బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అవేవో soft skills ట…


ఏమిటో ఈరోజుల్లో ఎవరినోట విన్నా ఇదేమాట.. ప్రెవేటు కంపెనీలో ఉద్యోగానికి వెళ్తే ముందర  ఈ  soft skills  అనేవున్నాయా లేదా చూస్తారుట.. ఎంతైనా మట్టిబుర్రకదా, దీనర్ధమేమి తిరుమలేశా అని వెదికితే ”  Soft skills is a synonym for “people skills.” The term describes those personal attributes that indicate a high level of emotional intelligence” అని తెలిసింది. EQ  గురించి ఇక్కడ చదివాను.. ఓరి మీ ఇల్లుబంగారంగానూ ఇదన్నమాట అని నవ్వుకున్నాను.  వీటిని skills  అంటారన్నమాట. మా చిన్నప్పుడు ఏదో ఒక విషయంలో ఇలాటివి లేని మనుషులే ఉండేవారు కాదూ. ఇప్పుడంటే గూగులమ్మలూ వాళ్ళూ వచ్చేసి, ప్రతీదానికీ బధ్ధకం పెంచేశారు కానీ, ఆరోజుల్లో ఇలాటివేమైనా చూశామా పెట్టామా? ఈరోజుల్లో ప్రతీదానికీ, తుమ్ముకీ దగ్గుకీ ఆ గూగులమ్మే దిక్కు. ఏదైనా అవసరం వస్తే, ఆ  Just Dial  కి ఫోనుచేసి నెంబరడగడం. పాపం పాపాల భైరవుడిలా, తద్దినాలకి బ్రాహ్మలు ఎక్కడ దొరుకుతారో దగ్గరనుంచి ప్రతీదానికీ శాంతంగా వివరాలందిస్తాడు కాబట్టి, కాలక్షేపం చేసేస్తున్నారు ఈనాటి యువతరం , వీధిన పడకుండా.

కానీ ఇలాటి సదుపాయాలు లేకుండానే . ఆరోజుల్లో ప్రతీ ఇంట్లోనూ ఎవరో ఒకరికి ఉండేవే, ఆడ, మగ వారికి. అలాగని వారు వాటిని స్వార్ధంతో కాకుండా, అందరికీ ఉపయోగించేవారు. ఒక్కోప్పుడు చిరాగ్గానూ ఉండేది అనుకోండి.కొన్ని ఉదాహరణలు చూద్దాం– ఓ ఇంట్లో ఒకావిడకి అప్పడాలూ, ఒడియాలూ పెట్టడం వెన్నతో నేర్పిన విద్య. ఆ విషయం,  అందరికీ ఎలా తెలుసూ అనకండి, వాటిని ఏ నులకమంచంమీదొ, ఎండలో ఆరపెట్టినప్పుడు, పక్షులురాకుండా ఆవిడే చూసుకునేది. వీధిలో పోయేవారందరికీ తెలిసేది ఓహో ఈ తల్లేనన్నమాట అప్పడాలు పెట్టిందీ, అందుకేనేమో ఆ ఎండలో చూరుకింద కూర్చుని కాకుల్ని తోలుతోందీ..ఆ అప్పడాలుకూడా వీధివీధంతా తలో పదో పంచేవారు. దానితో ఆవిడకి అప్పడాలు/  ఒడియాలు పిన్నిగారని పేరొచ్చేసేది. దానితో ఆ అగ్రహారంలో ఎవరింట్లో అప్పడాలూ, ఒడియాలు ( పిండివీ, బూడిదగుమ్మిడికాయవీ, రెండు వెరైటీలూ ) పెట్టాలన్నా ఆవిడకే కబురెట్టేవారు. అప్పడాల పిన్నిగారని పేరొచ్చేసింది.అలాగే ఆ ఇంటి పెద్ద గారు పనసపొట్టు కొట్టడంలో సిధ్ధహస్తులు.. అదేమైనా ఆషామాషీ పనా? ఎంత ఒడుపుండాలీ?  ఆ పొట్టుతో . ఆవపెట్టి కూర చేస్తే, వెన్నలా గొంతుకలోకి వెళ్ళాలి. అదీ పనసపొట్టంటే. . అంతేనే కానీ ఈరోజుల్లోలాగ గ్రైండర్ లో తిప్పే పొట్టూ పొట్టేనా?అవేవో పీసుల్లా ఉంటాయి.PPottu

PPP2

సో ఆ మాస్టారుకి ఆ వీధివీధంతా అభిమానులైపోయేవారు. ఎంతదాకా వచ్చిందంటే, ఎవరైనా వచ్చి  ఫలానా సుబ్బారావుగారిల్లు ఎక్కడా అంటే చెప్పలేరు కానీ, పనసపొట్టు మాస్టారంటే ఠక్కున చెప్పేసేవారు. ఆ ఊళ్ళో ఎక్కడ పెళ్ళి జరిగినా, సంతర్పణ జరిగినా పనసపొట్టు మాత్రం మాస్టారే కొట్టాలి.

 ఎవరికైనా కాలు బెణికినా, తేలు కుట్టినా అదేదో తేలుమంత్రం, ఇరుకు మంత్రం వేసే అమ్మమ్మలూ, బామ్మలూ ఉండేవారు. అలాగే ఏ కావిర్లో వస్తే , ఫలానా మాస్టారి ఇచ్చే ఆకు పసరు పడితేనే తగ్గేది. ఇవన్నీ  soft skills  కాక మరేమిటంటారూ?

ఇవే కాకుండా ఇంకొన్నుండేవి. ఆరోజుల్లో బ్యాటరీ లైట్లుండేవి.  వాటి ఉపయోగాలుకూడా ఎక్కువగానే  ఉండేవి. పెరట్లో కి వెళ్ళడానికో, చీకట్లో ఏ పొలం గట్లవెంట వెళ్ళేటప్పుడో ఉపయోగించేవారు.కానీ, దాన్ని ఎక్కువగా ఉపయోగించక ఓ మూలన పడెస్తే, కొద్దిరోజులకి ఆ బ్యాటరీలు నీరు కారిపోయి, ఎటూ కాకుండా పోయేవి. ఏ ఆదివారం పూటో, ఇంటిపెద్దగారు దీనిసంగతేదో తేలుద్దామని, ఓ సీసామూతలో కిరసనాయిలూ, ఇంకో  మూతలో  కొబ్బరి నూనె, ఓ పాతగుడ్డా పెట్టుకుని. ఆ బ్యాటరీలు తీసేసి, శుభ్రంగా తుడిచి,  దానికున్న బొడిపె దగ్గర ఓసారి ఏ సీనారేకుతోనో గీకి, కొత్త బ్యాటరీలు వేసేసరికి లక్షణంగా వెలిగేది. వీధివీధంతా , వీళ్ళింట్లో పాడైపోయిన బ్యాటరీ లైటు  బాగుచేసేరని తెలిసిపోయేది. ఎవరిద్వారా అంటారా, పనిమనుషులద్వారా. ఇంకేముందీ ఆ వీధిలో ఉండే పాడైపోయిన బ్యాటరీ లైట్లన్నీ వీళ్ళింట్లో ప్రత్యక్షం. కొందరు స్వయంగా తెచ్చీ, కొందరు వారి పిల్లలతో ” మా నాన్న దీన్నోసారి చూడమన్నారు.. ” అంటూనూ. పైగా ఏ బజారులోనో, సంతలోనో కనిపించినప్పుడు హక్కుగా అడగడమోటీ..” బ్యాటరీ లైటు ఎంతదాకా వచ్చిందీ..” అంటూ..

ఈవేళ్టికివి చాలు.. మరికొన్ని  soft skills  ఇంకో టపాలో….

4 Responses

  1. సాఫ్టు స్కిల్లు గూర్చి సాపుగ జెప్పిరి
    బెష్టు e- జిలేబి భేషు భేషు !
    నాటి కథల నున్న నాజూకు లేవిర
    నేటి కాల నరుడు ‘నెట్టు’ లోడు 🙂

    జిలేబి

    Like

  2. తెలుగు లో ఏమంటారో మరి soft skills ని.ప్రత్యేక నైపుణ్యమా?మీ పుణ్యమాని పొద్దున్నే ఆరోగ్యకరంగా నవ్వాను.ముహూర్తాల బామ్మలూ,శకునాల శాస్త్రులూ,వాస్తు వీరులూ మరికొందరు.

    Like

  3. సాఫ్ట్ స్కిల్స్ అంటే మరేమీ లేదండి.
    “బతక నేర్చటం” – అంతే!

    Like

  4. జిలేబీ,

    As usual, మీకు మీరే సాటి.

    రాధారావు గారూ,

    లాఫింగ్ క్లబ్బుల అవసరం లేకుందా నవ్వగలిగారు, సంతోషం..

    బోనగిరిగారూ,

    ఈనాటి డిక్షనరీ అర్ధం మాస్టారూ అది.

    Like

Leave a comment