బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- “సరదాగా కాసేపు.”.

    నేను మార్చ్ నెలలో భాగ్యనగరం వచ్చినప్పుడు, నాకు కలిగిన ఓ మంచి పరిచయం గురించి ఒక టపా పెట్టాను. నా స్నేహితుడు శ్రీ గబ్బిట కృష్ణమోహన్ గారు, మాకు షడ్రసోపేతమైన భోజనంతో పాటు dessert గా ,ఆయన వ్రాసిన మూడు పుస్తకాలు చేతిలో పెట్టారు.అందులో ఒక పుస్తకం ” సరదాగా కాసేపు”Saradaagaa.. అనేది ఒకటి. చెప్పానుగా, అది చదువుతూంటేనే కడుపుబ్బిపోయి నవ్వేశాను. అందులో ఉన్నవి పది అఛ్ఛోణీ లాటి కథలు. నేను చదివి మీ అందరితోనూ నా ఆనందం పంచుకోవాలని ఎప్పటినుండో ఉండడమైతే ఉంది. కానీ, ఆకథలన్నిటికీ మూలం PG Wodehouse Short Stories. శ్రీ కృష్ణమోహన్ గారు, ఆ కథలని తెలుగు వాతావరణం లోకి ఎలా transform చేశారో తెలియాలంటే, మరి ఆ మూలకథలు కూడా చదవాలిగా.ఇప్పుడు వాటిని కొని చదవమనడమూ బాగోదాయె, కానీ పాఠకులచేత చదివించాలాయె, మరి ఈ సమస్య కి సమాధానం ఏమిటీ అని ఈ నెలన్నరా ఆలోచించి..చించి.. చించి మొత్తానికి సాధించేశాను. దాని ఫలరూపమే ఈ లింకు.PG Wodehouse ఇందులో మొత్తం తొమ్మిది కథలున్నాయి. 266 పేజీలు. శ్రీ కృష్ణమోహన్ గారు తనదైన బాణీ లో మొదటి రెండు కథల తో పాటు ఇంకో 8 కథలు తనస్వంతమైన ప్రత్యేక ఫక్కీ లో “ అనుసృజన” చేశారు. తీరా చేసి ఆ పుస్తకాన్ని అంకితం ఎవరికిచ్చారూ అంటే, ఇంకెవరూ మన “ వంశీ” గారికి.

   మన పురాణాల్లో “సూత ముని” పేరు చాలా చోట్ల వింటాము. సాధారణంగా ఆయన నోటివెంటే పురాణాలన్నీ నడుస్తాయి. మరి ప్రస్తుతానికి వస్తే, మూల కథలో ఉన్నట్టు Mr.Mulliner.. Mr George అని వ్రాస్తే మజా ఏముంటుందీ,, పైగా ఏమీ అర్ధంఅవకపోవచ్చుకూడానూ, అందుకని ఓ ” సూత ముని” పాత్రకి ఓ భాగోతుల సూతరాజు ని సృష్టించేశారు.

   ఉదాహరణకి మూలకథలో 12 వ పేజీలో వుడ్ హౌస్ ఒక మాటంటారు–.”I love a lassie.. bonny, bonny lassie” sang George ” She is as pure as the lilly in the dell..”, ఆ భావం వచ్చేటట్టుగా, మన మనసులు ఆ దృశ్యం కళ్ళకి కట్టినట్టుగా చెప్పాలంటే, మరి మనకి తెలిసినవి చెప్తేనేకదా చదువరిలకి అర్ధం అయ్యేదీ?
“మా ఊళ్ళో ఒక చిన్నదీ,ఎంతో అందమైనదీ,ఆమెంటే నాకెంతో ఇష్టమూ, ప్రాణమైనా ఇస్తానూ.. లాయిలప్ప లాయిలా, లాయిలప్ప లాయిలా..” అంటూ పాడాడు.తన భావాలని డాక్టరుగారు సలహా ఇచ్చినట్టుగా,ఈ కథని చదివే తెలుగువారు relate చేసికుని, మనసుకు హత్తుకునేటట్టుగా చేయడానికి,రచయితకి ఓ తెలుగుపాట చరణాలు గుర్తుచేయడానికి , భాషమీదే కాదు, మిగతావాటిమీద కూడా పట్టుండాలి.అవి మాత్రం పుష్కలంగా ఉన్నాయి శ్రీ కృష్ణమోహన్ గారికి.

   “” All we Mulliners have been noted for our presence of mind..”–అన్నదాన్నికి రచయిత వ్రాసిందేమిటీ– “మా భాగోతుల వంశీకులు మంచి లౌక్యులు..” అని. ఇలాటి అచ్చతెలుగు నుడికారాలుంటేనే కదా, కథ ముందుకు నడిచేదీ. డాక్టరు గారి దగ్గరనుంచి సలహా తీసికుని, ఆ సలహా ఆచరణలో పెట్టే ఉద్దేశ్యంతో ఇంగ్లీషు కథలో,కథానాయకుడు డైరెక్టు ట్రైన్ లో కాకుండా, ఒక ట్రైనెక్కి, ఇంకో ట్రైనులోకి మారాల్సొస్తుంది. మరి ఆ కథలోనే ఉండే రైలు ప్రయాణం వివరిస్తే, మనవాళ్ళకి అర్ధం ఏమౌతుందీ, అందుచేత, మన ప్రాంతంలోని మెడ్రాస్- రేపల్లె మార్గాన్ని ఎన్నుకున్నారు, కారణం రేపల్లెకి తిన్నగా వెళ్ళలేరు, తెనాలిలో రైలు మారాలి, అదన్నమాట విషయం. అలా అడుగడుగునా, మూల కథలోని సన్నివేశాలన్నిటినీ, ఏక్ దం తెలుగు వాతావరణం లోకి మార్చేసి కథని నల్లేరుపైనడకలా నడిపించేశారు.

    ప్రతీ సన్నివేశాన్నీ, సంఘటననీ, కథానాయకుడి మనస్థత్వాన్నీ, “తెలుగైజు”చేసేయడమంటే మాటలా మరి? ఏ ఒక్కపేజీ విసుగెత్తదు.డాక్టరుగారు ఇచ్చిన సలహా ప్రకారం, ముగ్గురు కొత్త్తవారితో పరిచయం చేసికోవాలి. అందులో ఇద్దరితో interaction తో గుండె బేజారెత్తిపోయిన తరువాత, మూడో పరిచయం– ఆ మారిన ట్రైనులోది. అందులో ఒక వనిత ఎక్కుతుంది.అకస్మాత్తుగా, ఓ “ప్రాణి” ని చూసేటప్పటికి, ఆవిడ స్పందన తెలుగులో చదవాలేకానీ, వర్ణించడం చాలా కష్టం. మన కథానాయకుడేమైనా తక్కువ తిన్నాడా, ఠక్కున డాక్టరుగారి సలహా జ్ఞాపకం వచ్చి “పాట” లోకి దిగిపోతాడు !” అందమైన బాలా.. ఆవుపాలా చాయా, విందుగా పసందుగా చాయ అందుకోవా.. కోవా...” అంటూ, 1960 లో నాగేశ్వరరావూ, గిరిజ లమీద చిత్రీకరించిన జమునారాణి, పిబిశ్రినివాసు ల “ఋణానుబంధం” లోని పాటను ఎంచుకున్నారు. ఇది చదవగానే మనకు గుర్తొచ్చేది ఆ సీనే.

    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నని చెప్పగలనూ? ప్రతీ పేజీ ఓ కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకు, ఓ బందరు లడ్డూ అన్నా చాలదేమో. మరి అందుకే ఆ పెద్దాయన శ్రీ ముళ్ళపూడి వెంకటరమణగారు

    “ఇంపైన వుడ్ హౌసు

    సొంపైన తెలుగీసు

   తెలుగు హాస్యప్రియులకు

   ఇంతకన్న ఆనందమేమీ”-— అన్నారంటే అనరూ మరి…

%d bloggers like this: