బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అబ్బ.. bore ..కొట్టేస్తోందండి…

    ఈ టపాకి పెట్టిన శీర్షిక నా అభిప్రాయం కాదు. ఈ రోజుల్లో ఎవరి నోటంట విన్నా ఇదే మాట. ఏదో మాటలు రానంతకాలం ఫరవాలేదు, ఏదో ఉంగా.. బుంగా.. అంటూ లాగించేస్తారు పసిపిల్లలు. వాళ్ళనేదేమిటో మనకు అర్ధమైచావదూ, తీరా నాలుగుమాటలు నేర్చుకునేటప్పటికి, వాళ్ళనేదేమిటీ అంటే ఇదిగో “బోరు” అనే మాట. దానికి వాళ్ళనీ తప్పుపట్టి లాభంలేదు. ఆ పసిపిల్ల అమ్మా, నాన్నా, తనకంటే ఓ రెండుమూడేళ్ళముందర పుట్టిన అక్కో, అన్నో.. ఎవరినోటంట విన్నా అదేమాటాయె. మరి ఏవేవో అర్ధవంతమైన మాటలు రమ్మంటే ఎక్కడొస్తాయీ?

పెద్దచదువులు చదివి తగిన ఉద్యోగంరాలేదో అని ఏడ్చినంతసేపు పట్టదు, తీరా వచ్చినతరువాత ఏడాదినుంచీ ప్రారంభం..” ఏమిటోనండీ దిక్కుమాలిన ఉద్యోగం ‘బోరు’ కొట్టేస్తోందండీ..”. అసలు పొట్టకూటికోసం చేస్తూన్న ఉద్యోగం “బోరు” కొట్టడమేమిటో నా మట్టి బుఱ్ఱకైతే అసలు అర్ధమే అవదు.. ఈ బోరు కొట్టడమనేది ఒక జన్మహక్కనుకుంటారు.ఒకడికేమో job profile బాగో లేదట, ఇంకోడికేమో ఆ job లో growత్తే లేదట. కారణాలకేమిటిలెండి, కావలిసినన్ని వెరసి “బోరు”. మరి అంత బోరుకొడుతూంటే ఆ ఉద్యోగం మానేసి, హాయిగా స్వంతవ్యాపారం ఒకటి చూసుకోవచ్చుగా, అబ్బే, మళ్ళీ దానికి పెట్టుబడెవడు పెడతాడు? పైగా స్వంతవ్యాపారం అంటే అందులో ” బోరు” లాటి privileges ఉండవు కదా. ఆతావేతా తేలేదేమిటంటే, ఇంకోడెవడో పెట్టుబడిపెట్టిన సంస్థలో వేషాలేయొచ్చన్నమాట. నిజమే growth అనేది లేకపోతే కష్టమే, కానీ ఈ growth అనేదానికి కొలమానం ఏమిటి? మనం growth అని పిలిచేది, ఆ సంస్థయజమానికి అలా అనిపించకపోవచ్చుగా.

కొంతమందికి ఇంట్లో ఊరికే కూర్చోడం “బోరు” కొట్టి, ఏదో ఉద్యోగంలో చేరుతూంటారు.ఇలాటివారు ప్రభుత్వరంగంలో ఎక్కువగా కనిపిస్తూండేవారు.ఫాక్టరీలోనో, రక్షణ శాఖలోనో భర్త ఏదైనా పెద్ద ఉద్యోగంలో ఉన్నారంటే automatic గా భార్య, అక్కడుండే స్కూల్లో teacher.అలాగని వారు శ్రధ్ధగా పాఠాలు చెప్పలేదని కాదు,చెప్పొచ్చేదేమిటంటే, పాఠాలు చెప్పడంలోకంటే, ఇంట్లో ఊరికే కూర్చుని ” బోరు” కొట్టఖ్ఖర్లేకుండా ఉండడానికి ప్రాముఖ్యత ఎక్కువిచ్చేవారు.

సరేనండి, పెద్దాళ్ళకి ఇలాటి privileges ఉండడం బాగానే ఉందీ, మరి పిల్లలకి ఈ “జాడ్యం” అంత త్వరగా వచ్చేయడానికి కారణాలు ఏమిటిటా? ఇంట్లో వాతావరణమేమో అని నా అభిప్రాయం.సంపాదన బాగా ఉన్నప్పుడు వచ్చే ” జరుగుబాట్లు” ఇవన్నీ.ప్రతీరోజూ చూస్తున్న కర్టెన్ బొరు కొడుతుందిట.అదే కారులో రోజూ ఆఫీసుకెళ్ళడం బోరుట కొందరికి.ప్రతీ రోజూ ఇంట్లోనే తింటే బోరుకొడుతుందిట కొందరికి. మరి ప్రతీదీ ఇంతంత బోరు కొట్టేస్తూంటే, ఆ దిక్కుమాలిన చానెళ్ళలో వచ్చే సీరియళ్ళు బోరెందుకు కొట్టవో మరి !!ఏళ్ళ తరబడీ జీడిపాకంలా సాగతీయబడే సీరియళ్ళని మాత్రం వదులుకోరు. ప్రాణం మీదకొచ్చినా సరే, సీరియల్లో ఏమయిందో తెలిసికోవాలి.

ఇన్నిన్ని కబుర్లు చెప్తారే, మన ఇంటికి పాల ప్యాకెట్లు తెచ్చేవాడికీ, అంట్లు తోమే పనిమనిషికీ, సొసైటీలో తుడిచేవాడికీ, రోడ్లు బాగుచేసేవాళ్ళకీ అకస్మాత్తుగా “బోరు” కొట్టేస్తే, మన పని ఏమైపోతుందిట? మరి వాళ్ళూ మనుష్యులేకదా, వాళ్ళకో రూలూ, మనకో రూలూనా ఏమిటీ? సామాజికన్యాయం ఉండొద్దూ?సరదాగా ఓసారి మాటవరసకి ఊహించుకుందాం- పైన చెప్పిన ప్రతీవాడూ ” బోరు” కొట్టబడి, వాడు ప్రతీరోజూ చేసేపని, మానేసి చూద్దాం అనుకుని, కట్టకట్టుకుని రావడం మానేస్తే, వామ్మోయ్ ఊహించడానికే ఇంత భయంకరంగా ఉంటే , నిజంగా జరిగితే, భరించగలమా?ఈ పనులు చేయడానికి ఇంకో source కూడాఉండదు.

అందుకే నేను చెప్పొచ్చేదేమిటంటే, ఓ ఉద్యోగం బోరుకొడితే ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు.ఓ కారు అమ్మేస్తే ఇంకో కారు కొనుక్కోవచ్చు, ఓ కర్టెన్ బోరుకొడితే, ఇంకోటి మార్చేసికోవచ్చు, అలా మార్చుకుంటూ పోతే దీనికి అంతెక్కడా? అంతదాకా ఎందుకూ, ఈరోజుల్లో ఎవ్వరూ ఓ సెల్ ఫోనుని ఏడాదికాలం వాడరు.ఏమిటయ్యా అంటే, ఆ పాతదానిని వాడి వాడి బోరుకొట్టేసిందండీ అనేయడం.

ఇదివరకటి రోజుల్లో ఈ “బోరు” లనబడేవి ఎక్కువగా ఉండేవి కావు, కారణం చెప్తే అందరికీ నచ్చకపోవచ్చు–సింపుల్ గా చెప్పాలంటే, ఆర్ధికస్థోమత,availability.ఈ రెండూ ఎక్కువయ్యేసరికి ఎక్కళ్ళేని బోరులూ వచ్చేశాయి.తల్లితండ్రుల్ని చూసి పిల్లలూ నేర్చేసికుంటున్నారు.ఇదివరకటి రోజుల్లో అయితే, ఓ దెబ్బేసి అడిగే పరిస్థితి. ఇప్పుడో, అడిగితే ” మీరూ, మమ్మీ ప్రతీదానికీ బోరు బోరు అంటూంటారే, మాకుమాత్రం బోరుండకూడదేమిటీ” అని ఎక్కడ అడిగేస్తాడో అని భయం.దాంతో ఏమౌతోందంటే, “నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా..” అనుకుంటూ ఓ దండం పెట్టుకోడమే. మనం చేసేదే మన పిల్లలూ నేర్చుకుంటారు.

ఇలాటివాళ్ళు ఇన్నేసేళ్ళు కాపరాలు ఎలా చేస్తారో మరి? వాళ్ళకి మాత్రం ప్రతీరోజూ చూసే భార్యంటే భర్తకీ, vice versa బోరుకొట్టేయదా మరి? ఇన్ని కబుర్లూ చెప్పి దీంట్లోకెళ్ళేడేమిటీ ఈయనా అనుకుంటున్నారా? అదే మరి మన భారతీయత లో ఉండే అసలు సిసలు గొప్పతనమంతా.ఎక్కడైనా బావ కానీ, వంగతోటలో..అన్నట్టు మిగిలినవాటన్నిటిలోనూ ఎన్నైనా వేషాలు వేయొచ్చు, కానీ ఈ దాంపత్యంలో మాత్రం కాదు. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ కాలక్షేపం చెసేస్తారు కానీ, మరీ ప్రాణం మీదకి మాత్రం తెచ్చుకోరు.అదేకదా మన పెళ్ళిమంత్రాల్లో ఉండే అసలు మహాత్మ్యం అంతా.

ఈవేళ నెట్ లో ఒక లింకు దొరికింది. హిందుస్థానీ సంగీతం నేర్చుకోవాలని ఎవరికైనా ఆసక్తి ఉంటే ఒక్కసారి ఇక్కడ చూడండి.

ఇన్నేసి కబుర్లు చెప్తున్నారు, మీకు బోరు కొట్టడంలేదా ఇన్నిన్ని టపాలు పెట్టడానికీ అని.వ్యాఖ్యలు పెట్టినా, పెట్టకపోయినా, కొంతమందికైనా ఉపయోగిస్తుందేమో అనే సదుద్దేశ్యంతో లింకులు ఇస్తూంటాను. ఊరికే లింకులిచ్చేసీ టపా పెట్టేస్తే ఎలాగా అని, మిమ్మల్ని బోరుకొడుతూంటాను.

%d bloggers like this: