బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Comfort level


   ఒకానొకప్పుడు అంటే 40-50 సంవత్సరాల క్రితం, ఎక్కడికైనా , ఏ తెల్లవారుఝామునే ప్రయాణం పెట్టుకుంటే, ఆ ముందురోజే, ఏదో మనకి వాడికలో ఉన్న, ఏ ఒంటెద్దు బండివాడికో చెప్పుంచేవారు. కాల క్రమేణా, ఈ ఒంటెద్దు బళ్ళు వెళ్ళిపోయి, గుర్రబ్బళ్ళూ, లాగే రిక్షాలూ వచ్చాయి.అవీ వెళ్ళిపోయి, సైకిల్ రిక్షాలొచ్చాయి. కాలక్రమేణా అవీ, కాలగర్భంలో కలిసిపోయి, ఆటోరిక్షాలు వచ్చాయి. వీటికి కూడా “కాలదోషం ” పట్టేటట్టు కనిపిస్తోంది.ఈ మధ్యన పెద్ద పెద్ద నగరాల్లో ఎన్నో కంపెనీల వాళ్ళు call cabs మొదలెట్టారు. పైగా, వీటి apps మొబైల్ లో పెట్టేసికుంటే, క్షణాల్లో క్యాబ్ రెడీగా ఉండడంతో, అర్జెంటుగా వెళ్ళాల్సిన వారికి ఇది చాలా సదుపాయంగా ఉంది.

ఆ మధ్యన ఇలాటి క్యాబ్ లో వెళ్తూ, డిల్లీ లో ఒక మహిళ మీద అత్యాచారం జరగడంతో, ప్రభుత్వం వారు , వెంటనే ఆ కంపెనీ, దానితోపాటు ఇంకో కంపెనీ క్యాబ్బులమీదా , ban పెట్టేశారు. మన నాయకులూ, వగైరాలందరూ, ” ఆహా..ఓహో..” అనేసికున్నారు. మహిళ మీద అత్యాచారం జరగడం, చాలా విచారకరమే, ఎవరికైనా ఎప్పుడైనా జరగొచ్చు. కానీ, ఆ సమస్యకి పరిష్కారం, ఎడా పెడా ప్రజలకి సౌకర్యంగా ఉన్న సర్వీసులని బ్యాన్ చేయడం కంటే, ఆ కంపెనీ వాళ్ళు, డ్రైవర్లని recruit చేసే పధ్ధతిలో, ఇంకొన్ని conditions పెట్టుంటే బాగుండేదేమో.ఆ కంపెనీ వాళ్ళు, డ్రైవర్ల పూర్వాపరాలు పూర్తిగా తెలిసికోకుండా ఉండడం వలన ఇలాటి పరిస్థితి వచ్చిందీ, అలాటి వాళ్ళను తప్పిస్తే నష్టం ఏమిటీ, అనేవాళ్ళు ఉన్నారు. మరి అత్యాచారాలు ఆటోల్లో జరగడంలేదా, అంటే సమాధానం ఎవడూ చెప్పడు. అప్పుడెప్పుడో డిల్లీలో ఓ బస్సులో ఒక అమ్మాయిమీద అత్యాచారం చేసి,హత్య చేసినందుకు, అదేదో ” నిర్భయ్” చట్టాన్ని చేశారు. ఆ సంఘటనలో పాలుపంచుకున్న దోషులకి ” మరణ శిక్ష” వేశారు, అదెంతవరకూ అమలు పరుస్తారో ఆ భగవంతుడికే తెలుసు. అలా బస్సులో అత్యాచారం జరిగిందని బస్సులన్నీ బ్యాన్ చేశారా? అప్పుడెప్పుడో షిరిడీ వెళ్తూన్న బస్సు లో మంటలొచ్చి, ఎంతోమంది ప్రాణాలు పోయాయి. వెంటనే, మొత్తం ట్రావెల్స్ వాళ్ళ బస్సులన్నిటికీ తూతూమంత్రంగా కొన్నిరోజులు ఆపేశారు. మళ్ళీ మామూలే. కారణం, దేశంలోని ఏరాష్ట్రంలోనైనా సరే, ఈ ట్రావెల్స్ బస్సులవాళ్ళు, ఎంతో “పలుకుబడి” కలిగిన రాజకీయనాయకులే. వాళ్ళ ముఖ్యోద్దేశ్యం డబ్బులు చేసికోడంకానీ, మనుషుల ప్రాణాలెవడు పట్టించుకుంటాడూ?

అయినా మన నాయకులకీ, మీడియా వారికీ ఇది అలవాటేకదా- ఏదైనా సంఘటన జరిగినప్పుడు, చిలవలూ పలవలూ చేసి, నానా హడావిడీ చేసేయడం, అక్కడకి వాళ్ళే దేశప్రజల సౌభాగ్యానికి పాటుపడుతూన్నట్టు చూపించుకోడం. చివరకి సాధారణ పౌరుడి గురించి పట్టించుకునే వాడు ఎవరయ్యా అంటే తనే . ఎవరో వస్తారూ ఏదో ఒరగబెడతారూ అనుకోవడం బుధ్ధితక్కువ. ఆ క్యాబ్బులవాళ్ళని ban చేయడం వలన ప్రభుత్వానికి ఏమైనా ఒరిగిందా అంటే “ఏమీ లేదు”. మహా అయితే, ఆ కంపెనీలవాళ్ళు మళ్ళీ వాళ్ళ సర్వీసులు మొదలెట్టడానికి, ఎవరి ” చెయ్యో ” తడపాలి. కానీ, ఆ సదుపాయం లేక, నష్టపడ్డవారు మాత్రం చాలామందే ఉన్నారు.

అయినా ground realties తెలిసికోకుండా కనపడ్డ ప్రతీదాన్నీ బ్యాన్ చేయడం , మన ప్రభుత్వాలకి ఓ సరదా ! ” మనకేమిటీ, ప్రభుత్వ వాహనాలున్నాయి.. దానికి సాయం convoy పేరుచెప్పి ఇంకో పది కార్లూ..ఇంక సామాన్య మానవుడంటారా, వాడి అవసరం ఇంకో అయిదేళ్ళదాకా ఎలాగూ ఉండదూ…”.అనే భావనే, తప్ప, పోనీ బస్సు సర్వీసులు బాగున్నాయా, ఆటోవాళ్ళు వాళ్ళిష్టమొచ్చినంత “వసూలు” ఆపుతారా, అని ఏమాత్రం ఆలోచించరు. మన Transport వ్యవస్థ దౌర్భాగ్యంగా ఉండడం మూలానే కదా, ఆర్ధిక స్తోమత ఉన్న వారు, ఈ క్యాబ్ సర్వీసులు ఉపయోగించుకుంటున్నారేమో అన్న ఆలోచన ఏ ఒక్క నాయకుడికీ కలగలేదు. ఓ ఆర్డరు మీద సంతకం చేసి, క్యాబ్ సర్వీసులు ban చేయడంతో, తమ పని అయిపోయిందనుకుంటారు. ఎవడు ఏ గంగలో దిగితే మనకెందుకూ అనుకోడం.

మిగిలిన నగరాల్లో పరిస్థితి గురించి నాకైతే తెలియదు. కానీ, పూణె లో పరిస్థితి గురించి చెప్పాలంటే, ఈ క్యాబ్బు సర్వీసులు వచ్చినప్పటినుండీ, సుఖాలకి అలవాటు పడ్డామంటే ఆశ్చర్యం లేదు. ఇదివరకు మేముండే చోటునుండి, మా ఇంటికి వెళ్ళాలంటే, ముందుగా మా సొసైటీనుండి, ఆటోలు దొరికే చోటుకి వెళ్ళాలంటే, ఓ అరకిలోమీటరు నడవాలి.రోడ్డు చివర ఉండే ఆటో స్టాండు వాడిని అడిగితే, 70 రూపాయలో మొదలెడతాడు. మీటరేమయిందిరా అంటే, ” పని చేయడం లేదు “…ఎప్పుడూ ఒకటే సమాధానం. మనకి తెలుసు, వాడడిగేది ఎక్కువా అని, కానీ చేసేదేమీ లేదు, పోనీ రోడ్డుమీదవెళ్ళే ఇంకో ఆటోని ఆపి అడుగుదామా, అంటే , వీళ్ళని చూసి వాళ్ళు ఆటో అసలు ఆపనే ఆపరాయె. ఫలితం, ఇంకో పావుకిలోమీటరు ఆపసోపాలు పడుతూ, నడవడం, అదృష్టం బాగుంటే, మీటరు మీదొచ్చేవాడు దొరికితే సరే సరి, లేకపోతే 50 రూపాయలకి బేరం కుదుర్చుకోడం. పైగా ఇందులో ఓ ” ego satisfaction ” ఒకటీ, మనం అనుకున్న రేటుకే కుదుర్చుకున్నామూ అని ! కానీ, దానికోసం ముప్పావు కిలోమీటరు నడిచామూ అనేది, మర్చిపోతాము !!

ఈ మధ్యన ఈ క్యాబ్బుల వాళ్ళు- OLA, TAXI FOR SURE, MERU.. లాటివి వచ్చిన తరువాత సుఖపడ్డామంటే నమ్మండి. అందులో Taxi for sure వాడి మినిమం 49 రూపాయలు. మిగిలిన వాళ్ళవి 99 రూపాయలు. మా ఇంటికీ, మేముండే ఇంటికీ దూరం 4 కిలోమీటర్లు. హాయిగా 49 రూపాయలతో పనైపోతోంది. అమ్మాయి ఇంటికి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు.ఓ ఎనభైరూపాయలతో పనైపోతోంది. ఇదివరకు వందలకి వందలు ధారపోసేవాళ్ళం. పైగా అడుగు కిందపెట్టకుండా, హాయిగా ఇంటిముందర ఎక్కి, గుమ్మంలో దిగడం. మన మ.రా.శ్రీ. ప్రభుత్వం వారు ఇలాటి సదుపాయం చేయగలరా? పైగా ప్రకటనలకి మాత్రం లోటుండదు. ఏ ఆటో వాడైనా ఎక్కువ వసూలు చేస్తే ఫలానా..ఫలానా.. నెంబరుకి ఫోను చేసి ఫిర్యాదు చేయండీ అంటూ. ఆ ఫోను ఛస్తే పనిచేయదు. పోనీ చేశామే అనుకోండి, ఆ ఆటోవాడు మర్నాడో. మూడోనాడో రోడ్డుమీద వెళ్తూంటే, ఏ బెడ్డో విసిరితే, మన గుండు పగిలితే మన rescue కి ఏ ప్రభుత్వం వస్తుందిట? పోనీ, అలా అంటే, ” మీలాటి అర్భకులవల్లే దేశం మట్టికొట్టుకుపోతోందీ, ఎవరో ఒకరు మొదలెట్టాలికదా..” అంటూ social media లో ప్రతీవాడూ ఏకేసేవాడే…ఎందుకొచ్చిన గొడవా.. హాయిగా ఇంటికి టాక్సీ పిలిపించుకోడంలో ఉన్న హాయే వేరూ….

Advertisements

2 Responses

  1. బాగుందండి 🙂

    Like

  2. వర్మగారూ,

    మీ స్పందనకు ధన్యవాదాలు. కూడలి లో నా టపా రావడంలేదు, ఈమధ్యన. వారికి నా టపాలు నచ్చడంలేదేమో మరి. చిత్రం ఏమిటంటే, వారి “లోగో” ను నా బ్లాగులో పెట్టడం !!
    ఇంకెందుకూ, దానిని తీసేస్తే పోలా ?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: