బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- ఏమైనా One day వండరా?

ఈ టపా మొన్నటి రోజునే రాద్దామనుకున్నాను. కానీ పాఠకుల మనోభావాలేమైనా hurt  అవుతాయేమో అని నోరుమూసుక్కూర్చున్నాను. అసలు అర్ధం ఏమైనా ఉందా? ” అమ్మ ” గురించి అసలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటీ? అదీ సంవత్సరంలో ఒక్కరోజా? అసలు బుధ్ధి అనేదేమైనా ఉందా? మన అస్థిత్వానికే కారణభూతురాలైన ” అమ్మ” గురించి . ఆ ఒక్కరోజే  గుర్తుచేసికోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామన్నమాట.మనకి జన్మ ఇచ్చినప్పటినుండీ, ఒళ్ళు దాచుకోకుండా, ఒక్కమాటనకుండా , ఒంట్లో ఓపికున్నంతకాలమూ, తన పిల్లలకీ, వాళ్ళ పిల్లలకీ, ఇంకా బతికుంటే వాళ్ళ  వాళ్ళ పిల్లలకీ సేవలు చేయడమే. ఏ విదేశాల్లోనో ఉండే పిల్లలు తమ అవసరార్ధం అంటే పురుళ్ళకీ, పుణ్యాలకీ, ” అమ్మ” నే పిలుస్తారు.  నాన్న   Buy one get one లో బాపతు. పాపం ఆ వెర్రితల్లి సప్తసముద్రాలూ దాటి, తన పిల్లల పిల్లలకి సేవలు చేస్తుంది. ఆ పసిబిడ్డకి నడుం నిలిచేటైముకో, లేక అవతలివైపు జంట వచ్చేసరికో, వీళ్ళకి రిటర్న్ ఫ్లైట్.  ప్రపంచంలో  Taken for granted  ప్రాణి అనే వ్యక్తి ఉన్నారా అంటే, ఆ వ్యక్తి  ” అమ్మ” అని ఢంకా బజాయించి చెప్పొచ్చు..

శలవలొచ్చేసరికి  అటకమీంచి ఆటసామాన్లు తీసి దులిపినట్టుగా, ఈ  Mothers Day  వచ్చేటప్పటికి, ఓ చీర కట్టి ఓ ఫొటో తీయించేసికుని, ప్రపంచం అంతా చాటుకోవడం– చూడండి మా అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటున్నామో అని. ఆవిడేమైనా ఎప్పుడైనా ఏదైనా అడిగిందా? తన పేగు చించుకొచ్చిన బిడ్డలు క్షేమంగా ఉంటే చాలనుకుంది. ఇదివరకటి రోజుల్లో బిడ్డలకి జన్మ ఇవ్వడానికి ఎన్నిసార్లు పునర్జన్మ ఎత్తిందో? పైగా ఆరోజుల్లో, ఇప్పటిలాగ ఎనెస్థీసియాలూ గట్రాకూడా ఉండేవి కావు. పళ్ళు బిగపెట్టుకుని నొప్పి సహించి, మనల్ని ఈభూమ్మీదకి తెచ్చిన తల్లి.   ఆవిడేమీ మణులూ మాణిక్యాలూ అడగలేదు. రోజుకోసారి తన బిడ్డ ఆఫీసునుంచి వచ్చేటప్పుడో, ఆఫీసుకి వెళ్ళేటప్పుడో, ఒక్కసారి… ఒక్కటంటే ఒక్కసారి  ” ఎలా ఉన్నావమ్మా..” అని అడిగితేచాలు, కొండెక్కేసినంత సంతోష పడే అల్ప సంతోషి.

అంతేకానీ, వేలంవెర్రిలా కవితలూ, ఫోటోలూ పెట్టేసికుంటే ఒక్కొక్కప్పుడు  ” అతి” గా కనిపిస్తుంది. ప్రస్తుత వాతావరణంలో ” అమ్మ ” ఓ ఫోటోకి  Model  లాగానో, లేక ఓ కథకో వ్యాసానికో ఇతివృత్తంగానో కనిపిస్తోంది.. అంతేనేకానీ, నిజంగా అమ్మమీద అభిమానం ఉన్నవారు, ఇంత పబ్లిసిటీలిచ్చుకుని, ఊరంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

ఆవిడేమైనా  One Day Wonder  కాదుగా.జన్మజన్మలకీ గుర్తుపెట్టుకోవాల్సిన తల్లి.మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక అమ్మ. ఈ సందర్భంలో… పచ్చినిజాన్ని ఆవిష్కరించిన ఓ మచ్చుతునక…

facebook_1462865064886

%d bloggers like this: