బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- అమ్మమ్మలూ నాన్నమ్మలూ


   గత వారం రోజులనుండీ, నేనూ, మా ఇంటావిడా బిజీ అయిపోయాము. నేనైతే, కొంతలోకొంత, ఒకటో రెండో టపాలు పోస్ట్ చేసికోకలిగాను. మా ఇంటావిడకి ఆ ఛాన్సుకూడా రాలేదు, ఆవిడకి మా మనవడు అగస్థ్యతోనే సరిపోతుంది. వాడేమో, ఈవిడని చూడ్డం తరవాయి, మీదకెక్కేస్తాడు. ఉండడం అంటే, ఇంకో ఫ్లాట్ లో ఉంటున్నాము కానీ, ఈవిడకెప్పుడూ వాడి ధ్యాసే! ఏదో ఊళ్ళోనే ఉంటున్నాం కాబట్టి సరిపోయింది కానీ, అదే ఏ రాజమండ్రీలోనో ఉండి ఉన్నట్లైతే, నా ప్రాణం మీదకొచ్చేది, నా పెన్షనంతా రైలు ప్రయాణాలకే అయ్యేది.పైగా మా ఇంటావిడకి సీనియర్ సిటిజెన్ల కన్సెషన్ కూడా లేదు. ఇప్పుడు, ఓ ఆటోలో తీసికెళ్తే చాలు! అందుకే అంటారు, ఏది ఎలా జరిగినా మన మంచికే అని.

    ప్రపంచం లో ఆడవారికి ఎంత ఓర్పూ సహనం ఉంటుందో, ప్రత్యక్షంగా చూస్తేనే కానీ తెలియదు.అలా దగ్గరగా చూసే ముహూర్తం ఎప్పుడు వస్తుందిట,రిటైరయిన తరువాతే.అసలు భార్యలో ఉండే సుగుణాలన్నీ తెలిసికునే సమయం ఎక్కడేడిచిందీ ఉద్యోగం చేసినంత కాలం? ఏదొ సంపాదిస్తున్నాము,వండి పారేస్తోందీ,పిల్లల బాగోగులు చూసుకుంటోందీ అనే కానీ,వాళ్ళకీ ఏవెవో చిన్న చిన్న కోరికలుంటాయీ అని ఎప్పుడైనా అలోచిస్తామా?మనకైతే ప్రభుత్వం వారి ధర్మమా అని ఓ రిటైరుమెంటోటి ఉంది,మరి వాళ్ళకీ? పెళ్ళైయేదాకా,ఇంట్లో పెద్ద పిల్లైతే చెల్లెళ్ళకీ,తమ్ముళ్ళకీ సేవ చేయడం,ఆ తరువాత కట్టుకున్నవాడికీ,కన్న పిల్లలకీ చేయడం,ఆ తరువాత మనవళ్ళకీ,మనవరాళ్ళకీ చేయడం.ఈ లోపులో అత్త మామలుకూడా ఉంటే,వాళ్ళొకళ్ళు.ఆతావేతా జీవితకాలం అంతా సేవ చేయడం తోటే సరిపోతుంది. అసలు ఈ ఆడవాళ్ళకి అంత ఓపికా,సహనం ఎక్కడనుండి వస్తుందో తెలియదు.

   మనం రిటైరయ్యాక ఓ పెద్దరికం ఒకటి కట్టబెట్టేయడం తో బతికిపోయాము. లేకపోతే తెలిసేది ఇప్పటి పసిపిల్లల్ని అదీ 1-4 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో? వామ్మోయ్ వాళ్ళు పిల్లలా పిడుగులా!వాళ్ళవెనక్కాలే పరిగెత్తే ఓపిక లేదు. పైగా ప్రాక్టీసుకూడా తక్కువ, ఉద్యోగంలో ఉన్నప్పుడైతే ఏదో వంకుండేది. ఆఫీసులో ‘సో కాల్డ్ టైరైపోయి రావడం’ అనేది. టైరూ లేదూ సింగినాదం లేదూ, ఉత్తి పోజు! గవర్నమెంటు ఆఫీస్సులో పని చేసి, మగాళ్ళెవరూ టైరైపోవడం నేనైతే ఎప్పుడూ చూడలేదండోయ్.ఎప్పటి పని (ఆఫీసులో) అప్పుడు చేసేసికుంటే టైరెందుకవుతారూ? వాడితోటీ వీడితోటీ హస్కేసుకుని కూర్చుంటే చెప్పలేము. మా బాస్ అనేవారు- నో బడీ డైస్ ఆఫ్ ఓవర్ వర్క్ ఇన్ గవర్నమెంట్-అని!ఆఫిసునుండి, కొంపకి చేరడానికి ట్రాఫిక్కులో ఇరుక్కుపోవడం టైరైపోవడం అంటే చేసేదేమీ లెదు.ఆఫీసుల్లో పనిచేసే ఆడవారి సంగతేమిటి మరి?

   ఇంక ఇప్పటి నానమ్మలు/అమ్మమ్మల సంగతికొస్తే,వామ్మోయ్ మనవలతో ఎన్నెన్ని ఆసనాలూ,డాన్సులూ చేయాలో, నాకు మాత్రం అంత ఓపికలేదు బాబూ.ఏదో ముస్తాబు చేసి, ఏ ప్రామ్ లోనో కూర్చోబెడితే, బయటకి తీసికెళ్ళి తిప్పమంటే మాత్రం రెడీ!అంతేకానీ అస్తమానూ చంకెక్కుతానంటే మాత్రం ఎత్తుకోలేను. ఈ పిల్లలు పూర్తిగా నడక రాదూ,నడవాలని తాపత్రయం. మధ్యలో ఏదో చేస్తారు, బట్టలు మార్చాలి, పోనీ ఏదో సహాయం చేద్దామా అని అనుకున్నా, వాళ్ళు మనచేతిలో ఉండరూ, ‘ఏమిటండీ ఒక్కసారి పట్టుకోమంటే అంత హడావిడి చేసేస్తారూ’ అంటూ చివాట్లూ!ఏదో ఒక్కసారి నిద్రపోగొట్టుదామా అనుకున్నా, ఊరికే ఏడుస్తాడు. వాణ్ణి సముదాయించడం ఓ పేద్ద టాస్క్. ‘ఏడవకమ్మా, దాయి దాయి…’అనాలికానీ,ఊరికే వాడిమీదలా అరిస్తే వింటాడా? అని మళ్ళీ క్లాసూ.ఎందుకొచ్చిన రిటైర్మెంటయ్యా భగవంతుడా, హాయిగా ఉద్యోగంలో ఉన్నప్పుడే బావుండేది అని విసుపూ!

   రోజులో ఒక్క గంట ఆ చిన్న పిల్లల్ని సముదాయించలెని బ్రతుకూ ఓ బ్రతుకేనా అని అనుకుందామన్నా, అమ్మో రోజంతా చూడమంటే, ఏదో ‘మమ’ అని ఒకసారి అనుకుంటే పోతుంది.లేనిపోని గొడవల్లోకి వెళ్ళకూడదు!నూటికి తొంభైతొమ్మిది మంది అమ్మమ్మలూ, నానమ్మలూ, ఎంత నడుంనొప్పివస్తున్నా సరే, ఎంతంత గూళ్ళనొప్పి వస్తున్నా సరే, ఎంతంత మోకాళ్ళ నొప్పి వస్తున్నా సరే, ఈ చిన్న పిల్లల్ని చూడ్డం మాత్రం మానరు.’నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలోయ్’ అన్నా సరే
‘పోనిద్దురూ, మనమేమీ రోజూ చూస్తున్నామా ఏమిటీ, ఏదో ఇలా అవసరం పడినప్పుడు అడుగుతారు పిల్లలు, వాళ్ళేం పరాయివాళ్ళా ఏమిటీ’ అని మనల్ని వీటో చేసేస్తారు!చివరకి మన మాటే మిగిలిపోతుంది కానీ, వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. అదీ ఈ నానమ్మల/అమ్మమ్మల గ్రేట్ నెస్!
నూటికి తొంభైతొమ్మిది అన్నానే, ఆ మిగిలిన ఒక పెర్సెంటు వాళ్ళనీ చూశాను. ముందరే చెప్పేస్తారు, మీ పిల్లలకి నడకా మాటా వచ్చేదాకా మేం చూళ్ళేమమ్మొయ్ అని! నడకా మాటా వస్తే, మనం చూసేదేమిటీ, వాళ్ళే మనల్ని చూస్తారు!
వాళ్ళగురించి ఇంకో టపాలో!
.

4 Responses

 1. నేనూ నాన్నమ్మనే! సరిగ్గా వ్రాసారు. ఇప్పటి పిల్లలతో నానమ్మలు, తాతలు వాళ్ళలాగా ఆడుకోవాల్సి వస్తోంది. ఓపిక లేకపోయినా ప్రేమకొద్దీ చెయ్యాల్సి వస్తుంది.

  Like

 2. మాస్టారు, నిజంగా కుటుంబ జీవితంలోని ఒక పరమసూత్రాన్ని ఆవిష్కరించారు ఈ టపాలో.

  Like

 3. మా అత్తయ్య కి,లేని ఆరోగ్య సమస్య లేదు.ఐనా సరే,అవిడ మనవడిని ఎత్తుకుని తిరిగేస్తుంది.మాకు మాత్రం,ఆ నొప్పి,ఈ నొప్పి అని ఫోన్లు.చెప్తే వినరు. ప్రేమ వుండొచు కాని అతి తగదు.

  Like

 4. @శుభ గారూ,

  మీ అందరి జన్మలూ సార్ధకం చేసికుంటున్నారమ్మా!

  @కొత్తపాళీ గారు,

  మరీ అంతంత పెద్దమాటలొద్దు.నేను ప్రత్యక్షంగా చూస్తున్నదేదో, వ్రాయాలనిపించింది.

  @నిరుపమా,,

  అదేనమ్మా వీరిలో ఉన్న గ్రేట్ నెస్ !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: