బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Benchmark

 చిన్నప్పుడు చదువుకునేరోజుల్లో ఎప్పుడూ విన్నమాట కాదు ఈ  benchmarకో, కుర్చీమార్కొ. అయినా అంత ఇంగ్లీషు ఎక్కడ వచ్చి ఏడ్చిందీ ( మనలో మనమాట). ఏదో జెవి రమణయ్య గారి గ్రామరూ , లేదా అదేదో  status symbol కోసం Wren and Martin,    గైడ్లకోసం   Lifco Guide– వీటితోనే గట్టెకించేసి, కాలేజీలో కూడా అత్తిసరు మార్కులతో డిగ్రీలు తీసికున్న బతుకులాయె.  ” H ”  ని  ” హెచ్ ” అనకూడదూ, ” ఎచ్ ” అనాలని పిల్లలదగ్గర నేర్చుకున్న అర్భకులం.మొత్తానికి వీధినపడక్కర్లేకుండా లాగించేస్తున్నాము. అయినా ఒక్కొక్కప్పుడు అనిపిస్తూంటుంది– ఈరోజుల్లో యువతరం మాట్టాదే కొన్ని పదాలైతే అసలు అర్ధమే అవదు. మామూలుగా చిన్నప్పుడు కాలేజీలో కెమిస్ట్రీలో  ” K ”  అంటే, అదేదో పొటాసియంకి సింబలని. కానీ ఈరోజుల్లో  ఏదో ” వేలల్లో” చెప్పాలంటే , అదేదో 10 K, 20 K  అనే చెప్తారు. నీజీతం ఎంతా అని కర్మకాలి అడిగేరా  50K  అంటారు.అది నెలకో, సంవత్సరానికో అర్ధం అయి చావదు. ఏమిటో అంతా గందరగోళం.దాంతోటి నా నెలసరి పెన్షన్ ఎంత చెప్పాలో తెలియకుండా పోయింది. అయినా అదేమైనా రత్నాలా మాణిక్యాలా? ఏదో సందర్భం వచ్చిందికదా అని ఎత్తాను.

 ఉద్యోగం చేస్తూన్నరోజుల్లో , అదేదో  Brainstorming  అని విన్నాను.  ఇంటికొచ్చి డిక్షనరీ చూసి, అర్ధం తెలిసికుని, అప్పటినుంచీ , ఎడా పెడా వాడేస్తున్నాను. మామూలుగా  Schedule  ని  షెడ్యూల్ అనే అంటారనుకునేవాడిని. అదేం కర్మమో, స్కెడ్యూల్  అనాలిట. అలాగే  often  ని ఆఫ్టెన్ అనాలిట. తెలుగు భాష ఎలాగూ అపభ్రంశం అయిపోయింది, పోనీ ఆ ఇంగ్లీషునేనా వదులుతారేమో అంటే అదీ లేకుండా పోయింది.

ఇప్పుడు మనం మాట్టాడుకుంటున్నది benchmark  కదూ. ఏరోజున ఒలింపిక్స్ లో నాడియా కొమెనాచి, 10 కి 10 తెచ్చుకుందో, అప్పటినుంచీ, మన దైనందిక కార్యక్రమాలు కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు. ఇదివరకటి రోజుల్లో, నూటికి 60 పైన వస్తే, ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. 70 దాటితే డిస్టింక్షన్ అనేవారు. కానీ ఈరోజుల్లో– నూటికి 95 వచ్చినా,  తక్కువమార్కులు వచ్చాయని, ఆత్మహత్యలు చేసికునే విద్యార్ధులని చూస్తున్నాము. అంతా కలికాలం.

 వచ్చిన గొడవల్లా ఏమిటంటే ఈ  benchmarకులు ఇళ్ళల్లోక్కూడా వచ్చేసి ప్రాణం తీస్తున్నాయి. ఉదాహరణకి  ప్రతీదానికీ ఓ  benchmark  వచ్చేసింది. ఇల్లంతా అద్దంలా మెరిసిపోవాలి. అసలు పనిమనుషులే దొరకడం లేని ఈరోజుల్లో, వాళ్ళని ఒకటికి రెండుసార్లు, ” చీపురు నొక్కి  తుడూ.. ఓసారి “పోచా ” చేసినతరువాత, ఆ గుడ్డ పిండూ..” అని సతాయిస్తే ఉంటారా ఆ పనిమనుషులూ? పైగా తోటి పనిమనుషుల దగ్గర ” యాగీ ” కూడా చేసేస్తారు. ” అక్కడ పనికెళ్ళొద్దు.. ఆవిడ ఓ పెద్ద మహంకాళి … ఎంతచేసినా మళ్ళీమళ్ళీ చేయమనే అంటుంది… ఈమాత్రం  పనే దొరకదా ఏమిటీ..” అని. వాళ్ళకి స్వేఛ్ఛా స్వాతంత్రాలున్నాయి కాబట్టి, పని మానేస్తారు. కానీ, రిటైరయినప్పటినుంచీ ” డొమీనియన్ ప్రతిపత్తి” లోనే ఉక్కిరిబిక్కిరవుతున్న భర్తల మాటేమిటీ?  పక్కమీద దుప్పటీ సరీగ్గా వేయకపోతే తప్పు. ఏ కాఫీయో, చాయో తాగేటప్పుడు జుర్రుమని శబ్దం చేస్తే తప్పు. చేతులు కడుక్కున్నతరువాత, ఏ కర్టెన్ కో తుడిస్తే తప్పు. వారానికి కనీసం రెండుసార్లైనా, Colin తో  అద్దాలూ, ఫ్రిజ్జీ తుడవకపోతే తప్పు. ఏదో బావుందికదా అని ఏ లేతరంగు చొక్కాయో, ఫ్యాంటో వేసికుంటే రెండో రోజుకి మార్చేయాలి..  వారానికోసారి ఫ్యాన్లు తుడవకపోతే తోచదు, ఓపిక లేకపోయినా సరే. ఆవకాయకాయకి టెంక ఉందో లేదో చూసి తేకపోతే తప్పు.లోపల టెంకుందో లేదో ఎలా తెలుస్తుందీ? కొట్టువాడుందంటే ఉన్నట్టే కదా… 

 ఈ ఈతిబాధలూ, benchmark  లూ భరించలెక, ఏ హిమాలయాలకో వెళ్ళిపోదామన్నంత కోపం వస్తుందంటే రాదు మరీ?  పెట్టే బేడా సద్దుకుంటూంటే గుర్తొస్తుంది– అక్కడ కందా బచ్చలి కూరా, అరటికాయ ఆవ పెట్టిన కూరా చేసి, ముక్కలపులుసుతో  సుష్టుగా భోజనం ఎవరు పెడతారూ అని. పాపం తను మాత్రం అడిగిందేమిటీ.. ఇల్లు శుభ్రంగా ఉంచండీ. ఏ వస్తువు దాని చోట్లో పెట్టండీ అనే కదా. ఉద్యోగంలో  మనం ఉన్నంతకాలమూ పాపం తనేకదా చూసుకునేదీ. పిల్లలు స్కూళ్ళకీ, భర్త ఉద్యోగానికీ వెళ్ళడంతో  హాయిగా ఇల్లు అద్దంలా ఉంచుకునేది. ఇప్పుడు కదా, ప్రతీదాంట్లోనూ వేలెట్టే  భర్తలు ఇంటిపట్టున ఉంటున్నదీ?

  మోదీగారైతే ” స్వఛ్ఛ్ భారత్ ” అని ఇప్పుడు మొదలెట్టారు కానీ, మన ఇంటి ఇల్లాళ్ళు , సంవత్సరాలతరబడి చేస్తున్నారు.. చేస్తూనే ఉంటారు. వాళ్ళ  Benchmark  10/10 కదా….

%d bloggers like this: