. మళ్ళీ ఎక్కణ్ణుంచి వచ్చారో ఇద్దరు అబ్బాయిలు, మా సామాను తీసేసికుని, రెండో నెంబరు ప్లాట్ఫారం మీద పెట్టేసి, మేము థాంక్స్ చెప్పుదామని చూసేసరికి మాయం అయిపోయారు. మా ప్రయాణం లో ఎక్కడా శ్రమ పడకూడదనే, ఆ భగవంతుడు, దేవదూతలని పంపీంచేడా అనిపించింది.. ఎక్కడా, కాలు కింద పెట్టనవసరంలేకుండా జరిగింది మా యాత్ర…

   అన్నిటిలోకీ ముఖ్యం శ్రీ కాళహస్తీశ్వరుడి దర్శనం. ఎక్కడచూసినా క్యూలే. ఎవరో చెప్పగా, మేము 200 రూపాయల టిక్కెట్లు తీసికున్నాము. ఆ టిక్కెట్లు చేతిలో, కనిపించేటట్టుగా పెట్టుకుని, తిన్నగా దర్శనానికి వెళ్ళిపొమ్మన్నారు. అదే చిత్రమో కానీ, మా చేతిలో టిక్కెట్టు చూడడం, క్యూ ఆపేసి, మాకోసం గేటు తెరవడమూ, క్షణంలో మూలవిరాట్టుకి ఎదురుగా ఉన్నాము. అలాగే అమ్మవారి దర్శనమూనూ. తిరుమలలోనూ అలాటి అనుభవమే. 300 రూపాయల టిక్కెట్టు రెండు కాపీల బదులు, ఒకటే ఉంది. ఫొటోకాపీ తెమ్మన్నారు. రాకరాక పదేళ్ళ తరువాత వచ్చామూ, దర్శనం అవదేమో, అని భయపడ్డంతసేపు పట్టలేదు, ఎవరో ఓ అబ్బాయి సహాయం చేశాడు.

   మరి అడుగడుగునా ఇలాటి అనుభవాలు జరిగినప్పుడు अच्छा लगता है… కాక ఏమంటారు మరి ?