బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–almost సుఖపడిపోయాననుకున్నాను….


    వేసంకాలం వచ్చిందంటే నాకు “పరీక్షాకాలం”. ఈ బ్లాగుల ప్రపంచంలోకి ప్రవేశించిన తరువాత, నా ఈతిబాధలు ,వేసంకాలంలో వచ్చేవాటిని గురించి, ఇదివరలో 2010 లో ఒక టపా, 2011 లో ఒక టపా వ్రాశాను. మనలో ఉండే బాధని బయట పెట్టేసికుంటే అదో ఆనందం. అందువల్లనే ఆ టపాలు వ్రాశాను. మొదటి దానికి కౌంటరు పెడుతూ మా ఇంటావిడ కూడా ఓ టపా వ్రాసింది. తూగోజి, పగోజి వారు, తమతమ పార్టీలని సమర్ధించేసికున్నారు. మళ్ళీ ఈ ఏడాదేమౌతుందో అని , I kept my fingers crossed….ఎప్పుడో ఆర్డరు వేసేస్తుంది, మామిడికాయలూ… అంటూ సాగదీసుకుంటూ…, ఆ శుభముహూర్తం ఎప్పుడా అని ఎదురుచూడ్డం తప్ప ఏం చేస్తాను? పైగా ఉన్నదేదో చాలక, నేనే ఎందుకు ఎత్తాలి? కావల్సొస్తే తనే అడుగుతుంది. అయినా ఇంకా నూనె, కారం, ఆవపిండి, తెమ్మని అడగే లేదూ, ఏమిటి చెప్మా..

    చాలామందికి గుర్తుండేఉందనుకుంటాను, స్కూళ్ళలో చదివేటప్పుడు, ఒకటో ఫారం నుండి అయిదో ఫారం దాకా ప్రతీ నెలా స్లిప్ టెస్టులూ ( వాటినే యూనిట్ టెస్ట్ లని కొద్దిగా మొడర్నైజు చేశారు), క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, చివరగా యాన్యుఅల్ పరీక్షలు. ఆ వాతావరణం లోనే పెరిగి పెద్దయ్యాము. రోజులన్నీ ఒకేలా ఉండవుగా, ఆ తరువాత అదేదో క్లాసులోనే Annual అన్నారు. అలా కాలక్రమేణా ప్రస్తుతం టెన్త్ దాకా అసలు పరీక్షలే లేవంటున్నారు. అమ్మయ్య సుఖపడ్డారనుకున్నాను. ఏమిటో, దేనికైనా పెట్టిపుట్టాలంటాను. మారోజుల్లో ఇలా ఉండి ఉంటే ఎంత బావుండేదో కదా… ఏదో నెలనెలా పరీక్షల ధర్మాన్నైనా, ఆమాత్రం చదువు వంటబట్టుండొచ్చు, లేకపోతే నాలాటివాళ్ళెక్కడుండేవారో…

    నాలాటి వాళ్ళకి పరీక్షాకాలం ఒక్క వేసంకాలంలోనేలెండి. నా పై టపాలు చదివితే తెలుస్తుంది. అలాటిది సడెన్ గా మా ఇంటావిడ, ఈ ఏడాది ఆవకాయ పెట్టడంలేదూ అని ఓ historic announcement చేసేసింది. కారణం మరేమీ లేదు, కిందటేడాది అబ్బాయికిచ్చిన సీసాడు ఆవకాయా, ఇంకా అలాగే ఉంది. ఆమధ్యన మా ఇంటికెళ్ళినప్పుడు చూసింది. కోడలు చెప్పేదాంట్లోనూ పాయింటుంది, ఇదివరకటి రోజుల్లో లాగ ఇప్పుడు, రోజూ ఆవకాయ ఎవరు వేసికుంటున్నారూ, ప్రతీ రోజూ నియమంగా భోజనం చేయడానికే టైముండడం లేదు, ఈ tenderleaves.com ధర్మమా అని. మేమా ఇదివరకటిలాగ, ప్రతీ వారం వెళ్ళడం లేదు, కొంచమైనా చెల్లుబాటవడానికి. ఇంక మా అమ్మాయి సంగతంటారా, అక్కడ తనొక్కత్తే వేసికుంటుంది. ఆతావేతా తేలిందేమిటంటే, మా ఇంట్లో కూడా అలాగే ఉండిపోయింది. ఇద్దరికి ఓ పేద్ద సీసాడావకాయ ఎక్కీ తొక్కీనూ… సదరు కారణాల పరిణామమే ఆ historic announcement కి కారణం.

    కారణం ఏదైతేనేం ఈ ఏడాదికి మనకి పరీక్షలు క్యాన్సిల్…It really calls for celebration.. అని అనుకోబోయి, మరీ సంతోషించలేదు నయం !ఈమధ్యన అబ్బాయీ,కోడలూ, మనవరాలూ, మనవడూ ఎక్కడికో long drive కి వెళ్ళి, వచ్చేటప్పుడు, ఎక్కడో మామిడి చెట్లు కనిపించాయిట, అవన్నీ కోసి, ఓ పాతిక, ముఫ్ఫై కాయలు తెచ్చారు. వాళ్ళేం చేసుకుంటారు అన్ని కాయలు, ఉందిగా మా ఇంటావిడ, కార్లో వేసికుని తెచ్చి, మా ఇంట్లో పెట్టారు. ఇంక మా ఇంటావిడకి అన్ని కాయలు చూసేసరికి “ పూనకం” వచ్చేస్తుంది. అబ్బ ఎంత బావున్నాయో కాయలు, అసలు కాయలంటేఇలా ఉండాలీ… వగైరా ..వగైరాలు మొదలెట్టింది. ఈ నలభై ఏళ్ళలోనూ, ఆవిడ నోటంట ఒక్కసారంటే, ఒక్కసారి ఇలాటి సెభాసీ వినాలని, ఎంత తహతహ లాడిపోయానో అసలావిడకు తెలుసా?
కొడుకు తెస్తే బావున్నట్టా, కట్టుకున్నవాడు తెస్తే ఎప్పుడూ సణుగుడా, ఏం చేస్తాం లెండి.

    రాత్రికి రాత్రి అవన్నీ కడిగేసి, నన్ను బయటకి పంపి ఉప్పు తెప్పించి, ఓ కత్తిపీట ( నేను మా కొత్తకాపరంలో 1972 లో కొన్న మొట్టమొదటిది!) ముందేసికుని, కస్ ..కస్.. మంటూ తరిగేసి, అలా తరిగిన ప్రతీ కాయకూ, అబ్బ టెంకంటే ఇలా ఉండాలి అంటూ మోనోలాగ్గులూ, నాతో డయలాగ్గులూ, మొత్తానికి వాటి షేప్ మార్చేసి ఉప్పులో పడేసింది. ఓ రెండు రోజులు ఊట పూర్తిగా కారనిచ్చి, ఇంక ఎండలో పెట్టడం తరవాయి అంది. నేనేమో ప్రొద్దుటే, లేచి, లిఫ్ట్ పనిచేయకపోవడం వల్ల మెట్లన్నీ దిగి కిందకెళ్ళి, వాచ్ మన్ దగ్గర టెర్రెస్ తాళం తీసికోడం, ఆ ఎండలో ఈ ముక్కల్ని పెట్టడం. పైగా తనేమో ఏ.సి. పెట్టుకుని హాయిగా ఉంటుంది, నేనేమో బయటేమైనా మేఘం పడుతుందేమో, ఏ జల్లైనా పడితే, ముక్కలన్నీ తగలడిపోతాయి అనుకుంటూ, కూర్చోడమూ, ఇంట్లోనేలెండి. కానీ అది కూడా ఓ పనేగా మరి! మొత్తానికి నాలుగు రోజులు ఎండలో పెట్టేసరికి ” ఒరుగులు” తయారైపోయాయి. ఇంతా చేసి అన్ని మామిడి కాయలూ ఓ డబ్బాడు తయారయ్యాయి, అవి ఏ మూలకీ? నిన్న కోడలొచ్చేసరికి అవన్నీ తనకిచ్చేసింది. ఇంక కూతురికోసం తయారు చేయొద్దూ, ఇదిగో ఈవేళ పంపి, ఓ పాతిక్కాయలు తెప్పించింది. మళ్ళీ రేపణ్ణించి Action Replay– టెర్రేసూ, తాళం చెవీ, లిఫ్ట్ పని చేయకపోడం, మేఘాలూ etc..etc..

    ఇవన్నీ ఎవడికీ కనిపించవు. అమ్మ అంత కష్టపడిపోతుందీ, మాకోసం ఏడాదికి సరిపడా “ఒరుగులు” చేసిందో అని ఆవిడ tangible కష్టాలు కనిపిస్తాయి కానీ, నేను పడ్డ intangible తిప్పలు మాత్రం ఎవరికీ కనిపించదు. ఏం చేస్తాను? పోన్లెద్దురూ పిల్లలు ఏడాదంతా, ఎప్పుడు కావలిసొస్తే అప్పుడు, మావిడికాయ పప్పులో వేసికుంటున్నారా లేదా….

Advertisements

10 Responses

 1. ఫణి బాబు గారూ మీ ఆవకాయ అనుభవాలు 2010 ,2011 2012 చూసాను

  ఏ ఏటికి అ ఏడు మామిడికాయల ఎంపికలో అనుభవం సంపాదించారు శభాష్

  ==శాస్త్రి==

  Like

 2. భలే భలే బాగున్నాయి మీ కష్టాలు

  Like

 3. బాతా ఖానీ ఫణి గారు,

  కనిపించే కష్టాల గురించి, కనిపించని బాధల గురించి, మీరు కనిపించే టపా వ్రాసి, మా చేత కనిపించని కామెంటు కొట్ట నిచ్చి మొత్తం మీద కనిపించే రాగాలే, కనిపించని హృదయాలే అనిపించేరు సుమీ !

  చీర్స్
  జిలేబి.

  Like

 4. “సీత కష్టాలు సీతవి,
  పీత కష్టాలు పీతవి”
  అని ఊరికే అన్నారని అను కున్నారా?
  “కష్టే ఫలి”అని కూడా అన్నారేమో కదా?

  Like

 5. మామిడి ఒరుగులను దక్షిణాదిన
  మామిడి ఉప్పు చెక్కలని అంటారు
  చూపించి నోరు వూరించినందుకు
  మా అమ్మమ్మను గుర్తుకు తెచ్చినందుకు,
  చాలా చాలా కృతజ్ఞతలు!

  Like

 6. నాలుగు పదుల అనుభవం,
  మీదీ, మీ కత్తిపీటదీనూ,
  వరిష్టుల అనుభవం వృధా పోదు!

  Like

 7. @శాస్త్రి గారూ,

  మీకు ఈ మూడేళ్ళవే కనిపించాయి. నలభై ఏళ్ళలో బాగానే ఇంప్రూవ్ అయ్యాను సారూ…..

  @ఫణీంద్ర,

  థాంక్స్..

  @నిరుపమా,

  ఔనమ్మా చదివేవాళ్ళకి బాగానే ఉంటాయి….

  @జిలేబీ,

  యతి ప్రాసలకి మీకు సరిపడే “జోడి” లేదు…..

  @మోహన్ గారూ,

  అన్నేసి వ్యాఖ్యలా మరీనూ… మీ అమ్మమ్మగారిని గుర్తుచేయకలిగినందుకు చాలా సంతోషంగా ఉంది.

  Like

 8. హ హ హ నవ్వలేకపోయానంటే నమ్మండి…….

  మొత్తనికి Historic Announcement కూడా మీ కష్టాలని తీర్చలేదంటారు…

  అయినా అంటే అన్నామంటారు కానీ ఏ చలి కాలం లొనో మావిడికాయ పప్పు తినాలని మీకనిపిస్తే చేసి పెట్టేది ఎవరండీ… అలాంటి కోరికలు తీరాలంటే ఇలాంటి చిన్న చిన్న కష్టాలు లెక్క చేయకూడదు మరి…

  Like

 9. మాధవీ,

  ఆ “చలికాలం” గుర్తొచ్చేకదా ఇలాటి “హమాలీ” పనులన్నీ చేసేది…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: