బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “పద్మ” ఎవార్డులు ఓ “వేళాకోళం” అయిపోయాయి….


    ఒకానొకప్పుడు గణతంత్ర దినోత్సవానికి ముందురోజు, కేంద్రప్రభుత్వం, దేశంలోని వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకి , పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఎవార్డులు ప్రకటించేవారు. సాధారణంగా, మర్నాటి వార్తాపత్రికల్లోనే చదివి తెలిసికునేవాళ్ళం. పేపరులో చదవగానే, ” ఓహో.. ఫలానావారికిచ్చేరన్నమాట..” అనుకునేవారం. ” భారతరత్న” అయితే, ప్రతీ ఏడాదీ కాకుండా, సంఘంలో ఎంతో ఘనత సాధించినవారికి, ఏ రెండేళ్ళకో, మూడేళ్ళకీ ప్రకటించేవారు. భారతరత్న బిరుదు కూడా, కనిపించిన ప్రతీవాడికీ ఇచ్చుకుంటూ పోలేదు. భారతరత్న బిరుదాంకితుల లిస్టు చూస్తేనే తెలుస్తుంది. కానీ, కొంతకాలానికి, రాజకీయ కారణాలతో ఇచ్చేవారు. అప్పటినుండీ మొదలయింది, అసలు ఈ రత్నాలు, విభూషణాలూ, భూషణాలూ, శ్రీ ల గొడవంతానూ. కేంద్రంలో ఏ రాజకీయపార్టీ ఉంటే, వారికి , ఏదో ” లాబీయింగు” ధర్మమమా అని వచ్చేయడం మొదలయింది.

    చివరకి ఎంత దౌర్భాగ్యానికి దిగిందంటే, ఎవరికి వారే, మాకు ఫలానా కావాలీ, ఫలానా దానికి మాకంటే అర్హులెవరూ అని కొట్టుకు చచ్చేటంత హీన స్థితికి చేరిపోయారు. ఆ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఆ మధ్యన, ఫలానా అతనికి భూషణం రికమెండు చేస్తే, నేను మాత్రం అర్హురాలిని కాదా అన్నారు. పైగా, అవేవో ప్రభుత్వోద్యోగాల్లో ప్రమోషన్ల లాగ. ఏదో ఒకసారి “శ్రీ” ఇస్తే, అయిదేళ్ళదాకా “భూషణాలు ” రావుట. వీళ్ళ గొడవ పడలేక, మొత్తానికి క్రీడా మంత్రిత్వ శాఖ వారు, ఇద్దరినీ, రికమెండు చేశారు. కానీ, రికమెండేషనుతో సరిపోదుగా, చివరకి ఇద్దరికీ రాలేదు. పీడా విరగడయింది. ఇంకొక సినిమాలకి సంబంధించినాయన, నా మిత్రుడు ( ఈయన గారి “జోడీ” లెండి) కి, భూషణం రాగా లేనిది, నాకు మాత్రం ఉఠ్ఠి “శ్రీ” యేనా అని వాపోయాడు.

   ఇంక మన మహారాజశ్రీ ప్రభుత్వం వారైతే ఎప్పుడో దివంగతులైన దేశ నాయకులందరికీ బిరుదులు ప్రదానం చేసేస్తున్నారు. ఏదో వీళ్ళెవరో “బిరుదు” ఇస్తారని , దేశానికి సేవ చేయాల్సిన గతి పట్టలేదు, వారికి. నిస్వార్ధ సేవ చేసి, దేశప్రజల నీరాంజనాలు అందుకున్న మహా మహులు వారందరూ. వీళ్ళేదో బిరుదులు ఇచ్చారని, వారి గొప్పతనం పెరగాలేదూ, ఇవ్వకపోతే తగ్గనూ తగ్గదూ. ప్రభుత్వ శైలి చూస్తూంటే, ఎప్పుడొ శ్రీరాముడికి, శ్రీకృష్ణుడికీ, భీష్మాచార్యులకీ కూడా భారతరత్న ఇచ్చినా ఆశ్చర్యపడనఖ్ఖర్లేదు. అప్పుడు మనంకూడా రామాయణం, మహాభారతం పక్కన పెట్టేయొచ్చు, ఎలాగూ బిరుదులు వచ్చేశాయిగా !

    ఇంక ఎడాపెడా ఈ బిరుదులు స్వీకరించిన ” మహామహులు”, అసలు వారి పేరుముందర వారికి వచ్చిన “బిరుదు” వాడకూడదూ అని ఓ నియమంకూడా ఉందిట. అదెప్పుడు తెలిసిందీ అంటే, ఆయనెవరో నటుడు పద్మశ్రీ..ఫలానా.. అని సినిమా టైటిల్స్ లో పెట్టుకుంటున్నాడని, ఓ “తలమాసినవాడు” (తనకి రాలేదని దుగ్ధ తో ) కోర్టుకెళ్తే, ఆ మ.రా.శ్రీ కోర్టువారు ఠాఠ్ .. పెట్టుకోకూడదూ అన్నప్పుడు. అయినా చాలామంది ఇంకా పేరుకి ముందర వాడుకుంటూనే ఉన్నారనుకోండి. ఇంకో పెద్దాయనైతే ” భారత రత్న” దారి దానిదే, నేనూ నా వ్యాపారప్రకటనలు మానుకుంటానా అని, ఈ బిరుదులు ఏమైనా తిండిపెడతాయా అంటాడు.

   ఏదో బిరుదులు వస్తేనే గొప్పవారైపోరు.ప్రజల అభిమానం సంపాదించాలి. అందుకు ఉదాహరణ, మన బాపూ గారే. అన్ని సంవత్సరాలపాటు, తెలుగువారందరి గుండెల్లోనూ ఓ స్థానం సంపాదించిన శ్రీ బాపు గారిని అసలు, ఏ తెలుగుప్రభుత్వమూ పట్టించుకోనేలేదాయె. చివరకి తమిళనాడు ప్రభుత్వం వారి దయతో ఓ ” పద్మశ్రీ” వచ్చింది. అదీ ఎప్పుడూ, వారి జంట శ్రీ ముళ్ళపూడి వారు దివంగతులైన తరువాత. అలాగని శ్రీ బాపూ గారు.. అరే ఇదేమిటీ నాకు “శ్రీ” తో సరిపెట్టేశారూ, “భూషణం” కదా రావాల్సిందీ.. అనుకుంటూ, కార్ట్యూన్లు వేశారా . ఏదో పేపర్లకి ప్రకటనలిచ్చేసి, హడావిడి ఏమైనా చేశారా? అబ్బే, అంత అనారోగ్యంతోనూ, నిరాడంబరంగా వెళ్ళి స్వీకరించారు, వారికి వ్యవస్థ మీద ఉన్న గౌరవంతో. అదీ నిజమైన గొప్పవారిలో ఉండే నిజమైన గొప్పతనం.ముళ్ళపూడి వారి ప్రతిభని ప్రభుత్వం గుర్తించకపోవడం వలన, ఆయనలోని “ఘనత” తగ్గిందా? అయ్యో బాపురమణ లకి జంటగా వచ్చుంటే బాగుండునని బాధ పడని తెలుగువాడు లేడు.

   ఈ సంవత్సరం బాబా రాందేవ్, శ్రీశ్రీ రవిశంకర్ గార్లు, వారికి తెలుసు, ఈ ప్రభుత్వ బిరుదులు స్వీకరించి, ఊరికే అల్లరి పడడం దేనికీ అనుకుని, ముందుగానే ప్రభుత్వానికి తెలియచేసేశారు, మమ్మల్ని ” ఇరుకు” లో పెట్టొద్దూ అని !

   ఈ బిరుదుల ప్రహసనం ఓ రెండుమూడేళ్ళపాటు ఆపేస్తేనే హాయేమో… మేరా భారత్ మహాన్…

Advertisements

2 Responses

  1. నా ఉద్దేశ్యంలో ఎలెక్షన్ కమీషన్ లాగ ఒక స్వతంత్ర సంస్థను ఏర్పరిచి ఈ ఎవార్డులకు ఎంపిక చెయ్యటం మొదలుపెడితే బాగుంటుదేమో.

    Like

  2. శివరామప్రసాద్ గారూ,

    స్వతంత్ర సంస్థలు ఎంత ” స్వతంత్రమైనవో ” చూస్తున్నాము కదా..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: