బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ” శరద్రాత్రులు”…

    ” అసలు రోజుకు ఎన్ని గంటలు పనిచెయ్యాలె”

   “ప్రొద్దున్న తొమ్మిది గంటలనుండి సాయంత్రం అయిదు గంటల దాకా డ్యూటీలో ఉండాలె”

   ” చేయవలసిన పనులు ఏమిటి?”

   “చాలా వరకు నా ముందు నుంచోడం”

   “నుంచుని?”

   ” నుంచుని నను చూస్తూండడమే”

   “ఇంకా”

   “నాకు పూలు తెచ్చిపెట్టడం, నేను అలంకరించుకుంటూంటే నాకు తోడ్పడటం”..

    ఇలాటి సంభాషణలు విని కానీ, చదివి కానీ ఎన్ని సంవత్సరాలయిందో కదూ. ఈరోజుల్లో ఇంత సావకాశంగా ఉండే అవకాశం ఎక్కడిదీ? ఎక్కడ చూసినా ఉరకలూ పరుగులూనూ. అసలు ప్రొద్దుటే లేవడమే కష్టం, దానికి సాయం భర్తతోపాటు ఉద్యోగానికి వెళ్ళే భార్య కి, పిల్లల్ని లేపి వాళ్ళని స్కూలుకి పంపడం, భర్తకి ప్రొద్దుటే టిఫిను చేసి, తనూ తిని, ఆఫీసులో మధ్యాన్న భోజనానికి ఓ లంచ్ బాక్స్ తయారుచేసికుని, ఆదరాబాదరాగా వెళ్ళడం. సాయంత్రం మళ్ళీ షరా మామూలే. ఇంత హడావిడిలోనూ…

   “ఆమె చెక్కిళ్ళు ఆ వెన్నెలని తినేస్తున్నాయి.ఆమె పెదవిపై కెక్కి నాట్యం చేస్తున్న ఎరుపును తెలుపు చేయాలనివెన్నెలలు ప్రయత్నం చేశాయి. వెన్నెల ప్రవాహంగా వచ్చేసరికి చీకట్లు కొన్ని పారిపోయివచ్చి ఆమె గడ్డం క్రింద దాక్కున్నాయి.”

   ఈరోజుల్లో ఆ వెన్నెలలెక్కడా, చెక్కిళ్ళెక్కడా? అగ్గిపెట్టెల్లాటి ఎపార్టుమెంట్లలో వెన్నెలలు రావడానికి అవకాశం ఎక్కడ?

   “ ఆవిడ రాణి అయి మూడు నెలలు అయిఉంటుంది.ఆమె మొగములో ఇంకా కొత్త పెళ్ళికూతురుతనం పోలేదు. మాటిమాటికీ సిగ్గుపడేది…సిగ్గుపడిసిగ్గుపడి చివరకు తలవంచుకుని తేనె వాక్కులు జార్చేది..“— ఇలాటివన్నీ ఏవో రచనల్లో చదవడమో, ఎన్నో ఏళ్ళ క్రితం తీసిన ఏ సినిమాలోనో యూట్యూబ్ తీసికుని చూడ్డమే. మహా అయితే ఏ యాష్ ఛోప్రాయో తీసిన సినిమా టీవీలో వచ్చినప్పుడు చూడడమే.
ఇప్పటి రొజుల్లో పెళ్ళికూతురిలో సిగ్గూ, కొత్తతనమూ మాట దేముడెరుగు, … ఎందుకులెండి.. మనోభావాలు నొచ్చుకుంటాయి.. మన అభిప్రాయాలు వ్రాస్తే…
ఇంకో సంఘటనలో కొత్తపెళ్ళికూతురూ, పెళ్ళికొడుకూ వారి అక్క వరసావిడ ఇంటికెళ్ళినప్పుడు పేర్లు చెప్పుకోకుండా ఇంట్లోకి రానివ్వనన్నప్పుడు జరిగిన హడావిడీ అవీ ఇప్పుడు మచ్చుకైనా కనిపిస్తున్నాయా?

    దంపతులమధ్య ఉండవలసిన అవగాహనా, వారి మధ్యనడిచే శృంగారం పనస తొనల్లాటి వివరణతో చెప్పాలంటే శ్రీ మునిమాణిక్యం నరసింహరావుగారు సృష్టించిన “కాంతం” పాత్ర అసలు ఎందుకు సృష్టించారూ అన్నది తెలుసుకోవాలి. అది తెలియాలీ అంటే ఆయన 1945 లో వ్రాసిన “ శరద్రాత్రులు” అనే నవలిక చదవాలి. అసలు ఆ నవలికకి ఆ పేరే ఎందుకు పెట్టారూ అన్నది కూడా తెలిసికోవాలంటే ఆ శరద్రాత్రులు చదవొద్దూ మరి? ఇంకెందుకూ ఆలశ్యం.. చదివేయండి.. అలా..అలా..అలా.. పాత మధురజ్ఞాపకాల్లోకి వెళ్ళి, ఒకసారి రీఛార్జ్ చేసేసికోండి మీ బ్యాటరీలు…శరద్రాత్రులు మునిమాణిక్యం కండిషన్లు మామూలే… పుస్తకం తెరుచుకోడంలేదని ఊరికే ఖంగారు పడిపోకండి. HAPPY READING.

%d bloggers like this: