బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– భలే మంచి రోజు..పసందైనరోజు…

    క్రిందటి సారి భాగ్యనగరానికి వెళ్ళినప్పుడు ఒక

పెద్దమనిషితో పరిచయం అయిందని చెప్పానుగా, ఆ పెద్దమనిషి మాటల్లో ఇంకో పెద్దమనిషితో తనకు చాలా పరిచయం

ఉందనిన్నూ, తమ ఇంటికి ఆయన రాకపోకలు కూడా ఎక్కువగానే ఉన్నట్టూ చెప్పారు.ఈయనకి అంత పరిచయం ఉన్న పెద్దమనిషిని ఎప్పటినుండో కలుద్దామనీ ఉంది నాకైతే. నేనే అని ఏమిటిలెండి, ఛాన్సంటూ వస్తే, ఎవరైనా ఆయన్ని ఒక్కసారి కలిస్తే బావుంటుందని అనుకోనివారు ఎవరూ ఉండరు. మరి ఆయన తెలుగు సాహితీరంగంలోనూ, సినిమా రంగంలోనూ అంత ప్రసిధ్ధికెక్కిన మనిషి.ఆయన దర్శకత్వంలో సినిమా వచ్చిందంటే, ఎలా ఉంటుందో అని ఒక్కసారైనా చూడకుండా వదలరు.మరి అంత పేరుతెచ్చుకున్నారు. ఇంక ఆయన వ్రాసిన పుస్తకాలంటారా,లైట్ గా, మనసుకు హత్తుకునేలా , ఆ రచనలోని పాత్రలు, మన కళ్ళకెదురుగా వచ్చి నుంచుంటాయి. దానికి కారణం ఆయన చేసిన పాత్రలోని జీవం,ఆ పాత్రలకు ప్రాణంపోసిన శ్రీ బాపూగారి “గీతలూ”. ఒక్కసారి ఆ బొమ్మలు చూస్తేనే, కథంతా అర్ధం అయిపోతుంది.

    మరి అలాటి మహత్తర వ్యక్తిని చూడాలని కోరిక ఉందంటే ఆశ్చర్యం ఏముంటుందీ? భాగ్యనగరంలో నా స్నేహితుడితో ఓ “అర్జీ” పెట్టేసికున్నాను. అయ్యా, వారిని నేను కలిసే పుణ్యం మాత్రం మీరే చేసుకోవాలీ అని. ఇందులో అడగడానికి మొహమ్మాటం ఎందుకూ, వీలైతే చేస్తారు, లేకపోతే కుదరదూ అని చెప్పేస్తారు. కానీ నా అదృష్టంకొద్దీ, మొదటిదానికే ఒప్పుకున్నారు. సరేనండి, నా ప్రయత్నమేదో నేను చేసి, మీకు ఓ వారంరోజులుముందుగా తెలియచేస్తానూ అని చెప్పేశారు. ఇంక అప్పటినుంచీ, ఆయనదగ్గరనుండి ఫోనెప్పుడొస్తుందా, నా చిరకాల కోరిక ఎప్పుడు తీరుతుందా అని రోజూ ఎదురుచూడ్డమే. మొదటి స్టెప్పుగా, ఓ రోజు ఆయన ఫోను చేసి, తనతో మీకోరిక చెప్పానండీ, తప్పకుండా కలుద్దామూ అన్నారూ అని చెప్పేరు.ఫరవాలేదూ,కలవడానికి ఒప్పుకున్నారు మొత్తానికి రథం కదిలిందని సంతోషించి, కార్యక్రమానికి ఓ తేదీ ఫిక్స్ చేసికోవద్దూ మరి? అదికూడా నిశ్చయించేసికుని,నిన్న( 14-5-2013) కలుద్దామని అనుకున్నాము.సరే అనుకుని టిక్కెట్టు కూడా రిజర్వు చేయించేసికున్నాను. మా నవ్య, అగస్థ్యలకి శలవల కారణంగా, నేనొక్కడినే వెళ్ళేటట్టు కార్యక్రమం పెట్టుకున్నాను.

    అన్నీ బావున్నాయీ అనుకున్నంతలో, మా స్నేహితుడి దగ్గరనుంచి మళ్ళీ ఫోనూ..” ప్రోగ్రాంలో కొద్దిగా మార్పు అయిందీ..”అని. మళ్ళీ ఏమి ఆటంకంవచ్చిందా అని భయపడ్డాను. వాళ్ళింటికి వెళ్ళి కలుద్దామనుకున్నాము కదా, తను నిన్న ఫోను చేసి చెప్పారూ, తన “సినిమా షూటింగు మళ్ళీ మొదలుపెట్టానూ..”, ఈయనన్నారుట, ” పాపం అంత దూరంనుంచి మిమ్మల్ని కలవడానికే వస్తున్నాడాయనా, ఇప్పుడెలాగ..”అని అంటే, ” దానికేముందిలెండి, తిన్నగా మన లొకేషన్ కి తీసికొచ్చేయండీ, షూటింగు చూసినట్టూ ఉంటుంది, నాలుగు కబుర్లూ చెప్పుకోవచ్చూ..,లంచ్ కూడా మాతోనే చేసేయొచ్చూ..” అన్నారుట.తంతే బూర్లెబుట్టలో పడ్డం అంటే ఇదే మరి! ఏదో ఇంటికి వెళ్ళి ఒకసారి కలిసి, ఆయన పుస్తకాల గురించి మాట్టాడుకుందామనుకుని నేననుకుంటే, ఏకంగా ఆయనలోని, రెండో ప్రతిభ కూడా ప్రత్యక్షంగా చూసే అవకాశం వస్తూంటే ఇంకేం కావాలి? అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే నా ప్రోగ్రాం ఫైనల్..
కార్యక్రమం ఫైనలైజు చేసికున్న తరువాత, ఆ పని అయేదాకా ఎవరితోనైనా ఆ విషయం పంచుకోడానికి కొద్దిగా జంకుతాను. ఏదో అయిపోతుందేమోనని భయం అని కాదూ, ఏదో అదో సెంటిమెంటూ. తీరా మనం అనుకున్నది జరక్కపోతే ఏదో అవతలివాళ్ళు వేళాకోళం చేస్తారేమో అన్న భయమోటీ, ఇంత శ్రమా పడి ఈ ఎండలో వెళ్ళినా ప్రయోజనం లేకపోయిందే అని ఓ రకమైన disappointment అనండి, మొత్తానికి ఎవరితోనూ ముందుగా చెప్పనివే మాకు విజయవంతమయ్యాయి. సరే అని ఆ పధ్ధతికే సెటిలయిపోయాము.కానీ ఈసారిమాత్రం చిరకాల మిత్రుడొకరు మమ్మల్ని కలవడానికొచ్చినప్పుడు, మా ఇంటావిడ కాస్తా నా ప్రోగ్రాం విషయం అతనితో అనేసింది. అయ్యో మాట జారేశానే, తీరా ఏదైనా అవాంతరం వస్తే పాపం ఈయన బాధపడతారేమో అని, నేను నిన్న భాగ్యనగరం వెళ్ళి, ఆ పెద్దమనిషిని కలవకలిగి, నాలుగు గంటలు ఆయనతో గడిపేనని ఫోను చేశాకకానీ తీరలేదు.

    పోనీ ఇక్కడితో అయిందా, ఎలాగూ కలుస్తున్నాను కదా అని, ఆయన అప్పుడెప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూని యూట్యూబ్ లో వెదికి పట్టుకున్నాను. అందులోనేమో ఈయన, తనకి అసలు స్నేహితులనేవారే లేరనిన్నూ, అంతగా ఇతరులతో కలియడానికి అంతగా ఇష్టపడరనిన్నూ etc..etc.. చెప్పుకొచ్చారు. ఓరినాయనో మరీ ఇలాటివారితో పెట్టుకున్నానేమిటీ, అని భయపడుతూనే, అన్నిeventualities కీ సిధ్ధపడి, మొత్తానికి మా స్నేహితుడు తన కారులో, చిలుకూరు లో షూటింగవుతున్న farm house కి తీసికెళ్ళారు.అప్పటికే ఆయన అక్కడకి వచ్చేశారు.సినిమాకి సంబంధించిన హీరో రాక ఆలశ్యం అవడంతో, మాకు ఆయనతో ఓ మూడు గంటలు exclusive గా గడిపే సదవకాశం కలిగింది.

    ఇంక మరి ఆ పెద్దమనిషెవరో మీతో చెప్పొద్దూ– “పసలపూడి కథలు” ,” దిగువ గోదావరి కథలు” లాటి అచ్చతెలుగు నుడికారంతో వ్రాసిన కథల రచయితా, “సితార” లాటి ఆణిముత్యాన్ని మనకందించిన ప్రఖ్యాత దర్శకుడు శ్రీ వంశీ గారు. నేనంటే చాలా అసూయగా ఉంది కదూ, మీకే అలాగుంటే, నాలుగ్గంటలు ఆయనతో గడిపిన నాకెలా ఉంటుందంటారు?

    రెండేళ్ళ్ళ క్రితం శ్రీ బాపూరమణలు, అంతకుముందు మిథున శ్రీ రమణ గారు, క్రిందటేడాది ఆర్.కే.లక్ష్మణ్ గారు, ఇప్పుడేమో శ్రీ వంశీగారు.
HYD 1405 005

Vamsi 001

   ఇంత “భలే మంచి రోజు”, మా ఇంటావిడ నాతో పంచుకోలేకపోయిందే అన్నదే నా బాధల్లా.అక్కడ గడిపిన నాలుగ్గంటలూ మరీ అన్నీ కాకపోయినా.. ఇంకో టపాలో..

%d bloggers like this: