బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఓ ..చిన్న మార్పు…it makes a huuuuuuuge… difference…


   ఈ మధ్యన మా కంప్యూటరు కొద్దిగా తిప్పలు పెట్టడం ప్రారంభించింది. పాపం దానికీ నా లాగే వయస్సు మీద పడుతోంది. మొదట్లో ఉండే ఉత్సాహం ఇప్పుడుండమంటే ఉంటుందా ఏమిటీ? పని చేస్తోంది, కానీ ,మరీ ప్యాసెంజరు బండిలా ( ఈ రోజుల్లోవి కావు, మారోజుల్లోవి) వెళ్తోంది. ఈరోజుల్లో లోకల్ ట్రైన్లనుండి, ప్యాసెంజరు బండ్ల దాకా అన్నీ ఎలెట్రీ ఇంజన్లతోనే కాదా నడిచేదీ, కానీ మా రోజుల్లో బొగ్గింజన్లే గతి. దానికి సాయం ప్రతీ స్టేషన్లోనూ ఆగడం. దీనితో ఆ ప్యాసెంజర్లలో వెళ్ళడం అంటే ప్రాణం మీదకొచ్చేది! ఓ వేళాపాళా ఉండేది కాదు. ట్రైనుందా అంటే ఉంది. లేదని ఎలా అంటాము?రాకపోకలు దైవాధీనాలు, అలాగ తయారయింది మా కంప్యూటరు. అంత పేద్ద ప్రోగ్రామింగులూ అవీ ఏం చేస్తారు మీరు, అని అనకండి మరి. నేను కాలక్షేపానికి వ్రాసుకునే టపాలు నాకు సంబంధించినంత వరకూ, అది కూడా ఓ పెద్ద ప్రోగ్రామింగే మరి! ఎంత చెట్టుకంత గాలి !

   ఇదివరకు బ్రాడ్ బాండ్ కోసం, రిలయెన్సు వాడి నెట్ కనెక్ట్ ఉండేది, దానితో బాధలు భరించలేక, బి ఎస్ ఎన్ ఎల్ వారి బ్రాడ్ బాండ్ కొన్నానని చెప్పానుగా, శుభ్రంగా పనిచేస్తోంది. ” ఆయనే ఉంటే మంగలెందుకూ..” అన్నట్టు, అన్నీ బావుంటే, ఈ గొడవెందుకూ? మొత్తానికి, మా కంప్యూటరు ” పాసెంజర్ మోడ్ ” లోకి వెళ్ళిపోయింది. ప్రొద్దుటే లేవగానే సిస్టం ఆన్ చేయడం, స్నానపానాదులూ,బ్రేక్ ఫాస్టులూ అయే సమయానికి, ఏదో ఆడుతూ పాడుతూ, నెట్ కనెక్టవడం. పోనీ కనెక్టయింది కదా అని మొదలెడితే, మధ్యలో ఏం రోగం వస్తుందో ఆగిపోవడం. ఏమిటో అంతా గందరగోళం. అప్పటికీ అబ్బాయినడిగాను, దీని సంగతేమిటో చూడు నాయనా అని. వాళ్ళకా టైముండదు. డాడీ టెక్నీషియన్ ని పిలిచి, ఓ సారి క్లీనింగు చేయించేయి, ఏదో వైరస్ లాటిదొచ్చిందీ అని చెప్పాడనుకోండి, ఆ మధ్యన ఒకతను వచ్చినప్పుడు, మీ కంప్యూటరు ని అదేదో అప్ గ్రేడ్ చేయండీ అన్నాడు. ఈ గొడవలన్నీ నాకెక్కడ తెలుస్తాయీ? నేనేమైనా మీ అందరిలాగా కంప్యూటర్లలో పుట్టానా పెరిగానా? ఏదో వీధిన పడకుండా, నా మిడిమిడి జ్ఞానాన్ని బయటపెట్టుకునేఅగత్యం లేకుండా, లాగించేస్తున్నాను. అలాగని మధ్యమధ్యలో గుర్రాల్లాగ “మెడ్డువారీలు” చేస్తే ఎలాగ మరి? ఈ ” మెడ్డువారీలు” అంటే ఏమిటండీ అని అడుగుతారు. మా చిన్నప్పుడు, ఒంటెద్దు బళ్ళ తో పాటు, గుర్రబ్బళ్ళని కూడా ఉండేవి. గుర్రం తో నడిపేవారు. ఏదో పాతసినిమాల్లో తప్ప కనిపించవు. ఆ గుర్రాలకి సడెన్ గా మూడ్ మారిపోయి, పరిగెత్తడం మానేసేవి. బండి కి కట్టున్నా సరే, రోడ్డుమధ్యలో ఆగిపోయేవి. ఈ ప్రక్రియనే “మెడ్డువారీ” అనేవారు. తప్పేదైనా అంటే కరెక్టు చేయండి.

   ఏదో మా దారిన మేమున్నాము కాబట్టి, ఈ వేషాలన్నీనూ. ఇదివరకటి రోజుల్లో మా ఇంట్లో ఉండే డెస్క్ టాప్, పిల్లల బెడ్రూంలో ఉండేది. మనకి ఈ కంప్యూటర్లూ కథా కమామీషూ తెలియనప్పుడైతే పరవా లేదు కానీ, ఓసారి తెలిసిన తరువాత, అస్తమానూ “కెలక” బుధ్ధేస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు, కొడుకూ, కోడలూ ఉండే రూం లోకి వెళ్ళడం బాగోదు కదా, అలాగని వాళ్ళేమైనా అంటారనికాదూ, ఏదో చిన్నప్పటినుంచీ అబ్బిన సంస్కారం. ప్రొద్దుటే వాళ్ళిద్దరూ ఆఫీసులకెప్పుడెళ్ళిపోతారూ, మనం కంప్యూటరు దగ్గర ఎప్పుడూ కూర్చుందామూ అనే ఆలోచన. ఇంక వీకెండ్లొచ్చాయంటే, అడగఖ్ఖర్లేదు. పోనీ అప్పుడైనా చూద్దామా, పిల్లలు ఏ బయటకెళ్ళినప్పుడో అనుకుందామా అంటే, డాడీ అందరం కలిసి బయటకెళ్దామేమిటీ అంటారు. అసలు ఈ గొడవలేమీ లేకుండా, హాయిగా ఆ కంప్యూటరు ని అందరూ ఉపయోగించుకునేటట్టుగా ఏ హాల్లోనో పెట్టేసికుంటే ఎంత బావుంటుందీ?ఇప్పుడసలా గొడవే లేదు. ఇంట్లో మూడు లాప్ టాప్పులు. మా కోడలూ, అబ్బాయీ , ఎప్పుడు కావలిసిస్తే అప్పుడుపయోగించుకోండి అంటారు. వాళ్ళకీ ఓ నమ్మకం, ఈయన వీటినేమీ తగలేయడూ అని !! వాళ్ళు మాకు ఆ ఫ్రీడం ఇచ్చారు కాబట్టే కదా ఈమాత్రం నేర్చుకున్నామూ?

    మరీ ” బాగ్ బాన్” సినిమాలోలాగ, ఏ అర్ధరాత్రి కీబోర్డు నొక్కినా చప్పుడైనా అవదు. మన పెద్దవారి ఏ కూతురో, ఎక్కడో అమెరికాలోనో, ఇంగ్లాండు లోనో ఉందనుకుందాము. ఆ పిల్లలకి అమ్మా నాన్న లతో మాట్టాడడానికి ఏ అర్ధరాత్రో తప్ప వీలవదూ. ఈ డెస్క్ టాప్ కొడుకు బెడ్ రూం లో ఉంటే, ఈ సౌకర్యాలన్నీ ఎలా వీలౌతాయీ? అంత కంప్యూటరు లేకుండా రోజే వెళ్ళదా అనకండి. పెద్దాళ్ళకి అదో వ్యాపకం మరి. ఇదివరకటి రోజుల్లో సైకిలు లేని ఇల్లు ఎలా లేదో, అలాగే ఈ రోజుల్లో కంప్యూటరు లేని కొంప లేదు. ఇందులో ఇంకో సౌలభ్యం ఉంది, ఒక్కసారి కంప్యూటరు వ్యసనానికి అలవాటు పడ్డారంటే, ఈ పెద్దాళ్ళు, హాయిగా ఇంటి పట్టునుంటారు. రోజంతా దిక్కుమాలిన టివీ చూడమనడం కంటే ఇదో option కూడా ఉంటే బావుంటుందిగా. వాళ్ళేమీ ఏదో బయట ట్రినింగులకెళ్ళి దేశాన్ని ఉధ్ధరించేద్దామనే ఉద్దేశ్యాలేమీ ఉండవు. ఏదో మీకు వీలున్నప్పుడు, ఓసారి basics నేర్పేస్తే చాలు, భార్యాభర్తలిద్దరూ వాళ్ళ పాట్లు వాళ్ళు పడతారు. ఇంత వయస్సొచ్చి, ఇంత అనుభవం వచ్చేక, ఆ మాత్రం కంప్యూటరు నేర్చుకోడం బ్రహ్మవిద్యేమీ కాదు.

    ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే, ఇంట్లో అంటూ కంప్యూటరంటూ ఉంటే, దాన్ని మరీ బెడ్రూమ్ముల్లో పెట్టేయకండి. కాదంటారూ, ఓ లాప్ టాప్ కొనిచ్చేయండి. ఆమాత్రం కొనగలరు, ఈరోజుల్లో చేసే ఖర్చుల్లో ఇదేపాటిది? అప్పుడు చూడండి, మీ అమ్మా నాన్నలెలా ఉంటారో? ఇదేమిటి మీరూ, ప్రపంచం లో ఉన్న పెద్దాళ్ళందరి తరఫునా వకాల్తా పుచ్చుకున్నారా, మా గొడవలేవో మేము పడతామంటారా మీ ఇష్టం… కంప్యూటరు హాల్లో పెట్టండర్రా అని మరీ అడగలేరు వాళ్ళు. మీరే వారి చిన్న చిన్న కోరికలు గమనిస్తూ ఉండాలి…and watch the change...

Advertisements

5 Responses

 1. గది గదికొక టి.వి,
  లేక పోతే గడవని రోజులండి ఇవి!
  తర తరానికొక డెస్క్టాప్,
  ఒడి ఒడికొక లాప్టాప్,
  ఉంటేనే అవుతుందండి లైఫ్ టాప్!
  ప్రక్క గది నుంచైనా కోడలు
  ఆన్లైన్ పంపాలంటే డైవోర్సు
  ఉండాలండి తలతలకొక న్యుసేంసు!!

  Like

 2. @మోహన్ గారూ,

  ఏమిటీ ఈమధ్యన, మీ ” కవితా హృదయం” ఉప్పొంగిపోతోంది….

  @ఫణీంద్ర,

  థాంక్స్…

  Like

 3. ఫణిబాబు గారూ మరి అంతవెంటనే నా అవసరము అందరి దృష్టికి తెచ్చేసారే

  కృతజ్నతలు.వాస్తవం తెలియచేసారు చాలా చాలా బాగుంది. ==శాస్త్రి==

  Like

 4. శాస్త్రిగారూ,

  ఎవరో ఒకరు చెప్పాలి కదండీ….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: