బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మొత్తానికి నన్ను floor చేసేసింది మా ఇంటావిడ…


    ఇన్నేళ్ళగా అంటే అక్షరాలా 40 సంవత్సరాల 3 నెలలుగా తట్టనిది ఈసారి ఎలా తట్టిందో కానీ, మొత్తానికి నన్ను పట్టేసింది.ప్రతీ ఏడాదీ వేశవి శలవల్లో ప్రతీ తెలుగువారి ఇంటా, క్రమం తప్పకుండా జరిగేదేమిటయ్యా అంటే “ఊరగాయలు” పెట్టడం. ఇదివరకటి రోజుల్లోలా కాకుండగా, ఇప్పుడు ప్రతీచోటా ఈ ఊరగాయలు దొరుకుతూనే ఉన్నాయి. ఏదో కొంతకాలం క్రితందాకా ఆ రామోజీ గారి “ప్రియా” పచ్చళ్ళే దిక్కు, కానీ కాలక్రమేణా చిన్న చిన్న గ్రామాల్లో కూడా, ఈ ఊరగాయల తయారీ ఓ cottage industry లా తయారైపోయింది. ఇదివరకటిలాగ ఆవాలూ, కారం, మెంతులూ, ఉప్పూ, నూనె అంటూ బజారుకెళ్ళి తెచ్చే ఓపికెక్కడుంటోంది ఇప్పుడూ? పోనీ అలాగని మిగిలినవాటిలాగ, ఏదో ఇంట్లో చేస్తే ఖర్చు తక్కువా అనడానికీ వీలులేదాయె. ఈమాత్రందానికి ఊరికే తాపత్రయాలెందుకూ, హాయిగా మార్కెట్ కి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చెసికుంటే గొడవొదిలిపోతుంది. పైగా వాటిల్లో వివిధ రకాలైన పచ్చళ్ళోటీ. అయినా అనుకుంటాం కానీ, ఈ రోజుల్లో ఇళ్ళల్లో ఊరగాయలు ఎవరికోసం పెట్టాలీ, ఈ కాలం పిల్లలు ప్రతీదానికీ so..much oil !! Oh my God.. అని నోరు వెళ్ళబెట్టేవాళ్ళే, ఆ తెరిచిన నోట్లో ఓ ఆవకాయ పెచ్చు పడేస్తే తెలుస్తుంది!!. పైగా కొత్తవకాయలో హాయిగా నెయ్యి వేసికుని తినే “మజా” వీళ్ళకెలా తెలుస్తుందీ? నెయ్యంటేనే ఆమడదూరం పారిపోతారు.. అదేమిటో fat పెరిగిపోతుందిట.కొలెస్ట్రోలో ఏదో పెరిగిపోతుందిట. ఇన్నేళ్ళూ మేమంతా ఈ ఊరగాయలూ, నేతులూ వాడకుండానే ఉన్నామా ఏమిటీ, చిత్రం కాపోతే. అసలు తినొద్దని ఏ డాక్టరూ చెప్పలేదు, కొద్దిగా మితంగా తినమంటారు. అయినా సరే ఈరోజుల్లో బర్గర్లకీ, పిజ్జాలకీ,సబ్ వే లకీ ఉండే విలువ ఆ ఆవకాయకి లేదు. ఏం చేస్తాం? అయినా “తెలుగు న్యూసు పేపరు” ఇంట్లో లేకపోతే ఎంతతలవంపో, అలా ఆవకాయ ఇంట్లోలేకపోతే అంత తలవంపు ఈరోజుల్లో. ఎందుకంటారా, ఈ రోజుల్లో నగరాల్లో పనిచేసే కుర్రకారుకి, తెలుగువారికంటే పరభాషా స్నేహితులే ఎక్కువాయె, ఎప్పుడో వాళ్ళని ఏ భోజనానికో పిలిచినప్పుడు వాడు अर्‍ऍ भाय आंध्रा पिकिल नही है क्या... అంటాడేమో అని భయం మరి.వాడుకూడా ఎక్కడో నెట్ లో చదివుంటాడు, ఆంధ్రావాళ్ళకి ఆవకాయ చాలా ప్రీతీ అని. అలా క్రమక్రమంగా ఈ “ఆవకాయ” మనకోసం కంటే బయటివాళ్ళకోసం ఓ status symbol గా తయారయింది. ఈనాటి పిల్లలంతా వాళ్ళ అమ్మలో, అమ్మమ్మలో పెట్టిన ఊరగాయలతోనే పెరిగారు. ఇప్పుడే ఈ సుకరాలన్నీనూ.

   ఇంత గొడవ జరుగుతున్నా ప్రపంచంలో మా ఇంటావిడ లాటి ప్రాణులు కొంతమందుంటూనే ఉంటారు. మాయదారి తాపత్రయాలూ, భవబంధాలూ అంటూ, ఊళ్ళోనే ఉండే కూతురికీ, కొడుక్కీ ప్రతీ ఏడాదీ క్రమం తప్పకుండగా ఈ ఊరగాయలు పెట్టడం, “వాహ్ మమ్మీ” అంటూ కూతురూ అల్లుడూ, “వహ్వా అమ్మా” అంటూ కొడుకూ డయలాగ్గులు చెప్పడం. కొడుకుతో పాటు కోడలనదా అనకండి, ఈ ఆంధ్రా కోడళ్ళకి ఆంధ్రదేశం నుంచి వాళ్ళ అమ్మలు తెచ్చే ఊరగాయలే నచ్చుతాయి.ఎంత చెప్పినా అమ్మ అమ్మే.. అత్త అత్తే…ఆతావేత తేలేదేమిటంటే, అబ్బాయికి ఇచ్చిన ఊరగాయ, ఏడాది పొడుగునా, మేము అక్కడకి వెళ్ళినప్పుడు వేసికోవడమే. పాపం మా నవ్య, అగస్థ్యలకి మాత్రం, నేను వెళ్ళేనంటే పండగే. నాతోపాటు నెయ్యేసికుని, ఆవకాయముద్ద తప్పకుండా తింటారు.

    అసలు విషయానికొస్తే, నా “ఆవకాయ” గొడవలు గత మూడేళ్ళనుండీ వ్రాస్తూనే ఉన్నాను, ప్రతీ ఏడాదీ ఎండాకాలం వచ్చిందంటే నా ప్రాణం మీదకొచ్చేది. ఇక్కడేమో, మా ఇంటావిడ specifications కి సరిపడే ఆవపిండీ, కారం దొరకవుట, ఆంధ్రదేశం నుంచి తెప్పించాలంటుంది.అప్పుడెప్పుడో మా రాజమండ్రీ కాపరంలో ఓ ఏడాది అక్కడపెట్టినప్పటినుంచీ, ఆ రుచే కావాలంటుంది. ఈ ఆవకాయకోసం ప్రతీసారీ ఆంధ్రదేశం వెళ్ళాల్సొస్తే ఈ ఆవకాయ “ఖర్చు” తడిపిమోపెడవుతుంది.అయినా ఎలాగోలాగ ఎవరిచేతో తెప్పించి మొత్తానికి ఆవపిండీ, కారం అక్కణ్ణుంచి తెప్పింఛేటట్టూ, మెంతులూ, ఉప్పూ, ఆయిలూ ఇక్కడ కొనేటట్టూ ఓ ఎగ్రీమెంటుకు వచ్చి, అలా కానిచ్చేస్తున్నాము.పాపం భాగ్యనగరంలో ఉండే మా వియ్యాలారికి ప్రతీ ఏటా ఇదో ఎగస్ట్రా పని. ఈ సారేమో ఈ నెలలో శ్రీవంశీ గారిని కలియడానికి కార్యక్రమం పెట్టుకున్నాగా, నన్ను ఆహ్వానించిన శ్రీ కృష్ణమోహన్ గారినే, సిగ్గు విడిచేసి అడిగేశాను, ” గురువుగారూ కొద్దిగా ఈ సహాయం చేసిపెడతారా ” అని. కొల్తలు చెప్పండీ అనేసి, ఏ ఎస్ బ్రాండు పప్పునూనె కూడా తెప్పించుంచుతానూ అనేయడంతో, హాయిగా ఒక్కరోజే కదా అని ఓ బ్యాగ్గుతో వెళ్ళేదానికి, ఓ సూట్ కేసు నాకంటగట్టింది మా ఇంటావిడ. మొత్తానికి ఆంధ్రదేశం నుంచి raw material తేవడంతో మొదటి అధ్యాయం ముగిసింది.

    మా ఇంటావిడ మామిడికాయల దగ్గరకొచ్చేటప్పటికి ఏమిటేమిటో “గిన్నెలూ, కొలతలూ” చెప్తుంది.పోనీ ఎన్ని కిలోలో చెప్పమంటే చెప్పదూ, పాతిక్కాయలంటుంది, ఒక్కోసారి పాతిక్కాయలంటే అయిదారు కిలోలూ కాకపోతే క్వింటాళ్ళూ అవుతాయి, మరీ బలవంతపెడితే నాలుగ్గిన్నెలంటుంది. ఏమిటో గోల! పోనీ తననే తీసికెళ్దామా అంటే తను రాదూ నామోషీట, ఏమిటో ఆ భగవంతుడిమీద భారం వేసేసి, నేనే traditional చివాట్లు తింటూ లాగించేస్తున్నాను. ఈసారి ఏమనుకుందో ఏమో పూర్తిగా రూట్టే మార్చేసింది. ఏవో కొలతలు వేసి, ఓ న్యూస్ పేపరుమీద ఆవపిండీ,ఉప్పూ, కారం వేసి, కిందపెట్టేసి నన్ను కలపమంది. పైగా పక్కన నుంచుని, “సరీగ్గా రెండు చేతులతో కలపమన్నానా..” అంటూ గొడవోటీ. నాలుగ్గిన్నెల ముక్కలూ విడిగా తీసి, ఆరారగా successful గా నాచేత కలపబడిన దాంట్లో వేయడం, కొద్దిగా నూనె చేర్చి మొత్తానికి సీసాలో వేయడం, ఈ కార్యక్రమం అంతా పూర్తయేసరికి గంటన్నరా పట్టింది. పట్టదూ మరీ, అక్కడెక్కడో ఆవకాయపిండి, ముక్కా సరీగ్గా కలవలేదూ, నూనె పట్టలేదూ అనడం, మళ్ళీ రెండుచేతులతోనూ కలపమనడం. ఓరి నాయనో ఇంత గొడవుందా ఈ ఆవకాయ పెట్టడానికీ అనిపించింది.

    పోనీ ఇంత శ్రమా పడ్డాడూ, ఓ కాఫీయో, చాయో ఇద్దామనుంటుందా, మధ్యలో తడి తగలకూడదుట. ఈ తడేమిటో కానీ, ఈ ఆవకాయ కలుపుతున్నంతసేపూ నా గొంతుకలో తడి మాత్రం ఆరిపోయింది.అన్నీ పూర్తయినతరువాత అంటుందీ..” ఈ ఏడాది ఆవకాయ ఏమైనా బూజు పట్టిందా, మీదే బాధ్యత..” అని బెదిరింపోటీ.

    నిన్న నెట్ లో ఇంకో బ్రహ్మాండమైన పుస్తకం దొరికింది. 1954 లో శ్రీ మునిమాణిక్యం నరసింహరావుగారు, భార్యాభర్తల సంబంధాల గురించి వ్రాసిన ఇల్లు-ఇల్లాలు.ఆ పుస్తకంలో వ్రాసినవన్నీ అక్షరసత్యాలు. ఇప్పటికే తెలుగువారు చాలా మంది చదివేసుండొచ్చు. ఇంకోసారి చదవండి. ఇంకా చదవనివారు ఓసారి చదివేస్తే తెలుస్తుంది అందులొని మజా. నేను పెట్టిన ఈ pdf తెరుచుకోడానికి టైము పడితే విసుక్కోకండి. ఆమాత్రం సహనం ఉండాలి, అలాటి “ఆణిముత్యం” చదవాలంటే..మొదటి అయిదారు పేజీలూ blank గా కనిపిస్తే ఖంగారుపడి పారిపోకండి. కనిపిస్తుంది మరి, ఎంతైనా పాతపుస్తకం కదా, కొద్దిగా టైము తీసికుంటుంది… Happy Reading...

11 Responses

  1. >ఈనాటి పిల్లలంతా వాళ్ళ అమ్మలో, అమ్మమ్మలో పెట్టిన ఊరగాయలతోనే పెరిగారు. ఇప్పుడే ఈ సూకరాలన్నీనూ.
    ఓహో ఈ‌సూకరాలు అనే మాటను మా ఆవిడే కాక మరికొంతమంది కూడా వాడతారని ఇప్పుడే అర్థమైంది!

    మా ఆవిడ నోటి యీ యెత్తిపొడుపుమాట పలుసార్లు వినీవినీ దీని భావం మహబాగా తెలిసింది కానీ ఈ మాట యెందుకు వచ్చింది చెప్మా అని తెగ ఆలోచించాక గాని తత్వం‌ బోధపడ లేదు. అయ్యా మీరంతా (మా ఆవిడతో సహా) “సుకరాలు” అనటానికి బదులుగా “సూకరాలు” అంటున్నారండీ. ఈ మాత్రానికేం‌ సమస్య అంటారా, “సూకరం” అంటే “పంది” మరియు, “సుకరం” అంటే “సదుపాయం, తేలిక పధ్దతి” అని అర్థం.

    మా ఆవిడకు చెప్పటం జరగలేదు. పెరటి చెట్టు మందుకు పనికిరాదుకదా అని తెలిసి. పోనీ లెండి, మీకు చెప్పాక కడుపుబ్బు తగ్గింది.

    మీ టపా చాలా బాగుంది. బాగా వ్రాస్తారు మీరు.
    పైగా మంచి మంచి పుస్తకాలకు లింకులు కూడా ఇస్తున్నారు. కందుకూరు వారి ఆత్మకథ download చేసి చదువుతున్నాను మధ్యాహ్నం నుండీ.

    Like

  2. భమిడి పాటి శ్రీమతి గారు దీనికి ఏమి కౌంటరు వేస్తారో చదవాలని ఉన్నది !!

    జిలేబి

    Like

  3. bagundadi mee avakai kaburlu. 25 yearsa back ma maradalu appanan palli lo chesichichi di eppantiki mrachipolesm aa ghatu.

    Like

  4. శ్యామలరావుగారూ,

    మీ స్పందనకి ధన్యవాదాలు. ఏదో వాడుక భాషలో అలవాటు పడి “సూకరాలు” అని వ్రాశాను. నిజం చెప్పాలంటే దాని అర్ధం కూడా మీరు చెప్పిన తరువాతే తెలిసింది. తప్పు దిద్దుకున్నాను. మీలాటివారు సంస్కరిస్తేనే కదా, మా తప్పులు తెలిసేది. మరోసారి ధన్యవాదాలు… ఎప్పుడో ధైర్యం చేసి మీ భార్యగారికి కూడా చెప్పేయండి.

    జిలేబీ,

    ప్రస్తుతం మునిమాణిక్యం వారి “ఇల్లు-ఇల్లాలు” చదువుతోంది. ఎప్పుడో ఆ చదవడంపూర్తయి అస్వాదించేక, వదులుతుందనుకోను….పైగా ఆ పుస్తకంలో ఆయన భర్తల ” రహస్యాలు” అన్నీ సవిస్తరంగా వ్రాసేసారు కూడానూ…

    రమణగారూ,

    ధన్యవాదాలు. అప్పటినుంచీ మళ్ళీ ఆవకాయే పెట్టుకోలేదా ఏమిటీ ?

    Like

    • శ్యామలరావు గారు, మీరు చెప్పిన ‘సుకరము ‘ ఇక్కడ వర్తించదండి. ఎవరయినా ‘మేము చెయ్యలేము బాబూ’ అని పని తప్పించుకోవాలని చూస్తే మన పెద్దవాళ్ళు ఈ మాట వాడుతారు. సుకుమారాలు పోతున్నావు అనటము వాడుకలో సూకరాలు పోతున్నావు అయి వుంటుంది అని నా అభిప్రాయము. కానీ దాని అర్థం మారి పోతున్నది అని వారికి తెలియకపోవచ్చు.

      Like

      • శుభగారూ, మీరు చెప్పినది చాలా సబబుగా ఉంది. బహుశః సుకుమారాలు పోవటం (సౌకుమార్యం నటించటం) అనటమే వాడుకలో భ్రష్టరూపం పోంది సుకుమారాలు కాస్తా సూకరాలు అవటానికి అవకాశం ఉంది.

        Like

  5. సూకరాలు : మాండలిక పదకోశము (ఆం.ప్ర. సాహిత్య అకాడమీ)
    •1. సుకుమారతలు.
    •2. విడూరములు. [గంజాము]

    http://andhrabharati.com/dictionary/index.php?w=%E0%B0%B8%E0%B1%82%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81

    (మనవి – మొదటవ్రాసినదాంట్లో చిన్నతప్పుదొర్లింది – దానిని ప్రచురించవద్దు)

    Like

  6. పటాలం ఉద్యోగంలో 34 ఏళ్ళ లో 22 బదిలీలు ,
    మొత్తం 20 రాష్రాలలో ఆవకాయ పెట్టుకున్న చరిత్ర మాది.
    ఎక్కడ ఏది సదుపాయమనిపిస్తే , అది దైర్యంగా వాడేసేవాళ్ళం,
    ఒక్కొక్క సారి ఒక్కొక్క క్రొత్త రుచి, “ఆవకాయ అది అందరిదీ” ,
    అని ఎప్పటినుంచో పాడే సుకుంటూ , హాయిగా దేశ సంచారం చేసాం.
    మా ఆవకాయ, మాగాయ జాడీలు చెక్కు చదరకుండా వేల మైళ్ళు తిరిగాయి.
    ఆవకాయ స్మృతులు తాజా చేసినందుకు ధన్యవాదాలు

    Like

  7. శేషుగారూ,శుభ గారూ

    మీరు ఎంతో శ్రమ తీసికుని “సు(సూ) కరాలు” పదంలోని లోటుపాట్లు తెలియచేసినందుకు ధన్యవాదాలు…

    డాక్టరుగారూ,

    అదే కదా సార్ ” ఆవకాయ” లో ఉండే మజా మరి !!

    Like

  8. మా ఆవకాయ పెట్టుకోడం ఒక పరిశ్రమ. దొడ్లో చెట్టుకాయలు కోయడం నుంచి, కారం ఆడించుకొచ్చి, నూనె తెచ్చి ఇచ్చేదాకానే నా బాధ్యత, ఆ తరవాత పని ఆవిడదే. మేం పని పంచుకున్నాం.

    Like

  9. శర్మగారూ,

    మీకేమిటి మాస్టారూ? మాలాటి “కాందిశీకులకి” అన్నిన్ని సదుపాయాలుండవు. గత ఏడాది దాకా చివరి పని తనే చేసేది. ఈసారి వెరైటీ కోసం ఆ పని కూడా నాకే అప్పగించింది మీ చెల్లాయి. తప్పుతుందా మరి?….

    Like

Leave a comment