బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– చూస్తూ.. చూస్తూంటే.. రోజులెలా గడిచిపోతాయో కదా….


    ఏమిటో ఇప్పుడు వ్రాయడం వచ్చు కదా అని, ఇన్నాళ్ళూ జీవితంలో జరిగిన సంఘటనలు వ్రాయడానికి బాగానే ఉంటుంది. కానీ, అవి జరగడానికి ముందర ఎంతంత టెన్షన్లు అనుభవించామో, తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తూంటుంది. అసలు మనమేనా, అలా చేయగలిగామూ అని! కానీ, ఇన్నేళ్ళ తరువాత , ఆ సంఘటనల పరిణామాలు ప్రత్యక్షంగా చూసినప్పుడు మాత్రం అదో రకమైన ఆత్మవిశ్వాసం మరోసారి rekindle అవుతూంటుంది. భగవంతుడి మీద నమ్మకం కూడా ఇంకా..ఇంకా ..పెరిగిపోతూంటుంది. దీన్నే మానవజీవితం అంటారేమో… ఇదేమిటీ సడెన్ గా ఫిలాసఫీలోకి దిగిపోయాడేమిటీ ఈయనా అనుకుంటున్నారా? నిజమే కదా, జీవితంలో అసలు పెళ్ళంటూ అవుతుందా, నాకూ ఓ సంసారం, పిల్లలూ అనేవాళ్ళు ఏర్పడతారా అని అనుకున్నంతసేపు పట్టలేదు, పెళ్ళీ అయింది, నన్ను పూర్తిగా అర్ధం చేసికుని, నా tantrums భరించి ( మరి ఆరోజుల్లో అలాగేగా ఉన్నది !), ఆరేళ్ళు తిరక్కుండా, ఇద్దరు రత్నాల్లాటి పిల్లలకు జన్మ ఇచ్చి, వాళ్ళ చదువుసంధ్యలకి పూర్తి బాధ్యత తీసికుని, ఈవేళ ఇలా బ్లాగులు వ్రాసుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తున్నానంటే, దీనికంతకూ ముఖ్య కారణం, మా ఇంటావిడే.

    ప్రతీ భార్యా అలాగే ఉంటుంది, ఇందులో పేద్ద గొప్పేమిటమ్మా అనుకోవచ్చు. కానీ ఎవరి భార్య వాళ్ళకి గొప్పే కదా! వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ చెప్పుకోరు, అందులోనే ఉంది వారి గొప్పతనమంతా! మనకీ తెలుసు, వారి సహకారం లేనిదే, మనం బిగ్ జీరో అని. అయినా ఒప్పుకోడానికి అహం అడ్డొస్తూంటుంది!అయినా ఉన్నదేదో చెప్పేసికుంటే అదో తృప్తీ. అసలు ఈవేళ ఇలా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళడానికి కారణం ఏమిటయ్యా అంటే, మా బంగారు తల్లిని ఓ అయ్య చేతిలో పెట్టి ఇవేళ్టికి 15 వసంతాలు పూర్తయాయి.. మొదటినుండీ, ఆంధ్రదేశానికి బయటే ఉండి,కూతురికి సంబంధాలు తేవడం అంత సులభం కూడా కాదూ, పైగా ఈ రోజుల్లో ఉన్నన్ని మాధ్యమాలు అందుబాట్లో లేనప్పుడు మరీనూ! ఎవరో మధ్యవర్తి తప్ప ఇంకో దిక్కు లేదు. కూతుర్ని కన్న తరువాత, వివాహం చేయడం మన బాధ్యతే కదా.అలాగని, అన్ని సంవత్సరాలు బయట ఉండి, సంబంధాలు తేవడం అంటే మాటలా? కూతురి భవిష్యత్తుకూడా దృష్టిలో పెట్టుకుని చూడాలి. మన గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి మనకు తెలియదు. మరీ, ఇన్నాళ్ళూ తెలుగు సంప్రదాయాలకి దూరంగా ఉంటూ, ఒక్కసారి అక్కడి సంబంధం చేస్తే పిల్ల పాపం ఇమడగలదా అని ఓ అనుమానం. అంతేకాదు, ఇప్పుడంటే పరవాలేదు కానీ, ఆ రోజుల్లో పిల్ల పెళ్ళి చేయాలంటే, తండ్రి రూపురేఖలు కూడా ముఖ్యం. నాకున్న సమస్య నాది. ఏం చేస్తానూ?

    మరి ఇన్ని సమస్యలకీ ఆ శ్రీవెంకటేశ్వరస్వామి ఠక్ మని, మా అమ్మాయి మనస్సులో ప్రవేశించేసి, “డాడీ, నాకు ఫలానా అబ్బాయంటే ఇష్టం..” అనిపించేలా చేశారు. ముందుగా like any middle class parents, షాక్ తిని, ఆ తరువాత నేనూ, ఇంటావిడా ఆలోచించి, ఇంట్లో పెద్దవారైన మా అమ్మగారితోనూ, మా అత్తగారూ,మామగారు లతోనూ సంప్రదించి, వారి ఆశీర్వచనంతో వివాహం జరిపించాము. ఒక్కొక్కప్పుడు అనుకుంటూంటాము, 15 సంవత్సరాల క్రితం suppose మేము మన ప్రాంతాల్లోనే ఉన్నట్టైతే, ఇంత పెద్ద decision తీసికునే ఉండేవారమా అని ! ఊళ్ళో వాళ్ళేమనుకుంటారో, చుట్టాలందరూ మనతో సంబంధబాంధవ్యాలు కటాఫ్ చేసికుంటారేమో, ఏమిటో అన్నీ అనుమానాలే ! చేద్దామని మనసా వాచా అనుకున్నా, ఏమీ చేయలేని నిస్సహాయత. ఎంత చెప్పినా ఆనాటి పరిస్థితులూ, మానవ స్వభావాలూ మరీ ఇప్పటిలా లేవు కదా. ఎవరో ఏదో అంటారు, బాధపడ్డం తప్ప ఇంకేమీ చేయలేము.

    అందుకే destiny ని నమ్ముతాము మేము. మన చేతిలో ఏమీ లేదు. ఆయన ఎలా నడిపిస్తే అలా నడిచేయడమే. మా అల్లుడూ, అమ్మాయీ, మనవరాలు తాన్యా, మనవడు ఆదిత్య లను చూసినప్పుడల్లా అనుకుంటాము– Yes we were right... అని. ఇందులో మా గొప్పేమీ లేదు, ఆ దేవదేవుడే మాకు అలాటి శక్తిని ప్రసాదించారు. బ్లాగులోకంలోకి ప్రవేశించిన కొత్తలో మా ఇంటావిడ ఓ టపా వ్రాసింది. అదికూడా చదివేయండి మరి….

Advertisements

3 Responses

 1. మీ అమ్మయికి, అల్లుడికి పెళ్లి రోజు శుభాకాంక్షలండి. అమ్మాయి మనసెరిగి ఆ రొజుల్లోనే వారి పెళ్ళి చేసిన మీ ఇద్దరికీ అభినందనలు.
  అన్నట్టు నిన్న మా పెళ్ళి రోజు (పది సంవత్సరాలు!). మేము కూడ ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాము. అయితే నా తల్లితండ్రులు మేము ఎంత ప్రయత్నించినా, ఎన్ని రోజులు ఆగినా, మా పెళ్ళికి అంగీకరించకపోవడం మాకు ఇప్పటికి బాధ కలిగించే విషయం. ఎంతయినా మీ పిల్లలు అదౄష్టవంతులండి.

  Like

 2. ముందుగా మీ అమ్మాయికి మరియు అల్లుడుగారికి పెళ్ళిరోజు శుభాకాంక్షలండీ….

  నేను మిమ్మల్ని అభినందించేంత పెద్దదాన్ని కాదు కాబట్టి మీరు చేసింది చాలా చాలా మంచి పని అని మాత్రం చెప్పగలను…

  అయితే ఆ రోజుల్లో మీరు ఎంత శ్రమ పడి , ఎన్ని అవరోధాలను ఎదుర్కొని, ఎంతమందిని సమాధాన పరిచి ఈ పెళ్ళి చేసుంటరో అంచనా వేయగలను…

  Like

 3. @SG,

  ముందుగా ధన్యవాదాలు, మీ హార్దిక శుభాకాంక్షలకి. ఎప్పటికో అప్పటికి, మీ తల్లితండ్రులు, మీతో కలుస్తారులెండి…

  @మాధవీ,

  థాంక్స్… అవరోధాలనేవి ఏమీ ఎదురుకోలేదమ్మా. నచ్చనివారు ఎవరూ మొహం మీద చెప్పలేదు.శ్రమ అంటారా, పిల్ల పెళ్ళి చేయడం అంటే శ్రమ కంటె ఆనందం ఎక్కువగా ఉంటుంది. అటువైపు, ఇటువైపు పెద్దలందరూ ఆశీర్వదించడంతో, మేము పడ్డ ” శ్రమ” మర్చిపోయాము. భగవంతుడి దయతో అందరూ సుఖంగా ఉన్నారు. అంతకంటే ఇంకేమి కావాలి?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: